బడ్జెట్​ల విశ్వసనీయత పెరగాలి

 ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అత్యధిక అంచనాలతో భారీ బడ్జెట్​ను  ప్రజల ముందుకు తీసుకువచ్చి, అన్ని రంగాలకు, అన్ని వర్గాల ప్రజలకు భారీగా నిధులను ఇస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ఆచరణలో ఆ దిశగా నిధుల పంపిణీ జరగటం లేదు. పదేండ్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్​ల నుంచి లభించిన అనుభవం అది. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ 2014-15 లో రూ. 1,00,638 కోట్లు అంచనా ఉండగా, అందులో కేవలం రూ.62,306 కోట్లు ఆదాయ వనరులు సమకూర్చుకొని, ఖర్చు చేయడం జరిగింది. 

అంచనాలలో కేవలం 61.9% మాత్రమే వనరులను ఖర్చు చేయడం జరిగింది. అంటే దాదాపుగా 40 శాతం వివిధ రంగాలకు కేటాయించిన నిధుల్లో  కోత విధించాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. కానీ 2019–20 నాటికి బడ్జెట్ అంచనాలు రూ. 1,46,492 కోట్లు కాగా, వాస్తవిక వ్యయం రూ,1,42,857 కోట్లతో వాస్తవికతకు కాస్త దగ్గరగా ఉన్నది. ఆ బడ్జెట్ విశ్వసనీయత దాదాపుగా 97.5% గా చెప్పవచ్చు. 2022–23 నాటికి బడ్జెట్ అంచనా రూ. 2,56,859 కోట్లుగా పేర్కొన్నప్పటికీ కేవలం 2,48, 085 కోట్లు మాత్రమే ఖర్చు చేయడంతో బడ్జెట్​పై విశ్వసనీయత 79.5%కి తగ్గింది.  

అంచనాలకి, వాస్తవిక కేటాయింపుల మధ్య వ్యత్యాసంతో బడ్జెట్​లు ప్రజల  విశ్వాసాన్ని పొందటంలో విఫలమవుతున్నాయి. రాష్ట్ర వాస్తవ పన్ను ఆదాయం రూ. 29,288 కోట్లు ఉండగా అది 2022–-23 నాటికి 1,06,948 కోట్లకి చేరుకుంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు బడ్జెట్  విశ్వసనీయత 61.9% గా ఉండేది. కానీ అది 2022-– 23 నాటికి 79.5% కి చేరుకున్నది. 2014-–15 నుంచి 2022-–23 నాటికి సగటున అది 82.3%కి చేరుకుంది. దీనిని పరిశీలిస్తే రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2022-–23 నాటికి మొత్తం బడ్జెట్ అంచనాలలో సరాసరి 82.3% మాత్రమే ఖర్చు చేయబడింది. 

అయితే, బడ్జెట్ అంచనాలకు, వాస్తవ వ్యయానికి మధ్య వ్యత్యాసం సుమారుగా 17.3% తెలంగాణ రాష్ట్రంలో ఉండగా, దేశంలో గనుక చూస్తే ఈ వ్యత్యాసం సరాసరి 3% మాత్రమే ఉంది. ఇంత పెద్ద వ్యత్యాసం ఉండటం ప్రభుత్వం ప్రజలను అసాధ్యమైన అంచనాలతో అయోమయానికి గురి చేయడమే. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. 

తలసరి ఆదాయమే కాదు,ద్రవ్యోల్బణమూ పెరిగింది

స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి, తలసరి ఆదాయాలలో వరుసగా ప్రస్తుత ధరలలో రూ. 4,16,332 కోట్లు, రూ.1,24,104గా ఉండగా, అది 2022-–23 నాటికి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి , తలసరి ఆదాయాలులో వరుసగా  రూ.7,26,670 కోట్లు,  రూ.3,17,115 లక్షలకి  చేరుకుంది.   భారతదేశ జీడీపీలో 2014-–15  నుంచి 2022–-23 వరకు తెలంగాణ వాటా 4.1%  నుంచి 4.9% పెరిగింది. వాస్తవ రాష్ట్ర పన్ను ఆదాయం 29,288 కోట్ల నుంచి 1,06,948  కోట్లకి, అలాగే బడ్జెట్ లోటు  జీఎస్​డీపీలో  నాడు 1.9%  శాతం ఉండగా, 2022-–23  నాటికి అది 2.7 కి పెరిగింది.  ద్రవ్యోల్బణం సైతం నాటి నుంచి నేటికీ దాదాపు రెండింతలు పెరిగింది. 

అప్పుల పరిస్థితి ఏమిటి? 

రాష్ట్రం ఏర్పడినప్పుడున్న అప్పులు రూ. 72,658  కోట్ల నుంచి రూ. 3,89,673 (బడ్జెట్​ ప్రకారం) కోట్లకు పెరిగాయి. అలాగే మొత్తం చేసిన అప్పులను గమనిస్తే అది రూ. 6,71,757 కోట్లకి చేరుకుంది. నాడు తెలంగాణ  ఆవిర్భవించిన రోజుల్లో అప్పుల శాతం (బడ్జెట్​ ప్రకారం)  జీఎస్​డీపీలో 14.4% నుంచి 2022–-23 నాటికి 27.8% కి చేరుకుంది. ఇలా అప్పులు క్రమంగా రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటికి 13.4% పెరగడం ప్రజలలో ఆందోళన కలిగించే విషయం.

 ఫలితంగా రాష్ట్ర ఆదాయంలో సింహభాగం రుణచెల్లింపుల కోసమే కేటాయించడం జరుగుతోంది.  ఇది రాష్ట్ర స్థితిగతుల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించింది.  తెలంగాణలో 2022–-23  నాటికి జీఎస్​డీపీలో అప్పు శాతం 36.9%కి  చేరింది. పరిమితికి మించి అప్పు చేయటం వల్ల ఆర్థిక పురోగతికి భంగం కలుగుతోంది.

 అడ్వాన్సులపైనే ఆధారపడితే..

రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం మధ్య అంతరాలు కలిగినప్పుడు ఆర్​బీఐ నుంచి స్వల్పకాలిక రుణాలను పొందే అవకాశం ఉంటుంది.   గత కొన్ని సంవత్సరాలుగా గమనిస్తే రాష్ట్రం వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాలపై అధికంగా ఆధారపడటం వల్ల కొంత ఆర్థిక అభివృద్ధి తగ్గుముఖం పట్టింది. 

విద్య, వైద్యాన్ని నిర్లక్ష్యం చేశారు

2023-–24 బడ్జెట్లో విద్యా రంగానికి,  వైద్య రంగానికి వరుసగా 7.6%,  5% మాత్రమే ఖర్చును అంచనా వేయడం వల్ల గత ప్రభుత్వ మౌలిక వసతుల కల్పన పాత్రను తెలుసుకోవచ్చు.  ఆరోగ్యంలో దేశంలోనే నాలుగవ అత్యల్ప, దేశ జాతీయ స్థాయి సగటు (6.2%) కంటే చాలా తక్కువ ఉంది.  ఇతర రాష్ట్రాలలో వారి మొత్తం బడ్జెట్ వ్యయంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వరుసగా విద్యపై 16.6%, 12.6%, 14.1%, 14.0% ఖర్చు పెడుతున్నారు. అలాగే వారి మొత్తం బడ్జెట్ వ్యయంలో ఇటు ఆరోగ్యం కోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో వరుసగా 6.3%, 5.3%, 5.7% ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని సరైన క్రమంలో వినియోగించినప్పుడే భవిష్యత్ తరాలకు భారం ఉండదు, ఆర్థిక వ్యవస్థ కుంటుపడదు.

ప్రజలు ఏం కోరుకుంటున్నారు?

విద్యారంగంలోనూ, వైద్యరంగంలోనూ, ఉద్యోగ/ఉపాధి కల్పనలోనూ, యువతకు నైపుణ్యాన్ని కల్పించడంలో ప్రభుత్వం పెద్దపీట వేసినప్పుడు మరింత అద్భుత ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని  గవర్నెన్స్ లో ఆవిష్కరణలు చేపట్టి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడం, ఇంటర్నెట్ ఆధారిత లేదా డిజిటల్ ఎకానమీ ద్వారా కృత్రిమ మేధను ఉపయోగించి ఎన్నో నవకల్పనలు, సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణలు చేస్తే అవి ఆర్థిక వ్యవస్థకు ఒక చోదక శక్తిగా పనిచేస్తాయి. 

బడ్జెట్లో మూలధన వ్యయం, విద్య, వైద్యం వంటి మౌలిక వసతుల కల్పనకు గత ఏడాది కన్నా రెండింతల నిధులు కేటాయించి పెద్ద పీటవేస్తే   దాని ప్రభావం దీర్ఘకాలంలో అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  వాస్తవికతకు దగ్గర అంచనాలకై కృషి చేస్తేనే ప్రజలకు ప్రజాపాలన అందుతుంది. 

ప్రస్తుత పరిస్థితి

గత ప్రభుత్వం  ముఖ్యంగా ప్రజలలో కొనుగోలు శక్తి పెంచడం కోసం డిమాండ్ వైపు పెట్టుబడి సహాయాన్ని అందించే  రైతుబంధు అమలుచేసినా దానికి ఒక పరిమితిని విధించకపోవడం, గొర్రెల పంపిణీ  కార్యక్రమం తలపెట్టినా ఆచరణలో మాత్రం విఫలం, పేదోడికి  సొంతింటి కలను నెరవేర్చే క్రమంలో డబుల్ బెడ్ రూమ్ పథకాల్లో  విజయం సాధించలేకపోయింది.  వ్యవసాయ అవసరాల కోసం ఉచిత విద్యుత్ 24 / 7 కొంతవరకు అనుకూల ప్రభావాన్ని చూపించింది. కొన్ని కార్యక్రమాల  ఉద్దేశ్యం గొప్పదైనప్పటికీ వాటి అమలు తీరులో లోపాలు ఉన్నందున కేటాయించిన బడ్జెట్​ను వినియోగించడంలో దుర్వినియోగం వల్ల  గత ప్రభుత్వంలో ఒక పెద్ద ప్రతికూలతను చూపింది. 

మరి బడ్జెట్ ఎలా ఉండాలి?  

బడ్జెట్   ప్రాధాన్యతలలో, కేటాయింపులలో సమతుల్యత పాటించవలసిన అవసరం ఉంంది. పూర్తిగా ఉచిత పథకాల వైపు మొగ్గు చూపకుండా అటు సంక్షేమంవైపు ఇటు మౌలిక వసతుల కల్పనపైనా ప్రభుత్వం దృష్టి సారించాలి. కేవలం సంక్షేమ పథకాల వల్లనే ఆర్థిక వ్యవస్థ స్థిరపడదు. కానీ, మౌలిక వసతులను కల్పించి ప్రజల జీవన  ప్రమాణాలు పెంపొందించినప్పుడే ఒక బలమైన ఆర్థికశక్తిగా తెలంగాణ మారుతుంది.  మౌలిక వసతులు  రోడ్లు, రవాణా, భవనాలు, ఇంధనం, కమ్యూనికేషన్, నీటి సరఫరా,  పారిశుధ్యం వంటి అన్ని కీలక రంగాలలో వ్యూహాత్మక అభివృద్ధి ప్రణాళిక వేసినప్పుడే ప్రభుత్వం రాష్ట్ర ప్రగతిని మరొక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. 

- డాక్టర్. కృష్ణారెడ్డి చిట్టెడి, అసోసియేట్ ప్రొఫెసర్, అర్థశాస్త్ర విభాగం,హెచ్ సీయూ

- గజ్వేల్లి వెంకటేశం, రీసెర్చ్ స్కాలర్, హెచ్​సీయూ