కామారెడ్డి జిల్లాలో ఘనంగా సీపీఐ ఆవిర్భావ దినోత్సవం

కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం సీపీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.  సీపీఐ సీనియర్​ స్టేట్​ లీడర్​ నర్సింహారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. ఎన్నో  కార్మికులు, రైతులు, ప్రజా పోరాటాలు చేసిన పార్టీ సీపీఐ అని అన్నారు.  రైతులకు గిట్టుబాటు ధరలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు రైతాంగ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు.  కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ ఎల్.దశరథ్,  సహాయ కార్యదర్శి బాల్​రాజు, దేవయ్య, బాలమణి,  మల్లేష్​ తదితరులు పాల్గొన్నారు. 

కోటగిరి, వెలుగు: సీపీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని  ఆ పార్టీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు.  సీపీఐ మండల కార్యదర్శి  విఠల్ గౌడ్  కోటగిరి  బస్టాండ్ వద్ద పార్టీ  జెండా ఎగురవేసి కమ్యూనిస్టుల సేవలను కొనియాడారు. అనంతరం బాన్సువాడ నియోజకవర్గ ఇన్​చార్జి దుబాస్ రాములు మాట్లాడుతూ.. దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనార్టీలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాడులను పెంచిందన్నారు.  

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేండ్లు దాటిన రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసిన ఘన చరిత్ర సీపీఐదని  గుర్తు చేశారు.   తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెట్టాలని పోరాటం చేశామన్నారు.