అంబానీ, అదానీల దోస్త్ మోదీ.. నల్గొండలో జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో రాజా

  • మతం పేరుతో అధికారం కాపాడుకుంటున్నడు
  • ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్

నల్గొండ అర్బన్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ.. అంబానీ, అదానీలకు మాత్రమే హితుడని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. మోదీ అంటున్న సబ్ కా సాథ్, సబ్ కా వికాస్  కొందరి అభివృద్ధి కోసమే పనిచేస్తున్నదని అన్నారు. సోమవారం నల్గొండ ఎన్జీ కళాశాల ఆవరణలో జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు రాజా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 

మతాల పేరుతో దేశంలో గొడవలు సృష్టించి  అధికారాన్ని కాపాడుకోవాలన్న దుష్ట ఆలోచనతో మోదీ పరిపాలన కొనసాగిస్తున్నారని, మతోన్మాదానికి సీపీఐ  వ్యతిరేకమని స్పష్టం చేశారు. డాక్టర్  బాబా సాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్  చేశారు.

  అంబేద్కర్ పై మోదీకి ఏమాత్రం గౌరవం ఉన్నా అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్  చేయాలన్నారు. మోదీ పాలనలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. భారతదేశానికి లౌకికరాజ్యంగా ప్రపంచ దేశాల్లో గొప్ప పేరు ఉందని, కానీ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్  రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు మోదీ యత్నిస్తున్నారని ఆరోపించారు.

1925 డిసెంబర్  26 న సీపీఐ ఆవిర్భవించిందని,  శతాబ్ది ఉత్సవాలను ఉద్యమాల ఖిల్లా నల్గొండలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. పార్టీని  మరింత బలోపేతం చేయాలన్నారు. సీపీఐ  పేదల హక్కుల కోసం పుట్టిన పార్టీ అని మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు.  ప్రజల గుండెల్లో పార్టీని నిలపడమే లక్ష్యంగా కమ్యూనిస్టులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.  

మరణం లేని పార్టీ సీపీఐ: కూనంనేని   

మానవజాతి ఉన్నంత కాలం కమ్యూనిస్టులకు మరణం లేదని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టు  పార్టీ చరిత్ర లేకుండా దేశ చరిత్ర లేదన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టులు చనిపోతే ఇందులో 3,000 మంది నల్గొండ జిల్లా వారేనని ఆయన గుర్తుచేశారు. అధికారం కోసం పుట్టిన పార్టీలు పక్షవాతం వచ్చి ఒక రాష్ట్రంలో ఉంటే మరో రాష్ట్రంలో ఉనికి లేకుండా అంగవైకల్యంతో బాధపడుతున్నాయని, కమ్యూనిస్టులు మాత్రం అధికారం లేకున్నా  ప్రతి చోటా ఉన్నారన్నారు. 

భేదాభిప్రాయాలను పక్కనపెట్టి అన్ని ఎర్రజెండా పార్టీలు ఏకం కావాలని కూనంనేని  పిలుపునిచ్చారు. అంతకుముందు గడియారం సెంటర్  నుంచి రెడ్ షర్ట్  వలంటీర్లు ఎన్జీ కళాశాల వరకు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే  పల్లా వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీ, జాతీయ కార్యదర్శి సయ్యద్  అజీజ్  పాషా, మాజీ ఎమ్మెల్యే, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్య పద్మ  తదితరులు పాల్గొన్నారు.