తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ ట్రాప్ లో పడొద్దు : కూనంనేని సాంబశివరావు

  • ప్రభుత్వాన్ని కూల్చేందుకు రెండు పార్టీల కుట్ర 
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని 

 కరీంనగర్, వెలుగు : తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ ట్రాప్‌‌‌‌‌‌‌‌లో పడొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు. ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. రైతు రుణమాఫీ 100 శాతం అమలు చేయాల్సిందేనని, సంక్షేమ పథకాలపై స్పష్టతనివ్వాలని ఆయన  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌‌‌‌‌‌‌‌లో సీపీఐ జాతీయ సమితి సభ్యుడు చాడ వెంకట్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కలిసి బుధవారం మీడియాతో మాట్లాడారు.

హైడ్రా పేదవాడికి శాపంగా మారకూడదని, పేదల ఇళ్లను కూల్చొద్దని సూచించారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఏర్పడిందన్నారు. రేషన్ కార్డులు, పింఛన్లు, రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కూనంనేని సూచించారు.  డిసెంబర్ 26న సీపీఐ100వ వసంతంలోకి అడుగుపెడుతోందని, ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు పొనగంటి కేదారి, సృజన్ కుమార్, అశోక్, స్వామి, సమ్మయ్య, లక్ష్మీ, బాబు, సురేందర్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.