కవర్ స్టోరీ : మగవాళ్లకి మాత్రమే!

‘ఇవ్వాళ ఉదయాన్నే విపరీతమైన తలనొప్పి మొదలైంది. కాస్త టీ పెట్టిచ్చి ఇచ్చారంటే... మిగతా పనంతా ఎలాగోలా ఓపిక చేసుకుని చేసేస్తా..’ అని తల్లి అడిగితే... ‘నీళ్లు ఎన్ని పెట్టాలో? టీపొడి, చక్కెర, పాలు ఎన్ని పోయాలో? నాకు తెలియదు. అయినా ఇలాంటి పనులన్నీ మీ ఆడవాళ్లే చేయాలి. మగవాడ్ని నా వల్ల ఈ వంట పని ఏం అవుతుంది?’ అని తండ్రి చెప్పిన సమాధానం.

దాంతో ఏం చేయాలో తోచక స్కూల్​కి రెడీ అవుతున్న ఎనిమిదేళ్ల కూతురిని ‘కొంచెం టీ పెట్టిస్తావా తల్లీ. తలనొప్పిగా ఉంది’ అని అడిగింది ఆ తల్లి.
 ఆ పాప ‘సరేనమ్మా’ అంటూ టీ పెట్టేందుకు వంటగదిలోకి వెళ్లింది. ఇదంతా అక్కడే ఉన్న ఆరున్నరేళ్ల కొడుకు బుర్రలో బలంగా నాటుకుపోయింది.

‘నాకు ఆఫీస్​లో క్లయింట్​ మీటింగ్​ ఉంది. త్వరగా వెళ్లిపోవాలి. ఆయమ్మ వచ్చే వరకు బేబీ కేర్​ చెయ్యి’ అంది భర్తతో పద్మ.బేబీని టేక్​ కేర్​ చేయాలా?! డయపర్​ మార్చడం. ఫుడ్​ ఫీడింగ్​ చేయడం నాకేం వస్తుంది? పక్కింటి వాళ్లనో, నీ ఫ్రెండ్స్​నో హెల్ప్​ అడగొచ్చు కదా ఆయమ్మ వచ్చే వరకు. అయినా ఇంటిపని, పిల్లల పని ఆడవాళ్లు చూసుకోవాలి. నాకు చెప్తున్నావేంటి?’ అని భర్త చంద్ర సమాధానం.

ఈ రెండు సంఘటనలు చదివిన తరువాత... ఎంతో డెవలప్​ అవుతున్నాం. ఆడవాళ్లు బయటకెళ్లి ఎన్నో రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు. అయినా కూడా ఆడ పని, మగ పని అనే తేడా ఇంకా పోవడంలేదు ఎందుకు అనిపిస్తుంది కదా! అవును ఇంటి పని, పిల్లల సంరక్షణ వంటి విషయాల్లో ఈ తేడా అనేది తరతరాలుగా వేళ్లూనుకుపోయింది. అలాగని అందరు మగవాళ్లు ఒకేలా ఉన్నారని చెప్పడం లేదు.

ఇంటి పనిని పంచుకునే మగవాళ్లు కూడా ఉన్నారు. కాకపోతే ఆ సంఖ్య అంకెల్లో చెప్పలేనంత తక్కువ. ఇంటి పని, కుటుంబం, పిల్లల సంరక్షణకు సంబంధించిన విషయాల్లో ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఒకేలా ఉంది. మరి ఆ పరిస్థితిలో మార్పు రావాలంటే... ముఖ్యంగా మగ పిల్లలకు చిన్నప్పట్నించే ఇంటి, బేబీ కేర్​ వంటి పనులు చేయడానికి ఆడ, మగ అనే వ్యత్యాసం ఉండదని అర్థం చేయించాలి. పనుల్లో వాళ్లని భాగస్వాములుగా చేయాలి. అది ఇంటి నుంచి మొదలై స్కూల్స్​లో ఒక సబ్జెక్ట్​ అవ్వాలి. అప్పుడు కానీ అందరూ కోరుకుంటున్న మార్పు సాధ్యం కాదనిపిస్తుంది! 

బహుశా ఈ విషయాన్ని గమనించే కాబోలు మగవాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక కోర్సు తయారుచేశారు. అందులో భాగంగా మగవాళ్లకు డయపర్​ ఎలా మార్చాలి? పోనీటెయిల్​ ఎలా వెయ్యాలి అనే పనులతో పాటు గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, ఐరన్​ చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వంటి పనులన్నీ నేర్పిస్తున్నారు. ‘ఈ పనుల కోసం ఒక కోర్స్​ అవసరమా’ అని నవ్వుకుంటున్నారా? అయితే మీలాంటి వాళ్లు అమెరికాలోని కొలంబియా రాజధాని బొగోటాలో ఉన్న ‘సనిటాస్​ యూనివర్సిటీ ఆఫ్​ ఫౌండేషన్’​ గురించి తెలుసుకోవాలి. ప్రత్యేకంగా వాళ్లు తయారుచేసిన ఆ కోర్సు గురించి మరిన్ని వివరాలకోసం ఈ స్టోరీ చదవండి.

కేర్​ స్కూల్  

సనిటాస్​ యూనివర్సిటీ ఫౌండేషన్​లో మగవాళ్ల కోసం ‘కేర్​ స్కూల్ ఫర్​ మెన్స్​’​ మొదలుపెట్టారు. అక్కడ డయపర్​ వేయడం, డయపర్​ మార్చడం, పోనీటెయిల్​ వేయడం ఎలానో ప్రాక్టికల్​గా నేర్పిస్తున్నారు. ఆ క్లాసులు 30 ఏండ్ల ఫెలిపె కంత్రెరస్​ పర్యవేక్షణలో జరుగుతున్నాయి​. క్లాస్​కి వెళ్లిన మగవాళ్లకు ఒక బేబీ బొమ్మ (మానెకిన్)ని ఇస్తారు. ఎవరు తీసుకున్న బొమ్మకు వాళ్లు తమకు నచ్చిన పేరు పెడతారు.

ఆ తరువాత బేబీ​కి డయపర్​ మార్చడం ఎలా అనే ట్రైనింగ్​ మొదలవుతుంది. డయపర్​ తీసేశాక  ర్యాష్​ రాకుండా ఆయింట్​మెంట్ రాయడం ప్రాక్టికల్​గా నేర్పిస్తారు. ఆ పని కూడా అయ్యాక బేబీని ఉయ్యాలలో ఎలా పడుకోపెట్టాలో నేర్పిస్తారు. బేబీని పడుకోపెట్టేటప్పుడు సున్నితంగా ఎలా హ్యాండిల్​ చేయాలో చూపిస్తారు. వీటన్నింటితోపాటు ఇంటి పనుల్లో ఎలా సాయపడాలి? వంటి విషయాలను దశల వారీగా నేర్పిస్తారు ఇక్కడ. 


మామూలుగా అయితే సనిటాస్​ యూనివర్సిటీ ఫౌండేషన్​లో ఇలాంటి క్లాసులు మెడికల్​ స్టూడెంట్స్​కి చెప్తుంటారు. కానీ ఈ మధ్య తండ్రులు ఎక్కువ సంఖ్యలో ఈ కోర్సుకి ఎన్​రోల్​ చేసుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్​ను కొలంబియాలో మొట్టమొదట స్టార్ట్​ చేశారు. అయితే ఇలాంటి కోర్సును ఏదో సరదాగా రూపొందించలేదు. జెండర్​ ఈక్వాలిటీ విషయంలో కొన్ని సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికలు ఈ కోర్సు ఏర్పాటుకు ఆధారం అయ్యాయి.

జీతంలేని పని  

‘‘ప్రపంచవ్యాప్తంగా ఆడవాళ్లు చేస్తున్న కేర్​గివింగ్​ అనేది 3/4వ వంతు జీతం లేని పని’’ అని ఇంటర్నేషనల్ లేబర్​ ఆర్గనైజేషన్​ ఒక నివేదిక ఇచ్చింది. ‘‘అదే బొగోటా సిటీలో చూస్తే రోజులో దాదాపు ఐదున్నర గంటల సమయాన్ని జీతం లేని ఇంటి పని కోసం ఖర్చు చేస్తున్నారు ఆడవాళ్లు. ఈ టైం మగవాళ్లు చేసే అదే పనితో పోలిస్తే రెండింతలు ఎక్కువ’’ అని కొలంబియా నేషనల్​ స్టాటిస్టిక్స్​ ఏజెన్సీ 2017లో చేసిన ఒక స్టడీలో వెల్లడైంది. ఇంటి పని విషయంలో ఇలాంటి అసమానతల వల్ల ఆడవాళ్లు చేసే ఉద్యోగం, చదువు, సెల్ఫ్​కేర్​ కోసం కేటాయించుకునే టైం తగ్గిపోతోంది. అంతేకాదు ఆడవాళ్లలో ఎక్కువమంది పేదవాళ్లుగా ఉండటానికి ఇది కారణంగా ఉంటోందని ‘జర్నల్​ ఆఫ్​ గ్లోబల్​ హెల్త్​’లో ఒక స్టడీ పబ్లిష్​ అయింది.

ఉద్యోగాలు చేసే వాళ్లు పెరిగినా...

ఉద్యోగాలు చేసే ఆడవాళ్ల సంఖ్య బాగా పెరిగింది. డబ్బు కూడా సంపాదిస్తున్నారు. అయినప్పటికీ ‘డొమెస్టిక్​ జెండర్​ గ్యాప్​’లో మాత్రం ఎటువంటి మార్పు లేకపోగా రానురాను అది బాగా పెరిగిపోతోంది అంటున్నారు ఎక్స్​పర్ట్స్​. ‘‘ఇందుకు కారణం సమాజంలో లోతుగా నాటుకుపోయిన ఆడ, మగ పనులంటూ చేసిన డివిజన్​. ఒక్కమాటలో చెప్పాలంటే సంస్కృతి, సంప్రదాయల మాటున పని విషయంలో ఉన్న ఒకలాంటి డిక్టేటర్​షిప్​ అనేది ఇందుకు కారణం. అందులో భాగంగానే ఆడవాళ్లు ఇంటి పని, పిల్లల, కుటుంబ సభ్యుల సంరక్షణ చేయాలి. మగవాళ్లు ఉద్యోగాలు చేసి సంపాదించాలి అనే ఆలోచనలు” అని కేర్​ స్కూల్​ ఫర్​ మెన్స్​కి​ స్ట్రాటెజీ లీడర్​గా ఉన్న హ్వాన్​ డేవిడ్​ కొర్తెస్​ అన్నాడు. ట్రెడిషనల్​ అలవాట్లలో భాగంగా ఇంటి పనుల్లో ఉన్న ఇలాంటి వ్యత్యాసాల్లో మార్పు తెచ్చేందుకు కేర్​ స్కూల్​ పనిచేస్తోంది.

ఈ ప్రోగ్రామ్​ ఎలా పుట్టిందంటే...

ఇలాంటి ఒక స్కూల్​ పెట్టాలనే ఆలోచన రావడం వెనక ఒక స్టోరీ ఉందన్నాడు కొర్తెస్. ‘‘కొవిడ్–‌‌‌‌19 ప్యాండెమిక్​ టైంలో కుటుంబంలో అందరి బాగోగుల్ని ఆ ఇంటి మహిళ ఒక్కతే చూసుకోవాల్సి వచ్చింది. ఆరోగ్యం బాగా లేకపోయినా, కుటుంబ సభ్యులెవరైనా చనిపోయినా, భర్త మరణిస్తే అతని బాధ్యతలను కూడా ఆమే చేపట్టింది. మగవాళ్లకు అలాంటి పరిస్థితులు ఎదురైతే బొగోటా సిటీ ‘మెన్​ హాట్​లైన్’​కి ఫోన్​ చేసి, వాళ్లకు కావాల్సిన సపోర్టు తీసుకునేవాళ్లు.

మగవాళ్లు తమ జీవిత భాగస్వామిని కోల్పోయిన బాధతో ఫోన్​ చేసి మానసిక ఒత్తిడిని తగ్గించుకునే వాళ్లు. దాంతో పాటు పిల్లల్ని చూసుకునే విషయంలో ఎంత విసిగిపోతున్నారో చెప్పేవాళ్లు. ఇంటి పనులు, పిల్లల పనులు చూసుకోవడం అంత విసుగ్గా అనిపించడానికి ప్రధాన కారణం వాళ్లు బాల్యంలో కేర్​గివింగ్​ స్కిల్స్​ నేర్చుకోకపోవడం వల్లనే. కనీసం ఎదుగుతున్న దశలో కూడా ఎప్పుడూ ఇంటి పనులు చేయకుండా ఉండడమే. హాట్​లైన్​కు కాల్​ చేసిన వాళ్లు ‘ఏం చేయాలో తెలియడం లేద’ని కంప్లయింట్​ చేసేవాళ్లు. అవన్నీ చూశాక మగవాళ్లకి బేసిక్​ కేర్​గివింగ్, ఇంటి పనులు నేర్పిస్తే కాన్ఫిడెన్స్​గా ఉంటారు అనిపించింది. అలా కేర్​ స్కూల్​ను​ 2021లో మొదలుపెట్టాం” అని చెప్పాడు కొర్తెస్​.

ఒక్కరోజుతో మొదలై...

కేర్​ స్కూల్​లో ఒక్కరోజు ఫ్రీ వర్క్​షాప్స్​లో డయపర్లు ఎలా మార్చాలి? జుట్టు పోనీటెయిల్​ ఎలా వేయాలి? అనే విషయాలను బొమ్మలు, మానెక్విన్స్​ మీద చెప్తారు. అదే ఆరు నుంచి ఎనిమిది వారాల ప్రోగ్రామ్​లో చేరితే బాత్​రూమ్​ క్లీనింగ్, బట్టలు ఐరన్​ చేయడం, గిన్నెలు తోమడం వంటివి నేర్పిస్తారు. ఈ పనులతో పాటు తరతరాలుగా సంప్రదాయం పేరిట ఇంటి పనుల్లో  చూపుతున్న వివక్ష గురించి కూడా అర్థమయ్యేలా చెప్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ మొత్తంమీద నిజమైన ‘మగవాడు’ ఎలా ఉండాలనేది బుర్రల్లోకి ఎక్కిస్తారు!

డయపర్​ ట్యుటోరియల్​ అందరికీ

ఇలాంటి ప్రోగ్రామ్స్​లో మగవాళ్లు అనుసరించాల్సిన గ్లోబల్​ ట్రెండ్ గురించి చెప్తుంటారు. నాలుగు దశాబ్దాలకు పైగా యునైటెడ్​ స్టేట్స్​లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు తండ్రి కాబోతున్న మగవాళ్లకు సపోర్ట్​ ట్రైనింగ్​ వంటివి ఇస్తున్నాయి. అదే మోడల్​ను మిగతా దేశాలకు కూడా విస్తరింపజేశాయి. ఆ పనిలో భాగంగా రీసెర్చి ఇనిస్టిట్యూట్ ‘ఎక్వైమండో’ జెండర్​ ఈక్వాలిటీ గురించి ఒక రివ్యూ చేసింది.

12 దేశాల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్​ ఎనిమిది వరకు చేసింది. ఆ ప్రోగ్రామ్స్​ ఎంతో ఎఫెక్టివ్​గా ఉండి పిల్లల సంరక్షణ విషయంలో మగవాళ్ల ఆలోచనాధోరణిని, ప్రవర్తనను మార్చాయని తేలింది. ఆ నివేదికలు కూడా ఈ కేర్​ స్కూల్​ ఏర్పాటులో కొంత పనిచేశాయి. అలా అన్ని వయసుల తండ్రులకు సరిపడే ‘కేర్​ గివర్స్’ ప్రోగ్రామ్​ తయారైంది. బొగోటా సిటీలో ఈ ప్రోగ్రామ్​ కోసం ఖర్చయిన మొత్తం కూడా ఏమంత ఎక్కువ కాదు. దాదాపుగా అర మిలియన్​ డాలర్స్​ ఖర్చయ్యాయి.

నెమ్మదిగా పుంజుకుంది

మొదట్లో ఈ ప్రోగ్రామ్​లో చేరే వాళ్ల సంఖ్య చాలా తక్కువ. కానీ 2022 తరువాత నుంచి ఎన్​రోల్​మెంట్​లో వేగం పుంజుకుంది. అప్పటినుంచి 7,300కి పైగా మగవాళ్లు ఈ క్లాసులకు ఫిజికల్​గా హాజరయ్యారు. మిగతా 50 వేల మంది మగవాళ్లు ఆన్​లైన్​​ కోర్సు పూర్తి చేసుకున్నారు. ఇక కేర్​గివింగ్​ మీద చేసిన వీడియో సిరీస్​ను బొగోటా సిటీలో ఒక లక్షా అరవై వేల మందికి పైగా చూశారు.

ప్రైవేట్​ ఇనిస్టిట్యూట్స్​ కొన్ని ఈ క్లాసులను యూనిర్సిటీలు, ఆఫీసులు, కమ్యూనిటీ సెంటర్స్​తో పాటు జైళ్ల వరకు తీసుకెళ్లాయి. మొత్తం మీద మంచి మెసేజ్​ బయటకు వెళ్తోంది. భిన్నమైన ధోరణితో వెళ్తున్న ఈ కేర్​ స్కూల్​ వర్క్​షాప్స్​లో ‘ఎడ్యుకేషన్​, ఫన్’​ రెండూ ఉంటాయి. సనిటాస్​ యూనివర్సిటీ​లో సెప్టెంబర్​లో జరిగిన ఒక వర్క్​షాప్​కి వచ్చిన స్టూడెంట్స్​తో పాటు టీచర్లతో సహా అందరూ యువకులే​ ఉన్నారు. ఆ వర్క్​షాప్​లో పాల్గొన్న వాళ్లకు యాప్రాన్​, క్లీనింగ్​ సప్లయ్​స్​, రీ యూజబుల్​ గ్రాసరీ బ్యాగ్స్​ వంటివి రివార్డు ప్రైజ్​లుగా ఇచ్చారు.

అలా రివార్డులు ఇచ్చి మరిన్ని పనులు చేసేలా ఎంకరేజ్​ చేశారు. ఈ వర్క్​షాప్​లో పాల్గొన్న తండ్రుల్లో ఒకరెవరైనా తప్పులు చేస్తుంటే తోటివాళ్లు ఒకరినొకరు సరిదిద్దుకున్నారు. ఇక టీచర్లు అయితే జోక్స్​ వేస్తూ స్టూడెంట్స్​ని ప్రోత్సహించారు. ప్రోగ్రామ్​కి హాజరయిన ఒకతను బేబీ బొమ్మను చేతి మణికట్టు దగ్గర పట్టుకుని పైకి లేపుతుంటే... ‘‘బీ కేర్​ఫుల్​ అలా లేపితే చేతులు ఊడి వచ్చేస్తాయి” అంటూ జోక్​గా అంటున్నట్టే బేబీని ఎలా క్యారీ చేయాలో నేర్పించాడు ఇన్​స్ట్రక్టర్​ కొర్తెస్.

రిలేషన్​షిప్​ మెరుగుపడుతుంది

ఈ ప్రోగ్రామ్​కి రాక ముందువరకు ఇంటి పనులు, పిల్లలు, కుటుంబ సభ్యుల సంరక్షణ ఆడవాళ్లకు మాత్రమే సంబంధించినవి అనుకునే మగవాళ్లు క్లాస్​లు అటెండ్​ అయ్యాక వాళ్ల ఆలోచనాధోరణి మార్చుకున్నారు. నిజానికి డయపర్​ మార్చడం రాని వాళ్లు బోల్డెంత మంది ఉన్నారు. ఈ ప్రోగ్రామ్​లో చేరడం, పనులు చేసుకోవడం వల్ల కుటుంబానికే కాదు మగవాళ్లకి కూడా ఒక రకంగా లాభమే అంటున్నారు నిర్వాహకులు. దీనివల్ల జెండర్​ గ్యాప్స్​ తగ్గడమే కాకుండా భాగస్వామితో రిలేషన్​షిప్​ కూడా మెరుగుపడుతుంది!  అందుకు ఉదాహరణ ఫెర్లీ సేంజ్​.

బొగోటాస్​ ట్రాన్స్​పోర్టేషన్​ సిస్టమ్​ను కో–ఆర్డినేట్​ చేస్తాడు 40 ఏండ్ల ఫెర్లీ సేంజ్​​. స్ట్రెస్​ మేనేజ్​మెంట్ స్కిల్స్​ మెరుగుపరుకోవాలి అని ఆరు వారాల ప్రోగ్రామ్​లో చేరాడు ఫెర్లీ. అతను చేరేటప్పటికి ఆ బ్యాచ్​లో 21 మంది స్టూడెంట్స్​ ఉన్నారు. కానీ ఆ తరువాత కేర్​గివింగ్​, మస్కులానిటీ అనే సబ్జెక్ట్స్​కు సంబంధించిన చర్చల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఆ తరువాత నుంచి ఆ విషయాల్లో మార్పు రావాలని బలంగా నమ్మాడు.

కొడుకుతో మళ్లీ కనెక్ట్​ అయ్యాడు

ఇద్దరు పిల్లల తండ్రి ఫెర్లీ. పిల్లల సంరక్షణ, ఇంటిపనులు భార్య బాధ్యత. కాబట్టి ఆమే చేయాలని అనుకునేవాడు. జాబ్​ చేయడం, ఫ్రెండ్స్​తో చిట్​చాట్​ చేస్తూ ఎక్కువ టైం బయటే ఉండడం మగవాడిగా తన హక్కు అనుకున్నాడు. అదంతగా పట్టించుకోవాల్సిన విషయమే కాదనుకునేవాడు. అది ఎప్పటివరకు అంటే... తన ఏడేండ్ల కొడుకు మార్టిన్​ తన నుంచి దూరంగా ఉండడం గమనించేవరకు. తండ్రీ కొడుకుల్ని ఇంట్లో ఉంచి ఫెర్లీ భార్య బయటకు వెళ్తే మార్టిన్​ తెగ ఏడ్చేవాడు. తండ్రీ కొడుకుల మధ్య రిలేషన్ రోజురోజుకీ దూరం కాసాగింది.

ఇంట్లో ఉన్నప్పుడు మార్టిన్​తో కలిసి కూర్చొని తినే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఫెర్లీకి. ఆ బాబుతో ఆడుకోవడం, డే కేర్​ సెంటర్​లో డ్రాప్​ చేయడం వంటివి కూడా ఫెర్లీ ఒక్కడి వల్లా కాలేదు. తల్లి పక్కన ఉంటే తప్ప మార్టిన్​ తండ్రితో కలిసి ఆడేవాడు కాదు. కేర్​ సెంటర్​కి వెళ్లే వాడు కాదు. అప్పుడు అతనికి ‘నా ఇంట్లోనే నేను పరాయి వ్యక్తిని అయ్యానా?’ అనిపించింది. అతను అలా అనుకుంటున్న టైంలోనే స్ట్రెస్​ మేనేజ్​మెంట్​ కోసమని ‘కేర్​ స్కూల్’ ప్రోగ్రామ్​లో చేరాడు ఫెర్లీ. ‘నా కొడుకుతో రిలేషన్​షిప్ఎ లా మెరుగుపరుచుకోవాలో తెలియడంలేదు.

మీరేమైనా సాయం చేస్తారా?’ అని అడిగాడు. ఆ ప్రోగ్రామ్​లో చేరినప్పటినుంచి ఇంటి పనుల్లో చురుకుగా పాల్గొని పిల్లలకు, భార్యకి దగ్గరయ్యాడు. అలా ప్రోగ్రాం పూర్తయ్యే టైంకి ఫెర్లీ​ మంచి తండ్రిగా మారిపోయాడు. ఇప్పుడు అతను మార్టిన్​ హోంవర్క్​లో సాయం చేస్తున్నాడు. స్కూల్లో జరిగే టీచర్​ పేరెంట్​ మీటింగ్స్ కు అటెండ్​ అవుతున్నాడు. వీకెండ్స్​లో పిల్లల బాగోగులు చూసుకుంటున్నాడు. భార్యకి కొంత ఫ్రీ టైం ఇవ్వగలిగాడు. ఇదంతా జరిగే ముందువరకు ఫెర్లీ భార్య తన పూర్తి టైంని ఆ ఇల్లు, కుటుంబ సభ్యులకి మాత్రమే కేటాయించింది. తనకోసం ఏ మాత్రం టైం ఇచ్చుకోలేకపోయింది.

వెలకట్టలేని భావన అది...

‘నా పిల్లలకు నేను క్వాలిటీ టైం ఇస్తున్నా. ఎదుగుదలలో, లెర్నింగ్ ప్రాసెస్​లో వాళ్లకు నేను చాలా దగ్గరయ్యా. మా పెద్దబ్బాయి స్కూల్​ నుంచి వచ్చాక రోజంతా ఎలా గడిచిందో నాకు చెప్తున్నాడు. ఇంతకు ముందు అలా చెప్పేవాడు కాదు. నా దగ్గరకే వచ్చేవాడు కాదు. నిజంగా ఇది నాకు వెలకట్టలేని ఫీలింగ్​ని ఇచ్చింది’ అని తన ఎక్స్​పీరియెన్స్​ గురించి చెప్పాడు ఫెర్లీ.

 ఇలాంటి ప్రోగ్రామ్స్​ ద్వారా కేర్​గివింగ్​ అనే విషయం ఆడవాళ్లదే అనే సమాజపు ఆలోచనాధోరణిలో మార్పు వస్తోంది. ‘‘అయితే సమాజంలో ఈ విషయంలో మార్పు రావాలంటే ఇంకా చాలా ఏళ్లు శ్రమ పడాల్సి ఉంది. రాబోయే ఆరేండ్లలో​ బొగోటా సిటీలో 40 శాతం మగవాళ్లు ఈ ప్రోగ్రామ్​లో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఒక్క శాతం నమోదు జరిగింది. ఆ సంఖ్య తప్పకుండా 40 శాతానికి జంప్​ అవుతుంది. వెదురు చెట్టు ఎలాగైతే పెరుగుతుందో అచ్చం అలానే ఇది కూడా ఎదుగుతుంది. ఇప్పుడే విత్తనాలు నాటాం” అంటున్నాడు కొర్తెస్​. ఏ మార్పూ లేకపోవడం కంటే ఎంతోకొంత మార్పు మొదలవడం అనేది ముఖ్యం. అందుకని ఆ మార్పుకు ఆ దేశంలో బీజం పడినందుకు సంతోషించాల్సిందే.

అమ్మ కష్టం అప్పుడే తెలిసింది!

లూయిస్​ రోడ్రిగ్వెజ్​ అనే పదిహేడేండ్ల మెడికల్​ స్టూడెంట్​ తన స్నేహితుల ప్రోత్సాహం తో కేర్​ స్కూల్​ ప్రోగ్రామ్​లో పాఠం వినేందుకు ఆగిపోయాడు ఒకరోజు. అప్పటివరకు అతను తన తల్లి ఇంటి పనుల్లో పడుతున్న శ్రమ గురించి పట్టించుకోనేలేదు. ఒక పక్క రోడ్రిగ్వెజ్​ పనులు చేసిపెడుతూ మరోపక్క తండ్రి, చెల్లి పనులు అన్నీ తల్లి ఒక్కతే చూసుకునేది. కేర్​ స్కూల్​ ప్రోగ్రామ్​లో భాగంగా మానెకిన్​కి​ జుట్టు చిక్కు తీస్తున్నప్పుడు అమ్మ చేసే పనుల తాలూకు బాధ్యత​ అతని కళ్ల ముందు నిలిచింది.

దాంతో అప్పటినుంచి ఇంట్లో ఎక్కువ పని చేయాలని నిర్ణయించుకున్నాడు. మానెకిన్​ జుట్టుకు ఉన్న రబ్బర్​ బ్యాండ్​ తీశాక చిక్కులు తీసి జుట్టు దువ్వాడు. ఆ తరువాత నీట్​గా కనిపించిన ఆ బొమ్మను చూసిన అతని కళ్లలో గర్వం ఒలికింది. అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. ‘‘మానెకిన్​ తల దువ్వాక ఎంత బాగా అనిపించిందో. చెల్లికి అమ్మ తల దువ్వితే ఎంత బాగుంటుందో అంత బాగా వచ్చింది ఈ మానెకిన్​కి కూడా. ఇప్పుడు నేను ఇంకా చాలా పనులు చేయగలన’’ని సంబరపడ్డాడు.

హోం ఎకనమిక్స్​

నిజానికి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, తినేందుకు కావాల్సినవి వండుకోవడం అనేవి జీవితంలో ప్రధానంగా కావాల్సిన నైపుణ్యాలు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు అంత స్వతంత్రంగా బతికే స్కిల్స్​ నేర్పిస్తున్నారా? అంటే లేదనే చెప్పాలి. ఎంతకీ పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్​ ఇవ్వాలని చూస్తున్నారే తప్ప బతికేందుకు కావాల్సిన బెస్ట్​ స్కిల్స్ చిన్నప్పట్నించే నేర్పించాలనే విషయాన్ని పట్టించుకోవడంలేదు.

చాలా కుటుంబాల్లో వంట వండడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, ఐరన్​ చేయడం వంటి పనులు అమ్మాయిలకు నేర్పిస్తుంటారు. కానీ అబ్బాయిలకు నేర్పించడంలేదు. దానివల్ల ​ అబ్బాయిలకు లైఫ్​ స్కిల్స్ లేకుండా పోతున్నాయి. ‘‘అందుకే మేం ‘హోం ఎకనమిక్స్​’ కోర్స్​ మొదలుపెట్టాం’’ అంటున్నారు కొలెజియా మోంటెక్యాస్టెలో ఇనిస్టిట్యూట్​ వాళ్లు. ఇది స్పెయిన్​లోని విగో అనే ప్లేస్​లో ఉంది. ఈ ఇనిస్టిట్యూట్​ 2018లో ‘హోం ఎకనమిక్స్’​ అనే సబ్జెక్ట్​ను కంపల్సరీ చేసింది. అందులో భాగంగా... వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం వంటివాటితో పాటు పడక సర్దుకోవడం​ కూడా నేర్పిస్తోంది. ఇవి నేర్చుకోవడం వల్ల ఆ పనులు కేవలం ఆడవాళ్లవే అన్న జెండర్​ గ్యాప్​ని తగ్గించొచ్చు అనేది వాళ్ల ఆలోచన. 

కుకింగ్​తో మొదలై...

ఈ కోర్సు మొదట్లో కుకింగ్ క్లాస్​లా మొదలైంది. ఇది​ మొదలుపెట్టినప్పుడు చాలా రకాలుగా రెసిస్టెన్స్ ఎదురైంది. వాటన్నింటినీ పక్కన పెట్టి మరీ హోం ఎకనమిక్​ క్లాస్​ను కంటిన్యూ చేశారు. అది సైలెంట్​ సక్సెస్​ తెచ్చి పెట్టింది. చాలా మంది పిల్లలు ‘మేం ఎప్పటికీ చేయలేం అనుకున్న పనుల్ని చాలా ఈజీగా చేసేస్తున్నాం’ అని చెప్పడం మొదలుపెట్టారు. ఈ కోర్సుని అందరూ మెచ్చుకోవడం మొదలు కావడంతో కోర్సును ఇంకొంచెం ఎక్స్​ప్యాండ్​ చేశారు. బట్టలు ఉతకడం, ఐరన్​ చేయడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం వంటి వాటితో పాటు కుట్టడం, ప్లంబింగ్​, కార్పెంటర్​, మేస్త్రీ పని, ఎలక్ట్రిషియన్​ స్కిల్స్​ నేర్పించడం మొదలుపెట్టారు. 


మరి ఇవన్నీ నేర్పించే మాస్టర్లు ఎవరు అంటే?  అంతా వలంటీర్సేనట! ఆ కాలేజీలో టీచింగ్​ స్టాఫ్, స్కూల్​ క్యాంపస్​ రిప్రజెంటేటివ్స్​తో పాటు అక్కడ చదివే పిల్లల తండ్రులు కూడా క్లాసులు తీసుకుంటారు. మొదట్లో మగపిల్లలు ఈ కోర్సు నేర్చుకునేందుకు అంతగా ఇష్టపడలేదు. కానీ ఒకసారి చేరాక వాళ్లలో వచ్చిన మార్పును వాళ్లే గమనించుకున్నారు. ఇంటి పనులు అనేవి ఎంత సింపుల్​గా చేయొచ్చనేది తెలుసుకున్నారు. మగ పిల్లల కాలేజీలో ఇలా క్లాసు పెట్టడం వల్ల ఇంటి పనులు అమ్మాయిలవే అనే స్టిగ్మాని దాటొచ్చు.

చిన్న వయసులోనే మగపిల్లలు ఇంటి పనుల్లో భాగం అవడం వల్ల వ్యక్తిగత జీవితం ఎంత స్మూత్​గా ఉంటుందో అర్థం చేసుకుంటారు. ఆ పనుల భారం ఆడవాళ్లు ఒక్కళ్లదే కాదనే విషయం అర్థం చేసుకుంటారు. ఈ కాలేజీని చూశాక అక్కడి ఇనిస్టిట్యూషన్స్​ చాలావరకు ఈ కోర్సు మొదలుపెట్టాయి. తమ విద్యార్థులను కూడా జెండర్​ సెన్సిటివ్​ వ్యక్తులుగా మారుస్తున్నాయి.

హోం ఎకనమిక్స్​ అంటే...

అసలు హోం ఎకనమిక్స్​ అంటే ఏంటి? ఇంటి పనుల్ని సమర్ధవంతంగా, సౌకర్యంగా, స్థిరం​గా చేయడం అనే సైన్స్​. అలాచేయడం వల్ల శుభ్రమైన ఇల్లు, శుభ్రమైన బట్టలు ఉంటాయి. సొంతంగా ఇంటిపనులు చేసుకోగలుగుతారు. నిజానికి ఈ పనులన్నీ మిలటరీ స్కూల్లో నేర్పిస్తారు తెలుసా!


అందుకే పూర్వం రోజుల్లో అంటే70ల్లో ఎలాగైతే ‘‘ఈ పనులన్నీ ఆడవాళ్లకు సంబంధించినవి. మగవాళ్లు బయటకు వెళ్లి పనులు చేయాలి’’ అనే ఆలోచనలు ఉండేవో ఇప్పటికీ అవే ఆలోచనలు ఉన్నాయి. డెవలప్​మంట్​ అంటున్నారు. అన్నింటా ముందున్నాం అంటున్నారు. ఎన్నో పరిస్థితులు మారుతున్నాయి. కానీ మనుషుల మెంటాలిటీ మాత్రం ఈ విషయంలో మారడంలేదు. నేటి జనరేషన్​ లింగ​ సమానత్వం కోరుకుంటోంది. అందుకే మిగతా ప్రపంచమంతా కూడా స్పానిష్​ స్కూల్స్​, కాలేజీల్లో అమలుచేస్తున్న ఆలోచనల్ని స్వీకరించాలి. ఆచరణలో పెట్టాలి. ఆడ, మగ పిల్లలిద్దరికీ స్కూల్​ వయసునుంచే జీవితాన్ని మేనేజ్​ చేయడం నేర్పించాలి. అది ఇంటి పనులు చేయడం నేర్పించడంతోనే మొదలవ్వాలి.

ఆమెదే భారం..

మన దేశంలో ఇంటి పనుల విషయంలో జెండర్​ డివిజన్​ అనేది ఎలా ఉంటుందో తెలిసిందే. ఇంటికి సంబంధించిన ప్రతీ పని ఎంతో కొంత మేర పని ప్రదేశాల్లో కూడా ఆడవాళ్ల మీదే భారం ఉంటుంది. దేశవ్యాప్తంగా 4.5 లక్షల  మంది మీద సర్వే చేశారు. అందుకుగాను ఆరేండ్లు దాటిన వాళ్ల నుంచి పెద్ద వయసు వాళ్ల దగ్గర నుంచి సమాచారం తీసుకున్నారు. వాళ్లందరినీ రోజులో సమయాన్ని ఎలా గడిపారు? అని అడిగారు. డాటా ప్రకారం వేతనం లేని ఇంటి పనిలో ఆడవాళ్లు తలమునకలవుతున్నారు. 84 శాతం ఆడవాళ్లు పనిగంటలను ఇంటి పనుల్లో గడిపేస్తున్నారు. అదే మగవాళ్లను తీసుకుంటే అందుకు భిన్నంగా 80 శాతం డబ్బులు వచ్చేందుకే వాళ్ల టైం కేటాయిస్తున్నారు.

టైం లేదు!

2019లో ఆర్గనైజేషన్​ ఫర్​ ఎకనమిక్​ కో–ఆపరేషన్​ అండ్​ డెవలప్​మెంట్​ ఒక  సర్వే చేసింది. దాని ఫలితాలు ఇలా ఉన్నాయి. సగటు భారతీయ మహిళ ఇంటి పనుల కోసం రోజుకి 352 నిమిషాలు ఖర్చు చేస్తుంది. అదే మగవాళ్ల విషయానికొస్తే అతితక్కువ మంది మాత్రమే 52 నిమిషాలను ఇంటిపనులకు కేటాయిస్తున్నారు.
మనలాగానే అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉన్న చైనాలో ఆ నిష్పత్తి 234:91, దక్షిణాఫ్రికాలో 250:103 గా ఉంది. 


ఇండియాలో ఉద్యోగినులకు కిరీటంలా నిలిచిన టైటిల్​ ‘మోస్ట్​ స్ట్రెస్డ్​’ అని నీల్సన్​ సర్వే సంస్థ నివేదిక ఇచ్చింది. ఆ సంస్థ 21 దేశాల్లో 6500 మంది ఆడవాళ్ల మీద చేసిన సర్వే ద్వారా ఈ విషయాన్ని చెప్పింది. ఆ సర్వేకి రెస్పాండ్​ అయిన వాళ్లలో 87శాతం ఎప్పుడూ తాము స్ట్రెస్​లోనే ఉంటున్నట్టు చెప్పారు. 82 శాతం మంది రిలాక్స్​ కావడానికి టైం దొరకట్లేదు అన్నారు.

పబ్లిక్ పాలసీలు అవసరం

న్యూయార్క్​కి చెందిన బ్రిగిడ్​ షూల్టె ‘బెటర్​ లైఫ్​ ల్యాబ్’​ డైరెక్టర్. ఆమె ‘ది వర్క్​ ఫ్యామిలీ జస్టిస్’ అనే​ ప్రోగ్రామ్​ చేసింది. ‘‘మా క్లాస్​లకు హాజరైన మగవాళ్లు వాళ్ల ఇంటి పనుల బాధ్యతను సమంగా పంచుకున్నారు. అంటే ప్రైవేట్​ లెవెల్​లో సక్సెస్​ సాధించినట్టే! అయితే మీరు దీన్ని ఒక స్కేల్​ మీద కొలత వేయాలి అనుకున్నా, ఇంకా ఎక్కువ కుటుంబాల్లో మార్పు చూడాలి అనుకున్నా ప్రతి ఒక్కరూ జెండర్​ ఈక్వాలిటీలో వ్యత్యాసం చూపాలి. అందుకు పబ్లిక్​ పాలసీలు రూపొందించాలి. వర్క్​ప్లేస్​ కల్చర్​లో మార్పు తీసుకురావాలి” అన్నదామె.

లైఫ్ స్కిల్స్

మగపిల్లలకి ఇంటి పనులు చేయడం వాళ్ల బాధ్యత అనేది నేర్పించాలి. చిన్నప్పటినుంచే చిన్న  చిన్న పనులతో పనులు చేసే అలవాటు చేయొచ్చు అదెలాగంటే... మగపిల్లలు ఆడుకున్న బొమ్మల్ని సరైన ప్లేస్​లో పెట్టమనాలి. వాళ్లు పడుకునే పక్కను వాళ్లనే సర్దుకోమనాలి. వంట పనుల్లో సాయం చేయమనాలి. పిల్లలు పెద్దవుతున్న కొద్దీ ఇంటి పనులు చేసే బాధ్యత పెంచాలి. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా గిన్నెలు కడగడం, కూరగాయలు కోయడం, గదులు శుభ్రం చేయడం వంటివి నేర్చుకోవాలి. ఈ పనుల వల్ల వాళ్లకి ఒక డిసిప్లిన్​ అలవాటవుతుంది. అది భవిష్యత్తులో వాళ్లకి ఎన్నో రకాలుగా ఉపయోగ పడుతుంది.

- కిరణ్మయి