క్రిప్టో కరెన్సీ పేరిట రూ. 2 వేల కోట్ల దందా !

  • మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరిట మోసం
  • రెండేళ్లలో విదేశాలకు భారీగా తరలింపు
  • నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో పది మందిపై కేసు
  • అధిక కమీషన్లు.. విదేశీ టూర్ల ఆఫర్లు ఆకర్షణ
  • అక్రమ లావాదేవీలపై నజర్ పెట్టిన ఈడీ

జగిత్యాల, వెలుగు: క్రిప్టో కరెన్సీ పేరిట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ. 2 వేల కోట్ల దందా జరిగింది. మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా పెట్టుబడులు ఆకర్షిస్తూ రెండేళ్లలో విదేశాలకు వేల కోట్లు తరలించారు. మ్యూచువల్ ఫండ్ కింద నడిచే క్రిప్టో కరెన్సీ బిజినెస్ లో వ్యక్తిగతంగా పెట్టిన పెట్టుబడిపై వచ్చిన ఇన్ కమ్ కు పన్ను చెల్లించాలి. కాగా.. ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా క్రిప్టో కరెన్సీ బిజినెస్ తెలియని కస్టమర్లతో పెట్టుబడులు పెట్టించారు. 

ఇలాంటి చైన్ సిస్టమ్లో పెద్ద మొత్తంలో కమీషన్ వస్తుండగా చాలామందిని జాయిన్ చేయిస్తూ.. ఏజెంట్లు లాభపడుతుండగా చివరకు ఇన్వెస్ట్ చేసిన వారు నష్టపోతున్నారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. కొద్దిరోజుల కింద నిర్మల్ జిల్లాలో ఐదుగురిపై, తాజాగా జగిత్యాలలో రెక్సోస్ పేరిట మల్టీ లెవల్ మార్కెటింగ్ చేసిన ఐదుగురిపై టీఎస్పీడీఎఫ్ఈ(తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ ఫైనాన్షి యల్ అండ్ ఎస్టాబిలిష్ మెంట్ యాక్ట్) యాక్ట్ –5, బ్యానింగ్ ఆఫ్ అన్ రెగ్యులెటెడ్ డిపాజిట్ స్కీమ్ యాక్ట్- – 2019లోని యాక్ట్ 21, 22, 23, బీఎన్ఎస్ యాక్ట్ 318(4), 316(2), 61(2) రెండ్ విత్ 3(5) కింద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు.

ఫారిన్ టూర్ల పేరిట గాలం
రెండేళ్లుగా యునిటి మెటా, రెక్సోస్, మెటా ఫండ్, అల్టిమా తదితర కొన్ని సంస్థలు క్రిప్టో కరెన్సీ పేరిట బిజినెస్ చేస్తున్నాయి. ఆయా సంస్థల్లో క్రిప్టో కరెన్సీ పేరుతో చలామణిలో ఉన్న ఆప్ల సాయంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మల్టీ లెవల్ మార్కెటింగ్ నేరమైనప్పటికి క్రిప్టో కరెన్సీ పేరిట కొన్ని సంస్థలు విదేశీ టూర్ల పేరిట గాలం వేసి ఇల్లీగల్ బిజినెస్కు తెర లేపాయి. వీటిలో కొన్ని సంస్థలు అధిక పెట్టుబడుల కోసం డాలర్ల రూపంలో ఆదాయంతో పాటు ఇతరులను చేర్పించినందుకు అదనంగా కమీషన్ ఇస్తుండటం, టార్గెట్ పూర్తి చేస్తే.. దుబాయి, బాలి, సింగపూర్, మలేషియా, థాయ్ లాండ్ వంటి 25 దేశాలకు టూర్ల ఆఫర్లు కూడా ఆశ చూపుతున్నాయి. దీంతో మొదట్లో పదుల్లో ఉన్న ఇన్వెస్టర్ల సంఖ్య ఇప్పుడు ఏకంగా వేలల్లోకి చేరింది. దీంతో చాలా మంది రూ. 50 వేలు మొదలుకుని రూ. కోటి ఆపై కూడా పెట్టుబడి పెట్టారు. 

సెవన్ స్టార్లు ఏడుగురు.. ఫార్చునర్లు, విల్లాలు గిఫ్టులు 
జగిత్యాల జిల్లా లో ఫస్ట్ ఎంట్రి ఇచ్చిన క్రిప్టో కరెన్సీ సంస్థలోనే దాదాపు 40 వేల మంది ఇన్వెస్ట్ చేశారు. ఇతర అన్ని సంస్థల్లో కలిపి లక్షకు పైగా ఉన్నారు. ఎంట్రీ సంస్థలో ఒక స్టార్ రావాలంటే మరో 25 మందిని చేర్పించడంతో పాటు రూ. పది లక్షలు ఇన్వెస్ట్ చేయించాలి. ఇలా టూ స్టార్కు రూ. 50 లక్షలు, త్రీ స్టార్కు 150 మందితో  రూ. కోటి, ఫోర్ స్టార్కు రూ. కోట్లు, ఫైవ్ స్టార్కు1,350 మందితో రూ. 10 కోట్లు, సెవన్ స్టార్కు 4,050తో మంది రూ. 50 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేయించాల్సి ఉంటుంది. 

ప్రపంచవ్యాప్తంగా 37 మంది సెవన్ స్టార్లు ఉంటే, జగిత్యాల జిల్లా నుంచే ఏడుగురు సెవన్ స్టార్లు ఉండగా, వీరంతా సుమారు రూ.500 కోట్ల వరకు పలువురితో ఇన్వెస్ట్ చేయించారు. త్రీ స్టార్కు రూ. లక్ష , ఫోర్ స్టార్కు రూ. 3 లక్షలు, ఫైవ్ స్టార్కు ఫార్చునర్ కారు, సెవన్ స్టార్కు దుబాయిలో విల్లా లేదా రూ. 3.5 కోట్ల నగదు ఇస్తూ బిజినెస్ను విస్తరించడం గమనార్హం.

జగిత్యాల, నిర్మల్, కరీంనగర్, హైదరాబాద్ తో పాటు ఆయా ప్రాంతాల్లో లింక్ ఉన్న ఇతర ప్రాం తాల్లోని చిరు వ్యాపారులు, డాక్టర్లు, ఇంజనీర్లు, బడా వ్యాపారులు, ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లు, ఉద్యోగులు, ఆధికారులు, రియల్టర్లు, రాజకీయ నేతలు ఫాస్ట్ రిటర్న్స్పై ఆశతో భారీగానే ఇన్వెస్ట్ చేశారు. 

ఒక్క సంస్థలోనే రూ. 500 కోట్ల వరకు పెట్టారంటే.. ఇలాంటి మరో 10 యాప్ ల  ద్వారా దాదాపు రూ. 2 వేల కోట్లకు పైగా లెక్క పక్కా లేకుండా ఇన్వెస్ట్ చేసిన సొమ్ము విదేశాలకు తరలడం విస్తుగొలుపుతోంది. అయితే పలువురు ఇళ్లు, గోల్డ్ కుదవ పెట్టడంతో పాటు బాండ్లు, ప్రామిసరీ నోట్లు రాసిచ్చి అప్పు చేసి ఇన్వెస్ట్ చేయడంతో వ్యాపారాలన్నీ కుదేల్ అయ్యాయి. ఎవరికీ ఒక్క రూపాయి అప్పు పుట్టని పరిస్థితి నెలకొనగా తీవ్ర సంక్షోభానికి దారి తీసిందని వ్యాపార వర్గాలు వాపోతున్నాయి.