కరువు మండలాలను ప్రకటించాలి : మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట, వెలుగు:  ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని  సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు.  శుక్రవారం జరిగిన సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.  వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగర్ ఆయకట్టు,  ఎస్సారెస్పీ కాలువ కింద రైతులు సాగు చేసిన పంటల్లో సగానికిపైగా ఎండిపోయాయని, ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.  

రైతులు బోర్లు వేసి కాపాడుకున్న పంటలు కొనుగోలుకు సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు.  మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇవ్వాలన్నారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాల్లో అద్దె బోర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కోరారు.  సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోలిశెట్టి  యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో  పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, కోట గోపి  పాల్గొన్నారు.