ఇలా.. బతుకు పయనంలో బోలెడు ఇబ్బందులు, సమస్యలు. జీవితమనే ప్రయాణంలో వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. లేదంటే ఎంతో సున్నితమైన ‘జిందగీ’ గాడి తప్పి గందరగోళంలో పడే ప్రమాదం ఉంది. ఇలా జరగకుండా పూర్వం... పెద్దల మాటలు, సలహాలు అండగా ఉండేవి. మరి ‘ఇప్పుడు లేవా..’ అంటే? ఎందుకు లేవు. ఇప్పుడూ ఉన్నాయి. కాకపోతే అవి దూరమయ్యాయి. అందుకు కారణాలు అనేకం. సలహా అవసరమైన టైంకి ‘నా’అనే వాళ్లెవరూ అందుబాటులో ఉండకపోవచ్చు.
అలాగని అందుబాటులో ఉన్న మనుషులకి చెప్పుకునేందుకు మనసు ఒప్పుకోదు చాలాసార్లు. ఇలాంటప్పుడు ఒత్తిడిలో తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆ తరువాతి జీవితాన్ని భారంగా మార్చే అవకాశం ఉంది. సరిగ్గా ఇలాంటప్పుడే... ఎవరి దగ్గరా మనసు విప్పి మాట్లాడలేని వాళ్లకు ‘కౌన్సెలింగ్’ అండగా ఉంటుంది అంటున్నారు సైకాలజిస్ట్‌లు.
అందుకే కొంతకాలంగా ఎంటర్టైన్మెంట్ టెలివిజన్, యూట్యూబ్ ఛానెల్స్‌లో కౌన్సెలింగ్ ప్రోగ్రామ్‌లు అనేకం టెలికాస్ట్ అవుతున్నాయి. వాటిలో ఆయా సమస్యల గురించి విశ్లేషించి, ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడిస్తున్నారు. ఇలా మాట్లాడడం వల్ల సమస్యకి పరిష్కారాన్ని కనుక్కోవచ్చనే ‘ఆలోచన’ నలుగురిలో కలిగించడం మంచిదే. కానీ, ఈ కార్యక్రమాలు జనాల్లోకి అచ్చంగా అలాంటి సందేశమే తీసుకెళ్తున్నాయా?అరగంటో, గంటో ప్రసారమయ్యే ఆ ప్రోగ్రామ్స్‌లో జరిగే కౌన్సెలింగ్ సరైనదేనా?ఆ కొద్ది టైంలోనే పరిష్కారం దొరుకుతోందా?అసలు కౌన్సెలింగ్‌లో ఏం చేస్తారు?ఎంత టైం పడుతుంది?ఎలాంటి సమస్యలకు కౌన్సెలింగ్ అవసరం?సైకాలజిస్ట్‌ల సాయం ఎంతవరకు సరిపోతుంది?ఎవరికి సైకియాట్రిస్ట్‌ల అవసరం పడుతుంది?ఈ సందేహాలను తీర్చే ప్రయత్నమే
ఈ వారం కవర్‌స్టోరీ.
కౌన్సెలింగ్‌కి మరోపేరు టాక్ థెరపీ. అంటే.. మాటలతో బాధకు మందు వేయడం అన్నమాట. ‘‘మనసులోని భావాల్ని అర్థం చేసుకుని మాటలతో నయం చేసే పద్ధతే ‘కౌన్సెలింగ్’. దానికి వయసుతో సంబంధం లేదు. కాగ్నిటివ్ రీస్ట్రక్చర్ ద్వారా కౌన్సెలింగ్ చేస్తాం. సింపుల్‌గా చెప్పాలంటే ఆలోచనల్లో మార్పు తీసుకురావడం. చిన్నపిల్లలైతే బిహేవియరల్ థెరపీ ఉంటుంది. ఆలోచనల్లో మార్పు తేవడం అనేది పిల్లల్లో వీలు కాదు. ఎందుకంటే వాళ్లకు అంత మెచ్యూరిటీ ఉండదు. అందుకని ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం” అని చెప్పారు సైకాలజిస్ట్ గౌరి ప్రయాగ.
ఎందుకు చెప్పుకోరు?
సమస్యతో ఇబ్బంది పడకుండా ఇంట్లో వాళ్లు, ఫ్రెండ్స్ లేదా దగ్గరి బంధువులకో చెప్పుకుంటే భారం దిగిపోతుంది కదా! అలా చెప్పుకోవడానికి ఎందుకు ఇష్టపడరు అనిపించొచ్చు. అలా చెప్పుకోకపోవడానికి కారణం... యాంగ్జైటీ, అవతలి వాళ్లు జడ్జ్ చేస్తారేమో అనే ఫీలింగ్. అందుకే ప్రాబ్లమ్‌ని బయటకు చెప్పుకోలేరు. ఇలాంటివాళ్లు కౌన్సెలర్ల దగ్గర మనసు విప్పి మాట్లాడగలుగుతారు అని చెప్తారు సైకాలజిస్ట్‌లు.
ఇదే విషయం గురించి సైకాలజిస్ట్ గౌరి మాట్లాడుతూ ‘‘సమస్యతో వచ్చిన వాళ్ల ప్రైవసీని కాపాడతాం. న్యూట్రల్‌గా ఉంటాం. ‘మీ బాధను వింటామే తప్ప... ఎవరు తప్పు? ఎవరు ఒప్పు? అని జడ్జ్ చేయం’ అనే విషయాన్ని మొదటి సెషన్లో స్పష్టంగా చెప్తాం. ఆ మాటలు విన్న వాళ్లకు మామీద నమ్మకం కలుగుతుంది. నిజానికి మనసులోని బాధను ఎవరితోనైనా చెప్పుకుంటే తగ్గుతుంది. కానీ, అలా చెప్పుకుంటే ... ‘అవతలి వ్యక్తి జడ్జ్ చేస్తారేమో. నాకు మేనేజ్ చేయడం చేతకాదు అనుకుంటారేమో. పొరపాటు చేశానని అనుకుంటారేమో’ అనే భయం ఉంటుంది.
కౌన్సెలింగ్‌లో మొదట ఆ భయాన్ని తీసేస్తాం. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్లను మాట్లాడిస్తాం. ఈ ప్రాసెస్‌లో ఎటువంటి హడావిడి ఉండదు. నిదానంగా ఒక్కో విషయాన్ని బయటకు చెప్పడం మొదలుపెడతారు. ఎవరికీ చెప్పని విషయాలను కూడా ఓపెన్‌గా చెప్తారు. అలా చెప్పించగలగడమే కౌన్సెలర్ టెక్నిక్. ఒకవేళ.. కౌన్సెలర్‌తో పంచుకున్న విషయం మూడో వ్యక్తికి చెప్పాల్సి వస్తే... దానికి కౌన్సెలింగ్‌కి వచ్చిన వాళ్ల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వాళ్లు అంగీకరిస్తేనే చెప్పాలి.
వాళ్లు ‘నో’ అంటే బయటకి చెప్పకూడదు. కౌన్సెలింగ్‌కి వచ్చిన వ్యక్తులు, కౌన్సెలర్కి మధ్య జరిగే సంభాషణ వాళ్ల మధ్య మాత్రమే ఉండేంత ప్రైవసీ పాటిస్తాం. ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి... కౌన్సెలింగ్‌కి వచ్చిన వాళ్లెవరూ సమస్యను నేరుగా చెప్పరు. వాళ్లకు గుర్తొచ్చిన విషయాలను చెప్పుకుంటూ పోతారు. వాళ్లు చెప్పే విషయాల్లో పాయింట్స్ వెతికి, అవసరమైన సమాచారాన్ని కౌన్సెలర్ రాబట్టుకోవాలి.
మెడిసిన్ ఉంటుందా?
అర్థంకాని, తేల్చుకోలేని సమస్యలు ఉన్నవాళ్లకే కాకుండా కొన్ని సందర్భాల్లో షాక్‌కి గురైన వాళ్లకు కూడా థెరపీలు ఉంటాయి. కౌన్సెలింగ్ ద్వారా వాళ్లను షాక్ నుంచి బయటకు తీసుకురావచ్చు. కౌన్సెలింగ్ చేసే సైకాలజిస్ట్‌లు, క్లినికల్ సైకాలజిస్ట్‌లు ఎవరూ కూడా మెడిసిన్ ప్రిస్క్రయిబ్ చేయకూడదు. సైకియాట్రిస్ట్ మాత్రమే మందులు రాస్తారు. వాళ్ల దగ్గరకు వెళ్లిన వ్యక్తులకు కౌన్సెలింగ్ అవసరం అనిపిస్తే వాళ్లను సైకాలజిస్ట్‌ల దగ్గరకి పంపిస్తారు. అయితే స్ర్కిజోఫ్రీనియా వంటి మానసికారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కౌన్సెలింగ్ వీలు కాదు. దానికి మందులు ఉంటాయి. ఆ మందులు వాడుతూ అడ్జువెంట్ కౌన్సెలింగ్ తీసుకుంటే బయటపడొచ్చు.
సోషల్ లైఫ్‌కి దూరమవుతున్న పిల్లలు
ఇదంతా ఒక ఎత్తయితే... పిల్లల విషయం మరోలా ఉంటోంది. బయటకు పంపిస్తే చెడ్డ విషయాలు తెలుసుకుంటారు. చెడు మాటలు నేర్చుకుంటారు అనే భయంతో పిల్లల్ని సోషల్ లైఫ్‌కి దూరం చేస్తున్నారు పేరెంట్స్. ఎవరితోనూ కలవనివ్వకుండా చేసి, వాళ్లను ఇంట్లోనే బంధిస్తున్నారు. మరి చదువుకునే టైంను వదిలేస్తే ఖాళీ టైంలో ఏం చేయాలి? అందుకని పిల్లలకు కాలక్షేపం కోసమని టీవీ, గాడ్జెట్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడేందుకు పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు.
పిల్లలు అలా ఒకదానికి అలవాటైతే త్వరగా మానుకోలేరు. వాటికి అడిక్ట్ అవుతారు. అప్పుడు మళ్లీ పిల్లలు అడిక్ట్ అయ్యారని పేరెంట్స్ కంప్లయింట్స్ ఇస్తుంటారు. ఇక్కడ పిల్లలకు సోషల్ లైఫ్ అలవాటు చేయకపోవడం పేరెంట్స్ పొరపాటు. వాళ్లకు ఆల్టర్నేట్ సోర్స్ చూపించాలి. అలా ఇంట్లో కూర్చొని గాడ్జెట్స్‌తో ఆడుకోవడం కంటే బయటకు వెళ్లి ఆడుకోవడంలో ఎక్కువ ఆనందం ఉందని తెలిసేలా చేయాలి.
మిగతా పిల్లలతో ఆడుకోమని లేదా క్లాసు పుస్తకాలు కాకుండా ఎంటర్టైన్మెంట్, నాలెడ్జి ఇచ్చే పుస్తకాలు చదువుకోమని చెప్పాలి. అందులో ఉన్న మజా తెలియనంతకాలం పిల్లలు వాటి జోలికి వెళ్లరు. ఆ విషయం వాళ్లకు అర్థమైందంటే పిల్లలెవరూ ఇంట్లో కూర్చోరు.
ప్రి–మెచ్యూర్డ్ లవ్
ఇక టీనేజి పిల్లల విషయానికి వస్తే... టీనేజ్ రాగానే హార్మోనల్ ఛేంజెస్ జరుగుతాయి. అలాంటప్పుడు వాళ్లు ఆపోజిట్ జెండర్ పట్ల అట్రాక్ట్ అవుతుంటారు. దాన్ని ఆపాలంటే సోషల్ అవేర్నెస్ అనేది చాలా అవసరం. హార్మోన్ మార్పుల వల్ల అట్రాక్ట్ అవ్వడం అనేది చాలా సాధారణ విషయం. దాన్నుంచి బయటకు రావాలని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. ఇలాంటి విషయాలు ఎలా చెప్తామో ఈ ఎగ్జాంపుల్ చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది.
బీటెక్ చదువుతున్న ఒక అమ్మాయి వాళ్ల ఊరికి దగ్గర్లో ఉన్న కాలేజీలో చదువుకుంటోంది. ఆ అమ్మాయికి ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్ మొదలైంది. వాళ్లిద్దరూ క్లాస్ రూమ్‌లో కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ల సర్ ఒకరు చూశారు. ఆయనది ఆ అమ్మాయి వాళ్ల ఊరే. దాంతో ఆయన ఆ అమ్మాయి పేరెంట్స్‌కి ‘మీ అమ్మాయి ఒక అబ్బాయితో స్నేహం చేస్తోంద’ని చెప్పాడు.
దాంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు చదువు మాన్పించేస్తామని అమ్మాయిని బెదిరించి, ఇంటికి తీసుకెళ్లారు. అలా తీసుకెళ్లిన వారం రోజుల తర్వాత ఆ అమ్మాయి వాళ్లకు ఎదురు తిరిగింది. అప్పుడు ఆ అమ్మాయిని కౌన్సెలింగ్ కోసం తీసుకొచ్చారు. ఆ అమ్మాయికి ఆ ఏజ్‌లో ఎలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు, మనుషుల్ని ఎలా సెలక్ట్ చేసుకోవాలి, మంచీ చెడూ ఎలా ఉంటాయని కౌన్సెలింగ్‌లో క్లియర్‌గా చెప్పాం.
తను ఆ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి రెండు నెలల టైం పట్టింది. ఆ తర్వాత రియలైజ్ అయింది. ‘‘ఆ కాలేజీకే వెళ్తే ఆ అబ్బాయి కనిపిస్తాడు. అతన్ని చూస్తే నాకు మాట్లాడాలి అనిపించొచ్చు. కాబట్టి వేరే కాలేజీలో నన్ను చేర్చండి’’ అని తనే అడిగింది. ఇదంతా ఒక్కసారిగా జరిగిపోదు. నెమ్మదిగా ఒక ప్రాసెస్‌లా జరుగుతుంది. ఆ రిజల్ట్ వచ్చేవరకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. అందుకు ఎన్ని సెషన్లు అయినా పట్టొచ్చు” అని కౌన్సెలింగ్ ప్రాసెస్ గురించి ఆమె వివరించారు.
* * *
రిలేషన్షిప్, వయసుకు సంబంధించిన సమస్యలకు కౌన్సెలింగ్ సరిపోతుంది. కానీ ఆల్కహాల్, ఓసీడీ వంటి వాటికి కౌన్సెలింగ్ సరిపోదు. ట్రీట్మెంట్ అవసరం. వాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రం కౌన్సెలింగ్ ఇవ్వొచ్చు అంటున్నారు సైకియాట్రిస్ట్, డాక్టర్ హరీష్.
టీవీ, సోషల్ మీడియా ప్రోగ్రామ్స్‌లో..
ఇదే విషయం గురించి చెప్తూ ‘‘యాంగ్జయిటీ, ఓసీడీ, డిప్రెషన్, ఆల్కహాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌తో కౌన్సెలింగ్ కోసం వచ్చే కేసులు ఉంటాయి. స్ర్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, డిమెన్షియా, మెంటల్ రిటార్డేషన్, బిహేవియరల్ ఇష్యూస్, అనుమానపు జబ్బు వంటివాటిని మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటారు. వీటికి ట్రీట్మెంట్ ప్రధానం. కౌన్సెలింగ్ పనికిరాదు. కుటుంబసభ్యులకు వారితో ఎలా మెలగాలి అనే విషయంపై కౌన్సెలింగ్ ఇవ్వొచ్చు.
టీవీ షోల్లో వచ్చే ప్రోగ్రామ్స్‌లో చూసేవి ఇంటర్ పర్సనల్ ప్రాబ్లమ్స్. అంటే.. వ్యక్తిగత రిలేషన్స్కి సంబంధించిన అంశాలు. వాటిలో అపార్థాలు, కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వంటివి ఉంటాయి. ఒక జంట మధ్య వచ్చే గొడవలకు కారణం ఎక్కువ శాతం వాళ్ల మెంటాలిటీనే. అలాంటి ప్రాబ్లమ్స్‌ని టీవీ, యూట్యూబ్ ఛానెల్స్‌లో వచ్చే ప్రోగామ్స్‌లో చూపిస్తుంటారు. కౌన్సెలింగ్ ఇవ్వడం అనేది మెంటల్ హెల్త్‌కి సంబంధించిందా? జనరల్ ఇష్యూకి సంబంధించిందా? అనే దాన్నిబట్టి ఉంటుంది.
ఎడ్యుకేట్ చేయాలి
మెంటల్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు.. అసలు ప్రాబ్లమ్ ఏంటి? ఎవరిలో వస్తుంది? ఎందుకొస్తుంది? ఎప్పుడు వస్తుంది? దానివల్ల జరిగే అనర్థాలు ఏంటి? దాన్నుంచి ఎలా బయటపడొచ్చు? అవి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? అనేవి కౌన్సెలింగ్‌లో చెప్తారు. ఉదాహరణకు కొవిడ్ ప్యాండెమిక్ అప్పటి పరిస్థితులు చూస్తే... కొవిడ్ వస్తే చనిపోతాం అనే భయంతో బతికారు చాలామంది.
ఆ తర్వాత కొవిడ్ గురించి కొంత నాలెడ్జ్ వచ్చింది. అది వచ్చాక మొదట్లో ఉన్నంత భయం కనపడలేదు. ట్యాబ్లెట్ వేసుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, ఐసోలేషన్ వంటివి పాటిస్తే సరిపోతుందని అర్థం చేసుకున్నారు. కౌన్సెలింగ్‌లో పేషెంట్‌ని ఎడ్యుకేట్ చేస్తారు. ప్రాబ్లమ్ ఏంటి? ఎలా వచ్చింది? దానికి సొల్యూషన్ ఏంటి? మళ్లీ వస్తే ఎలా ఎదుర్కోవాలి? అనేది చెప్తాం” అని చెప్పారాయన.
* * *
కౌన్సెలింగ్ అంటే ఒక అరగంట లేదా గంటలో అయిపోదనే విషయం అర్థమవుతోంది. మరి ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో ఒక్క ఎపిసోడ్‌లోనే కౌన్సెలింగ్ పూర్తి చేస్తున్నారు కదా! వాటికి వేలల్లో వ్యూస్ కూడా వస్తున్నాయి. మరి అదెలాంటి కౌన్సెలింగ్? అనే డౌట్ వస్తుంది.
ఇదే డౌట్‌ను సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీనివాస తేజని అడిగితే ఇలా చెప్పుకొచ్చారు... ‘‘ఏ వృత్తి లేదా ఉద్యోగంలో అయినా ఎథిక్స్ అనేవి ఉంటాయి. అలాగే కౌన్సెలింగ్‌లో కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. వాటిలో మొదటిది క్లయింట్ ప్రైవసీని కాపాడడం. అంటే.. క్లయింట్‌కి సంబంధించిన పర్సనల్, సెన్సిటివ్ విషయాలను గోప్యంగా ఉంచడం అనేది ముఖ్యం.
ఉదాహరణకు ఒక వ్యక్తి తన పర్సనల్ ప్రాబ్లమ్‌తో కౌన్సెలింగ్ కోసం వెళ్తే, వాళ్లకి సంబంధించిన వాళ్లు ‘‘మా వాళ్లకి ఏమైంది?’’ అని డాక్టర్ని అడగడం సహజం. కానీ, క్లయింట్ ప్రైవసీని నూటికి నూరుశాతం గోప్యంగానే ఉంచాలి. అందుకే ‘ఆ విషయాలు చెప్పడం కుదరదు’ అని చెప్తాం. ఎందుకంటే కౌన్సెలర్‌ని నమ్మి... వాళ్లు సమస్యను చెప్తారు. అది కూడా ఆ విషయం ఎవరి దగ్గరా మేం చెప్పం అని నమ్మకం వచ్చాకే. అందుకని క్లయింట్ నమ్మకాన్ని దెబ్బతీసే పని కౌన్సెలర్ చేయరు.
ఫ్యామిలీ ఇష్యూస్
అదే ఒక జంట గొడవపడి, కౌన్సెలింగ్ కోసం వస్తే.. ఆ కేసులో వాళ్ల తల్లిదండ్రులని ఇన్వాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే అది ఫ్యామిలీ ఇష్యూ. తల్లిదండ్రులనే కాదు.. ఆ సమస్యకు ముడిపడి ఉన్న బంధువులను కూడా కౌన్సెలింగ్‌లో భాగం చేయొచ్చు. సమస్యను బట్టి వేరే మనిషిని ఇన్వాల్వ్ చేయొచ్చా? లేదా? అనేది ఉంటుంది. అంతేకానీ.. వ్యక్తిగత సమస్యకు ఇతరులను ఇన్వాల్వ్ చేయడం సరికాదు. ఇదొక్కటే కాదు.. క్లయింట్ ప్రైవసీలో భాగంగా వాళ్లు చెప్పిన విషయాలను రికార్డ్ చేయడం. రికార్డ్ చేసి బయటకు తెలిసేలా చేయడం వంటివి చేయకూడదు.
ఇప్పుడు టీవీ షోల్లో, యూట్యూబ్ ఛానెల్స్‌లో కౌన్సెలింగ్ పేరుతో వచ్చే ఆ టీవీ షోలు, ప్రోగ్రామ్స్ అన్నీ నాటకీయతతో కూడినవి. వాటిలో నిజమైన కేసులను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. పైగా అవి కూడా నిజంగా కౌన్సెలింగ్ కోసం వచ్చే కేసులు కావు. చాలావరకు డబ్బులిస్తే... తీసుకొని ప్రోగ్రామ్స్‌లో కూర్చోవడానికి వస్తారు. ఇక్కడ మీకో ఉదాహరణ చెప్తా. పోలీసులు కూడా ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇస్తారు.
దంపతులు గొడవపడితే ఇద్దరికీ సర్ది చెప్పే క్రమంలో వాళ్లు ‘బాగా చూసుకో’ అని భర్తకు ఆర్డర్ వేస్తారు. వాళ్లకేం కావాలో అది తెలుసుకుని, దానికి తగ్గట్టు కౌన్సెలింగ్ ఇవ్వాలి. కానీ, ‘ఇలా ఉండు, అలా చెయ్’ అని కమాండ్ చేయకూడదు. అలాంటిది బాధ్యతగల వృత్తిలో ఉన్న సైకియాట్రిస్ట్ ఒక షోలో కూర్చుని క్లయింట్‌కి జడ్జ్మెంట్ ఇస్తే అది అనైతికం అవుతుంది. ఒక సైకియాట్రిస్ట్‌గా క్లయింట్ ప్రాబ్లమ్ తెలుసుకుని, దానికి తగ్గట్టు మాట్లాడి సమస్య పరిష్కరించాలి. అంతేకానీ, ‘నీది తప్పు’, ‘నువ్వు కరెక్ట్’, ‘నువ్వు అలా మాట్లాడకూడదు’, ‘ఇలా చేయకూడదు’ అని జడ్జ్ చేసే హక్కులేదు.
కానీ, చాలావరకు షోల్లో సైకియాట్రిస్టే ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. వాళ్ల జడ్జ్ మెంట్ లేనిదే షోకి రేటింగ్ రాదు. నిజంగా చేసే కౌన్సెలింగ్ చూస్తే... అది చూసేవాళ్లకి మజా రాదు. ఎందుకంటే అక్కడ జడ్జ్మెంట్ ఉండదు. జూమ్ షాట్లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, స్పెషల్ ఎఫెక్ట్స్ వంటివి ఉండవు కాబట్టి.
ప్రాసెస్‌కు టైం పడుతుంది
కౌన్సెలింగ్‌కి అనేక రకాల కేసులు వస్తుంటాయి. ఎన్నో ఏండ్ల నుంచి, వందల కొద్దీ కేసులు డీల్ చేస్తున్నా. అప్పుడప్పుడు కొత్త కేసులూ ఎదురవుతాయి.మరో ఉదాహరణ.. ఒక అమ్మాయికి పద్దెనిమిదేండ్లకు పెండ్లి చేశారు. అది మేనరికం పెండ్లి. భర్త వయసులో కొంచెం పెద్దోడు. పెండ్లయ్యాక రాత్రుళ్లు ఆమెని ఇబ్బంది పెట్టేవాడు. ఆ అమ్మాయికి సెక్స్ మీద విరక్తి. ఆ అమ్మాయి పదో తరగతి చదివేటప్పుడు సోషల్ మీడియాలో ఒకతను పరిచయమయ్యాడు. వాళ్లిద్దరూ తరచూ మాట్లాడుకునేవాళ్లు.
ఈ విషయం తెలిసి అమ్మాయి తరపువాళ్లు అతనికి డబ్బులిచ్చి, అమ్మాయి జోలికి రావద్దని చెప్పారు. ఆ అమ్మాయి ఒక రాత్రి ఇంట్లో ఎవరికీ తెలియకుండా అతనితో వెళ్లిపోయింది. కానీ, ఆ అమ్మాయికి సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అతని దగ్గర కూడా అదే సమస్య ఎదురైంది. కొన్నాళ్లకు అతని మీద చెడు అభిప్రాయం ఏర్పడింది. అప్పటికే ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు. ఆమె ఎవరితో ఉండాలనేది అర్థం కాని పరిస్థితిలో కౌన్సెలింగ్‌కి వచ్చారు. ఇలాంటి కేసులో కౌన్సెలర్ ముందుగా ప్రైమరీ అంచనాలు వేసుకుంటాడు. ప్లాన్, యాక్షన్ ఏంటి? అనేది రెడీ చేసుకుని కౌన్సెలింగ్ ఇస్తాడు. భర్త మీద ఉన్న నెగెటివ్ ఒపీనియన్‌ని పాజిటివ్‌గా మార్చాలి. సెక్స్ మీద ఆమెకున్న విరక్తి భావాన్ని తీసేయాలి.
ఇదీ ప్రాసెస్. అక్కడక్కడా ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్‌కు చాలా టైం పడుతుంది. అలాంటిది అరగంట, గంట ప్రోగ్రామ్‌లో ఇలాంటివి సాల్వ్ చేయగలరా? సాధ్యం కాదు. చాలావరకు ఇవి పెయిడ్ ప్రోగ్రామ్స్ అని చెప్పడానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఆ షోలకి కౌన్సెలింగ్ కోసం వచ్చే వాళ్లలో సెలబ్రిటీ కేసులు, బాధ్యత గల పౌరులు, చదువుకున్నవాళ్లు ఎవరూ కనిపించరు. అంతెందుకు నెలనెలా జీతాలు తీసుకునే చిన్న, పెద్ద గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఎవరూ కనపడరు. ఆ షోల్లో కనిపించేవాళ్లంతా నిరుపేదలు, కూలీలు, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వాళ్లు. డబ్బులకు ఆశపడి వస్తుంటారు” అని వివరించారు డాక్టర్ తేజ.
కౌన్సెలింగ్ వల్ల బెనిఫిట్స్
కౌన్సెలింగ్‌తో 99 శాతం సూసైడ్స్ ఆపొచ్చు. సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన ఇద్దరిలో మాత్రమే వస్తుంది. ఒకరు డిప్రెషన్లో ఉన్నవాళ్లు, అంటే.. జీవితం మీద విరక్తి చెందినవాళ్లు. మరొకరు ఎమోషనల్లీ అన్స్టేబుల్ పర్సనాలిటీ ఉన్నవాళ్లు. అంటే.. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక క్షణికావేశంలో ఉండేవాళ్లు. ఈ రెండు కేటగిరీలకు చెందిన వ్యక్తులను ఈజీగా ఆ ఆలోచన నుంచి బయటకు తీసుకురావొచ్చు.
ఇంకో బెనిఫిట్ చదువులో స్ట్రెస్ తగ్గించొచ్చు. ఎంతసేపు చదువుతున్నారనేది ముఖ్యం కాదు. మైండ్లోకి ఎంత ఎక్కించుకుంటున్నారు? అనేది ఇంపార్టెంట్. ఈ విషయంలో పేరెంట్స్‌కి అవగాహన ఉండడం లేదు. మరీ ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు, ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ నడిపేవాళ్లు దాన్ని వ్యాపారంలానే చూస్తున్నారు. దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నది విద్యార్థులే. కాబట్టి ఎప్పుడు? ఎక్కడ? ఎలా చదవాలనే దానిమీద ఎవరికీ అవగాహన లేదు. మైండ్ ఎంతవరకు గ్రహిస్తుంది? అనేది ఎవరికీ తెలియడంలేదు.
చదువుకుంటే చాలు వచ్చేస్తుంది అనుకుంటున్నారు. కానీ, చదువుకుంటే సరిపోదు.. అది అర్థం కావాలి. అలాగే అందరి పిల్లల్లో ‘ఐక్యూ’ ఒకేలా ఉండదు. ఐక్యూ లెవల్ తక్కువ ఉన్నవాళ్లు సరిగా చదవలేరు. అది తెలియక పేరెంట్స్ పిల్లల మీద ఒత్తిడి పెడుతుంటారు.
మిగతా పిల్లలతో పోలుస్తుంటారు. పిల్లల ఆసక్తి, ఏకాగ్రత, చురుకుదనం వంటివి చూసి వాళ్లకు ఏదైనా నేర్పించాలి. అది కూడా మూడు, నాలుగో తరగతి చదివే పిల్లల్లో క్లారిటీ రాదు. ఒకవేళ పిల్లలు మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే కనుక కౌన్సెలింగ్‌తో బయటపడేయొచ్చు.
గౌరి ప్రయాగ సైకాలజిస్ట్ స్మార్ట్ లైఫ్ కౌన్సెలింగ్ రెమెడీస్
ఆన్లైన్ కౌన్సెలింగ్
ఈ మధ్య కౌన్సెలింగ్‌లు కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. కాకపోతే వాటికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని కేసులు మాత్రమే ఆన్లైన్లో చేయగలం. ఎందుకంటే అందులో ప్రైవసీ ఉండదు. రెండు మూడు సెషన్స్ అయిపోయాక దాని కొనసాగింపు ఉండి, ఆ వ్యక్తి అందుబాటులో లేకపోతే ఆన్లైన్ కౌన్సెలింగ్‌కి మొగ్గుచూపుతారు.
అలాగే కౌన్సెలింగ్ తీసుకోవాల్సిన వ్యక్తి వేరే చోట ఉండి, కౌన్సెలర్ దగ్గరకి రాలేనప్పుడు ఆన్లైన్ కౌన్సెలింగ్ చేస్తారు. కానీ.. నేరుగా తీసుకున్న కౌన్సెలింగ్‌కి, ఆన్లైన్లో ఇచ్చే కౌన్సెలింగ్‌కి చాలా తేడా ఉంటుంది.
కౌన్సెలర్ ఎలా ఉండాలి?
కౌన్సెలర్కి మానసిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. కౌన్సెలింగ్‌లో మంచి ట్రైనింగ్ ఉండాలి.
కౌన్సెలింగ్ చేసే క్రమంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.
కౌన్సెలర్ సొంత అభిప్రాయాలు వ్యక్తీకరించకూడదు.
క్లయింటును కించపరచే విధంగా మాట్లాడకూడదు.
క్లయింటును తిట్టడం, విసుక్కోవటం, కొట్టటం లాంటివి అసలే చేయకూడదు.
క్లయింటుతో వృత్తిపరమైన సంబంధమే తప్ప వ్యక్తిగత సంబంధాలు పెట్టుకోకూడదు.
టీవీ, సోషల్ మీడియాల్లో చూసే ప్రోగ్రామ్‌లు ఏవీ కౌన్సెలింగ్ కాదు.
వారికి వారే డిగ్రీలు తగిలించుకున్న లైఫ్ కోచ్‌లు చెప్పే చిట్కాల వల్ల మానసిక సమస్యలు పరిష్కారం కావు.
ఒకటి, రెండు గంటల్లోనే పరిష్కరించటం సాధ్యం కాదు.
కొందరు సైకియాట్రిస్ట్‌లు, సైకాలజిస్ట్‌లు, సెలబ్రిటీలు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కౌన్సెలింగ్ అంటే అలాగే ఉంటుందనే తప్పుడు సమాచారం ప్రజల్లో ప్రచారం అవుతోంది.
ఈ కార్యక్రమాల్లో యాంకర్లు కూడా తమ అభిప్రాయాలను చెప్తూ రకరకాల హావభావాలు ప్రదర్శించటం మొత్తంగా కౌన్సెలింగ్ రూల్స్‌కే విరుద్ధం.
చాలా రకాల మానసిక రుగ్మతలను మందుల ద్వారా నయం చేయవచ్చు. కానీ మందులు మానేయగానే సమస్య మళ్ళీ మొదలు కావొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో సమస్యను అర్థం చేసుకుని రూట్స్‌తో సహా తీసేసేందుకు కౌన్సెలింగ్ చాలా బాగా పనిచేస్తుంది.
కొన్ని సందర్భాల్లో మన సమస్యలు ఎవరితో అయినా చెప్పినప్పుడు వాళ్లు సరైన పరిష్కారం చూపక పోగా, కొత్త సమస్యలు సృష్టించవచ్చు. అలాంటప్పుడు ఎక్స్పర్ట్స్ సలహా తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. మరీ ముఖ్యంగా ఎమోషన్స్‌తో కాకుండా సమస్య గురించి మాత్రమే డిస్కస్ చేయడం అనేది కౌన్సెలింగ్‌లోనే సాధ్యం.
అవగాహన లేకపోతే..
ఒక విషయంపై అవగాహన లేనప్పుడు దాన్ని మనం ఒక పెద్ద భూతంలా చూస్తాం. అవగాహన రావాలంటే ఆ విషయం ప్రజల నోళ్లలో నానాలి. కొత్తగా ఏదైనా వచ్చిందంటే దాన్ని చూసే కోణం ఒకలా ఉంటుంది. పాతబడ్డాక మరోలా ఉంటుంది. టీవీ షోల్లో, యూట్యూబ్ ఛానెల్స్ ప్రోగ్రామ్స్‌లో చూపించే కౌన్సెలింగ్ నిజమా? కాదా? అనేది పక్కన పెడితే అవి చూడడం వల్ల ప్రజలకు ఒకలాంటి అవేర్నెస్ వస్తుంది.
ముఖ్యంగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు ఎవరూ కూడా ముందుకొచ్చి వాళ్ల సమస్యను చెప్పుకోలేరు. అలాంటి వాళ్లు టీవీ ప్రోగ్రామ్స్ చూస్తే వాళ్ల ప్రాబ్లమ్స్‌ని కూడా చెప్పుకోవచ్చు అనే ధైర్యం వస్తుంది. ఇది మానసిక సమస్య. దీనికి ఒక డాక్టర్ ఉంటారు. కౌన్సెలింగ్ ఇస్తారనే విషయాలు తెలిసి డాక్టర్ దగ్గరకి వెళ్లి సమస్యలు సాల్వ్ చేసుకుంటున్నారు ఇప్పుడు.
మామూలుగా మన కల్చర్‌లో ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే దైవం మీద వేస్తారు. గుళ్లు, గోపురాలు తిరగడం, దానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలు పాటించడం చేస్తుంటారు. మాంత్రికుల దగ్గరకు వెళ్తుంటారు. ఎందుకంటే నాలెడ్జ్ అంతవరకే ఉంది. ఇవన్నీ కాదు... దీనికి సొల్యూషన్ వేరే ఉందని తెలియాలంటే ప్రజలకు మినిమమ్ నాలెడ్జ్ ఉండాలి.
చదువుకున్నోళ్లకు ప్రాబ్లమ్ ఏంటని తెలిసే అవకాశం ఉంది. దాన్నిబట్టి వాళ్లు ఏ డాక్టర్ దగ్గరకి వెళ్లాలనేది చూసుకుంటారు. మరి మిగతా జనాల్లో కొందరికి అయినా ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఫలానా ప్రాబ్లమ్‌కి, ఫలానా డాక్టర్ దగ్గరకు వెళ్లాలని తెలుస్తుంది. లక్ష మంది చూస్తే అందులో వెయ్యి మందికైనా అర్థమవుతుంది. వాళ్లలో కొందరైనా డాక్టర్ దగ్గరకి వెళ్లే ప్రయత్నం చేస్తారు. అయితే, ఇప్పుడు చూస్తున్న టీవీ షోలలో చేసేది మాత్రం కౌన్సెలింగ్ కాదు. అవి మెంటల్ హెల్త్ ఇష్యూస్ కాదు. కేవలం ఇంటర్ పర్సనల్ ప్రాబ్లమ్స్. అంటే వ్యక్తిగత సమస్యలు మాత్రమే. అయితే, సైకియాట్రిలో అది కూడా ఒక భాగం. అలాంటి అంశం ఉందా? లేదా అనేది డాక్టర్ని సంప్రదించినప్పుడే తెలుస్తుంది.
ఇంకో విషయం ఈ రోజుల్లో అడిక్షన్ అంటే మందు, సిగరెట్ మాత్రమే కాదు. ఆన్లైన్ గేమ్స్, నిద్రలేమి, జ్వరం ట్యాబ్లెట్స్ వాడడం, పర్ఫ్యూమ్స్, గమ్స్, పెట్రోల్, డీజిల్ వాసనలు, స్టిరాయిడ్ పిల్స్, కల్లు తాగడం వంటివి కూడా ఉంటాయి. అలాగే సెక్సువల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్‌ని ఎవరూ చెప్పుకోలేరు. దాంతో విడాకులు వరకు వెళ్తారు. స్లీప్ టైమింగ్స్, యాంగ్జయిటీ వంటి వాటిమీద చర్చించాల్సిన అవసరం ఉంది.
డాక్టర్ హరీశ్ పిన్నోజు కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ క్లినిక్ హైదరాబాద్
పబ్లిక్ ఇంట్రెస్ట్
కౌన్సెలింగ్‌కి రకరకాల క్లయింట్స్ వస్తారు. కానీ, సోషల్ మీడియా, టీవీ షోలలో అక్రమ సంబంధాల కేసులే ఉంటాయి. అవే ఎందుకు వస్తాయంటే అలాంటి కేసుల్ని పబ్లిక్ ఇంట్రెస్ట్‌గా చూస్తారు. షోకి రేటింగ్ పెరుగుతుంది. ఉదాహరణకు ఒక ఓసీడీ ఉన్న వ్యక్తికి కౌన్సెలింగ్ ఇస్తే పబ్లిక్‌కి ఇంట్రెస్ట్ ఉండదు. అదే ఆ కేసుల్లో అయితే, సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ కూర్చుని మెడికల్ టర్మ్ ఒకటి చెప్తారు.
అదేదో బ్రహ్మాండం అన్నట్టు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. కానీ, ఈరోజుల్లో ఆ కండిషన్ ఏంటనేది ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా తెలుస్తుంది. ఒక ఎక్స్పర్ట్ చెప్పేది కూడా బుక్‌లో చదువుకున్నదే కదా. అలాంటప్పుడు అంత అటెన్షన్ అవసరంలేదు. ఇక్కడ ఏమవుతుందంటే... సైకియాట్రిస్ట్ అని ఒక బాధ్యతగల డాక్టర్ని తీసుకొచ్చి, కెమెరా ముందు కూర్చోబెట్టి అతను ఎక్కడ ఏం చెప్పాలో? ఎలా చెప్పాలో కూడా షో నిర్వాహకులే చెప్తారు.
కాబట్టి ఎంటర్టైన్మెంట్ కోసం చేసే షోలలో ఇదొక భాగం అని చెప్పొచ్చు. వాటిలో వాస్తవం ఉండదు. అంతా స్క్రిప్టే. పైగా ఎటువంటి నైతిక విలువలు పాటించకుండా చేసే వీటిని కౌన్సెలింగ్ అనరు. వాటివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కౌన్సెలింగ్ అంటే పబ్లిక్‌లో నెగెటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి షోలు ఎక్కువైతే సోషల్ వ్యాల్యూస్ దెబ్బతింటాయి.
డా. పి. శ్రీనివాస తేజసైకియాట్రిస్ట్ బ్రెయిన్ వేవ్ హాస్పిటల్, నెల్లూరు
కేసులు – సక్సెస్ రేట్లు
ఇండివిడ్యువల్ సఫరింగ్ (వ్యక్తిగత మానసిక రోగం), ఫ్యామిలీ గొడవలు, పిల్లల్లో బిహేవియరల్ ఇష్యూస్, స్ట్రెస్ మేనేజ్మెంట్ వంటివి కౌన్సెలింగ్‌కి వస్తాయి. పిల్లల్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్, ఇండివిడ్యువల్ సఫరింగ్, ప్రి– మెచ్యూర్డ్ లవ్ ఇష్యూస్‌లో 90 శాతం సక్సెస్ రేట్ ఉంటుంది. ఫ్యామిలీ ఇష్యూల్లో సక్సెస్ రేట్50 శాతం ఉంటుంది. ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ. కొన్నిసార్లు మేమే ‘సెట్ అవ్వదు. విడాకులు తీసుకోవడం బెటర్’ అని చెప్తుంటాం. ఇలాంటి విషయాల్లో కొన్నిసార్లు కోర్టులో సాక్ష్యాలు కూడా చెప్పాల్సి వస్తుంది.
దర్వాజ డెస్క్