తీవ్ర జ్వరంతో సీతారాం ఏచూరి.. హుటాహుటిన ఢిల్లీ ఎయిమ్స్కు..

న్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ ఎంపీ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆసుపత్రిలో చేరారు. నిమోనియాతో బాధపడుతున్న ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన ఎమర్జెన్సీ విభాగంలోని రెడ్ జోన్లో చికిత్స పొందుతున్నారు. ఐసొలేషన్ వార్డ్కు ఆయనను తరలించి చికిత్స అందించి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని  వైద్యులు ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. 2021లో సీతారాం ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ (35) కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. రెండు వారాల పాటు  కరోనాతో పోరాడిన ఆశిష్‌ చికిత్స పొందుతూ చనిపోయారు. ఆశిష్ ఢిల్లీలోని ఓ పత్రికలో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేశారు.

ఆశిష్ మరణం సీతారం ఏచూరిని మానసికంగా కుంగదీసింది. భారత రాజకీయాల్లో సీతారాం ఏచూరి అనే పేరు తెలియని వారు ఉండకపోవచ్చు. 2016లో బెస్ట్ పార్లమెంటేరియన్గా ఆయన అవార్డు అందుకున్నారు. తమిళ్ బ్రాహ్మిణ్ కుటుంబానికి చెందిన సీతారాం ఏచూరి 1974లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)లో చేరారు. ఆ తర్వాత సంవత్సరానికే సీపీఎంలో సభ్యుడిగా మారారు. లెఫ్ట్ పార్టీలకు జేఎన్యూను ఒక బలమైన వేదికగా మార్చడంలో బృందాకారత్, సీతారాం ఏచూరి కీలక పాత్ర పోషించారు.