సాయుధ పోరాటాన్ని పాలకులెందుకు గుర్తించరు?

19వ శతాబ్దంలో దేశవ్యాప్తంగా ఉన్న సంస్థానాలలో అతిపెద్ద హైదరాబాద్‌ సంస్థానాన్ని నిజాం నవాబు  అసఫ్‌జాహీ వంశస్థులు 220 సంవత్సరాల పైబడి పరిపాలించారు. ఈయన సంస్థానం 16 జిల్లాల పరిగణ. 8 తెలంగాణ, 5 మహారాష్ట్ర, 3 కర్నాటకకు సంబంధించినవి. ఈయన కనుసన్నలలో జమీందార్లు, జాగీరుదార్లు, వతనుదారులు, భూస్వాముల వ్యవస్థ కొనసాగేది.  ప్రజలకు ఎలాంటి హక్కులు లేవు. పల్లె ప్రజల బతుకులు దినదిన గండంగా సాగేవి. దొరల కబంధ హస్తాల కింద వెట్టిచాకిరి, బానిసత్వంలో బతుకులు వెళ్లదీసే రోజులు.

హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌లో చదువుతున్న అనేకమంది యువకులు స్వాతంత్య్రోదమంలో పాల్గొన్నారు. 1932 కాకినాడ ఉప్పు సత్యాగ్రహం లాంటి వార్తలు విని తెలంగాణలో కూడా నిజాం ఆగడాలను, అరాచకాలను ఎండగట్టేందుకు, బానిస బతుకులకు చరమగీతం పాడేందుకు మెదక్‌ జిల్లా జోగిపేటలో మొదటి  ఆంధ్ర మహాసభ నిర్వహించారు. అందులో ప్రధానంగా పౌరహక్కులు, వెట్టిచాకిరి రద్దు, తెలుగులో పాఠశాలలు నిర్వహించాలనే అంశాలపై తీర్మానాలు చేశారు. ఆ తదుపరి ప్రతి సంవత్సరం ప్రజల కష్టాలు, కడగండ్లపై మహాసభలు నిర్వహిస్తూ 1945లో భువనగిరిలో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రమహాసభ నూతనత్వానికి, ప్రజల స్వేచ్ఛ, హక్కుల సాధనకు, భూమి, భుక్తి పోరాటాలకు పిలుపిచ్చింది. 

దొడ్డి కొమురయ్యపై తూటాలు

జనగామ ప్రాంతంలో విసునూరు రామచంద్రారెడ్డి 20 గ్రామాల అధిపతి 40 వేల ఎకరాలపైబడి భూములకు భూస్వామి. అతని అరాచకాలు అంతా ఇంతా కావు. కడివెండిలో ఆయన తల్లి జానకమ్మది క్రూరమైన మనస్తత్వం. అక్కడ నర్సింహులు, అనేక మంది యువకులు ఆంధ్ర మహాసభతో సన్నిహితంగా ఉంటూ క్రియాశీలకంగా ప్రజల మధ్య ఉంటూ దొరలను ఎదిరించేవారు. జులై 4న జానకమ్మ  అరాచకాలకు వ్యతిరేకంగా ఆమె ఇంటి ముందు నుంచి ఊరేగింపుగా వెట్టిచాకిరి రద్దు, దున్నేవాడికే భూమి లాంటి నినాదాలతో ఊరేగింపు కొనసాగుతుండగా జానకమ్మ ఊరేగింపు తన ఇంటి ముందుకు రాగానే గూండాలతో దాడి చేయించింది. కార్యకర్తలు ఎదురు తిరగడంతో దొరల గూండాలు తుపాకితో కాల్పులు జరపగా నేలకొరిగాడు దొడ్డి 
కొమురయ్య. అప్పటినుంచి హింసాత్మక సంఘటనలు ఆరంభమైనాయి. అప్పటికే నిజాం నవాబులు, రజాకార్లు ఒక్కటై గ్రామాలపై దాడులు మొదలుపెట్టారు.

చాకలి ఐలమ్మ తిరుగుబాటు

పాలకుర్తిలో చాకలి అయిలమ్మ తన పొలంలో వరి పంట వేసుకుంటే దానిని కూడా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించారు.  సకాలంలో సంఘ కార్యకర్తలు కట్కూరు రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వచ్చి చాకలి అయిలమ్మకు రక్షణగా నిలిచి ధాన్యాన్ని ఆమెకు అప్పగించారు. అలా తెలంగాణ వ్యాప్తంగా అణచివేతలు కొనసాగుతున్న తరుణం. నల్లగొండ, కరీంనగర్‌, వరంగల్‌, అనేక జిల్లాల్లో దొరల దౌర్జన్యాలను ఎదిరిస్తూ సంఘం దూసుకుపోయింది. మూడు వేల గ్రామాలపైబడి గ్రామ రాజ్యాలుగా ఏర్పాటు చేసుకున్నారు. దొరలంతా పట్నంకు వెళ్ళి నిజాంకు మొర పెట్టుకున్నారు.

సిపీఐ తొలి కార్యదర్శిగా బద్దం ఎల్లారెడ్డి

 నిజాం నవాబు మాత్రం 1947 జూన్‌లో తన హైదరాబాద్‌ సంస్థానాన్ని దేశంగా ప్రకటించుకున్నాడు. కేంద్రంలో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానిగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అప్పటికి తెలంగాణలో సీపీఐ శాఖ ఏర్పడి తొలి కార్యదర్శిగా బద్దం ఎల్లారెడ్డి ఎన్నికైనారు. హైదరాబాద్‌లో అనేక కార్మిక సంఘాలు, విద్యార్థి, తదితరులు సంఘాలుగా ఏర్పాటు చేసి కార్మికుల హక్కుల సాధనకు ఉద్యమాలు సాగుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినా తెలంగాణ సంస్థానం మాత్రం నిజాం పాలనలో కొనసాగుతున్నది.  కేంద్ర ప్రభుత్వం కూడా మంతనాలకే పరిమితమైంది.

రైతాంగ సాయుధ పోరాటం

సెప్టెంబర్‌ 11,1947 అంటే స్వాతంత్య్రం సాధించిన పిదప రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్‌ నిజాంను గద్దెదించడానికి సాయుధ పోరాటమొక్కటే శరణ్యమని భావించి  నిజాం నవాబుల తాబేదార్లపై ఎక్కడికక్కడ బడిశలు, కత్తులు, కర్రలు, కారంపొడితో ఆడ, మగ అనే తేడా లేకుండా తిరగబడాలని పిలుపివ్వడం జరిగింది. ఆ పిలుపు ప్రభంజనంగా మారింది. ఊరు, వాడ ఉప్పెనగా తిరుగుబాటు చేశారు. మూడు వేల గ్రామాలను విముక్తి చేశారు. 10 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచారు. 2500 మంది యువ కిశోరాలు సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించారు. అప్పటి నిజాంకు విధి లేక, గత్యంతరం లేక  కేంద్రంతో ఒప్పందం చేసుకున్నాడు. ఇది నిజం. 

విలీనంపై చర్చలు జరపలేదు

ఎట్టకేలకు 17 సెప్టెంబర్‌ 1948లో భారతదేశంలో తెలంగాణ విలీనానికి  కూడా చర్చలు జరపలేదు. యూనియన్‌ సైన్యాలు సెప్టెంబర్‌ 13న హైదరాబాద్‌కు చేరుకోవడం, సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. నిజాం నవాబుకు రాజభరణాలు ఆయన భూములు, భవనాలు, ఆభరణాలు అన్నింటిని ఆయనకే ఇవ్వడంలో ఔచిత్యాన్ని, ఆంతర్యాన్ని ఇప్పటికైనా మేధావులు దృష్టిలో ఉంచుకోవాలి.  ఇంత జరిగిన పిదప కూడా ఆనాటి పోరాటయోధులు కమ్యూనిస్టులే కాకుండా,  కాంగ్రెస్‌, సోషలిస్టు పార్టీలకు చెందిన నాయకులు కూడా ఉన్నారు. తెలంగాణ సంస్థానాన్ని భారతదేశంలో కలపడానికి (విలీనం) చేసిన ప్రాణాలర్పణకు ఎందుకు విలువ లేదనేది ప్రధాన ప్రశ్న.

విలీనం రోజును అధికారికంగా ఎందుకు జరపరు?

1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో తెలంగాణలోని 16 జిల్లాలను.. 5 జిల్లాలు మహారాష్ట్రలో, 3 జిల్లాలు కర్నాటకలో, మిగిలిన 8 జిల్లాలు తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం ఒక పరిణామంగా భావించినా కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్‌ 17న విలీన దినంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అధికార దినంగా ఆనాటి పోరాట యోధులను గుర్తించి సత్కరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పాలకులు తెలంగాణ యోధులకు అలాంటి గుర్తింపు ఇవ్వలేదు. 

బీజేపీ మొసలి కన్నీరు

అప్పుడు పుట్టని బీజేపీ పార్టీ మొసలి కన్నీరు కారుస్తూ తెలంగాణలో పాగా వేసేందుకు విలీన దినాన్ని అధికార పూర్వకంగా రాష్ట్రం జరపకపోయినా, కేంద్ర ప్రభుత్వం జరుపుతుందంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్వయంగా సెప్టెంబర్‌ 17న తెలంగాణలో బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన సభలలో పాల్గొంటున్నారు. రాజకీయ లబ్ధి తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించలేకపోయారు. 

ఇప్పటికైనా అధికారికంగా నిర్వహించాలి

ఇప్పటికైనా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ అయినా తెలంగాణ విలీనాన్ని అధికార పూర్వకంగా నిర్వహిస్తూ ట్యాంక్‌ బండ్‌పై రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లా రెడ్డి, ఇతర ప్రముఖుల విగ్రహాలు పెట్టాలి. వందలాది మంది  నేలకొరిగిన బైరాన్‌పల్లి, గుండ్రాంపల్లి లాంటి అనేక చోట్ల ఆనాటి చిహ్నాలు కాపాడే విధంగా టూరిజం ప్రదేశాలుగా గుర్తించి నిర్మాణాలు చేయాలి. పాఠ్యపుస్తకాలలో ఆనాటి త్యాగాల చరిత్ర నేటి తరానికి తెలియపరచేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలి. నాటి పోరాట స్మృతులతో మ్యూజియంను ఏర్పాటు చేయాలి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల శాశ్వతానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత విలీనదినంగా జరుపుతానని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. కేసీఆర్‌ కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా 
అనేక సభలలో సాయుధ పోరాటమే లేకపోతే తెలంగాణ ఏమైపోయేదో.. మరో పాకిస్తాన్‌ లాగ ఉండేదేమో అన్నారు. కానీ, ఆయన మాట నిలబెట్టుకోలేదు.  తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా 
కాంగ్రెస్‌ స్పష్టమైన వైఖరితో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, విలీన దినాన్ని ప్రభుత్వపరంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది.

- చాడ వెంకటరెడ్డి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు