సృజనశీల సినీ దార్శనికుడు

భారతీయ సినీ వినీలాకాశంలో ధృవ తారగా, సమాంతర సినిమాకు మార్గదర్శిగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన 90 ఏండ్ల సినీ నిర్మాత, దర్శకులు శ్యామ్‌‌ బెనెగల్‌‌ తుది శ్వాస విడవడంతో భారతీయ చలనచిత్ర పరిశ్రమ మూగబోయింది. భారత అత్యుత్తమ సినీ పురస్కారం దాదా సాహెబ్‌‌ పాల్కే అవార్డుతో పాటు 18 జాతీయ ఫిలిమ్‌‌ అవార్డులను పొందిన పద్మశ్రీ, పద్మ భూషణుడు శ్యామ్‌‌ బెనెగల్‌‌, శాంతారామ్‌‌ జీవన సాఫల్య పురస్కారం కూడా స్వీకరించిన భరతమాత ముద్దు బిడ్డ.  శ్యామ్ బెనెగల్‌‌ పరిచయం చేయనవసరం లేని వ్యక్తి.  

14 డిసెంబర్‌‌ 1934న తిరుమల‌‌గిరి, హైదరాబాదులోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శ్యామ్‌‌ సుందర్‌‌ బెనెగల్‌‌ తండ్రి శ్రీధర్‌‌ బెనెగల్‌‌ అత్యుత్తమ సినీ ఫొటోగ్రాఫర్‌‌గా పేరు తెచ్చుకున్నారు.  ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం ఏ పట్టాను పొందిన తర్వాత “హైదరాబాదు ఫిలిమ్‌‌ సొసైటీ” స్థాపనకు చొరవ తీసుకున్నారు. 1959లో కాపీ రైటర్‌‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి 1962లో “ఘెర్‌‌ బేతా గంగా” అనే తొలి డాక్యుమెంటరీ తీసిన శ్యామ్‌‌ తర్వాత వరుసగా 900 వరకు డాక్యుమెంటరీలు/ప్రకటనల ఫిలిమ్‌‌లు తీయగలిగారు. 1966 –73 మధ్య పూనె ఫిలిమ్‌‌ అండ్‌‌ టెలివిజన్‌‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌‌ ఇండియాలో బోధనలు చేస్తూ ఆ సంస్థకు చైర్మన్‌‌గా రెండు పర్యాయాలు సేవలు అందించారు. హోమి జె బాబా ఫెలోషిప్‌‌ను పొంది బాలల టివి కార్యశాలతో అనుబంధం పెంచుకున్నారు. 

సందేశాత్మక సినిమాలకు కేరాఫ్​ అడ్రస్

అంకుర్‌‌, నిశాంత్‌‌, మంథన్‌‌, భూమిక సినిమాలతో భారతీయ సినీ పరిశ్రమకు సృజనశీల సమాంతర సినిమా రుచిని చూపి విమర్శకుల మన్ననలు సహితం స్వంతం చేసుకున్నారు. అదే వరుసలో మమ్మో, సర్దార్‌‌ బేగమ్, జుబేదా లాంటి సినిమాలు తీసి జాతీయ ఫిలిమ్‌‌ అవార్డులను గెలుచుకున్నారు. హిందీ సినిమా రంగంలో ఏడు జాతీయ ఫిలిమ్‌‌ అవార్డులను పొందిన దర్శకత్వ ఘనుడిగా రికార్డులు సృష్టించారు. 

గుజరాతీ పాడి పరిశ్రమకు పునాది వేసిన కురియన్‌‌ ప్రేరణతో ఐదు లక్షల గుజరాతీ రైతులు ఒక్కొక్కరు రెండు రూపాయల విరాళం ఇవ్వగా సినీ నిర్మాతగా మారి “మంథన్‌‌” సినిమాను 1976లో తీయగలిగారు. 1970ల్లో యూనిసెఫ్‌‌ సహకారంతో 21 సినిమాలు నిర్మించారు. బాలల చిత్రంగా “చరణ్‌‌దాస్‌‌ చోర్‌‌” సినిమా తీసి చిల్డ్రన్‌‌ ఫిలిమ్‌‌ సొసైటీ దృష్టిని ఆకర్షించగలిగారు. 

తను తీసిన సినిమాలు నేటి దర్శక నిర్మాతలకు పాఠాలుగా మారడం, జీవం ఉట్టిపడే విధంగా సినిమాలను నిర్మించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అయ్యింది. 1980ల్లో కల్‌‌యుగ్‌‌, సుస్మన్‌‌, యాత్ర, మండీ, త్రికాల్‌‌, సర్దార్‌‌ బేగమ్‌‌, జుబైదా లాంటి సమాంతర సినిమాలతో పాటు భారత్‌‌ ఏక్‌‌ ఖోజ్‌‌ (టీవీ సీరియల్‌‌)లను తీసారు. బంగ్లాదేశ్‌‌ ప్రభుత్వ సౌజన్యంతో షేక్ ముజిబుర్‌‌ రహెమాన్‌‌ జీవిత చరిత్రను “ముజిబ్‌‌: ది మేకింగ్‌‌ ఆఫ్‌‌ ఏ నేషన్‌‌” సినిమాను తీసి 2023లో విడుదల చేసారు. 

ఎన్నెన్నో సినీ పురస్కారాలు

శ్యామ్‌‌ బెనెగల్‌‌ ప్రతిభను మెచ్చి అసంఖ్యాక అవార్డులు ఆయన చెంతనే చేరి మురిసిపోయాయి. దాదా సాహెబ్‌‌ పాల్కే అవార్డుతో పాటు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, నర్గీస్‌‌ దత్‌‌ అవార్డు, కేన్స్‌‌ ఫిలిం ఫెస్టివల్‌‌ నామినేషన్‌‌, బెర్లిన్‌‌ ఇంటర్నేషనల్‌‌ ఫిలిం ఫెస్టివల్‌‌ నామినేషన్‌‌, మాస్కో ఇంటర్నేషనల్‌‌ ఫిలిం ఫెస్టివల్‌‌ గోల్డెన్‌‌ ప్రైజ్‌‌, బి ఎన్‌‌ రెడ్డి నేషనల్‌‌ అవార్డు, జీవన సాఫల్య పురస్కారం, హోమీ బాబా ఫెలోషిప్‌‌, పద్మశ్రీ, పద్మ భూషణ్​, సోవియట్‌‌ల్యాండ్‌‌ నెహ్రూ అవార్డు, ఏఎన్ఆర్‌‌ నేషనల్‌‌ అవార్డు.

గుజరాత్‌‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌‌ లాంటి పలు పురస్కారాలు లేదా గుర్తింపులు పొందారు.‘నీరా బెనెగల్‌‌’ ను వివాహమాడిన శ్యామ్‌‌ బెనెగల్‌‌కు ‘పాయ్‌‌ బెనెగల్’‌‌ అనే కూతురు ఉన్నది. తన 90వ ఏట మూత్రపిండాల దీర్ఘకాలిక సమస్యతో 23 డిసెంబర్‌‌ 2024న తుది శ్వాస విడిచిన బెనెగల్‌‌ భారతీయ సినీ పరిశ్రమకు అంతర్జాతీయ కీర్తిని ఆర్జించి పెట్టారు.  బెనెగల్‌‌ సినీ నిర్మాణ విలక్షణ, సృజనశీల దక్షతకు పాదాభివందనం. 

- బుర్ర మధుసూదన్​రెడ్డి-