జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో టెర్రరిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ వీర మరణం పొందారు. బసంత్‌గఢ్‌లోని డుడు ఏరియాలో సోమవారం మధ్యాహ్నం సీఆర్పీఎఫ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పోలీసుల పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా టెర్రరిస్టులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ 187వ బెటాలియన్‌కు చెందిన ఓ ఇన్ స్పెక్టర్ బుల్లెట్ గాయాలు కాగా ఆస్పత్రికి తరలించామని, ఆయన అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారని వెల్లడించారు. భద్రతా బలగాలు కాల్పులు ప్రారంభించడంతో టెర్రరిస్టులు అక్కడి నుంచి పారిపోయారని, వారి కోసం వేట కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.