అంబానీ, అదానీల కోసమే..బీజేపీ హిందూత్వ సిద్ధాంతం : తమ్మినేని వీరభద్రం

  • లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలి 
  • సీపీఎంఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

సిరిసిల్ల టౌన్, వెలుగు : బీజేపీ హిందూత్వ సిద్ధాంతం కేవలం అంబానీ, అదానీల వంటి అగ్రవర్ణాల ప్రయోజనాల కోసమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి,  మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.  అసలైన హిందువులకు బీజేపీతో ఐదు పైసల మేలు జరగడం లేదని,  ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను బలపరుస్తూ దేశ సమైక్యత, సమగ్రత, మతసామరస్యానికి దేశ ప్రజలు ఐక్యంగా మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం   రాజన్న సిరిసిల్ల జిల్లా మూడో మహాసభల సందర్భంగా సిరిసిల్ల టౌన్ లో ఆర్టీఓ ఆఫీస్ నుంచి బీవైనగర్ షాదీ ఖానా వరకు ఎర్రజెండాలతో, డప్పు చప్పుళ్లు నడుమ బోనాలు, బతుకమ్మలతో భారీ ప్రదర్శన నిర్వహించారు.

షాదీఖానాలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముశం రమేశ్​అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడారు. పదేండ్ల బీజేపీ ప్రభుత్వం దేశప్రజలకు పది పైసలు మేలు చేయలేదని విమర్శించారు.  ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను, యువతను మభ్యపెట్టి మోసగించిందని మండిపడ్డారు.  ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ ప్రజలను మభ్యపెడుతూ తన మతోన్మాద మనువాద ఎజెండాను అమలు చేస్తూ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ అయిన ‘మహాలక్ష్మి’ ఒక్క గ్యారెంటీ మాత్రమే సంపూర్ణంగా అమలు చేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసేందుకు గత ప్రభుత్వ అడుగుజాడల్లోనే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. లగచర్ల రైతుల పోరాటంలో న్యాయం ఉందన్నారు. కలెక్టర్ పై దాడిని తమ పార్టీ ఖండిస్తుందన్నారు.  

రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని కోరారు.  సిరిసిల్ల జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమం బలహీనంగా ఉన్నప్పటికీ బలమైన పోరాటాలు నిర్మించిందని పేర్కొన్నారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి. స్కైలాబ్ బాబు, రాష్ట్ర నేతలు కూరపాటి రమేశ్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, గన్నేరం నరసయ్య, రమణ, నేతలు పాల్గొన్నారు.