కవర్ స్టోరీ : కిన్నెరసాని హొయలు

ప్రకృతి రమణీయత, హొయలొలుకుతూ సాగే కిన్నెరసాని ప్రవాహం, అబ్బురపరిచే వన్యప్రాణుల సందడికి కేరాఫ్​ కిన్నెరసాని ప్రాజెక్ట్​. అందుకే సెలవు దొరికితే చాలు.. సేద తీరడానికి వలస వచ్చే పక్షుల్లా ఈ ప్రాజెక్ట్‌‌కు వస్తారు చుట్టుపక్కల జనాలు. 

కిన్నెరసాని... ఉమ్మడి వరంగల్​ జిల్లా సరిహద్దు అడవుల నుంచి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని అడవుల గుండా పాల్వంచ మండలంలో పచ్చని ప్రకృతి మధ్య సేద తీరింది. కిన్నెరసాని హొయలను వర్ణిస్తూ ‘కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి...’ అనే పాట తెలుగు రాష్ట్రాల ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచింది. కిన్నెరసాని ప్రాజెక్ట్  భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నుంచి దాదాపు 24 కిలోమీటర్లు ఉంటుంది. పాల్వంచ పట్టణం నుంచి దాదాపు12 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

పచ్చందాల కిన్నెరసాని 

పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్​ స్టేషన్​(కేటీపీఎస్​) ప్రాజెక్ట్​ నీటి అవసరాల కోసం కిన్నెరసాని ప్రాజెక్ట్​ను1972లో కట్టారు. కిన్నెరసానిలోకి 516 స్క్వేర్​ మైల్స్​ నుంచి వర్షపు నీరు  వస్తుంది. ప్రాజెక్ట్‌‌లో 10స్క్వేర్​ మైల్స్​లో నీటి నిల్వ ఉంటుంది. ప్రాజెక్ట్​  ఎత్తు దాదాపు 415 అడుగులు కాగా లోపల 407 అడుగుల్లో 1.45టీఎంసీ నీరు నిల్వ ఉంటుంది. వానాకాలంలో 12 గేట్ల  నుంచి వరద నీటిని వదిలినప్పుడు ఆ దృశ్యాన్ని చూసేందుకు టూరిస్ట్​లు పెద్ద ఎత్తున వస్తారు. గేట్లు వదిలిన టైంలో కిన్నెరసాని గోదావరిలో కలిసేందుకు పరవళ్లు తొక్కుతూ.. పరుగులు పెట్టే తీరు చూసి తీరాల్సిందే. ఈ ప్రాజెక్ట్​లో మొసళ్లు ఎక్కువగా కనిపిస్తాయి. 

ప్రాజెక్ట్​కు అనుబంధంగా టూరిజం డెవలప్​ చేశారు. అద్దాల మేడతో పాటు, దట్టమైన చెట్ల మధ్య, కిన్నెరసాని ప్రాజెక్ట్​ ఒడ్డుపై కాటేజీలు కట్టారు. అయితే మూడు దశాబ్దాల కిందట మావోయిస్టులు అద్దాల మేడను పేల్చేశారు. ప్రాజెక్ట్​ దగ్గరకి వెళ్లే దారిలో మొదటగా ‘దుప్పుల పార్క్​’ టూరిస్ట్​లకు వెల్​కం చెప్తుంది. ఈ పార్క్​లో దాదాపు119 దుప్పులు ఉన్నాయి. వీటితో పాటు కొండ గొర్రెలు, మూషిక జింకలు, చుక్కల దుప్పులు, నల్ల, తెల్ల దుప్పులు టూరిస్ట్​లను  ఆకట్టుకుంటాయి. దుప్పుల పార్క్​కు ఎదురుగా ఉన్న నీటి కొలనులో నల్ల, తెల్ల బాతులను పోలిన హంసలు తిరుగుతుంటాయి. రకరకాల అడవి జంతువుల శిల్పాలు, జంతువుల కొమ్ములు, వాటి ఈకలతో ఏర్పాటు చేసిన చిన్న మ్యూజియం ఆకట్టుకుంటుంది. 

ఆద్యంతం అద్భుతంగా... 

కిన్నెరసాని ప్రాజెక్ట్​ నడి బొడ్డున ఉన్న ప్రాంతాన్ని చూస్తుంటే ఎంతసేపైనా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే చుట్టూ నీళ్లు ఉండి మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడింది ఆ ప్రాంతం. కొన్ని కాటేజీలను దట్టమైన చెట్ల మధ్య కట్టారు. ఈ మధ్య బోటు మీద ఆ ప్రాంతానికి వెళ్లి పిక్నిక్​ పార్టీలు కూడా చేసుకుంటున్నారు. కిన్నెరసాని ప్రాజెక్ట్​లో బోటు షికారు  బాగుంటుంది. ఈ ప్రాజెక్ట్‌‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇదివరకు కొన్ని సినిమా షూటింగ్​లు జరిగాయి. 


- పోతు రాజేందర్‌‌, భద్రాద్రి కొత్తగూడెం