కవర్ స్టోరీ..చలో మన దీవులు

‘లక్షద్వీప్, అండమాన్‌‌లకు వెళ్ళాను. అవి ఆశ్చర్యపరిచే అందమైన ప్రదేశాలు. అద్భుతమైన బీచ్‌‌లు.
హమ్‌‌ భారత్‌‌ హై.. హమారీ ఆత్మ నిర్భరతా పర్‌‌ ఆంచ్‌‌ మత్‌‌ దాలియే జై హింద్‌‌’ 

‌‌-–అమితాబ్ బచ్చన్‌‌

‘మాల్దీవ్​ల మినిస్టర్స్​ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు చూశా. టూరిస్ట్​లను పంపించే మన దేశం గురించి ఇలా మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది. పొరుగువారితో స్నేహంగా మెలగాలనే అనుకుంటాం. కానీ, ద్వేషాన్ని ఎందుకు సహించాలి? ఎన్నోసార్లు మాల్దీవ్స్‌‌కు వెళ్లా. ప్రతిసారీ ప్రశంసించా. అయితే ఆత్మగౌరవమే ఫస్ట్‌‌. భారతదేశంలోని దీవుల్లో ప్రయాణిస్తూ.. మన టూరిజంకి సపోర్ట్‌‌ చేద్దాం’ 

– అక్షయ్‌‌ కుమార్‌‌ 

‘ఈ మధ్య సింధూదుర్గ్‌‌లో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నా. అక్కడ మాకు కావాల్సినవి అన్నీ దొరికాయి. అందమైన ప్రదేశాలు, అద్భుతమైన ఆతిథ్యం ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ఎన్నో అందమైన, సహజ దీవులకు భారత్‌‌ కేరాఫ్​. చూడాల్సిన ప్రదేశాలు, ఎన్నో జ్ఞాపకాలను పదిల పరుచుకోవడానికి వేచి చూస్తోంది’

– సచిన్‌‌ టెండూల్కర్‌‌ 

‘మేమంటే ఎందుకంత అక్కసు’
‘మీరు ఆపదల్లో ఉన్నప్పుడు ఆదుకున్నది మేమే’
ఇలా సెలబ్రిటీలతో పాటు సామాన్యులు పెట్టే పోస్టులతో, బాయ్‌‌కాట్‌‌ మాల్దీవ్స్‌‌ అనే హాష్‌‌ట్యాగ్‌‌తో సోషల్‌‌ మీడియా గత కొన్ని రోజులుగా మార్మోగిపోతోంది. 
ఇలా మనవాళ్లు మాల్దీవ్స్‌‌ మీద విరుచుకు పడడానికి కారణం... అక్కడి మంత్రుల నోటి దురుసు. ప్రధాని నరేంద్ర మోదీ.. వాళ్ల  ప్రస్తావన తీసుకురాకున్నా.. మన దేశాన్ని కించపరిచే విధంగా మాల్దీవ్స్ మంత్రులు పోస్టులు పెట్టారు. దానికి ప్రతిస్పందనే ఇది.

మాల్దీవ్స్‌‌‌‌ మంత్రులు చేసిన వివాదాస్పద పోస్టులపై ఇండియన్‌‌ సిటిజన్స్‌‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మాల్దీవ్స్‌‌ని బాయ్‌‌కాట్‌‌ చేయడమే కాదు. ఇండియన్‌‌ ఐలాండ్స్‌‌ని ప్రమోట్‌‌ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఆత్మగౌరవం కాపాడుకునేందుకు భారతీయులు ఒక రకంగా సోషల్‌‌మీడియాలో యుద్ధమే చేస్తున్నారు. మాల్దీవ్స్‌‌ మంత్రులకు ఘాటుగా బదులిస్తున్నారు. 

‘‘మనకేం తక్కువ.. ఇండియాలో అన్నీ ఉన్నాయి. 
ఒక వైపు చల్లని హిమాలయాలు.. లోయల్లో అందమైన తోటలు. 
మరో వైపు అందమైన సముద్ర తీరం అంచున లక్ష ద్వీపాలు, అండమాన్‌‌ నికోబార్‌‌‌‌ ఐలాండ్స్‌‌.
దేశమంతా గలగలా పారే నదులు, పెద్ద పెద్ద ఆనకట్టలు.
ఏ రాష్ట్రానికి వెళ్లినా విభిన్నమైన భాషా సంస్కృతులు. రకరకాల రుచులు. 


దట్టమైన అభయారణ్యాలు. అబ్బుర పరిచే కట్టడాలు. వేల ఏండ్ల నాటి నాగరికతల గుర్తులు. ఆదిమానవులు వదిలిన ఆనవాళ్లు... ఇలా చెప్పుకుంటే మన దేశంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటన్నింటినీ చూడడానికి ఒక జీవితం సరిపోతుందా అనిపిస్తుంది. అందుకే మన దేశంలోని పర్యాటక ప్రదేశాలను మనమే ప్రమోట్‌‌ చేసుకోవాలి. సందర్శించాలి’’ అంటున్నారు నెటిజన్స్‌‌, సెలబ్రిటీలు.  

ప్రధాని నరేంద్ర మోదీ ఇండియాలో టూరిజం డెవలప్‌‌మెంట్‌‌ కోసం అప్పుడప్పుడు దేశంలోని పలు టూరిస్ట్‌‌ ప్లేస్‌‌లకు వెళ్లి.. ఆ ప్రాంతాల ఫొటోలు సోషల్‌‌ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అలా ఇదివరకు హిమాలయాలతోపాటు కొన్ని టూరిస్ట్‌‌ ప్లేస్‌‌ల ఫొటోలు షేర్‌‌‌‌ చేశారు. అలాగే ఈ మధ్య కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌‌కి వెళ్లినప్పడు అక్కడ కొంతసేపు సముద్రం ఒడ్డున సేద తీరారు. తర్వాత సముద్రంలో స్నార్కెలింగ్‌‌ చేశారు.

అక్కడి చూడదగ్గ ప్రదేశాల ఫొటోలు సోషల్‌‌ మీడియాలో షేర్ చేశారు.  ‘సాహసాలు చేయాలనుకునే వాళ్లు.. తమ లిస్ట్‌‌లో లక్షద్వీప్‌‌ను కూడా చేర్చుకోవాలని కోరుతూ’ ఒక పోస్ట్ పెట్టారు. ఆయన లక్షద్వీపాన్ని ప్రమోట్‌‌ చేయడంతో స్థానిక పర్యాటక రంగానికి కొంత ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందని అంతా అనుకున్నారు. కానీ.. మాల్దీవ్స్‌‌ మంత్రులు, ఎంపీలు మాత్రం మన దేశం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

అక్కసు.. 

మాల్దీవ్స్‌‌లో అధికారంలో ఉన్న ప్రోగ్రెసివ్ పార్టీ సభ్యుడు, సెనేట్ మెంబర్‌‌‌‌ జాహిద్ రమీజ్ ‘‘పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే. మా దేశం అందించే సర్వీస్‌‌ను  మీరు ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడి గదుల్లో వచ్చే వాసన అతి పెద్ద సమస్య’’ అని చేసిన ట్వీట్‌‌లో అక్కసు వెళ్లగక్కాడు. అతనితోపాటు కొంతమంది ప్రముఖులు, నెటిజన్స్‌‌ మన దేశాన్ని లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన, జాత్యహంకార, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. వారిలో మాల్దీవ్స్‌‌ యూత్ ఎంపవర్‌‌మెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ ఆర్ట్స్ డిప్యూటీ మినిస్టర్ మరియం షియునా కూడా ఉంది.

“ఏం జోకర్‌‌‌‌. లైఫ్ జాకెట్‌‌తో ఇజ్రాయెల్ తోలుబొమ్మ మిస్టర్ నరేంద్ర డైవర్”అంటూ ట్వీట్‌‌ చేసింది. అంతేకాదు.. డిలీట్‌‌ చేసిన మరో పోస్ట్‌‌లో షియునా భారతదేశాన్ని ఆవు పేడతో పోల్చింది. మాల్దీవ్స్‌‌లోని యువజన సాధికారత, సమాచార, కళల మంత్రిత్వ శాఖ డిప్యూటీ మినిస్టర్‌‌‌‌ మల్షా షరీఫ్ కూడా ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలే  చేశాడు. ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ మెంబర్‌‌‌‌ మాయిజ్‌‌ మహ్మద్‌‌ ఒక ఫొటో షేర్‌‌‌‌ చేస్తూ... “మాల్దీవ్స్‌‌లో కనిపించేంత సుందరమైన సూర్యాస్తమయం... మీకు లక్షద్వీప్‌‌లో కనిపించదు” అంటూ పోస్ట్ పెట్టాడు. పోస్ట్​ అయితే పెట్టాడు కానీ... అది మాల్దీవుల ఫొటో కాదు. తమ దీవులనే గుర్తించలేని ఆ మహానుభావుడు  ఫ్రెంచ్ పాలినేషియాలోని బోరా బోరా దీవుల ఫొటో పెట్టాడు! 

వార్తా సంస్థలు 

వాస్తవానికి నరేంద్రమోదీ పెట్టిన పోస్ట్‌‌లో మాల్దీవ్స్‌‌ని.. అక్కడి టూరిజం పరిస్థితులను ఎక్కడా కోట్​ చేయలేదు. లక్షద్వీప్‌‌ బాగుందని మాత్రమే చెప్పారు. కానీ.. దానికి భిన్నంగా ‘ఇండియా మాల్దీవ్స్‌‌ టూరిజంకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంద’ని కొన్ని స్థానిక వార్తా వెబ్‌‌సైట్‌‌లు వార్తలు రాశాయి. వాటిని చూసిన అక్కడి సిటిజన్స్​ కొందరు అసలు విషయం తెలుసుకోకుండా ఇండియా, లక్షద్వీప్స్‌‌కు వ్యతిరేకంగా సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌లు పెట్టారు. మాల్దీవ్స్‌‌, లక్షద్వీప్ మధ్య పోలికలు చెప్పడం మొదలు పెట్టారు. భారతదేశానికి, భారతీయులకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.  

గతేడాది నవంబర్‌‌లో బాధ్యతలు చేపట్టిన ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జూ ప్రభుత్వంలోని మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు అవమానకరమైన పదాలు వాడి పోస్ట్‌‌లు పెట్టడంతో వాళ్ల పౌరులను ఎంకరేజ్​ చేసినట్లు అయ్యింది. దాంతో సమస్య తీవ్రమైంది. చాలామంది... భారతీయ సోషల్ మీడియా నెటిజన్లతో వాదనలకు దిగారు. తగాదాలు పెట్టుకున్నారు. 

విజిట్‌‌ మాల్దీవ్స్‌‌ 

భారత ప్రభుత్వం లక్షద్వీప్‌‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేస్తుండడంతో వాళ్లు కూడా అలాగే చేయాలి అనుకున్నారు. దాంతో మాల్దీవ్స్‌‌లోని అధికారులు, ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (పీపీఎం), పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్‌‌సీ) అధికార సంకీర్ణ మద్దతుదారులు ‘#VisitMaldives’ హ్యాష్‌‌ట్యాగ్‌‌ను ముందుకు తీసుకొచ్చారు. దేశంలోని హాలిడే రిసార్ట్‌‌లు, బీచ్‌‌లు, అందమైన హోటళ్ల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌‌ చేస్తూ.. క్యాంపెయిన్ చేశారు. కొందరైతే.. మాల్దీవ్స్‌‌ నెటిజన్స్‌‌ లక్షద్వీప్ భారత భూభాగం కాదని, మాల్దీవ్స్‌‌కు చెందినదని అడ్డగోలుగా వాదించే వరకు వెళ్లారు.

మనం ఊరుకుంటామా? 

ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే మనం ఊరుకుంటామా? సోషల్‌‌ మీడియాలో ‘#BoycottMaldives’, ‘#ExploreIndianIslands’ హ్యాష్‌‌ట్యాగ్‌‌లతో పోస్ట్‌‌లు చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. అంతేకాదు.. ఇదివరకు మన దేశం మాల్దీవ్స్‌‌కు చేసిన సహాయాలను గుర్తుచేస్తున్నారు. మన దేశంలోని అందమైన ఐలాండ్స్ ఫొటోలను ట్యాగ్‌‌ చేస్తూ పోస్ట్‌‌లు పెడుతున్నారు. ‘టాక్‌‌ వాకర్‌‌’ అనే సోషల్ మీడియా అనలిటిక్స్ సంస్థ ఇచ్చిన డాటా ప్రకారం.. #BoycottMaldivesతో 2.83 లక్షల ట్వీట్లు ఉన్నప్పడు మాల్దీవ్స్​ సిటిజన్స్​ చేసిన #IndiaOut కేవలం 7,870 ట్వీట్లు మాత్రమే ఉన్నాయి.

జనవరి 2 నుంచి జనవరి 8 మధ్య మాల్దీవ్స్‌‌కు వ్యతిరేకంగా చేసిన పోస్ట్‌‌లను 14 లక్షల మంది లైక్, రీ-పోస్ట్ చేశారు. #IndiaOut ట్రెండ్‌‌పై కేవలం19,600 మాత్రమే స్పందించారు. ఇండియన్ సెలబ్రిటీలు చేస్తున్న క్యాంపెయిన్స్‌‌ మాల్దీవ్స్‌‌ ప్రయత్నాలను బాయ్‌‌కాట్‌‌ చేశాయి. సోషల్ మీడియాలోనే కాదు.. బయట కూడా చాలామంది బాయ్‌‌కాట్‌‌ చేస్తున్నారు. 

టికెట్లు క్యాన్సిల్‌‌

మనల్ని అవమానించిన మాల్దీవ్స్‌‌కు పౌరులే కాదు.. ప్రైవేట్ కంపెనీలు కూడా కౌంటర్ ఇస్తున్నాయి. ఇండియన్ ఆన్‌‌లైన్ ట్రావెల్ కంపెనీ ‘ఈజ్ మై ట్రిప్’ మాల్దీవ్స్‌‌కు ప్లైట్స్ బుకింగ్స్ రద్దు చేసింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ సీఈవో నిశాంత్ ట్విట్టర్‌‌‌‌ ద్వారా తెలిపారు. మన దేశానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ సంస్థ ద్వారా బుక్‌‌ చేసుకున్న 8 వేల హోటల్ బుకింగ్స్, 2,500 ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి.

అంతేకాదు.. మాల్దీవ్స్‌‌కు కొత్త బుకింగ్స్‌‌ కూడా ఆపేసింది. దీనివల్ల సంస్థకు నష్టం వస్తుందని తెలిసినా ఈ నిర్ణయం తీసుకున్నారు. లక్షద్వీప్‌‌ టూరిజంని డెవలప్‌‌ చేసేందుకు ఐదు కొత్త ప్యాకేజీలను మొదలుపెట్టినట్లు తెలిపారు. ఈ సంస్థ మాత్రమే కాదు.. మాల్దీవ్స్‌‌కు వెళ్లేందుకు ప్లాన్‌‌ చేసుకున్న ఇండియన్స్‌‌లో చాలామంది తమ ప్లాన్ మార్చుకున్నారు. 

మన దేశంలోని వివిధ నగరాల నుండి మాల్దీవ్స్‌‌కు నేరుగా విమానాలు నడుస్తున్నాయి. ఇక్కడి నుండి ప్రతిరోజూ దాదాపు 8 విమానాలు మాల్దీవ్స్‌‌కు వెళ్తాయి. వీటిలో 3 విమానాలు ముంబై నుండి, మిగతావి హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు, ఢిల్లీ నుండి నడుస్తున్నాయి. ఈ విమానాల ద్వారా ప్రతిరోజూ సుమారు1,200–1,300 మంది మాల్దీవ్స్‌‌కు వెళ్తున్నారు. వివాదం తర్వాత ఈ విమాన సర్వీసులపై చాలా ఎఫెక్ట్‌‌ పడింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో బుకింగ్‌‌లు రద్దవుతున్నాయి. దాదాపు 20 నుంచి 30 శాతం మంది ప్రయాణికులు టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అంటే ప్రతిరోజూ దాదాపు 300 నుంచి 400 మంది తమ విమాన టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. 

మనవాళ్లే ఎక్కువ

హిందూ మహాసముద్రంలో ఉన్న మాల్దీవ్స్‌‌లో 1,200 చిన్న దీవులున్నాయి. మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రకారం.. మాల్దీవ్స్‌‌ దేశం పర్యాటకంపైనే ఎక్కువ ఆధారపడింది. టూరిజం ఇండస్ట్రీ వాటా దాని జీడీపీలో 28 శాతానికి పైగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మాల్దీవ్స్‌‌కు వెళ్లే టూరిస్టుల్లో మనవాళ్లే ఎక్కువ. గడిచిన మూడేండ్లలో ఏటా 2లక్షల మంది కంటే ఎక్కువ మంది ఇండియన్స్‌‌ మాల్దీవ్స్‌‌ టూర్‌‌‌‌కు వెళ్తున్నారు. కొవిడ్​ టైంలోనూ మన టూరిస్ట్‌‌లే వాళ్లను ఆదుకున్నారు.

2023లో మాల్దీవ్స్‌‌కు మొత్తంగా 18.42 లక్షల మంది పర్యాటకులు వెళ్లారు. అందులో ఇండియన్స్ 11.2 శాతంగా ఉన్నారు. మన తర్వాత రెండో స్థానంలో 11.1 శాతంతో రష్యా ఉంది. అయితే.. ఇదివరకు మనవాళ్లు కాస్త తక్కువగానే వెళ్లేవాళ్లు. గడచిన ఐదారేండ్లలో ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2018లో మన దేశం నుంచి వెళ్లింది 6.1 శాతం మాత్రమే. తర్వాత ఈ సంఖ్య పెరిగింది. 2020, 2021, 2022లో భారతీయ పర్యాటకులు వరుసగా11.3 శాతం, 22.1 శాతం, 14.4 శాతం వాటాతో మాల్దీవ్స్‌‌కు వెళ్లారు.

మంత్రులు సస్పెన్షన్​

సోషల్ మీడియాలో మాల్దీవ్స్‌‌ మంత్రులపై ఇండియన్లు ఆగ్రహం వ్యక్తం చేయడం, బాయ్‌‌కాట్‌‌ మాల్దీవ్స్‌‌ హాష్‌‌ ట్యాగ్‌‌ ట్రెండ్‌‌ కావడంతో మాల్దీవ్స్ ప్రభుత్వం స్పందించింది. అంతెందుకు ఆ దేశంలోని ప్రతి పక్షాలు కూడా ఖండించాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు పెరగడంతో మాల్దీవ్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. “విదేశీ నాయకులు, ఉన్నతస్థాయి వ్యక్తులపై సోషల్ మీడియాలో అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం మాల్దీవ్స్‌‌ ప్రభుత్వానికి తెలుసు.

ఈ అభిప్రాయాలు వ్యక్తిగతమైనవి. మాల్దీవ్స్‌‌ ప్రభుత్వ అభిప్రాయం కాదు. అలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడం” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రెస్‌‌ నోట్‌‌ విడుదలైన కొన్ని గంటల్లోనే వివాదాస్పద పోస్టులు పెట్టిన వాళ్లను పదవి నుంచి తప్పించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. మరియం షియునా, మాల్షాతోపాటు మరో మంత్రి హసన్‌‌ జిహాన్‌‌లను మంత్రి పదవుల నుంచి తప్పించారు. 

తర్వాత మాల్దీవ్స్‌‌ విదేశాంగశాఖ ప్రతినిధి అలీ నాజర్‌‌ మహమ్మద్‌‌, భారత హైకమిషనర్‌‌ మును మహావర్‌‌ని కలిశారు. మంత్రులు, ఎంపీల వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్దేశాలు కావని అలీ నాజర్‌‌ వివరించారు. అంతకుముందు ఢిల్లీలోని మాల్దీవ్స్‌‌ రాయబారి ఇబ్రహీం షాహీబ్‌‌ను విదేశాంగశాఖ పిలిపించింది. వాళ్ల మంత్రులు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇండియా కన్నెర్రజేస్తే.. 

మాల్దీవ్స్‌‌ విషయంలో ఇండియా ఎప్పుడూ పెద్దన్న పాత్రే పోషించింది. ఎప్పుడు ఆపద వచ్చినా ఆదుకుంది. ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడిగా ప్రోగ్రెసివ్‌‌ పార్టీ ఆఫ్‌‌ మాల్దీవ్స్‌‌ నేత, పీపుల్స్‌‌ నేషనల్‌‌ కాంగ్రెస్‌‌ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి మొహమ్మద్ ముయిజ్జూ అధికారంలోకి వచ్చేవరకు రెండు దేశాల మధ్య సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయి. కానీ.. ఇప్పుడు ఆ సంబంధాలు దెబ్బతిన్నాయి. మొహమ్మద్ ముయిజ్జూ ఎన్నికైన తర్వాత గత ప్రభుత్వాలు అనుసరించిన ‘‘ఇండియా ఫస్ట్’’ విధానం నుండి వైదొలిగేందుకు ట్రై చేస్తున్నాడు. చైనా వైపు మొగ్గు చూపిస్తున్నాడు. నవంబర్ 2023లో ఆయన పదవీ బాధ్యతలు తీసుకున్నాడు.

వెంటనే ఇండియా మాల్దీవ్స్‌‌కు ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, ఒక డోర్నియర్ విమానం, భారత సైనిక సిబ్బందిని వాళ్ల దేశం నుండి వెనక్కి రప్పించుకోమని మోదీ ప్రభుత్వాన్ని కోరాడు. మాల్దీవ్స్‌‌లో మోహరించిన 77 మంది భారత సైనికులు.. భారత్‌‌ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తారు. అయితే.. 2013లో అధికారంలోకి వచ్చిన యామీన్‌‌ గయూమ్‌‌ కూడా భారత్‌‌ వ్యతిరేక ప్రచారం చేశాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఇబ్రహీం సోలిహ్‌‌ భారత్‌‌తో సన్నిహిత సంబంధాలకు కృషి చేశాడు. ముయిజ్జూ రాకతో మళ్లీ చైనా వైపు వెళ్లేందుకు మాల్దీవ్స్‌‌ ప్రయత్నిస్తోంది. 

మనమే గుర్తించాం

మన దేశ పశ్చిమ తీరానికి దగ్గర్లో ఉన్న లక్షద్వీప్‌‌ కింద ఈ మాల్దీవ్స్‌‌ ఉన్నాయి. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియాకు వెళ్లే  కీలకమైన సముద్రమార్గం ఇక్కడికి దగ్గర్లోనే ఉంది. మాల్దీవ్స్‌‌లో చైనా ప్రభావం పెరిగితే.. ఇండియా భద్రతకు ప్రమాదం. మాల్దీవ్స్‌‌ చిన్న దేశం కావడంతో భారత్‌‌ ఎక్కువగా సాయం చేసింది. అంతెందుకు1965లో మాల్దీవ్స్‌‌కు స్వాతంత్ర్యం వచ్చాక ఆ దేశాన్ని మొదట గుర్తించిన దేశాల్లో భారతదేశం ఒకటి.

తిరుగుబాటు నుంచి.. 

మాల్దీవ్స్‌‌లో 1988లో శ్రీలంక మిలిటెంట్ సంస్థ మద్దతుతో కొంతమంది తిరుగుబాటు చేశారు. అప్పుడు ఇండియానే సాయం చేసింది. భారత సైన్యం వెంటనే రంగంలోకి దిగి తిరుగుబాటును అణచివేసింది. అప్పుడే కాదు.. ప్రకృతి వైపరీత్యాల అప్పుడు కూడా  మన దేశం మాల్దీవ్స్‌‌కు సాయం చేసింది. సంక్షోభ సమయాల్లో మాల్దీవ్స్‌‌కు ‘మేమున్నాం’ అనే భరోసా ఇచ్చింది. 2004లో సునామీ, 2014లో మాలేలో వచ్చిన నీటి సంక్షోభం టైంలో మాల్దీవ్స్‌‌ వెన్నంటే ఉంది. 

భద్రత, రక్షణ

మాల్దీవ్స్‌‌ రక్షణ, భద్రత విషయంలో 1988 నుండి భారతదేశం సాయం చేస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. మాల్దీవియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ (ఎంఎన్‌‌డీఎఫ్‌‌) డిఫెన్స్ ట్రైనింగ్‌‌ అవసరాలను కూడా ఇండియా తీర్చింది. గత దశాబ్దంలో ఇండియా1,500 మందికి పైగా సిబ్బందికి శిక్షణ ఇచ్చింది. అంతేకాకుండా వాయు నిఘా కోసం విమానాలను ఇచ్చింది. హనిమాధూ, గన్ ఐలాండ్‌‌లోని విమానాశ్రయాలు, గ్రేటర్ మాలె కనెక్టివిటీ ప్రాజెక్ట్, గుల్హిఫల్హు పోర్ట్ డెవలప్‌‌మెంట్‌‌లో సాయం చేసింది. 

ఇండియా ప్రస్తుతం మాల్దీవ్స్‌‌లో చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్ట్.. గ్రేటర్ మాలె కనెక్టివిటీ. ఇందులో భాగంగా 6.74 కి.మీ. పొడవైన బ్రిడ్జి కడుతున్నారు. అందుకోసం భారత్ 500 మిలియన్ డాలర్లు మంజూరు చేసింది. అంతేకాకుండా రోడ్లు, స్ట్రీట్‌‌ లైట్స్‌‌, డ్రైనేజీ నిర్మాణాలకు సాయం చేసింది. రద్దీగా ఉండే మాలే ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ రష్‌‌ని తగ్గించడానికి గుల్హిఫల్హు పోర్ట్‌‌ను డెవలప్‌‌ చేసే ఆలోచనలో ఉంది. 

ఆరోగ్యం, విద్య

హెల్త్‌‌కేర్ సెక్టార్‌‌లో వివిధ దీవుల్లోని 150కి పైగా ఆరోగ్య కేంద్రాలను కలుపుతూ అత్యాధునిక క్యాన్సర్ హాస్పిటల్‌‌ ఏర్పాటు చేయడంతోపాటు ఇందిరా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ డెవలప్‌‌మెంట్‌‌కి ఇండియా రూ.52 కోట్లు ఇచ్చింది.1996లో టెక్నికల్‌‌ ఎడ్యుకేషన్‌‌ ఇనిస్టిట్యూట్‌‌ని ఏర్పాటుచేయడానికి సాయం చేసింది. అంతేకాదు.. మాల్దీవ్‌‌ టీచర్లకు, యువతకు ట్రైనింగ్‌‌ కూడా ఇచ్చింది. 2019 నుండి 2,200 మందికి పైగా మాల్దీవ్స్‌‌ వాసులు పలు రకాల ట్రైనింగ్స్‌‌ కోసం ఇండియాకు వచ్చారు. ఇండియా సైన్స్ అండ్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కింద మాల్దీవ్స్‌‌ వాసులకు ప్రతి ఏడాది 10 సీట్లను కేటాయిస్తోంది. 

ఆర్థికంగా..

2014లో ప్రధానిగా మోదీ ఎన్నికైన నాటి నుంచి భారతదేశం– మాల్దీవ్స్‌‌ మధ్య వాణిజ్యం నాలుగు రెట్లు పెరిగింది. 2014లో మొత్తం బిజినెస్‌‌ 173.50 మిలియన్ల అమెరికన్ డాలర్లుగా ఉండేది. 2022లో 501.82 మిలియన్లకు పెరిగింది. 2021 నాటికి భారత ప్రభుత్వ డాటా ప్రకారం.. మన దేశమే మాల్దీవ్స్‌‌కి మూడో అతిపెద్ద బిజినెస్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌. 

బిజినెస్‌‌ కోసం మాల్దీవ్స్‌‌కు వెళ్లే ఇండియన్స్‌‌కు 2022లో వీసా ఫ్రీ ఎంట్రీ పథకాన్ని అమలు చేయడంతో పాటు 2020 సెప్టెంబర్‌‌లో రెండు దేశాల మధ్య కార్గో నౌకల సేవలను మొదలుపెట్టాక వ్యాపారం బాగా పెరిగింది. మాల్దీవ్స్‌‌కు దగ్గరగా ఉన్న దేశం కావడంతో మన దగ్గర్నించే బియ్యం, గోధుమ పిండి, పంచదార, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, గుడ్లు, కూరగాయలు, కన్‌‌స్ట్రక్షన్‌‌ మెటీరియల్‌‌ లాంటి నిత్యావసర వస్తువులు దిగుమతి చేసుకుంటోంది. అంతెందుకు ఆ దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే అతిపెద్ద బ్యాంక్.1974 నుండి రిసార్ట్‌‌లు, సముద్ర ఉత్పత్తుల ఎక్స్‌‌పోర్ట్‌‌ కోసం కంపెనీలకు అప్పులు ఇస్తోంది. 

మొదట్నించీ ఇండియాపై... 

మాల్దీవ్స్‌‌ కొత్త ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జూకి మొదట్నించీ ఇండియా అంటే గిట్టదు. వాస్తవానికి ‘‘ఇండియా ఔట్‌‌” అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాడు ముయిజ్జూ. అతని పార్టీలో ఉన్నవాళ్లలో చాలామందికి ఇండియా అంటే నచ్చదు. అందుకే మాల్దీవ్స్‌‌కు సంబంధించిన ఏ విషయంలోనూ ఇండియా జోక్యం ఉండకూడదనేది వాళ్ల ఉద్దేశం. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.

సాధారణంగా మాల్దీవ్స్‌‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనవాళ్లు మొదటగా ఇండియాకు వచ్చే సంప్రదాయం ఉంది. కానీ.. దాన్ని ముయిజ్జూ పట్టించుకోలేదు. టర్కీ రాజధాని అంకారాను తన మొదటి అధికారిక పర్యటన కోసం ఎంచుకున్నాడు. అతను టర్కీనే ఎంచుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఒక కారణం ఉంది. కాశ్మీర్‌‌కు సెమీ అటానమస్ హోదాను రద్దు చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని టర్కీ విమర్శించింది. ఐక్యరాజ్యసమితిలో ఈ ప్రాంతంలో మానవహక్కుల ఉల్లంఘన జరిగిందని ఎత్తి చూపింది. అలా ఇండియాతో వైరుధ్యం పెంచుకోవడానికి ప్రయత్నించిన టర్కీకి వెళ్లాడు ముయిజ్జూ. ఆ తర్వాత డిసెంబర్‌‌లో మాల్దీవ్స్‌‌ ఉపాధ్యక్షుడు హుస్సేన్ ముహమ్మద్ లతీఫ్ చైనాలో పర్యటించాడు. జనవరిలో ముయిజ్జూ కూడా చైనాలో పర్యటించాడు. 

రిక్వెస్ట్‌‌ 

మాల్దీవ్స్‌‌కు ఈజ్‌‌మైట్రిప్‌‌ బుకింగ్స్ ఆపేయడంతో మాల్దీవ్స్‌‌ అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్(మటాటో) సంస్థ సీఈవో నిశాంత్ పిట్టికి లేఖ రాసింది. అందులో “మాల్దీవ్స్‌‌కు టూరిజం జీవనాధారం. మా జీడీపీలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ టూరిజం ద్వారానే వస్తోంది. పర్యాటక రంగంలో ప్రత్యక్షంగా సుమారు 44,000 మంది జీవనోపాధి పొందుతున్నారు. మా నేతలు కొందరు చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దు. ఆ మాటలు మాల్దీవ్స్‌‌  ప్రజల అభిప్రాయం కాదు. ఈజ్‌‌మైట్రిప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, మా దేశానికి విమాన బుకింగ్‌‌లను తెరవాలి. రెండు దేశాల మధ్య రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉంది. భారతీయులను మేం సోదరభావంతో చూస్తాం. మా పర్యాటక రంగంలో భారతీయులు కీలకం’ అని ఉంది. 

చైనా నుంచి పంపండి

చైనా నుంచి మాల్దీవ్స్‌‌కు వచ్చే టూరిస్ట్​ల సంఖ్య పెరగాలని మాల్దీవ్స్‌‌ అధ్యక్షుడు మహమ్మద్‌‌ ముయిజ్జూ చైనాను రిక్వెస్ట్‌‌ చేశాడు. ఆ దేశ పర్యటనలో భాగంగా ఫుజియాన్ ప్రావిన్స్‌‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రసంగించాడు. చైనాను తమ సన్నిహిత మిత్ర దేశాల్లో ఒకటిగా చెప్పాడు. అయితే.. ఇప్పటికే మాల్దీవ్స్‌‌కు వెళ్లే ఇండియన్స్ సంఖ్య తగ్గడంతో ఆ సంఖ్యను చైనీయులతో భర్తీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ముయిజ్జూ. అందుకే మాల్దీవ్స్‌‌కు చైనా పర్యాటకుల సంఖ్య పెంచాలని కోరాడు. ‘‘కొవిడ్‌‌కు ముందు మాకు చైనా నెంబర్ వన్ మార్కెట్‌‌. మళ్లీ ఆ స్థానాన్ని భర్తీ చేయాలి” అని కోరాడు.  
*   *   *

లక్షద్వీప్ చూసొద్దామా?

లక్షద్వీప్‌‌పై మాల్దీవుల వివాదం తరువాత చాలామంది వాటి గురించి తెలుసుకుంటున్నారు. లక్షద్వీప్‌‌కు వెళ్లేందుకు ప్లాన్‌‌ చేసుకుంటున్నారు. వాటి గురించి గూగుల్‌‌లో తెగ వెతుకుతున్నారు. ఈ దీవుల కోసం ఆన్‌‌లైన్‌‌లో వెతుకుతున్న వాళ్ల సంఖ్య బాగా పెరిగింది. జనవరి 5న ఒక్కరోజే 50వేల మంది గూగుల్‌‌లో వెతికినట్లు అంచనా. ‘మేక్‌‌ మై ట్రిప్‌‌’లో కూడా లక్షద్వీప్‌‌ గురించి వెతికేవాళ్ల సంఖ్య 3400శాతం పెరిగింది.

సాధారణంగా సెలబ్రిటీలు, కాస్త డబ్బులు ఉన్నవారు పదే పదే మాల్దీవ్స్‌‌కు వెళ్తుంటారు. ముఖ్యంగా హనీమూన్‌‌ కపుల్స్‌‌ ఎక్కువ వెళ్తారు. కానీ.. ఇప్పుడు అలాంటివాళ్లంతా లక్షద్వీప్‌‌ వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. అందమైన బీచ్‌‌లు, నీలి రంగు సముద్ర జలాలు లక్ష ద్వీప్స్‌‌ ప్రత్యేకతలు. ఇది 36 దీవుల సముదాయం. వాటిలో పది దీవులు మాత్రమే నివాసయోగ్యమైనవి.1956లో ఈ దీవులను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు.1973లో వీటికి ‘లక్షద్వీప్’ అని పేరు పెట్టారు. అంతకుముందు ఈ ప్రాంతాన్ని ‘లక్కదివ్’ అని పిలిచేవాళ్లు. లక్షద్వీప్‌‌కు ఎక్కువగా సెప్టెంబర్ 
– జూన్ మధ్య టూరిస్ట్​లు వెళ్తుంటారు. 

అనుమతి అవసరం 

లక్షద్వీప్‌‌ ఇండియాలో భాగమే అయినా.. అక్కడికి వెళ్లడానికి ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. అందుకోసం లక్షద్వీప్ అధికారిక వెబ్‌‌సైట్‌‌లో అప్లై చేసుకోవాలి. అవసరమైన ఐడీ ప్రూఫ్‌‌లు అప్‌‌లోడ్‌‌ చేసుకుంటే లక్షద్వీప్‌‌కు వెళ్లడానికి పర్మిషన్ ఇస్తారు. 

లక్ష ద్వీప్ అంటే.. 

లక్షద్వీప్ అనే పదానికి సంస్కృతం, మలయాళంలో ‘లక్ష ద్వీపాలు’ అని అర్థం. ఈ ద్వీపాల సమూహంలో ఆంద్రోత్​, కవరత్తి, కల్పేని, అమేని, అగత్తి ద్వీపాలు ముఖ్యమైనవి. 
బంగారం: ఒక చిన్న కన్నీటి చుక్క ఆకారంలో ఉండే ద్వీపం. ఇది అగత్తి, కవరత్తికి దగ్గరగా ఉంది. లక్షద్వీప్‌‌లో జనావాసాలు లేని ఏకైక ఐలాండ్ రిసార్ట్. రాత్రి టైంలో ఇక్కడి ఇసుక మెరుస్తుంటుంది. 

అగత్తి: అగత్తి అత్యంత అందమైన వాటిలో ఒకటి. లక్షద్వీప్‌‌లో ఎయిర్‌‌స్ట్రిప్‌‌ను కలిగి ఉన్న ఏకైక ద్వీపం.

కద్మత్: కద్మత్ 8 కి.మీ పొడవు, 550 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీనికి పశ్చిమాన సముద్రం తక్కువ లోతు ఉంటుంది. వాటర్ స్పోర్ట్స్‌‌కి ఇది బెస్ట్ చాయిస్‌‌. 

మినీకాయ్: మెయిన్ గ్రూప్‌‌కి కాస్త దూరంగా ఉంటుంది. దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 11 గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ వాటిని ‘అవా’ అని పిలుస్తారు, ప్రతి అవాకు బోడుకాక్ అనే గ్రామ పెద్ద అధ్యక్షత వహిస్తాడు.

కల్పేని: తిలక్కం, పిట్టి అనే రెండు చిన్న ద్వీపాలు, జనావాసాలు లేని చెరియమ్ ద్వీపంతో కలిపి కల్పేని అని పిలుస్తారు. 

కవరత్తి: ఇక్కడ లక్షద్వీప్‌‌ పరిపాలనా ఆఫీస్‌‌లు ఉంటాయి. వీటన్నింటిలో ఇదే డెవలప్‌‌డ్‌‌ ఐలాండ్‌‌. 

ఓడ శిథిలాలు

లక్షద్వీప్‌‌లోని మినీకాయ్‌‌లో 8 మీటర్ల లోతులో మూడు పెద్ద ఓడల శిథిలాలు ఉన్నాయి.  ఇక్కడ కనిపించే చేప జాతులు ఇతర చోట్ల కనిపించే చేపల కంటే పెద్దగా ఉంటాయి. శిథిలాల ఫెర్రస్ వల్ల ఇలా ఉన్నాయని నమ్ముతున్నారు. 

వాటర్ స్పోర్ట్స్

వాటర్ స్పోర్ట్స్‌‌ కోసం చాలా టూరిస్ట్ ప్యాకేజీలు ఉన్నాయి. కయాకింగ్​, క్యానోయిస్‌‌, పెడల్ బోట్లు, సాయిల్‌‌ బోట్స్‌‌, విండ్ సర్ఫర్‌‌లు, గ్లాస్-బాటమ్ బోట్లు అందుబాటులో ఉన్నాయి. సముద్రంలో లోతుగా వెళ్లి చేసే డీప్-సీ ఫిషింగ్ కూడా చేయొచ్చు. పడవలను అద్దెకు తీసుకోవచ్చు.

డైవింగ్

ఇండియాలోనే అందమైన డైవింగ్ ప్లేస్‌‌ కద్మత్‌‌లో ఉంది. ఇదే మొదటి లక్కదీవ్స్ డైవ్ సెంటర్. డైవ్ స్కూల్ కూడా ఉంది. అక్టోబర్ 1 నుండి మే 1 వరకు ఇక్కడ ట్రైనింగ్‌‌ ఇస్తారు. మినీకాయ్ డైవ్ సెంటర్, డాల్ఫిన్ డైవ్ సెంటర్ (కవరత్తి) కూడా ఉన్నాయి.

అతి చిన్నది

దేశంలో అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్​ 36 ద్వీపాల సముదాయం. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి చేపలు పట్టడం, కొబ్బరి సాగు. ట్యునా చేపల ఎగుమతులు ఎక్కువగా చేస్తారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా జెసెరి అనే భాష మాట్లాడతారు. 

ఇలా వెళ్లాలి

లక్షద్వీప్‌‌‌‌ వెళ్లేందుకు నేరుగా రోడ్డు, రైలు మార్గాలు లేవు. అక్కడికి వెళ్లాలంటే వాయు, జలమార్గాల్లో వెళ్లొచ్చు. కేరళ తీరానికి సుమారు 300 కి.మీ. దూరంలో లక్షద్వీప్ ఉంది. కాబట్టి, అరేబియా సముద్రంలోని ఈ దీవులకు వెళ్లాలంటే ముందుగా కేరళలోని కొచ్చికి వెళ్లాలి. కొచ్చి నుంచి ఓడలు, బోట్లు, విమానాలు, హెలికాప్టర్లలో లక్షద్వీప్‌‌కి వెళ్లొచ్చు. కొచ్చికి చేరుకోవడానికి రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి.

విమాన సర్వీసులు

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి కొచ్చికి ప్రతిరోజూ ఎయిర్​ సర్వీసులు ఉన్నాయి. కొచ్చికి వెళ్లడానికి దాదాపు నెల రోజుల ముందు ప్లాన్ చేసుకుంటే... హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి ఎయిర్​ ఫేర్​ రూ. 4,500 ఉంటుంది. లక్షదీవుల్లో ఉన్న ఒకే ఒక విమానాశ్రయం ‘అగట్టి’లో ఉంది. కొచ్చి నుంచి అగట్టీకి వెళ్లడానికి ఎయిర్​ ఫేర్​ రూ. 5,500.

ట్రైన్​ రూట్​

లక్షద్వీప్ వెళ్లడానికి కొచ్చి వెళ్లాలని చెప్పుకున్నాం కదా! అందుకని కొచ్చికి దగ్గరలో ఉండే ఎర్నాకులం టౌన్ లేదా ఎర్నాకులం జంక్షన్ రైల్వే స్టేష‌‌న్‌‌కు వెళ్లాలి. హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్(నాంపల్లి) నుంచి కేరళలోని ఎర్నాకులం జంక్షన్ (కొచ్చి/ఎర్నాకులం)కు శబరి ఎక్స్‌‌ప్రెస్ (17230) ప్రతి రోజూ ఉంది. జర్నీ టైం 23:35 గంటలు. విజయవాడ నుంచి దాదాపు ఏడు రైళ్లు కేరళకు వెళ్తాయి. వీటిలో కేరళ ఎక్స్‌‌ప్రెస్, అలప్పి ఎక్స్‌‌ప్రెస్ రోజూ నడుస్తుంది. కేరళ ఎక్స్‌‌ప్రెస్ జర్నీ టైం 18:30 గంటలు కాగా, అలప్పి అయితే 21:20 గంటల్లో కేరళ చేరుకుంటుందని ఐఆర్‌‌సీటీసీ వెబ్‌‌సైట్​లో ఉంది. విశాఖపట్నం నుంచి కేరళకు దాదాపు నాలుగు రైళ్లు ఉన్నాయి. అలప్పీ-–బొకారో ఎక్స్‌‌ప్రెస్ రోజూ కేరళకు వెళ్తుంది. దాని జర్నీ టైం 28:05 గంటలు.

రోడ్డు జర్నీ

ముంబయి, కోజికోడ్, మంగళూరు, బెంగళూరు, చెన్నై, గోవాలను కలుపుతూ వెళ్లే జాతీయ రహదారిపై కొచ్చి ఉంది. కాబట్టి ఈ నగరాలన్నింటి నుంచి రోడ్డు జర్నీ చేసి కొచ్చికి వెళ్లొచ్చు. ఇదంతా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కొచ్చికి చేరుకునే మార్గం. ఇక కొచ్చి నుంచి జల, వాయు మార్గాన లక్షద్వీప్‌‌కు ఎలా చేరుకోవాలంటే...

కొచ్చి నుంచి లక్షద్వీప్‌‌ ..

కొచ్చి నుంచి లక్షద్వీప్‌‌కు పడవలు, ఓడలు, విమానాలు నడుస్తాయి. ఒకరకంగా చూస్తే లక్షద్వీప్‌‌కు కొచ్చి గేట్‌‌వే లాంటిదన్నమాట. లక్షద్వీప్‌‌లోని ఉన్న విమానాశ్రయం అగత్తికి వెళ్లేందుకు కొచ్చి నుంచి గంటన్నర పడుతుంది. కొచ్చి నుంచి అగత్తికి నెల రోజుల ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే కనీస ధర రూ. 5,500 ఉంటుంది. జల మార్గానికొస్తే కొచ్చి నుంచి లక్షద్వీప్‌‌కు ఏడు ప్యాసింజర్​ షిప్స్​ ఉన్నాయి. ఎంవీ కవరత్తి, ఎంవీ అరేబియన్ సీ, ఎంవీ లక్షద్వీప్ సీ, ఎంవీ లాగూన్, ఎంవీ కోరల్స్, ఎంవీ అమిందివి, ఎంవీ మినీ కాయ్ అనే ఓడలు రెండు ప్రాంతాల మధ్య తిరుగుతుంటాయి.

అయితే ఏ దీవికి వెళ్లాలి అనుకుంటే దాన్ని బట్టి ఓడలో చేసే జర్నీ టైం14 నుంచి 18 గంటలు ఉంటుంది. ఈ ఓడల్లో ఫస్ట్ క్లాస్ ఏసీ (రెండు బెర్తులు), సెకండ్ క్లాస్ ఏసీ (నాలుగు బెర్తులు) కేటగిరీలు ఉంటాయి. ఓడలో డాక్టర్లు కూడా ఉంటారు. ఓడను బట్టి క్లాస్‌‌ల ఆధారంగా టికెట్ రేట్లు రూ. 2,200 నుంచి రూ. 6 వేల వరకు ఉంటాయి. 

లక్షద్వీప్‌‌‌‌లో డీశాలినేషన్‌‌‌‌

మాల్దీవ్స్‌‌‌‌ మంత్రులు మోదీ గురించి పోస్ట్‌‌‌‌లు పెట్టాక ఇజ్రాయెల్‌‌‌‌ ఒక కీలక ప్రకటన చేసింది. లక్షద్వీప్‌‌‌‌లో డీశాలినేషన్‌‌‌‌ ప్రక్రియ మొదలుపెడతామని ఇండియాలోని ఇజ్రాయెల్‌‌‌‌ రాయబార కార్యాలయం అధికారిక ఎక్స్‌‌‌‌ (ట్విటర్‌‌‌‌)లో పోస్టు చేసింది. అంతేకాదు.. లక్షద్వీప్‌‌‌‌లోని బీచ్‌‌‌‌ల ఫొటోలను షేర్‌‌‌‌‌‌‌‌ చేస్తూ.. ‘‘ సహజ సిద్ధమైన, నీటి అడుగున ఉండే అందాలను ఇప్పటికీ చూడనివారి కోసం కొన్ని ఫొటోలు ఇక్కడ ఉన్నాయి’’ అని రాసుకొచ్చింది.

ఇజ్రాయెల్‌‌‌‌లో దాదాపు 25శాతం తాగునీరు డీశాలినేషన్‌‌‌‌ ప్లాంట్ల నుంచే వస్తోంది. అదే టెక్నాలజీని లక్షద్వీప్‌‌‌‌లో వాడుతున్నారు. ఈ ప్రక్రియలో సముద్రపు నీటిలోని లవణాలను తొలగించి.. వాటిని తాగేందుకు వీలుగా మారుస్తారు. సముద్ర ఉపరితల నీటికంటే వెయ్యి నుంచి రెండు వేల అడుగుల లోతులో ఉన్న నీటి ఉష్ణోగ్రతలు 4–8 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. ఆ నీటిని పైకి తెచ్చి గడ్డ కట్టిస్తారు. ఆ తర్వాత మళ్లీ వేడిచేసి.. ఆ నీటి ఆవిరిని మంచినీటిగా మారుస్తారు. దీనికోసం రివర్స్‌‌‌‌ ఆస్మాసిస్‌‌‌‌ టెక్నాలజీని వాడతారు.

911 కాల్‌

మాల్దీవ్స్‌ మాజీ రక్షణ మంత్రి మరియా అహ్మద్ దీదీ మాట్లాడుతూ..  మాల్దీవ్స్‌ గవర్నమెంట్‌కు దూరదృష్టి లేకపోవడం వల్లే ఇండియాపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతేకాదు.. మహమ్మద్‌ ముయిజ్జూ అధికారం నుంచి దిగిపోవాలని డిమాండ్‌ చేశారు. భారత్ తమకు ఎంత ముఖ్యమో చెప్పారు. భారత్‌ ఆపత్కాలంలో ఆదుకునే ‘911 కాల్‌’(అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సాయం కోసం కాల్‌ చేసే నెంబర్‌) లాంటిదన్నారు.

‘అందరితో స్నేహంగా ఉండే చిన్నదేశం మనది. అదే సమయంలో భారత్‌ పొరుగు దేశమన్న విషయాన్ని మరవకూడదు. భారత్ ఎల్లప్పుడూ మనకు సాయం చేస్తుంది. రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు సహకరిస్తోంది. అలాంటి చిరకాల మైత్రిని దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం మంచిది కాదు” అంటూ ప్రభుత్వానికి చివాట్లు పెట్టారు. 

కొత్త ఎయిర్​పోర్ట్​

మాల్దీవుల వివాదం తరువాత లక్షద్వీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్తగా మరో విమానాశ్రయాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది కేంద్రం. యుద్ధ ప్రాతిపదికన దీన్ని నిర్మించాలని భావిస్తోంది. కమర్షియల్ ఆపరేషన్స్‌‌తో పాటు సైనిక అవసరాల కోసం కూడా ఈ ఎయిర్‌‌పోర్ట్‌‌ కట్టాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి కేంద్రం వచ్చింది. ప్రస్తుతం లక్షద్వీప్‌‌లోని అగత్తీలో విమానాశ్రయం, కవరత్తిలో హెలిప్యాడ్ ఉన్నాయి.

ఈ రెండింటితో పాటు మినికాయ్ ఐలాండ్స్‌‌లో కొత్త ఎయిర్ పోర్ట్ కట్టించాలి అనుకుంటోంది కేంద్రం. ఈ మినికాయ్ ఐలాండ్స్ మాల్దీవులకు దగ్గరలో ఉంటాయి. భవిష్యత్తులో  ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి మినికాయ్ ఐలాండ్స్‌‌లో ఎయిర్ పోర్ట్ అవసరం. పౌర విమానయాన సర్వీసులతో పాటు సైనిక అవసరాలకు అనుగుణంగా మిలటరీ ఎయిర్‌‌క్రాఫ్ట్, ఫైటర్ జెట్స్ టేకాఫ్, ల్యాండింగ్​లకి వీలుగా దీన్ని  డెవలప్​ చేస్తారు.