పటాన్​చెరు ఉద్యమం పర్యావరణ ఉద్యమాలకు స్ఫూర్తి

1974లో మెదక్ జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా పరిగణించి పరిశ్రమల ద్వారానే అభివృద్ధి, పురోగతి అని భావించి పటాన్​చెరు ప్రాంతంలో పారిశ్రామికవాడ ఏర్పాటు చేశారు. అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటుకు ఈ పారిశ్రామికవాడ ప్రారంభించినా,  క్రమంగా ఇక్కడ ఫార్మా పరిశ్రమలు గుమిగూడడం మొదలు అయ్యింది.  ఇక్కడ నీళ్ళు సులభంగా దొరుకుతాయని నిర్ధారణ అయిన తరువాత పరిశ్రమలు ఎక్కువ అయినాయి.  5 ఏండ్లలోనే  విపరీత  జల, వాయుకాలుష్యం ప్రభావంతో స్థానిక గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురికావడం మొదలైంది. వారి ఆరోగ్యం మీద దుష్ప్రభావం ప్రస్ఫుటం అయ్యింది. అయితే, వీళ్ళ అనారోగ్యానికి, పారిశ్రామిక కాలుష్యమే కారణం అని నిర్ధారణకు వచ్చింది ఒక డాక్టర్.   స్థానికంగా నర్సింగ్ హోం నడుపుతున్న డా.కిషన్ రావు ప్రజల అనారోగ్యానికి కారణం పారిశ్రామిక కాలుష్యం అని తెలుసుకుని ఒక పెద్ద పర్యావరణ ఉద్యమానికి నాంది పలికారు.  కిషన్​ రావు నడిపిన పర్యావరణ ఉద్యమం.. నేటి పర్యావరణ ఉద్యమాలకు అత్యంత స్ఫూర్తిదాయకం.

24 జనవరి, 1976న ఏర్పాటు అయిన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి జవసత్వాలు రాష్ట్రంలో జరిగిన పటాన్​చెరు కాలుష్య వ్యతిరేక పోరాటం వల్లనే ఏర్పడ్డాయి.  పటాన్​చెరు ప్రజల ఉద్యమం కాబట్టి దానికి వార్తాపత్రికలు, మీడియా ఇంకా అనేకమంది తమవంతు సహకారం అందించారు. ఉద్యమం స్వచ్ఛమైనది కనుకనే ప్రజల తరఫున అనేక మంది వ్యక్తులు, సంస్థలు నిలిచాయి. పటాన్​చెరు పర్యావరణ ఉద్యమానికి మూలస్తంభం డా. అల్లాణి కిషన్ రావు. అయన స్వభావం, వ్యక్తిత్వం, ఆలోచనలు ఈ ఉద్యమానికి ఊపిరి ఇచ్చాయి. అవే బలం. అవే బలహీనతలు. మెతుకు సీమగా పేరుపొందిన మెదక్ జిల్లాలో నీటి వనరులకు ఏనాడూ కొదవలేదు.  

కాలుష్య జలాలతో దెబ్బతిన్న వ్యవసాయం

నక్క వాగులో నిరంతరం జలం ఉండేది అని పెద్దలు చెప్పేవారు. ఈ ప్రాంతంలో వరి సాగు జరిగేది. కనీసం ఎకరాకు 45 బస్తాలు వచ్చేది. అటువంటిది 1985 కల్లా అందులో నిరంతర కాలుష్య జలాలు పారడం వల్ల స్థానిక వ్యవసాయం దెబ్బతిన్నది. కలుషిత నీరు తాగిన పశువుల మరణాలు పెరిగాయి. మహిళలకు, పిల్లలకు, వృద్ధులకు అనారోగ్యం పట్టుకున్నది. కొందరికి జ్వరానికి, నొప్పులకు ఇచ్చే మందుల మోతాదు మూడింతలు ఎక్కువ ఇవ్వాల్సి వచ్చేది. వాయుకాలుష్యం తీవ్రతరమైంది.

స్వచ్ఛందంగా పటాన్​చెరు పర్యావరణ ఉద్యమం

పరిశ్రమలు రాత్రిళ్ళు విడుదల చేసే వాయువుల దుర్వాసన, గాఢత తట్టుకోలేని ఊర్లలోని జనం ఇంటి తలుపులు, కిటికీలు మూసేసి బయట నుంచి గాలి దూరకుండా బట్టలు దూర్చి పడుకునేవారు. దాంతోటి చిన్న ఇండ్లలో ప్రాణవాయువు తగ్గి పిల్లలకు మూర్ఛవ్యాధి రావడం మొదలైంది.  కలుషిత నీటివల్ల కొందరికి నరాల వ్యవస్థ దెబ్బతిన్నది.  నడుములు పడిపోయినాయి. చర్మవ్యాధులు ప్రబలినాయి. బొక్కలు వంకరగా మారినాయి. కాళ్ళు, కీళ్ళ నొప్పులు స్థానికులకు సాధారణం అయినాయి.  మహిళల గర్భాశయ వ్యవస్థ కూడా కాలుష్యానికి దెబ్బతిన్నది. కొందరికి గర్భస్రావం కావడం.  నీలం రంగులో ఒక శిశువు పుట్టడం అప్పట్లో కలకలం రేపింది. 1984లో భోపాల్ నగరంలో జరిగిన దుర్ఘటనలో వందల మంది అప్పుడే చనిపోగా, తరువాత వేల మంది విషవాయువు బారిన పడి అనారోగ్యానికి గురిఅయ్యి మరణించారు. ఈ నేపథ్యంలో పటాన్​చెరు పర్యావరణ ఉద్యమం ప్రాముఖ్యత సంతరించుకున్నది. ఉద్యమంలో భాగంగా ఎడ్లబండ్లతో జాతీయ రహదారి దిగ్బంధం  రాష్ట్ర ప్రభుత్వాన్ని వణికించింది. అప్పటి ముఖ్యమంత్రి చర్చలకు ఆహ్వానిస్తే వందల మంది కాలుష్య బాధితులు లారీలలో స్వచ్ఛందంగా కదిలారు. ఆర్థిక వనరులు లేని పటాన్​చెరు ఉద్యమం ఆ స్థాయిలో ప్రజలను కదిలించి పోరాటం చేయడం మామూలు విషయం కాదు.   అవసరమైన పేద బాధితులకు ఆర్థిక సహాయం, ఆరోగ్య సేవలు, ఉచిత వైద్య, ఉచిత మందులు అందించిన డా. కిషన్ రావు తనదైన శైలిలో,  ప్రొఫెసర్  కె. పురుషోత్తం రెడ్డి  ప్రోద్భలంతో ఉద్యమాన్ని నడిపారు. పర్యావరణ ఉద్యమాలకు స్పూర్తిగా నిలిచారు.

కాలుష్య బాధితులకు అండగా న్యాయవాదులు

పటాన్​చెరు ఉద్యమం మీద, ఉద్యమ నేత మీద అనేక ఒత్తిళ్లు వచ్చాయి. మొదట్లో కాలుష్యమే లేదన్నారు. మెదక్ జిల్లా పెద్ద నేత, అప్పటి మాజీ మంత్రి ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేశారు. పరిశ్రమ కార్మికులను ఎగదోశారు. ఉద్యమ నేత మీద వ్యక్తిగత దాడులు కూడా చేశారు. అవమానాలకు గురి చేశారు. తప్పుడు పరిష్కారాలను ముందుపెట్టారు. రసాయన శాస్త్రం పేరు మీద కూడా పర్యావరణ ఉద్యమం మీద ఒత్తిడి పెంచారు. ఒక జిల్లా జడ్జి నివేదిక ఉద్యమానికి బాసటగా నిలిచింది.  సుప్రీంకోర్టు జడ్జి జీవన్ రెడ్డి తీర్పు మరికొంత బలాన్ని ఇచ్చింది. అనేక పర్యావరణ తీర్పులలో పేరు నమోదు చేసుకున్న సుప్రీంకోర్టు 
న్యాయవాది, మానవతావాది,  ఎం.సి మెహతా, అండ పటాన్​చెరు కాలుష్య బాధితులకు దొరికింది.  మెదక్ జిల్లా న్యాయవాదులు కూడా కాలుష్య బాధితులకు అండగా నిలిచారు.  

పర్యావరణ కాలుష్యంపై యువత ఉద్యమించాలి

1 సెప్టెంబర్ 2024 న  మృతి చెందిన డా. కిషన్ రావు ఒక ఉద్యమదారిని వదిలిపెట్టి వెళ్లారు. ఫార్మా కాలుష్యం తగ్గలేదు. పర్యావరణ కాలుష్యంపై ఉద్యమం ఇంకా ముందుకు వెళ్ళాల్సి ఉన్నది.  యువత ఈ ఉద్యమ కళ్ళాలు చేపట్టి, డా. కిషన్ రావు చూపెట్టిన బాటలో నడుస్తూ.. మెదక్ జిల్లా ప్రజలను కాలుష్య విముక్తులను చెయ్యాలి.  ప్రజాస్వామ్యంలో ప్రజల మనిషి పార్లమెంటు సభ్యుడు కాలేకపోయిండు.  కానీ,  ప్రత్యేక తెలంగాణాలో కాలుష్య పరిశ్రమల అధిపతులు పార్లమెంటు సభ్యులుగా కొత్త అవతారం ఎత్తారు.  కాలుష్యభరిత పారిశ్రామిక అభివృద్ధికి పరావరణ ఉద్యమానికి మధ్య జరుగుతున్న సంఘర్షణలో ఎప్పుడు కూడా డబ్బు, అధికారం కాలుష్య పరిశ్రమల చేతులలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో  పటాన్​చెరు పర్యావరణ ఉద్యమం చరిత్రలో ఒక స్ఫూర్తిదాయక దశగానే మిగిలింది.  కొత్తగా  తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఫార్మా క్లస్టర్లలో  కొడంగల్, న్యాల్కల్ మండలాలలో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలు అయ్యింది.  వారికి పటాన్​చెరు పర్యావరణ పరిరక్షణ ఉద్యమం ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుంది.

నేను సైతం..

పటాన్​చెరు పర్యావరణ ఉద్యమం వ్యూహాత్మకంగా అనేక విజయాలు సాధించింది. నేతల ద్వయం, డా.కిషన్ రావు, ప్రొ.పురుషోత్తం రెడ్డి ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ కాలుష్యాన్ని తగ్గించేందుకు, కాలుష్య బాధితుల ఉపశమనానికి కృషి చేశారు.  నిత్యం పటాన్​చెరు కాలుష్య సమస్య వార్తలలో నిలిచేలా చేశారు.  నేను సైతం విద్యార్ధి దశనుంచి ఈ ఉద్యమంలో పాల్గొన్నాను. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి సైకిల్ ర్యాలీ రాజ్ భవన్ వరకు నిర్వహించాం.  సునీల్ ఉమ్రావు పేరుగల విద్యార్ధి దీనిమీద ఒక డాక్యుమెంటరీ  చేశారు. అనేక మంది రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ విలేకరులు, వార్తాపత్రికలు, అప్పుడప్పుడే కొత్తగా వస్తున్న వీడియో చానళ్ళు పటాన్​చెరు కాలుష్య సమస్యను ప్రపంచం ముందుపెట్టారు. 90 దశకంలో పదుల సంఖ్యలో వచ్చిన కేంద్ర పర్యావరణ ఉత్తర్వులు పటాన్​చెరులాంటి పర్యావరణ ఉద్యమాల ఫలితమే.  వీటిలో ఎక్కువ శాతం పర్యావరణ అనుమతుల ప్రక్రియలలో ప్రజల భాగస్వామ్యం పెంచాల్సి వచ్చింది.  గత దశాబ్ద కాలంలో అన్నీ నీరుకార్చేశారు. 

 

దొంతి నరసింహరెడ్డి