హుజూర్ నగర్ లో కనుల పండువగా మహారుద్రాభిషేకం

  • లక్ష రుద్రాక్షలతో అభిషేకం 
  • శివనామస్మరణతో మార్మోగిన ప్రాంగణం
  • ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి తేలిన భక్తులు  

హుజూర్ నగర్, వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఆదివారం మహారుద్రాభిషేకం కనుల పండువగా నిర్వహించారు. మొదట శివలింగాలకు అభయాంజనేయస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అలంకరించిన వాహనంలో ప్రధాన రహదారి గుండా మేళతాళాలు, మహిళల కోలాటాల మధ్య మహా రుద్రాభిషేకం జరిగే ప్రాంగణానికి తీసుకొచ్చారు. 

8 అడుగుల మట్టి శివలింగానికి కాశిక్షేత్రం నుంచి వచ్చిన 45 మంది నాగసాధువులు శివబాబా ఆధ్వర్యంలో లక్ష రుద్రాక్షలతో మహా రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తుల శివనామ స్మరణలతో ప్రాంగణమంతా మార్మోగింది. ఆధ్యాత్మిక ఆనందంలో భక్తులు మునిగితేలారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ అర్చనారవి దంపతులు, వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి, నిర్వాహకులు, ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.