కవర్ స్టోరీ : వ్యాక్సిన్ వెనక...

‘కొవిడ్​ వ్యాక్సిన్ వేయించుకున్నారా?  మీ పని అంతే!’ 
‘ఆలస్యంగా వెలుగులోకి వస్తున్న వ్యాక్సిన్ సైడ్​ ఎఫెక్ట్స్’
 ‘కొంపముంచుతున్న కొవిడ్ వ్యాక్సిన్​ సైడ్ ఎఫెక్ట్స్’ 
‘ప్రాణాలు హరిస్తున్న వ్యాక్సిన్’ 

‘కరోనాకు వ్యాక్సిన్ తీసుకున్నారా. అయితే డేంజర్​ జోన్​లో ఉన్నట్లే’.... ఈ మధ్య వస్తున్న ఇలాంటి వార్తలు,  యూట్యూబ్​ఛానెల్స్​లో చూస్తున్న​ థంబ్​ నెయిల్స్ ‘ఓరిదేవుడా! కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టు తయారైందే’ అని జనాలు ఠారెత్తిపోయేలా చేస్తున్నాయి. నిజానికి ఆ వార్తల వెనక ఉన్న అసలు విషయం తెలుసుకోకుండా భయపడితే ఎలా? అందుకే ఈ వార్తలు ఇప్పుడు ఎందుకు ఇంతగా వైరల్​ అవుతున్నాయి? అసలు సంగతి ఏంటి? వ్యాక్సిన్​ వల్ల ఎంత లాభం? ఎంత నష్టం? నిజానిజాలు ఏంటో తెలుసుకుంటే బుర్రలో భయాన్ని తీసి గట్టున పెట్టొచ్చు! 

కరోనా... పేరు తలచుకుంటేనే వెన్నులో వణుకు పుట్టిన రోజులవి. కరోనా వైరస్​కు మందు లేదు అన్నప్పుడు ఎంత కృంగిపోయారో.. దాని​కి వ్యాక్సిన్​ కనిపెట్టారని తెలిసి అంతకు రెట్టింపు సంబరపడ్డారు ప్రపంచవ్యాప్తంగా. ఆ వ్యాక్సిన్స్​లో కొవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్, ఫైజర్, మోడర్నా​.. అంటూ పలు రకాలు వచ్చాయి. ఎవరికి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్​ వాళ్లు వేయించుకునేందుకు ‘క్యూ’లు కట్టారు. ఒకటి కాదు.. రెండు కాదు.. బూస్టర్​ డోసులు వేసుకుంటూ వ్యాక్సినేషన్ డ్రైవ్​ సక్సెస్​ చేశారు. ‘హమ్మయ్య ప్రాణాలు తీసే మహమ్మారిని కట్టడిచేసే వ్యాక్సిన్​ వేయించుకున్నాం’ అనే ధీమాతో హాయిగా బతుకుతున్నారంతా.
 

ప్రశాంతంగా ఉన్న కొలనులో చిన్న రాయి అలల అలజడి తెచ్చినట్టు... వ్యాక్సిన్​ వల్ల సైడ్​ ఎఫెక్ట్స్​ అనే వార్తతో... మొన్నమొన్నటివరకు సంజీవని అనుకున్న వ్యాక్సిన్​ ఇప్పుడు యమపాశంలా మారిందా? వ్యాక్సిన్​ సైడ్​ ఎఫెక్ట్స్ అంత డేంజర్​గా మారాయా? వాటివల్ల చనిపోయే పరిస్థితి వస్తుందా? అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు కొందరు. మరికొందరేమో వ్యాక్సిన్​ వేయించుకుని ఏండ్లు గడిచాయి కదా!  ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే వాటి బారిన పడకుండా ఎలా బయటపడాలి? అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ కొందరు డాక్టర్లతో మాట్లాడాం. వాళ్లు చెప్పిన వివరాలే ఈ వారం కవర్​స్టోరీ... 

పుట్టినప్పటి నుంచే..

పుట్టింది మొదలు ఎదిగేక్రమంలో హెల్త్​ పరంగా ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి శిశు దశ నుంచే వ్యాక్సిన్​లు వేయడం మొదలవుతుంది. ముఖ్యంగా మనదేశంలో పదేండ్ల వయసు వరకు రుబెల్లా, పోలియో, హెచ్​ఐవి, బీసీజీ, ఓపీవీ, హెపటైటిస్–బి, డిఫ్తీరియా, రోటా వైరస్, ఓరల్ పోలియో వైరస్, న్యుమోకోకల్ కాంజుగేట్, హెపటైటిస్ –ఎ, చికెన్​ పాక్స్, హెచ్​పీవీ వంటి వ్యాక్సిన్​లు వేస్తారు. అంత చిన్న వయసు నుంచే ఆరోగ్యం కోసం ఎన్నో వ్యాక్సిన్​లు వేయించుకున్నప్పుడు రాని భయం కరోనా వ్యాక్సిన్ విషయంలో వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందంటే... వ్యాక్సిన్ ఎందుకు వేసుకోవాలి? వ్యాక్సిన్​ ఎలా తయారుచేస్తారు? వంటి విషయాలపై అవగాహన లేకపోవడం వల్లే అంటున్నారు ఎక్స్​పర్ట్స్​. అందుకే వ్యాక్సిన్ గురించి ఒక్కొక్కటిగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 

వ్యాక్సిన్ అంటే...

ఇన్ఫెక్షన్ కలిగించే వైరస్ లేదా బ్యాక్టీరియాలు శరీరంలో ఉన్నప్పుడు వాటితో పోరాడుతుంది రోగ నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ సిస్టమ్). కానీ, మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ కంటే వైరస్ బలంగా ఉంటే అప్పుడు ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో వైరస్​, బ్యాక్టీరియాలను నిర్వీర్యం చేయడం కోసం బయటి నుంచి ఇమ్యూనిటీని వ్యాక్సిన్ రూపంలో శరీరం లోపలికి పంపుతారు.

అలా వ్యాధి నిరోధక వ్యవస్థ వైరస్​, బ్యాక్టీరియాలతో ఫైట్​ చేసి వాటిని చంపేస్తుంది. ప్రతి మనిషిలో రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది. మన శరీరమే వ్యాధినిరోధక శక్తిని తయారుచేసుకుంటుంది. తినే తిండి ద్వారా అది ఇమ్యూనిటీ పెంచుకుంటుంది. ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి హాని చేసే శత్రువులతో ఫైట్​ చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంటుంది. అలాంటిది కరోనా లాంటి బలమైన శత్రువు వంట్లో చేరితే దాంతో పోరాడేందుకు మనలో ఉన్న ఇమ్యూనిటీ సరిపోదు. అలాగని అటువంటి వైరస్​లను వెంటనే నాశనం చేయకపోతే ప్రాణాలకే ముప్పు. ఇలాంటప్పుడే వ్యాక్సినేషన్ కాపాడుతుంది. వ్యాక్సిన్ ద్వారా వైరస్​తో పోరాడే ఇమ్యూనిటీ వస్తుంది. అంత శక్తి వ్యాక్సిన్​కి ఎలా వస్తుంది? దాన్నెలా తయారుచేస్తారనే విషయాలు తెలుసుకోవాలి.

వ్యాక్సిన్ తయారీ అంత ఈజీ కాదు

ఏ వ్యాక్సిన్ అయినా డెవలప్ చేయడం అంత ఈజీ కాదు. ఒక వ్యాక్సిన్​ తయారుకావాలంటే దాదాపు ఏడాది కాలం పడుతుంది. ఆ తరువాత తయారుచేసిన వ్యాక్సిన్​ను ఎలుకల వంటి వాటి మీద ట్రయల్​ చేస్తారు. ప్రి – క్లినికల్ ట్రయల్స్ విజయవంతం​గా జరిగి, ఆ జంతువు చనిపోకుండా ఉంటే అప్పుడు ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే ఆ జంతువులో ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ ఎలా ఉన్నాయి? అని టెస్ట్ చేస్తారు. అంతా బాగుందని తేల్చేందుకే రెండేండ్లు పడుతుంది. ఆ తర్వాతే మనుషుల మీద ప్రయోగానికి రెడీ అవుతారు.

అప్పుడు చిన్న పిల్లల నుంచి ఆడ, మగ, మధ్యవయసు, ముసలి వాళ్లు... అంటూ రకరకాల వ్యక్తుల్ని సెలక్ట్​ చేసుకుంటారు. వాళ్లను మూడు నుంచి ఆరు నెలలు అబ్జర్వేషన్​లో ఉంచుతారు. ఆ తర్వాత ఎక్స్​పరిమెంట్​లో భాగంగా వాళ్లకు వ్యాక్సిన్ ఇస్తారు. అది పనిచేసిందా? లేదా? అనేది చెక్ చేయడానికి ఆరు నెలల నుంచి ఏడాది పైనే పడుతుంది. అక్కడి నుంచి వ్యాక్సిన్​ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలంటే ఇంకో ఐదారేండ్లు పట్టొచ్చు. అదే వ్యాక్సిన్ కనిపెట్టే ప్రాసెస్​ స్పీడ్​గా జరిగితే వ్యాక్సిన్​ వాడకంలోకి వచ్చేందుకు రెండు మూడేండ్లు పడుతుంది. వ్యాక్సిన్​ మార్కెట్లోకి వచ్చాక అందరికీ అందుబాటులోకి వస్తుంది.

సైడ్ ఎఫెక్ట్స్ సహజం!

ఇప్పుడు కరోనా వ్యాక్సిన్​ విషయానికి వద్దాం. ఇండియాలో 2021 జనవరి16న కరోనా వ్యాక్సిన్​ ఇవ్వడం మొదలైంది. మొట్టమొదట ఢిల్లీలోనే ఎయిమ్స్​లో పారిశుధ్య కార్మికుడు మనీశ్​ కుమార్​కు మొదటి కొవిడ్ టీకా వేశారు. మొదటి రోజే ఏకంగా1,91,181 మందికి కొవిడ్ టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తెలంగాణలో మొదటి రోజే 3, 962 మందికి టీకాలు ఇచ్చినట్టు తెలంగాణ గవర్నమెంట్ తెలిపింది.

కాగా పదకొండు మందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినట్లు రిపోర్ట్​లు వచ్చాయని అప్పుడే గవర్నమెంట్ చెప్పింది. ఢిల్లీలో కూడా 52 మందిలో ఏఈఎఫ్​ఐ (అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్) గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. అంటే.. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల సైడ్​ ఎఫెక్ట్స్ రావడం అన్నమాట. అయితే ఇలా జరగడం సహజం అంటున్నారు ఎక్స్​పర్ట్స్. ఇదంతా సరే మరి ఇప్పుడు అందరూ కంగారుపడుతున్న 

కోవిషీల్డ్ గొడవేంటి?

‘‘నిజానికి కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు సెకండ్ వేవ్​లో వైరస్ నుంచి 93శాతం వరకు సురక్షితంగా ఉన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో 98 శాతం మందికి మరణం ముప్పు తగ్గింది. కొవిడ్–19 ఇన్ఫెక్షన్ సోకకుండా వ్యాక్సిన్స్​ వందశాతం రక్షణ కల్పించినప్పటికీ వైరస్ తీవ్రతను తగ్గించడంలో వ్యాక్సిన్​ల ఎఫెక్ట్ ఉంటుంది” అని చెప్పాడు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్. అలాగే ఇన్ఫెక్షన్ సోకదని ఏ వ్యాక్సిన్ నూటికి నూరు శాతం గ్యారెంటీ ఇవ్వలేదు. కానీ, పరిస్థితులు సీరియస్ కాకుండా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి వ్యాక్సిన్​లపై నమ్మకం ఉంచడంతోపాటు అలెర్ట్​గా ఉండాలని కూడా చెప్పారు ఎక్స్​పర్ట్స్​ చాలామంది.

కోవిషీల్డ్ కథేంటి?

బ్రిటిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికా, ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి కోవిషీల్డ్ వ్యాక్సిన్ డెవలప్ చేసింది. దాన్ని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడానికి ఇండియా​లోని సీరమ్ ఇనిస్టిట్యూట్​తో కలిసింది. సీరమ్​ ఇనిస్టిట్యూట్​లో వ్యాక్సిన్ తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం కొంత మొత్తం డబ్బు​ కూడా ఇచ్చింది. అలా కోవిషీల్డ్​ వ్యాక్సిన్​లను భారత్​లోని సీరమ్​ ఇనిస్టిట్యూట్​లో​ తయారయ్యాయి.

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్​తో పలు వ్యాధులు వస్తున్నాయి. కొన్నిసార్లు మరణానికి దారితీస్తోందని బ్రిటన్ కోర్టులో పిల్స్(ప్రజాప్రయోజన వ్యాజ్యం) దాఖలయ్యాయి. దీనిపై ఇప్పటికే 51 కేసులు నమోదయ్యాయి. జరిగిన నష్టానికి పరిహారంగా దాదాపు వంద మిలియన్ పౌండ్లు కట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వాటిలో కొన్ని కేసులు మాత్రమే ప్రూవ్ అయ్యాయి. మిగతావి పెండింగ్​లో ఉన్నాయి. చాలావరకు కేసుల్లో ఈ వ్యాక్సిన్ సైడ్​ ఎఫెక్ట్స్​ వల్ల ‘రక్తం గడ్డకట్టడం. మెదడులో బ్లీడింగ్ కావడం. ప్లేట్​లెట్స్ పడిపోవడం. గుండె పోటు వంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వాటివల్ల మరణాలు సంభవించాయని కేసులు ఫైల్​ అయ్యాయి. దాంతో  కొన్నాళ్లు కోవిషీల్డ్​ వ్యాక్సిన్​ తయారీ కూడా ఆపేసింది. 

ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తిరిగి ఉత్పత్తి మొదలుపెట్టాక కోవిషీల్డ్​కి గుర్తింపు లభించింది. దాంతోపాటు టీకా ఎక్స్​పైరీ డేట్​ గడువు పెంచుతున్నట్టు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) సీరం ఇనిస్టిట్యూట్​కు ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో టీకా ఎక్స్​పైరీ డేట్​ ఆరు నుంచి తొమ్మిదినెలలు చేస్తున్నట్టు ఉంది. ప్రపంచవ్యాప్తంగా అప్పటికే అందుబాటులో ఉన్న టీకాల గడువు ఆరు నెలలు కాగా కోవిషీల్డ్​ని మాత్రం తొమ్మిది నెలలు అనుమతిచ్చింది.

అప్పటికే సీరం ఇనిస్టిట్యూట్ పెద్ద మొత్తంలో కొవిడ్ టీకాలను ఉత్పత్తి చేస్తోంది. ఇండియా​లోనే కాకుండా ఇతరదేశాలకు కూడా సరఫరా చేసింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఏర్పాటు చేసిన ‘కొవాక్స్’ కార్యక్రమంలో పేద, మధ్య ఆదాయ దేశాలు సీరం ఇనిస్టిట్యూట్​ టీకాపైనే ఆధారపడ్డాయి. అప్పటికే భారత్ 84 దేశాలకు ఆరు కోట్లకు పైగా టీకాలు పంపినట్టు సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ చెప్పింది.

*   *   *

సైడ్​ ఎఫెక్ట్స్ వస్తాయి

కోవిషీల్డ్ వ్యాక్సిన్​ను18 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్లే వేయించుకోవాలని చెప్పారు. ఒక్కో డోసు 0.5 ఎంఎల్ ఉంటుంది. తొలి డోసు తీసుకున్న 4 నుంచి 6 వారాల మధ్య రెండో డోసు తీసుకుంటే బెటర్ అన్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మూడు రకాల సైడ్ ఎఫెక్ట్స్​ ఉండొచ్చని అప్పట్లోనే చెప్పారు. ప్రతి పదిమందిలో ఒకరికి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ప్రతి వందమందిలో ఒకరికి అన్​కామన్​ సైడ్​ఎఫెక్ట్స్​ ఉండొచ్చు. ఇవన్నీ తాత్కాలికమే. కానీ, ఇంతకంటే పెద్ద ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చని చెప్పింది వ్యాక్సిన్​ తయారుచేసిన కంపెనీ.

 
వెరీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ : దురద, వాపు, అలసట, తలనొప్పి, జ్వరం వచ్చినట్లు ఉండడం, జాయింట్ పెయిన్స్, కండరాల నొప్పి...  ఏదో జబ్బు చేసిన ఫీలింగ్ వంటివి ఉంటాయి.


కామన్ : ఇంజెక్షన్ వేసిన దగ్గర గడ్డ కట్టడం. జ్వరం, వాంతులు, శరీర ఉష్ణోగ్రత పెరగడం, ముక్కు కారడం, దగ్గు, గొంతు మంట వంటివి.

అన్ కామన్​ : మత్తుగా ఉండడం, పొత్తికడుపు నొప్పి, ఆకలి తగ్గడం, చెమటలు, చర్మంపై దద్దుర్లు, విపరీతమైన దురద  వంటివి.

వ్యాక్సిన్ వేసుకునే టైంకి జ్వరం, బ్లీడింగ్ డిజార్డర్, బ్లడ్ చిక్కబడటం వంటివి ఉన్నవాళ్లు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, గర్భం దాల్చాలనుకుంటున్న మహిళలు డాక్టర్ సలహా మేరకు వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు.

టీటీఎస్ అంటే...

ఇదిలా ఉంటే కోవిషీల్డ్​ వ్యాక్సిన్​ వల్ల రక్తం గడ్డకట్టి ప్రాణాపాయం ఏర్పడిందని పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. ఇలా గడ్డకట్టడాన్ని టీటీఎస్​ అంటారు. థ్రాంబోసిస్  విత్ థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్) అనేది శరీరంలోని ఆయా భాగాల్లో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌‌లెట్ల సంఖ్య పడిపోయే అరుదైన పరిస్థితి. ప్లేట్‌‌లెట్స్ అనేవి రక్తం గడ్డకట్టడానికి సాయపడే చిన్న కణాలు. కాబట్టి ఇవి చాలా తక్కువగా ఉంటే చాలా ప్రమాదకరం. వ్యాక్స్‌‌జెవ్రియా, కోవిషీల్డ్, జాన్​స్సెన్ కొవిడ్ టీకా వంటి అడెనోవైరల్ వెక్టర్ కొవిడ్- వ్యాక్సిన్స్​ తీసుకున్న వ్యక్తుల్లో టీటీఎస్​ పరిస్థితి ఎదురయ్యింది. రక్తం గడ్డకట్టేందుకు కారణమయ్యే ప్రొటీన్‌‌పై దాడి చేసే యాంటీబాడీస్ తయారీలో శరీరం రోగనిరోధక వ్యవస్థ టీకాకు రెస్పాండ్ అవుతుంది. కాబట్టి టీటీఎస్ ఎదురవుతుంది. ఇది యువతలో సర్వసాధారణం. 

టీటీఎస్ లక్షణాలు

తీవ్రమైన తలనొప్పి. ఆ తలనొప్పి తరచూ రావడం. దృష్టి మసకబారడం. శ్వాస ఆడకపోవడం, ఛాతిలో నొప్పి. కాళ్లలో వాపు. తీవ్రమైన కడుపునొప్పి. వ్యాక్సిన్ తీసుకున్న భాగంలో చర్మం కింద గాయాలు కావడం. ఎర్రని మచ్చల్లాంటివి కనిపించడం... వంటివన్నీ టీటీఎస్ లక్షణాలు. టీకా వేసిన కొన్ని వారాల్లోపు ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడాలి.

ఏం చేయాలంటే..

ఆరోగ్యకరమైన జీవన విధానం అనుసరించాలి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్​ అదుపులో ఉంచుకోవాలి. వేళకు తినాలి. నిద్రపోవాలి. వ్యాయామం చేయాలి. వ్యాక్సిన్ వల్లే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అనుమానం వస్తే ఇలా చేయండి.

ప్లేట్​లెట్​ టెస్ట్ 

వ్యాక్సిన్ వల్ల వచ్చే క్లాట్స్​ను ప్లేట్​లెట్​ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. మనిషి రక్తంలోని ప్లేట్​లెట్ల సంఖ్య​ ఆధారంగా దీనిపై ఒక నిర్ధారణకు రావచ్చు. వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ప్లేట్​లెట్స్​ తగ్గితే ఆందోళన వస్తుంది. ప్లేట్​లెట్స్​ తగ్గి రక్తం గడ్డ కడుతుంటే అది వ్యాక్సిన్ వల్ల కలిగే ఎఫెక్ట్​ అని గుర్తించాలి.

జాగ్రత్తలు ఇలా...

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా కనిపిస్తే యాంటీ-పీఎఫ్4 ఎలిసా టెస్ట్ చేయాలి. దాని ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. కానీ అన్ని సందర్భాల్లో ఈ పరీక్ష అవసరం లేదు. ఒకవేళ టీటీఎస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే కార్డియాలజిస్ట్​ దగ్గరకి వెళ్లాలి. గుండెపోటు రాకుండా ట్రీట్​మెంట్ చేస్తారు. రక్తం గడ్డ కట్టడం వల్ల హార్ట్​ ఫెయిల్​ కాకుండా కాపాడతారు. టీటీఎస్ తీవ్రంగా మారితే కార్డియాలజిస్టులు, హెమటాలజిస్టులు, న్యూరాలజిస్టులు కలిసి ట్రీట్​మెంట్ చేస్తారు. బ్రిటన్​లో ఎంతోమంది టీటీఎస్ వల్ల మరణించారు. టీటీఎస్ రాకుండా అడ్డుకోలేం. టీకా వేయించుకున్న తర్వాత అతి కొద్ది మందిలో మాత్రమే ఈ లక్షణాలు కనిపించొచ్చు. కానీ లక్షణాలు కనిపించగానే డాక్టర్​ దగ్గరకు వెళ్లి సమస్యకు తగ్గ ట్రీట్​మెంట్​ చేయించుకోవాలి. 

భయపడొద్దు

కరోనా టైంలో ఈ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు సైడ్​ ఎఫెక్ట్స్​ రిస్క్​ మొదటి డోస్ అప్పుడు ఎక్కువ. రెండో డోస్ తీసుకున్నాక తగ్గిపోతుంది. మూడో డోస్​లో పూర్తిగా మాయమవుతుంది అన్నారు. ‘‘సైడ్ ఎఫెక్ట్స్ మొదటి రెండు, మూడు నెలల్లో కనిపిస్తాయి. ఏ వ్యాక్సిన్​కి​ అయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాలక్రమేణా తగ్గిపోతాయ’’ని ఐసీఎంఆర్ మాజీ సైంటిస్ట్ ఒకరు చెప్పారు. ‘‘పది లక్షలమందిలో ఏడు లేదా ఎనిమిది మందికి మాత్రమే ఇలా అవుతుంది. టీకా తీసుకుంటే రక్తం గడ్డకట్టడం అనేది కొత్త విషయం ఏం కాదు. దీని గురించి ఇంటర్నెట్​లో కూడా ఇన్ఫర్మేషన్​ ఉంది. ఈ సమస్యను ‘వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ టీటీఎస్‌‌’ (విఐటీటీఎస్) అంటారు. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ గురించి పూర్తి వివరాలు వ్యాక్సిన్​తోపాటు ఇచ్చే వివరాల్లో పేర్కొంది. అందులో రక్తం గడ్డకట్టడం గురించి కూడా ఉంద’’ని ఎక్స్​పర్ట్స్ కూడా చెప్తున్నారు. 

అందరికీ రావు

వ్యాక్సిన్ తీసుకున్నోళ్లందరికీ సమస్యలు వస్తాయనేది అపోహ. ప్రతి పది లక్షల మందిలో ముగ్గురు లేదా నలుగురికి ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అది కూడా వ్యాక్సిన్ డోస్ తీసుకున్న నాలుగు నుంచి నెలన్నర రోజుల్లో ఎప్పుడైనా సైడ్​ఎఫెక్ట్స్​ వస్తే ఈజీగా గుర్తించొచ్చు. రెండో డోసు తీసుకున్నాక సమస్యలు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా చాలా అరుదు. ఇప్పటికే రెండేండ్లు దాటింది. కాబట్టి రెండేండ్ల తర్వాత వ్యాక్సిన్ సైడ్​ ఎఫెక్ట్స్ అనేవి కనిపించవు. ఎలాంటి సమస్యలు రావు. 

ఒప్పుకుంది కదా మరి

మరి కోవిషీల్డ్​ వల్ల ప్రమాదకరమైన సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయని వాళ్లే ఒప్పుకున్నారు కదా! అంటే.. అవును. మెదడులో రక్తం గడ్డకట్టే ప్రమాదం మాత్రం కొందరిలో కనిపిస్తుంది. అది కూడా తొలి డోస్ తీసుకున్నాక వచ్చే ఛాన్స్ ఎక్కువ. రెండో డోస్​ తరువాత అంత ఎఫెక్ట్ చూపించదు. అలాంటిది రెండేండ్ల తర్వాత అలా జరగడం అసాధ్యం. అలాగే బ్రెయిన్ స్ట్రోక్​కి గురైన వాళ్లు వెంటనే చనిపోరు. ‘‘వ్యాక్సిన్లు కాకుండా.. కొవిడ్ ఇన్ఫెక్షన్ల వల్ల హార్ట్ఎటాక్స్ పెరిగే ఛాన్స్ ఉంది. కరోనా సోకినప్పుడు ట్రీట్‌‌మెంట్ కోసం వాడిన స్టెరాయిడ్స్ వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రీట్‌‌మెంట్ చేసిన ఏడాది తర్వాత ఇలా జరిగే ఛాన్స్ ఉంది’’ అంటున్నారు డాక్టర్లు. 

డోంట్ వర్రీ!

కొవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్.. పేరు ఏదైనా అవన్నీ కరోనాకు విరుగుడుగా పనిచేశాయి. వ్యాక్సిన్ తయారైందని తెలియగానే ప్రజల్లో ప్రాణాల మీద ఆశలు చిగురించాయి. అలాంటిది అప్పుడు మెడిసిన్​లా పనిచేసిన వ్యాక్సిన్​లే ఇప్పుడు మరణానికి దారితీస్తున్నాయా? అంటే.. దానికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. కోవిషీల్డ్ మీద కేసులు నమోదు కావడం, వాటిని తయారుచేసిన కంపెనీ ఆ ఆరోపణల్ని అంగీకరించడంతో భయం పెరిగింది జనాల్లో.

అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. వ్యాక్సిన్ ఏదైనా సరే దాన్ని తీసుకున్నప్పుడు చిన్న సైడ్ ఎఫెక్ట్స్​ రావడమనేది సహజం. వేరే వ్యాక్సిన్​లు తీసుకున్న వాళ్లకు కూడా సైడ్​ ఎఫెక్ట్స్ వచ్చాయి. కాకపోతే ఇప్పుడు ఒక వ్యాక్సిన్ మీద కేసులు రావడంతో అందరి దృష్టి దానిమీదకి మళ్లింది. అలాగే మిగతా వ్యాక్సిన్​లు తీసుకున్నవాళ్లలోనూ అనుమానాలు మొదలయ్యాయి. కానీ, వ్యాక్సిన్ తీసుకున్న నెల రోజుల్లోపే ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాంటిది వ్యాక్సిన్​ తీసుకుని రెండేండ్లు దాటాక ఇప్పుడు దాని గురించి భయపడాల్సిన అవసరంలేదు. ప్రజలు నిశ్చింతగా ఉండొచ్చు అంటున్నారు డాక్టర్లు.  
- మనీష పరిమి

కేసు నిర్ధారణ కాలేదు

వేణుగోపాలన్ గోవిందన్ అనే వ్యక్తి.. తన కూతురు కారుణ్య కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే ప్రాణాలు కోల్పోయిందని కేసు వేశాడు. కారుణ్య 2021 జులైలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంది. ఆ తర్వాతే ఆమె చనిపోయిందని వేణుగోపాలన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విషయంపైనే సీరమ్ ఇనిస్టిట్యూట్‌పై దావా వేశాడు. అయితే ఈ కేసు మీద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ మెడికల్ బోర్డు మాత్రం కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల కారుణ్య చనిపోలేదు అని నిర్ధారించారు.

తప్పు ఒప్పుకుంది!

‘‘ఏప్రిల్ 2021లో వ్యాక్సినేషన్ అయింది. ఆ వెంటనే మెదడులో రక్తం గడ్డకట్టడం, రక్తస్రావం జరిగింది. దాంతో మెదడుకు శాశ్వతం​గా గాయం ఏర్పడిందని జామీ స్కాట్ కోర్టుకు కంప్లైంట్ చేశాడు. అయితే ఇన్నాళ్లు ఆ ఆరోపణలను ఆస్ట్రాజెనికా పట్టించుకోలేదు. ఈ కేసులో తక్కువ ప్లేట్​లెట్ కౌంట్​ (థ్రోంబో సైటోపెనియా) ఉండడంతోపాటు రక్తం గడ్డకట్టడం(థ్రాంబోసిస్) (టీటీఎస్​) అనే అరుదైన వ్యాధి​ కారణంగా మెదడు, పొట్టతోపాటు శరీరంలోని వివిధ భాగాలు తీవ్రంగా ఎఫెక్ట్​ అయ్యాయని గుర్తించారు. ఆ పరిస్థితికి కారణం ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే అనేది జామీ స్కాట్​ ఆరోపణ. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రాజెనికా యూకే కోర్టుకు సమర్పించిన పత్రాల్లో ‘‘మా వ్యాక్సిన్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కొన్నిసార్లు రేర్ డిస్​ఇంపాక్ట్ చూపొచ్చు. టీకా చాలా అరుదైన సందర్భాల్లో థ్రోంబో సైటోపెనియా, థ్రాంబోసిస్ (టీటీఎస్)​కి కారణమవుతుంది. అంతేకాదు.. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లకు గుండెపోటు వచ్చే అవకాశముంది. మెదడు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. పది లక్షలమందిలో ఏడుగురికి సీరియస్​ అవుతుంద’’ని అంగీకరించింది. వ్యాక్సిన్​ తయారుచేసిన వాళ్లే ఇలా అంగీకరించడంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. మనదేశంలో కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎపెక్ట్స్‌ గురించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ‘‘కొవిషీల్డ్  సైడ్ ఎపెక్ట్స్‌ గురించి ఒక ఎక్స్​పర్ట్స్ టీమ్‌ ఏర్పాటు చేయాలి. ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చనిపోయిన, వైకల్యం బారిన పడిన వాళ్లకు నష్టపరిహారం అందేలా ఆదేశించాలి” అని కోరారు పిటిషనర్లు.

కంగారు వద్దే వద్దు

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అతి తక్కువ మందిలో టీటీఎస్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల.. ప్లేట్​లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది. దాంతో రక్తం గడ్డకట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక లక్ష మంది పేషెంట్లను తీసుకుంటే వాళ్లలో ఇద్దరికి మాత్రమే టీటీఎస్ ఉన్నట్టు తెలుస్తోంది. అది చాలా అరుదుగా వచ్చే సమస్య. నిజానికి వ్యాక్సిన్ రాకముందు కొవిడ్​ మరణాలే ఎక్కువ.

వ్యాక్సిన్ వల్ల వచ్చిన నష్టం కంటే కొవిడ్ కారణంగా జరిగిన నష్టమే ఎక్కువ. అరుదుగా వచ్చే ఈ రిస్క్​లకంటే అప్పట్లో మన ముందున్న పెద్ద సమస్య కొవిడ్​. ఆ వైరస్​తో ఫైట్ చేసి, ప్రజల్ని కాపాడేందుకే వ్యాక్సిన్​లు తీసుకొచ్చారు. పైగా అప్పుడున్న వ్యాక్సిన్​ల సంఖ్య కూడా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ మహమ్మారి సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు వ్యాక్సిన్​లు సరిపడా ఉండాలి. అవి అందరికీ అందాలనే ఉద్దేశంతో వేరు వేరు పేర్లతో వ్యాక్సిన్​లు తయారుచేశారు. వ్యాక్సిన్ లేకపోతే కొవిడ్ వల్ల జరిగే నష్టాన్ని ఎవరూ ఊహించలేరు. అప్పటికే డెల్టా వేరియంట్ వల్ల వయసు, ఫిట్​నెస్​తో సంబంధం లేకుండా చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. 

వేయించుకున్న వ్యాక్సిన్​ గురించి ఇప్పుడు కోర్టులో కేసులు, దానికి సంబంధించిన వార్తలు, వాటిమీద జరుగుతున్న చర్చలు చూసి ప్రజలు భయపడిపోతున్నారు. కానీ, అంతగా భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల టీటీఎస్​ బారిన పడే ఛాన్స్ ఉన్నప్పటికీ అది చాలా అరుదు. పైగా అలాంటి సైడ్​ ఎఫెక్ట్స్ ఏవైనా ఉంటే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నాలుగు నుంచి 42 రోజుల్లోగా ఆ లక్షణాలు బయటపడతాయి.

ఒకవేళ చనిపోయాక తెలుసుకోవాలంటే... బాడీలో ఎక్కడైనా రక్తం గడ్డకట్టిందా? ప్లేట్​లెట్ కౌంట్1‌‌.5 లక్షల కంటే తక్కువ ఉందా? పీఎఫ్​ – 4 (ప్లేట్​లెట్ ఫ్యాక్టర్ – 4) అనే యాంటీబాడీస్ పాజిటివ్​గా ఉన్నాయా? డీడైమర్ లెవల్స్ నార్మల్ వ్యాల్యూ కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఉన్నాయా? అనేది తేలాలి. అప్పుడు కొవిడ్ వ్యాక్సిన్ వల్లనే చనిపోయారని చెప్పొచ్చు. అలాగే ఈ కండిషన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్లే వస్తుందని చెప్పలేం. ఎడినో వైరస్ అనే వెక్టార్​ని ఆధారం చేసుకుని తయారుచేసిన ఏ వ్యాక్సిన్ తీసుకున్నా ఇలాంటి  సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వల్ల ఇలాంటి సిచ్యుయేషన్ కనిపించింది. 

అలాగే mRNA వ్యాక్సిన్స్​లో కూడా కనిపించాయి. కానీ, కోవిషీల్డ్​కి ఉన్నంత ఎక్కువగా కనపడలేదు. దానికితోడు దాన్ని సపోర్ట్ చేసే ఆధారాలు కూడా లేవు. దీనిపై కేసులు రావడంతో ఇప్పుడు హైలైట్ అవుతోంది.

వ్యాక్సిన్ ఏదైనా సైడ్​ ఎఫెక్ట్స్ కామన్

వ్యాక్సిన్ తీసుకుని దాదాపు రెండేండ్లు దాటింది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు కంగారుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోలియో, ఇన్​ఫ్లుయెంజా వంటివాటికి వ్యాక్సిన్​లు తీసుకుంటున్నారు. వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. పోలియో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల జీబిఎస్ సిండ్రోమ్ వస్తుంది. దాని వల్ల నరాలు ఎఫెక్ట్ అయ్యి నరాల బలహీనత వస్తుంది. కానీ అది చాలా అరుదు. అందుకని అసలు వ్యాక్సినే తీసుకోకపోతే ఆ వ్యాధి వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. నిజానికి పోలియో వ్యాక్సిన్ వల్ల ఎంతోమందికి మేలు జరిగింది. కాబట్టి ఎప్పుడో జరిగిన కేసుల్ని చూసి ఇప్పుడు భయపడక్కర్లేదు. ఏదైనా నష్టం జరిగితే దాని ప్రభావం రెండు నెలల్లోపే కనిపిస్తుంది. ఇప్పుడు దాని గురించి అనవసరంగా ఆందోళన చెందడం మానేయాలి.


ఇంతకుముందు హార్ట్​ ఎటాక్​ కేసులు వరుసగా వస్తుండడంతో అది కూడా వ్యాక్సిన్​ వల్లే అని వార్తలొచ్చాయి. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నెలలోపు హార్ట్ ఎటాక్ వస్తే దాన్ని లెక్కలోకి తీసుకోవాలి. అంతేకానీ... వ్యాక్సిన్ వేయించుకుని ఏడాది దాటాక ఎలాంటి చెడు ప్రభావం చూపించదు అనేది గుర్తుంచుకోవాలి. 

ఎక్కువ బెనిఫిట్స్

కరోనా వంటి ప్యాండెమిక్ వంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు దానికి వెంటనే మెడిసిన్ కనిపెట్టడం చాలా అవసరం. అలా కనిపెట్టే ప్రాసెస్​లో ఆ మెడిసిన్​ వల్ల బెనిఫిట్స్, రిస్క్​లు చూస్తారు. నూటికి 95 శాతం బెనిఫిట్స్ ఉండి, 5 శాతం రిస్క్​ ఉంది అని తెలిసినప్పుడు కచ్చితంగా మెజారిటీ వైపే మొగ్గుచూపిస్తారు. అంతమందికి లాభం కలుగుతుంది అన్నప్పుడు డ్రగ్ కనిపెట్టడం సరైనదే అనే డెసిషన్​ తీసుకుంటారు. అలానే కొవిడ్​ వైరస్​తో పోరాడేందుకు కోవిషీల్డ్​ని.. స్పైక్ ప్రొటీన్​కి వ్యతిరేకంగా తయారుచేశారు. చింపాంజీ నుంచి సేకరించిన అడినో వైరస్ వెక్టార్ ద్వారా స్పైక్​ ప్రొటీన్​కి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇండియాలో కొవాగ్జిన్, కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్​లను అప్రూవ్​ చేశారు. కోవిషీల్డ్​తో పోలిస్తే కొవాగ్జిన్​ వల్ల సైడ్​ ఎఫెక్ట్స్ తక్కువ ఉన్నాయి. 


కోవిషీల్డ్ మొదటి డోస్ ఇచ్చినప్పుడు జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటివి వచ్చాయి. ఇలా దాదాపు 60 శాతం మందికి ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. తర్వాత రెండో డోస్ ఇచ్చినప్పుడు 6 శాతం మందికి ఎఫెక్ట్ అయ్యుండొచ్చు. అయితే ఒక ఏడాది తర్వాత రక్తం గడ్డకట్టిన కేసులు వచ్చాయి. నార్త్​ ఇండియాలో పొత్తికడుపు నొప్పితో చాలామంది హాస్పిటల్లో చేరారు. అందుకు కారణం.. కడుపులో పేగులకు రక్తం సరఫరా చేసే ఆర్టరీస్​లో రక్తం గడ్డ కట్టడం.

దాంతో ఆ పేగు పాడవుతుంది. డయాబెటిస్, బీపీ, బ్లడ్ సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్లలో ఇలాంటి పరిస్థితులు కనిపించాయి. అలాగే రెండో డోస్ తీసుకున్న వాళ్లలోనూ ఇలాంటి కేసులు వచ్చాయి. వాళ్లకు కొయాగ్యులేషన్ ప్రొఫైల్​ సజెస్ట్ చేశారు. అంటే ఈ టెస్ట్​లో రక్తం కారడం, గడ్డకట్టే టైం ఎలా ఉంది? ప్లేట్ లెట్ కౌంట్​ ఎలా ఉంది? వంటివి చెక్ చేస్తారు. ఎవరిలో అయినా ఇలాంటి పరిస్థితి ఉందని అనుమానిస్తే అల్ట్రా సౌండ్ డాప్లర్ అని ఒక టెస్ట్ చేసేవాళ్లం. లంగ్స్, హార్ట్​కి కాళ్ల నుంచే రక్తం సరఫరా అవుతుంది. కాబట్టి కాళ్లలో రక్తం గడ్డకట్టిందా? అని ఈ టెస్ట్​లో చూస్తాం.


కొవిడ్ వచ్చినప్పుడు నాలుగు నుంచి 14 రోజులు అబ్జర్వేషన్​లో ఉంచారు. ఆ తర్వాత ఐదు రోజుల నుంచి 12 రోజుల్లో బయటకు రావచ్చు. కరోనా వైరస్​ సోకడం వల్ల వెంటిలేటర్ పై ఉండాల్సిన పరిస్థితి, స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడడం, యాంటీ వైరల్ డ్రగ్స్ వాడడం, డీడైమర్ లెవల్ 900–1100 స్టేజ్​ నుంచి రికవర్ అయిన వాళ్లలో మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటివి వచ్చాయి. అంతేకానీ, సాధారణంగా త్వరగా కోలుకున్న వాళ్లలో ఇలాంటి కేసులు లేవు. ఇప్పటికీ హాస్పిటల్స్​లో వేరే ఏదైనా ట్రీట్​మెంట్ చేయాలన్నా కొవిడ్ వచ్చిందా? ఎన్ని రోజులకు తగ్గింది? ఏం ట్రీట్​మెంట్ తీసుకున్నారు? వంటివి తెలుసుకున్నాకే చేస్తున్నారు. 

ఆరోగ్యవంతులతో పోలిస్తే అప్పటికే హెల్త్ ప్రాబ్లమ్స్​ ఉన్నవాళ్లకు ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డ్రగ్స్​కి అడిక్ట్ అయిన యువత ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. బీపీ, డయాబెటిస్, స్ట్రోక్ వంటివి ఉంటే వాళ్లు ఒకసారి కొయాగ్యులేషన్, డీడైమర్ టెస్ట్​లు చేయించుకోవాలి. అప్పుడు వాళ్ల శరీరంలో రక్తం గడ్డకట్టడానికి ఛాన్స్ ఉందా? లేదా? అనేది తెలుస్తుంది. ఈ టెస్ట్​లు ప్రతి హాస్పిటల్, డయాగ్నస్టిక్ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి. 

ఈ రెండు టెస్టులు ముఖ్యం

టీటీఎస్ అనేది చాలా రేర్ డిజార్డర్. జనరల్​గా గాయం అయ్యి బ్లడ్ వస్తుంటే.. ఫస్ట్​ ప్లేట్​లెట్స్ అనేవి చిన్న మెష్​​లా ఏర్పడి రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తాయి. దాంతో బ్లీడింగ్ ఆగిపోతుంది. అలాంటిది రక్తనాళాల్లో ప్లేట్​లెట్స్ అన్నీ కలిసిపోయి మెష్​లా మారుతుంది. ఫ్లూయిడ్ స్టేట్​లో ఉండాల్సిన రక్తం గడ్డ కట్టుకుపోతుంది. ఇలా ఎక్కువగా ఆడవాళ్లలో గమనిస్తుంటాం. ఇలాంటప్పుడు టీటీఎస్ ఉందా? లేదా?  తెలుసుకోవాలంటే సీబీసీ(కంప్లీట్​ బ్లడ్​ కౌంట్​) టెస్ట్ చేయించుకోవాలి. ఇందులో ప్లేట్​ లెట్ కౌంట్ తెలుస్తుంది. కొయాగ్యులేషన్ ప్రొఫైల్​లో బ్లీడింగ్ టైం తెలుస్తుంది. ఇవి తెలిస్తే  ప్లాస్మా ఎక్స్ఛేంజ్ అనే ట్రీట్​మెంట్ కూడా ఉంది. 

శరీరంలో కొన్ని అవయవాలకి రక్త సరఫరా రెండు మార్గాలుగా జరుగుతుంటుంది. మరికొన్నింటికి ఒకటే మార్గం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో రక్తం గడ్డ కడితే ఆ అవయవం పనిచేయదు. దాంతో భరించలేని నొప్పి పుడుతుంది. దాంతో షాక్​లోకి వెళ్లి చనిపోతారు. ఇప్పటికీ ఇంకా ఎవరికైనా వ్యాక్సిన్ తీసుకున్నందుకు హెల్త్ ఎలా ఉందో? ఏంటో? అనే అనుమానాలు ఉంటే డాక్టర్​ని అడిగి సీబీటీ, కొయాగ్యులేషన్ టెస్ట్​లు చేయించుకోవచ్చు. వాటిలో బ్లడ్​ పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది. పరిస్థితిని బట్టి అవసరమైన ట్రీట్​మెంట్ చేయించుకోవచ్చు. కంగారు పడాల్సిన అవసరం లేదు.

డా. రాజేంద్ర పినగాని
జనరల్ ఫిజీషియన్
అమేధ హాస్పిటల్స్ హైదరాబాద్

దేనికైనా సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయి!

వ్యాక్సిన్ తీసుకున్న పది లక్షలమందిలో ఒకరికో, ఇద్దరికో సమస్య వస్తుంది. ఇప్పుడు అందరూ మాట్లాడుకునే వ్యాక్సినే కాదు ఏ వ్యాక్సిన్ తీసుకున్నా సైడ్​ ఎఫెక్ట్​ ఉంటుంది. రేబిస్, ఇన్​ఫ్లుయెంజా వంటి వ్యాక్సిన్​లు తీసుకున్నప్పుడు .0001 శాతం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మెడిసిన్ తయారుచేయకుండా ఉండరు కదా! ఎందుకంటే అప్పుడున్న అత్యవసర పరిస్థితిని బట్టి మెడిసిన్ వెంటనే అందుబాటులోకి రావాలనే ఆలోచనే ఉంటుంది. ఎప్పుడైనా వ్యాక్సిన్ రిలీజ్ చేసేటప్పుడు ఎమర్జెన్సీ ఆథరైజేషన్ అనేది ఉంటుంది. కొవిడ్ లాంటివి అకస్మాత్తుగా వచ్చినప్పుడు చాలా తక్కువ టైం ఉంటుంది. వేరే ఆప్షన్ ఉండదు. ప్రాణాలను కాపాడాలంటే వ్యాక్సిన్ తయారుచేయాల్సిందే. దాంతో ఎమర్జెన్సీ ఆథరైజేషన్​కి డబ్ల్యూహెచ్ఒ(ప్రపంచ ఆరోగ్య సంస్థ) పర్మిషన్ ఇస్తుంది. అలానే కొవిడ్​ వ్యాక్సిన్ తయారీ మొదలైంది. 

అంతేకాకుండా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఏ వ్యాక్సిన్ రిలీజ్ చేసేటప్పుడు అయినా దాని వల్ల జరిగే లాభనష్టాలను కూడా డాక్యుమెంట్​లో స్పష్టంగా రాస్తారు. అలానే కోవిషీల్డ్​ వ్యాక్సిన్​ విషయంలో కూడా ‘టీటీఎస్ అనేది చాలా రేర్’ అని రాశారు. కొవిడ్​ వ్యాక్సిన్స్ మాత్రమే కాదు.. ఉదాహరణకు జ్వరానికి వేసుకునే డ్రగ్స్ వల్ల కూడా సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయి. వాటిని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల లివర్​ ఎఫెక్ట్ అవుతుందని రాస్తారు. కానీ అలాంటివి ఎవరూ పట్టించుకోలేదు. కొవిడ్​ వైరస్​ కోసం వచ్చిన ఈ వ్యాక్సిన్​ని మాత్రమే హైలైట్ చేసి నిన్నమొన్నటి వరకు వైరస్​ భయంతో ఉన్న ప్రజల్ని ఇంకా భయపెట్టడం సరికాదు.

మొదట్లోనే తెలుస్తాయి

కోవిషీల్డ్ వల్లే హార్ట్ ఎటాక్​, బ్రెయిన్​ స్ట్రోక్​ వస్తున్నాయని అంటున్నారు. కానీ, ఏ సైడ్ ఎఫెక్ట్​ అయినా మొదటి డోస్ తీసుకున్న నెల నుంచి మూడు నెలల్లోపే వస్తుంది. అది కూడా వ్యాక్సిన్ వల్ల రావడం చాలా రేర్. ఒకవేళ సైడ్​ ఎఫెక్ట్స్ వస్తే వాటిలో టీటీఎస్​ సిండ్రోమ్ చాలా డేంజర్. దీని బారిన పడి విపరీతమైన తలనొప్పి, కడుపునొప్పి, శ్వాసలో ఇబ్బంది, మూర్ఛ వంటివి వస్తే వెంటనే డాక్టర్​ దగ్గరకి వెళ్లాలి. ఇప్పటికే చాలామంది రెండు, మూడు డోస్​లు తీసుకున్నారు. దాదాపు అందరూ సేఫ్​గానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ‘ఏమో అయిపోతుంద’ని భయపడాల్సిన అవసరం లేదు. 

వ్యాక్సిన్ మరణాలతో పోలిస్తే కొవిడ్ మరణాలు చాలా ఎక్కువ. అందుకని ఫైనల్​గా చెప్పేదేంటంటే.. ఇప్పుడు వ్యాక్సిన్​ గురించి వస్తున్న వార్తలను చూసి ఎవరూ భయపడొద్దు. కొవిడ్ వ్యాక్సిన్​లు తీసుకుని రెండుమూడేండ్లు అయింది. అందుకని అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. కొత్త లక్షణాలు  ఏమైనా కనిపిస్తే వెంటనే చెక్ చేయించుకోవాలి. ప్రతి ఏటా హెల్త్ చెకప్​ చేయించుకోవాలి. అలా చేయించుకుంటేనే ఎప్పుడు? ఏమైనా? తేడా ఉంటే వెంటనే తెలుసుకోవచ్చు. సరైన టైంకి ట్రీట్​మెంట్ చేయగలం.

డా. సందీప్ రెడ్డి కొప్పుల
ఇంటర్నల్ మెడిసిన్ 
హెచ్​ఓడీ 
ఏరేట్ హాస్పిటల్స్ హైదరాబాద్​