కవర్ స్టోరీ : ఇంటర్మిటెంట్‌‌‌‌ ఫాస్టింగ్‌‌‌‌ అంటే ఏమిటి.. ఏలా చేయాలి?

బరువు తగ్గడానికి, ఆరోగ్యం బాగుచేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా సైంటిస్ట్‌‌‌‌లు, డాక్టర్లు అనేక పద్ధతులు కనుగొన్నారు. వాటిలో ఎవరికి తెలిసిన పద్ధతులు వాళ్లు పాటిస్తుంటారు. వాస్తవానికి పేషెంట్‌‌‌‌కి ఒక మెడిసిన్ ప్రిస్క్రయిబ్​ చేసేటప్పుడు ఆ వ్యక్తికి ఇదివరకేమైనా సమస్యలు ఉన్నాయా? శరీరం ఆ మెడిసిన్‌‌‌‌ని తట్టుకుంటుందా? వయసు? బరువు? లాంటివన్నీ లెక్కలోకి తీసుకుంటాడు డాక్టర్‌‌‌‌. 

అలాగే.. డైట్‌‌‌‌ లేదా వెయిట్ లాస్‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌ చేయాలన్నా ఎన్నో విషయాలు బేరీజు వేసుకోవాలి. అలా కాకుండా తెలిసినవాళ్లు చేస్తున్నారని ఆ డైట్​ గురించి ముందూ వెనకా ఏమీ తెలుసుకోకుండా ఫాలో అయ్యి ఆరోగ్యం మీదకి తెచ్చుకోవద్దు అని హెచ్చరిస్తున్నారు ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌. ముందుగా ఈ మధ్య చాలా మంది ఫాలో అవుతున్న, ఎక్కువమంది మాట్లాడుకుంటున్న ఇంటర్మిటెంట్​ ఫాస్టింగ్​ గురించిన వివరాల్లోకి వెళ్తే...

ఇంటర్మిటెంట్‌‌‌‌ ఫాస్టింగ్‌‌‌‌

ఈ మాట వినగానే చాలామందిలో ‘‘అసలు దీన్ని ఫాలో కావచ్చా? దీని మీద ఎందుకింత చర్చ జరుగుతోంది? కొన్ని స్టడీలు ఈ డైట్​ అంత మంచి డైట్‌‌‌‌ లేదంటున్నాయి. కొన్నేమో దీనివల్ల గుండెకు ముప్పు అంటున్నాయి. వాటిలో ఏది నిజం?’’ ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. 

అయితే.. ఎవరైనా సరే ఈజీగా ఫాలో అయ్యేలా ఉండడంతో కొన్నాళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్మిటెంట్‌‌‌‌ ఫాస్టింగ్‌‌‌‌ ట్రెండ్‌‌‌‌ నడుస్తోంది. దీన్ని చాలామంది పాటించి సక్సెస్ కూడా అయ్యారు. అయితే.. ఇది సరైన పద్ధతి కాదని చెప్పినవాళ్లూ ఉన్నారు. అయినప్పటికీ మొత్తంగా చూస్తే ఎక్కువమంది దీనికి ఓటేస్తున్నారు. ఇంటర్మిటెంట్‌‌‌‌ ఫాస్టింగ్‌‌‌‌ని వెయిట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం, కొన్ని రకాల వ్యాధులను తగ్గించుకోవడానికి లేదంటే రివర్స్ చేయడానికి చేస్తుంటారు. ఈ ట్రెండ్‌‌‌‌ ఈ మధ్యే మొదలైనట్టు అనిపిస్తున్నా ఇంటర్మిటెంట్‌‌‌‌ ఫాస్టింగ్‌‌‌‌ని ఎన్నో ఏండ్ల నుంచి అనేక రూపాల్లో చేస్తూనే ఉన్నారు. 

ఎలా మొదలైందంటే..  

కొన్నేండ్ల క్రితం కొవ్వు ఎక్కువగా ఉన్న కొన్ని ఎలుకలను ఇంటర్మిటెంట్‌‌‌‌ ఫాస్టింగ్ చేయించి, వాటి మీద రీసెర్చ్​ చేశారు! అంటే రోజులో కొన్ని గంటలు మాత్రమే వాటికి ఫుడ్‌‌‌‌ పెట్టారు. ఆ ఎలుకలన్నీ బరువు తగ్గాయి. వాటిలో చాలా ఎలుకలకు కొలెస్ట్రాల్, బ్లడ్‌‌‌‌ షుగర్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌లోకి వచ్చాయి. అయితే మనుషులకు వాటికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మనుషుల మీద ఇది అంతే ఎఫెక్టివ్‌‌‌‌గా పనిచేస్తుందా? లేదా? అనేది ఇంకా పెద్ద ఎత్తున రీసెర్చ్‌‌‌‌ జరిగితే కానీ చెప్పలేం అన్నారు పరిశోధకులు. అయితే.. ఇప్పటివరకు ఈ ఫాస్టింగ్​ డైట్​ మీద జరిగిన రీసెర్చ్‌‌‌‌లు చాలావరకు ఇది సేఫ్‌‌‌‌ అనే చెప్పాయి. 

కొన్ని రీసెర్చ్​లు మాత్రం ప్రమాదం అంటున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా ఎలుకల మీద జరిగిన రీసెర్చ్‌‌‌‌ తర్వాత ఇంటర్మిటెంట్‌‌‌‌ ఫాస్టింగ్ సేఫ్‌‌‌‌. ఎఫెక్టివ్‌‌‌‌గా పనిచేస్తుందని  చాలామంది నమ్మారు. 2012 తర్వాత దీన్ని పాటించే వాళ్ల సంఖ్య చాలా పెరిగింది. ఆ ఏడాదిలో బీబీసీ బ్రాడ్‌‌‌‌కాస్టింగ్ జర్నలిస్ట్ డాక్టర్ మైఖేల్ మోస్లీ చేసిన టీవీ డాక్యుమెంటరీ ‘ఈట్ ఫాస్ట్, లైవ్ లాంగర్‌‌‌‌’‌‌‌‌తో ఈ డైట్​కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 

ఆయన దీనిపై ‘ది ఫాస్ట్ డైట్’ పేరుతో ఒక పుస్తకం కూడా రాశాడు. అది ఇంటర్మిటెంట్‌‌‌‌ ఫాస్టింగ్‌‌‌‌ని జనాలకు దగ్గర చేసింది. ఆ తర్వాత జర్నలిస్ట్ కేట్ హారిసన్ తన ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌లో తెలుసుకున్న అనేక విషయాలతో ‘ది 5:2 డైట్‌‌‌‌’ అనే పుస్తకం రాసింది. ఈ బుక్‌‌‌‌ వచ్చిన కొన్నాళ్లకే డాక్టర్ జాసన్ ఫంగ్ రాసిన ‘ది ఒబేసిటీ కోడ్’ మార్కెట్‌‌‌‌లోకి వచ్చింది. ఇది 2016లో బెస్ట్ సెల్లర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. వీటన్నింటిలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌‌‌‌ గురించే ప్రస్తావించారు. 

దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ డైట్‌‌‌‌కి చాలా క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ఒబెసిటీ కోడ్‌‌‌‌లో డాక్టర్ ఫంగ్ ఈ ఫాస్టింగ్ మీద జరిగిన అనేక పరిశోధనలు, డాక్టర్‌‌‌‌‌‌‌‌గా అతని అనుభవాల గురించి రాశాడు. దాంతో చాలామంది ఈ ఫాస్టింగ్‌‌‌‌ వల్ల ప్రయోజనం కలుగుతుందని నమ్మారు. ఈ పుస్తకంలో ఆయన ఫాస్టింగ్‌‌‌‌ చేస్తున్నప్పుడు ఎక్కువ పండ్లు, కూరగాయలు, ఫైబర్, హెల్దీ ప్రొటీన్లు, ఫ్యాట్స్‌‌‌‌ తినాలని... షుగర్‌‌‌‌‌‌‌‌, రిఫైన్డ్‌‌‌‌ గ్రెయిన్స్‌‌‌‌, ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌‌‌‌, చిరుతిళ్లకు దూరంగా ఉండాలని స్పష్టంగా చెప్పాడు.

ఎలా చేయాలి? 

ఇంటర్మిటెంట్‌‌‌‌ ఫాస్టింగ్‌‌‌‌ అనేక రకరకాలుగా చేయొచ్చు. ఎన్ని రకాలుగా చేసినా కొన్ని గంటల పాటు కడుపును ఖాళీగా ఉంచడమే దీని లక్ష్యం. ప్రపంచంలో ఒక్కో దగ్గర ఒక్కో రకంగా రకరకాల షెడ్యూల్స్‌‌‌‌ తయారు చేసుకుని ఈ డైట్​ ఫాలో అవుతుంటారు. వాటిలో కొన్ని ముఖ్యమైన పద్ధతుల వివరాల్లోకి వెళ్తే... 

16/8 లేదా 14/10 పద్ధతి

ఈ పద్ధతిలో రోజులోని 24 గంటలను ఈ రెండు భాగాలుగా విభజిస్తారు. వాటిలో ఒకటి ఈటింగ్‌‌‌‌ విండో, రెండోది ఫాస్టింగ్ విండో. ఉదాహరణకు.. రోజులో16 గంటలు ఉపవాసం ఉంటే 16/8  అంటారు.14 గంటలు ఉంటే14/10 అంటారు. ఈ రెండు పద్ధతులనే ఎక్కువమంది పాటిస్తుంటారు. మొదటి పద్ధతిలో ఒక రోజుకు సరిపడా ఆహారం రోజులోని ఎనిమిది గంటల్లో మాత్రమే తింటారు. మిగతా16 గంటలు ఫాస్టింగ్ విండోగా పెట్టుకుంటారు. అంటే ఆ పదహారు గంటలు మంచి నీళ్లు, జ్యూస్‌‌‌‌లు మాత్రమే తాగుతారు. అయితే.. సాధారణంగా నిద్రపోయే టైం కూడా ఈ ఫాస్టింగ్‌‌‌‌ విండోలోనే ఉంటుంది. అందుకే ఈ పద్ధతిని ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు.  ఎందుకంటే.. ఆ పదహారు గంటల్లో ఎనిమిది నుంచి పది గంటలు నిద్రలోనే గడిచిపోతుంది. 

మిగతా నాలుగు నుంచి ఆరు గంటలు ఆకలిని తట్టుకుంటే సరిపోతుంది. ఈ పద్ధతిలో ఎక్కువమంది ఉదయం బ్రేక్‌‌‌‌ ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్​గా ఉదయం పది గంటలకు భోజనం చేస్తారు. సాయంత్రం ఆరు గంటల్లోపు డిన్నర్‌‌‌‌‌‌‌‌ చేసేస్తారు. ఇక అప్పటి నుంచి మరుసటి రోజు ఉదయం పది గంటల వరకు ఎలాంటి ఫుడ్‌‌‌‌ తీసుకోరు.

14/10 పద్ధతిలో ఉదయం 9 నుండి సాయంత్రం7 గంటల మధ్య మాత్రమే తింటారు. కొందరు ఈ ఫాస్టింగ్ ఏండ్ల తరబడి చేస్తుంటారు. కొందరేమో వారానికి రెండు మూడు రోజులు చేసి, మిగతా రోజుల్లో మామూలుగానే తింటారు. కానీ.. ఈ పద్ధతుల్లో విండోలను ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవడానికి లేదు. ఉదాహరణకు.. మొత్తానికి ఎనిమిది గంటలు ఈటింగ్ విండో ఉండాలి కాబట్టి..  ‘మధ్యాహ్నం వరకు ఏమీ తినకుండా ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు తింటా’ అంటే కుదరదు. కచ్చితంగా చీకటి పడకముందే ఫాస్టింగ్‌‌‌‌ విండో మొదలుపెట్టాలి. సాయంత్రం ఏడు గంటల్లోపే రోజులో చివరి భోజనం తినేయాలి. అలా చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు. ఈటింగ్‌‌‌‌ విండోలో కూడా మితంగా తినాలి. సాయంత్రం తినే ఫుడ్‌‌‌‌లో తక్కువ క్యాలరీలు ఉండాలి.

వారానికి రెండుసార్లు 

ఈ పద్ధతిలో వారానికి రెండు రోజులు ఇంటర్మిటెంట్‌‌‌‌ ఫాస్టింగ్‌‌‌‌ చేసి, మిగిలిన ఐదు రోజులు  మామూలుగా తినొచ్చు. కాకపోతే.. ఫాస్టింగ్‌‌‌‌ చేసే ఆ రెండు రోజులు చాలా కీలకం. ఎందుకంటే.. ఆ రోజుల్లో రోజుకు 500 కేలరీలు ఇచ్చే ఫుడ్‌‌‌‌ మాత్రమే తినాలి. ఆ రెండు రోజులూ రోజుకు రెండుసార్లు మాత్రమే భోజనం చేయాలి. మొదటి భోజనంలో 300 క్యాలరీలు, రెండో భోజనంలో 200 కేలరీల ఫుడ్ తినాలి. అందులో కూడా ఎక్కువ ఫైబర్, ప్రొటీన్ ఉండాలి. బాగా గుర్తుంచుకోవాల్సిన మరో విషయం.. వారంలో ఈ రెండు రోజులు వరుసగా ఉండకూడదు.