జిల్లా అభివృద్ధి కోసం పోరాడుతాం : మచ్చ వెంకటేశ్వర్లు

  • సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రజా పోరాటాలు చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. కొత్తగా జిల్లా సెక్రటరీగా ఎన్నికైన ఆయన కొత్తగూడెంలోని సీపీఎం జిల్లా ఆఫీస్​లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇల్లెందు పట్టణంలో శుక్ర, శనివారాల్లో జిల్లా మహాసభలు జరిగాయన్నారు. కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇద్దరు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి భద్రాద్రికొత్తగూడెం జిల్లా అభివృద్ధిపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. 

సీతారామ ప్రాజెక్ట్​ ద్వారా ఈ జిల్లాకు మేలు జరగడం లేదన్నారు.  పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలతో పాటు భద్రాచలం, సారపాక పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించాలన్నారు. అర్హులైన పోడు సాగు దారులందరికీ పట్టాలివ్వాలని డిమాండ్​ చేశారు. హాస్పిటళ్లలోని ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. పట్టా ఉన్న వాళ్లకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామనడం సరికాదన్నారు.  

ఇల్లెందులో జరిగిన మహాసభల్లో భవిష్యత్​ పోరాటాలపై చర్చించామని చెప్పారు. 34 మందితో జిల్లా కమిటీ, 11 మందితో జిల్లా కార్యదర్శి వర్గాన్ని ఎన్నుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు అన్నవరపు కనకయ్య, జిల్లా నేతలు ఎం. జ్యోతి, లిక్కి బాలరాజు, బ్రహ్మచారి, అన్నవరపు సత్యనారాయణ, ఆర్​. శ్రీనివాస్​, కొండపల్లి శ్రీధర్​, భూక్యా రమేశ్, పద్మ పాల్గొన్నారు.