మోదీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి : బీవీ.రాఘవులు

  • దేశాన్ని ఆదానీ, అంబానీలకు తాకట్టు పెడుతున్నరు
  • సీపీఎం జాతీయ  పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు 

చౌటుప్పల్‌‌‌‌, వెలుగు : ప్రధాని మోదీ దేశాన్ని ఆదానీ, అంబానీలకు తాకట్టు పెడుతున్నారని సీపీఎం జాతీయ పొలిట్‌‌‌‌ బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు విమర్శించారు. దేశ భవిష్యత్‌‌‌‌ కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని, అందులో  సీపీఎం అగ్రభాగాన ఉంటుందన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌‌‌‌లో ఆదివారం నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు చౌకగా అమ్మేస్తున్నారని ఆరోపించారు. దేశంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల్లో వైషమ్యాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రాంతీయ, మత ఉద్యమాలను ముందుకు తెస్తున్నారని, ప్రజల మధ్య విభజన సృష్టిస్తున్నారన్నారు.

బీజేపీ విధానాలపై కాంగ్రెస్‌‌‌‌ ఎందుకు మౌనం వహిస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా సీపీఎం చేస్తున్న పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాటూరు బాలరాజు, మంగ నరసింహ, కల్లూరి మల్లేశం, దోనూరి నర్సిరెడ్డి, మేక అశోక్‌‌‌‌రెడ్డి, దాసరి పాండు పాల్గొన్నారు.