ఇయాల్టి నుంచి హెల్మెట్ మస్ట్ .. సీరియస్​ అమలుకు సీపీ ఆర్డర్స్​

  • సిటీలో తిరిగినా హెల్మెట్​ ఉండాల్సిందే, లేకుంటే జరిమానాలు
  • మరణాల నివారణకు  నిర్ణయం

నిజామాబాద్​, వెలుగు: ఆగస్టు 15 నుంచి బండి బయటకు తీస్తే తలకు హెల్మెట్​ పెట్టుకోవాల్సిందే. లేకుంటే జరిమానాలు కట్టాల్సిందే. ఐదు నిమిషాల దారేకదా అని అశ్రద్ధ  చేస్తే   ఫైన్​ పడుతుంది. ఇయ్యాల్టి నుంచి దీన్ని అమలు చేసేందుకు సీపీ కల్మేశ్వర్​ ఆర్డర్స్​ జారీ చేశారు. 

767 యాక్సిడెంట్లు..337 మరణాలు

రోడ్​ ప్రమాదాల నివారణపై ఫోకస్​ పెట్టిన సీపీ కల్మేశ్వర్​  ప్రమాదాలకు  కారణాలను గుర్తిస్తున్నారు. మద్యం మత్తులో నడిపే వారిని డ్రంక్​ అండ్ డ్రైవ్​ టెస్ట్​లో పట్టుకొని జైలుకు పంపుతున్నారు. ఇప్పటి వరకు 800 కేసులు నమోదు చేసి 400 మందికి 10 నుంచి 14 రోజుల జైలు శిక్ష పడేలా చేశారు. మైనర్లకు బండ్లు ఇవ్వొద్దని కాలేజీలకు వెళ్లి పేరేంట్స్​తో కౌన్సిలింగ్​ నిర్వహించారు. ఈ విషయంలో కాలేజ్​ మేనేజ్​మెంట్​లకు ఆదేశాలు జారీచేశారు. రోడ్​ సేఫ్టీ ప్రొగ్రామ్స్​కు ప్రయారిటీ ఇచ్చారు. వన్​వేలో రాంగ్​రూట్​లో వచ్చే వాహనాలు ఏవైనా జరిమానాలు విధిస్తున్నారు. సౌండ్​ పొల్యూషన్​కు కారణమవుతున్న  బండ్ల సైలెన్సర్​లను పీకేయించే బుల్డోజర్​తో ధ్వంసం చేయించారు.   

జిల్లాలో గత యాడాది 767 యాక్సిడెంట్లు జరుగగా337 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మంది సీరియస్​ కండీషన్​తో హాస్పిటల్స్​లో చేరగా కొందరు ఇప్పటికీ కోలుకోలేదు. అవయవాలు కోల్పోయి దివ్యాంగులైన వారు కొందరు కాగా మరికొందరు చాలాకాలంగా  బెడ్​పైనే ఉన్నారు.  జనవరి నుంచి ఇప్పటిదాకా జరిగిన  ప్రమాదాల్లో 200 మించి  మరణాలు చోటుచేసుకున్నాయి. వీటిలో టూవీలర్​ ప్రమాదాలు ఎక్కువగా ఉండటంతో   హెల్మెట్​ రూల్​ అమలు చేయనున్నారు. ఇందుకు డెడ్​లైన్​గా పంద్రాగస్ట్​ను ఫిక్స్​ చేసి రెండు వారాల నుంచి విస్తృత ప్రచారం చేశారు. 

టూవీలర్స్​ అధికం

జిల్లాలోని నిజామాబాద్​నగరం, బోధన్, ఆర్మూర్, భీంగల్​ మున్సిపాలిటీలలో 1,27,696 టూవీలర్​ బండ్లు ఉండగా 530 విలేజ్​లలో 2.43 లక్షల ఉన్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా వాహనం ఉన్న ప్రతిఒక్కరికీ హెల్మెట్​ అలవాటు చేయాలని నిర్ణయించారు. ట్రాఫిక్​ ఉల్లంఘనల పరిధిలోనే హెల్మెట్​ను చేర్చారు. వీటిని తలపై ధరించక బండ్లు నడిపేవారి ఫొటోలు తీసి ఇంటి అడ్రస్​లకు జరిమానా లెటర్​లు పంపుతారు. చెకింగ్​లో పట్టుబడినా పెనాల్టీ వసూలు చేసి రశీదు ఇస్తారు.

వాహనాలు నడిపే వారి వ్యక్తిగత భద్రతకోసం 15 ఆగస్టు నుంచి మొత్తం కమిషరే​ట్​ పరిధిలో హెల్మెట్​ తప్పనిసరి చేశాం.  హెల్మెట్​ లేకుంటే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తాం

సీపీ కల్మేశ్వర్​