నాగార్జునసాగర్ టు శ్రీశైలం లాంచీ షురూ

  • ప్రారంభించిన టూరిజం శాఖ
  • సోమశిల నుంచి కూడా బోటు అందుబాటులోకి..
  • ప్రతీ శనివారం ఉదయం బయల్దేరనున్న లాంచీలు

నాగార్జున సాగర్, సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు శనివారం ప్రారంభమయ్యాయి. ప్రతి శనివారం ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. రానుపోను రెండ్రోజుల పాటు ప్రయాణం ఉంటుంది. సాగర్​ నుంచి బయల్దేరి ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాంతం మీదుగా శ్రీశైలం చేరుకుంటారు. ఆదివారం శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు. వన్ వేకు పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600 చార్జీ  వసూలు చేస్తారు. రానుపోను అయితే పెద్దలకు రూ.3వేలు, పిల్లలకు రూ.2,400.

హాలియా/కొల్లాపూర్, వెలుగు: నాగార్జున సాగర్, సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు శనివారం ప్రారంభమయ్యాయి. సాగర్ నుంచి 100 మంది, సోమశిల నుంచి 80 మంది ప్రయాణికులతో రెండు లాంచీలు బయల్దేరినట్లు టూరిజం శాఖ అధికారులు తెలిపారు. ప్రతీ శనివారం ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, రానుపోను రెండ్రోజుల పాటు ప్రయాణం ఉంటుందన్నారు. లైఫ్ జాకెట్లు, మంచినీరు, ఆహారంతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

నల్గొండ జిల్లా నందికొండ మండలం హిల్‌‌కాలనీ లాంచీ స్టేషన్ నుంచి ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు లాంచీ బయల్దేరుతది. నాగార్జున సాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాంతం మీదుగా సాయంత్రం శ్రీశైలం చేరుకుంటది. ఆదివారం శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు. వన్ వేకు పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రూ.1,600 చార్జీలు వసూలు చేస్తున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ, వాటర్ ఫీడ్ జీఎం ఇబ్రహీం తెలిపారు.

రానుపోను అయితే పెద్దలకు రూ.3వేలు, పిల్లలకు రూ.2,400 వసూలు చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా, నాగర్​కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి శ్రీశైలానికి (120 కిలో మీటర్లు) ఏడు గంటల సమయం పడ్తది. చీమలతిప్ప, అంకాలమ్మతోట, గంగపుత్ర, శివగంగ, అక్కమహాదేవి గుహలు మీదుగా శ్రీశైలం చేరుకుంటారు. ఆన్​లైన్ ద్వారా కూడా టికెట్ బుక్​ చేసుకోవచ్చు. శ్రీశైలంలో వసతి, ఇతర అవసరాలను పర్యాటకులే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.