దోమ చాలా చిన్న ప్రాణి.. ప్రాణి చిన్నదే కాని దాని పేరుతో జరిగే వ్యాపారం అంతా ఇంతా కాదు.. వందల నుంచి కోట్ల వరకు దోమ వ్యాపారం చేస్తుందంటే మామూలు విషయం కాదు. దోమల పేరుతో బిజినెస్ చేసేవారు కోట్లకు పడగలెత్తారు. పెద్ద పెద్ద కంపెనీలే వెలిశాయి. దోమ తెరల వ్యాపారం.. ఆస్పత్రుల వరకు దోమ వ్యాపారం అంతా ఇంతా కాదు.. ఏప్రిల్ 25 మలేరియా డే సందర్భంగా దోమ పేరుతో జరిగే బిజినెస్ గురించి తెలుసుకుందాం
దోమ చాలా చిన్న ప్రాణి. కానీ మనం దాన్ని జయించలేం. ఎందుకంటే దాని శక్తి మనకంటే చాలా పెద్దది. అది కుట్టకుండా మన చావు మనం చావాల్సిందే. అంతే తప్ప దాన్ని చంపలేం. ఒకవేళ చంపితే దోమల పేరుతో జరిగే లక్షల కోట్ల వ్యాపారం మునిగిపోతుంది. ఒకప్పుడు దోమల నుంచి రక్షించుకోడానికి దోమ తెరలు తప్ప వేరే మార్గం లేదు. అవి కూడా రెడీమేడ్ దొరికేవి కావు. బట్ట కొని టైలర్ దగ్గర కుట్టించుకోవాలి. తర్వాత నైలాన్ దోమతెరలు వచ్చాయి. దోమతెరల్ని కట్టడం ఒక ఆర్ట్. మంచానికి నలు వైపులా బ్యాలెన్స్‌డ్‌గా కట్టాలి. పరుపు మీదికి దూరే సమయానికి , మనతో పాటు ఒక దోమల మంద కూడా దూరి కంటికి కనపడకుండా నక్కుతుంది.
మనం మూలలన్నీ వెతికి హమ్మయ్య అని లైట్లు ఆర్పి నిద్రపోగానే జుమ్మంది నాదం అని ఆర్కెస్ట్రాతో బయల్దేరుతాయి. ఒక్కోసారి చెవి దగ్గరికే వచ్చి పాట వినిపిస్తాయి. ఆ రాగానికి చప్పట్లు కొడతాం. జ్ఞానం లేని దోమలు అది ప్రశంస అనుకుని చచ్చిపోతాయి. మన రక్తం మన అరచేతులకే అంటుతుంది. దోమల వల్ల నేర్చుకోవాల్సిన నీతి ఏమంటే అన్ని చప్పట్లు మన మంచి కోరవు.
ఎన్ని అవస్థలు పడినా ఒక్క దోమ చాలు, మన కలల్ని నాశనం చేయడానికి. దోమ తెరల బాధలు పడుతూ వుంటే ఎవరో పుణ్యాత్ముడు టార్టాయిస్ కాయిల్స్ కనిపెట్టాడు. అది వెలిగిస్తే రాత్రంతా ఘాటు. దోమల వల్ల కొత్త జంట "ఎంత ఘాటు రాత్రియో" అని పాడుకోవాల్సి వచ్చేది. తర్వాత ఓడోమాస్ వచ్చింది. ఒళ్లంతా పూసుకుని తెల్లారి స్నానం చేయాలి. లేదంటే కంపు. మనం ఎప్పుడైతే కొనడం స్టార్ట్ చేస్తామో వ్యాపారస్తులు ఊరుకోరు. అనేక ప్రయోగాలు చేస్తారు. చివరికి కాయిల్స్ దగ్గర సెటిల్ అయ్యాం. ఇంతకు ముందు బిస్కెట్ల సైజులో బిల్లలు పెట్టేవాళ్లం. వీటన్నింటిని డబ్బులు పెట్టి కొనేవాళ్లు. అంటే దోమల పేరుతో చిన్న చిన్న గల్లీ షాపుల నుంచి వ్యాపారం మొదలవుతుంది.
పూర్వకాలం దీపపు బుడ్డీల సైజులో కొంచెం చిన్నవి ఉండేవి. దాంట్లో మళ్లీ ప్లేవర్లు, ఎక్స్‌ట్రా పవర్లు చాలా జాతులుంటాయి. కాల్గెట్ టూత్‌పేస్ట్‌కి రకరకాల గుణగణాలు యాడ్ చేసి అదే పేస్ట్‌నే గత 60 సంవత్సరాలుగా అమ్ముతున్నారు (వాస్తవానికి ఆ కంపెనీ వయసు 216 ఏళ్లు. అది అమెరికా కంపెనీ అని మనకే గుర్తు లేనంతగా ఇళ్లలో కలిసిపోయింది). అదే విధంగా దోమల కాయిల్స్ కూడా అమ్ముతున్నారు. తరువాత కాల క్రమేణ అనేక రకాల కాయిల్స్ వచ్చాయి. తరువాత వీటిని లిక్విడ్ రూపంలో తయారు చేసి.. వాటికి ఎలక్ట్రికల్ మిషన్ ద్వారా దోమలపైకి దండయాత్ర చేసేలా అందుబాటులోకి తెచ్చారు. ఆల్ అవుట్.. వంటి లిక్విడ్ మస్కిటో ఆయిల్స్ ను వాడకంలోకి తెచ్చారు. కరంట్ ద్వారా అందులోని లిక్విడ్ వేడెక్కి సన్నని పొగ వచ్చి ఆ పొగ ఘాటుకు ఆ గదిలో నుంచి దోమలు వెళ్లాయి. ఇప్పుడు అవి కూడా తెలివి మీరి.. ఆ ఘాటును తట్టుకొని మనపైనే దాడి చేస్తున్నాయనుకోండి. అయితే ఇలాంటి చర్యలు తీసుకోవడం వలన దోమలు కుట్టడం తగ్గింది కానీ, అవి ఎక్కడికీ పోలేదు. మన మధ్యే సహజీవనం చేస్తున్నాయి.
అసలు దోమలు లేకపోతే మలేరియా, డెంగీ, చికెన్ గున్య, టైఫాయిడ్ ఉండేవి కాదు. జ్వరాలు లేకపోతే కోట్ల రూపాయల ఫార్మా కంపెనీలు ఏం కావాలి? ఆస్పత్రులు, డాక్టర్లు వీళ్లంతా ఎవరి కోసం? మలేరియా, చలి జ్వరం, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి విష జ్వరాలు దోమ కాటు వలనే వ్యాపిస్తాయి. ఈ వ్యాధుల బారిన పడ్డామా.. ఇక అంతే సంగతులు.. ఆస్పత్రి చుట్టూ తిరగాల్సిందే.. ల్యాబ్ టెస్టులకు పదే పదే వెళ్లాల్సిందే. కాస్ట్లీ మందులు మింగాల్సిందే.. ఒళ్లు గుల్లావ్విల్సిందే.. ఆస్పత్రులు బిల్లులు కట్టాల్సిందే.. కంటికి కూడా కనపడకుండా తిరిగే దోమే లేకపోతే ఇంత అనర్ధం జరిగేది కాదుగా మరి .. ఏదైనా అణు యుద్ధం జరిగి మనిషి అంతరించిపోయినా కూడా దోమ అంతరించిపోదు. నూతన మానవుడి ఆవిష్కరణ కోసం అది ఎదురు చూస్తూనే వుంటుంది. దోమ నుంచి ఆధునిక వ్యాపారవేత్తలు నేర్చుకున్న సిద్ధాంతం ఏమంటే సాటి మనిషి రక్తం తాగడం. ప్రపంచ వ్యాపార పునాదులన్నీ దోమ సూత్రం మీద ఆధారపడే నిలిచి వున్నాయి.