కవర్ స్టోరీ : మనం పండించుకోలేమా?

‘మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూరగాయల ధరలు మండిపోతున్నయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌! ఏది కొందామన్నా పిరమే!’ కొన్నేండ్లుగా మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లాస్ జనాల నుంచి ఇలాంటి మాటలే వింటున్నాం. అసలు కూరగాయల ధరలు ఇంతలా పెరగడానికి కారణమేంటి? అంటే.. మనం పండించుకోకుండా పక్కరాష్ట్రాల మీద ఆధారపడడమే. మనం తినే కూరగాయల్లో 43 శాతానికి పైగా దిగుమతి చేసుకునేవే. అందుకే ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా అన్ని ఖర్చుల భారం సామాన్యుడే మోయాల్సి వస్తోంది. ఇంతకీ మనకు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందంటే..  

రాష్ట్రంలో ప్రజలు తింటున్న కూరగాయల్లో చాలావరకు మన రాష్ట్రంలో పండించినవి కావు. వాటిలో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేవే ఎక్కువ. రాష్ట్రంలో జనాభాకు తగ్గట్టు కూరగాయల సాగు జరగడం లేదు. ఇన్నాళ్లు ప్రభుత్వ ప్రోత్సాహం కరువై  ఎప్పుడూ కూరగాయలు వేసే రైతులు కూడా వేయట్లేదు. ఫలితంగా కొంతకాలంగా కూరగాయల ధరలు ఏవి చూసినా మండిపోతున్నాయి. గత పదేండ్లలో రాష్ట్రం వరిసాగులో ఎంతో అభివృద్ధి సాధించిందని గొప్పలు చెప్పుకున్నా.. కూరగాయల సాగులో మాత్రం రాష్ట్రం స్వయంసమృద్ధి సాధించలేక, ఇతర రాష్ట్రాల ఉత్పత్తుల పైనే ఆధారపడాల్సిన దుస్థితి. రాష్ట్రంలో కూరగాయల సాగు కోసం హార్టికల్చర్ శాఖ, సర్కారు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. దీంతో రైతులు ఆ పంటల వైపు చూడడం మానేశారు.

పక్కరాష్ట్రాల నుంచే..

రాష్ట్రంలో, అందులో ప్రధానంగా హైదరాబాద్​ జనం తింటున్న టమాటలో సింహభాగం ఏపీ, కర్ణాటక నుంచే దిగుమతి అవుతున్నాయి. ఏపీలోని చిత్తూరు మదనపల్లె, అనంతపురం, కర్నూలు, పత్తికొండ, హుబ్లీ, కళ్యాణదుర్గం తదితర ప్రాంతాల నుంచి రోజు వారీగా టమాటా వస్తోంది. అదే విధంగా బెంగళూరు, చింతామణి, బాగేపల్లి, గుల్బర్గా, మహారాష్ట్రలోని సోలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కూడా వస్తున్నది. రోజు వారీగా సికింద్రాబాద్​లోని బోయిన​పల్లి మార్కెట్​కు వచ్చే 50 నుంచి100 కూరగాయల లారీలు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నవే!

ఇతర రాష్ట్రాలదే...

రాష్ట్రంలో ప్రజలు తినే ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, కాకరకాయ, బీరకాయ, పచ్చిమిర్చి, బెండకాయ, సొరకాయ, బీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్యాప్సికం వంటి కూరగాయలు కూడా తగినంతగా సాగు చేయడం లేదు. ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, క్యాప్సికం, క్యారెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పచ్చిమిర్చి అంతా ఇతర రాష్ట్రాల నుంచే వస్తోంది. ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఆగ్రా నుంచి ఆలుగడ్డ దిగుమతి అవుతోంది. ఇక ఉల్లిగడ్డ మహారాష్ట్రలోని సోలాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాంగ్లీలతో పాటు ఏపీలోని కర్నూలు నుంచి రోజూ లారీలకు లారీలు, వందల లోడ్లు మలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్​కు వస్తోంది. 

క్యారెట్​, క్యాప్సికం కర్నాటకలోని మల్లూరు, బాగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బల్లాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హోస్​పేట నుంచి వస్తోంది.  పచ్చిమిర్చి కూడా ఏపీ నుంచే వస్తోంది. అనంతపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గుత్తి, ఆదోని, కర్ణాటకలోని బళ్లారి, మహారాష్ట్రలోని జల్‌గావ్‌, ఛత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గడ్​లోని జగదల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి వస్తోంది. ఇలా మెజార్టీ కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచే దిగుమతి అవుతున్నాయి.

18లక్షల 29వేల టన్నుల ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కొరత 

ఐసీఎంఆర్​ రీసెర్చ్​ ప్రకారం రోజు వారి తలసరి కూరగాయల వినియోగం 325గ్రాములు. నాలుగు కోట్లకి పైగా ఉన్న రాష్ట్ర జనాభాకు తగ్గట్టు  ఏడాదికి 41లక్షల 75వేల  టన్నుల కూరగాయలు  కావాలి. కానీ  ప్రస్తుతం రాష్ట్రంలో ఏడాదికి 23లక్షల 46వేల 700 టన్నుల కూరగాయలు మాత్రమే పండుతున్నాయి. అంటే రాష్ట్రంలో18లక్షల 29వేల టన్నుల కూరగాయల కొరత ఉంటోంది. ఆలు గడ్డలు, ఉల్లి గడ్డల వంటివి 48 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. కాగా ఆకుకూరల లోటు 52 శాతం. ఆకుకూరలు ఏడాదికి1.61లక్షల టన్నులు అవసరం కాగా... ఇప్పుడు 89వేల టన్నుల ఆకుకూరలే పండుతున్నాయి. ఒక్క ఆకుకూరల లోటే  72వేల టన్నులు. 

సాధారణంగానే  పంట సాగు బాగా జరిగితేనే కొరత ఉంటుంది. సాగు పడిపోతుండడంతో  వినియోగదారులపై కూరగాయల ధరల భారం తప్పడం లేదు. కొరతను అధిగమించే ప్రయత్నాలు ఇన్నాళ్లు సర్కారు చేయకపోవడంతో దిగుమతిపైనే ఆధారపడుతున్నం. అవసరాలు తీరాలంటే 3.48లక్షల ఎకరాల్లో అదనపు సాగును ప్రోత్సహించాల్సిందేనని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేస్తున్నారు.  ప్రతి ఏటా కూరగాయల సాగు టార్గెట్​లో పావువంతు కూరగాయల సాగు జరగక  దిగుబడి గణనీయంగా తగ్గి తీవ్రమైన కొరత ఏర్పడుతోంది. సాగు పడిపోవడంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూరగాయలేవీ సామాన్యులు కొనే పరిస్థితి లేదు. 

60శాతం దిగుమతే ఆధారం..

రాష్ట్రంలో తినే కూరగాయాల్లో 60శాతం ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా అవుతున్నాయి. అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 60 నుంచి 70శాతం అక్టోబరు నుంచి మార్చి వరకే 50శాతం కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచే దిగుమతి అవుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తమిళనాడు, ఢిల్లీ నుంచి రాష్ట్రానికి కూర గాయలు దిగుమతి జరుగుతోంది. ఏపీ నుంచి అన్ని వెరైటీలు దిగుమతి అవుతుండగా ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుంచి ఆలుగడ్డ దిగుమతి అవుతోంది. మహారాష్ట్ర , రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి ఉల్లిగడ్డ , కర్ణాటక నుంచి క్యాప్సికం, టమాటా ఇలా ఎక్కువగా రాష్ట్రానికి దిగుమతి అవుతున్నాయి.

గత పదేళ్లలో ప్రోత్సాహం కరువు

కూరగాయల సాగుకు అనుకూలమైన నేలలు ఉన్నప్పటికీ  రైతులకు ప్రోత్సాహం కరువై కూరగాయలు పండించడం లేదని తెలుస్తోంది. కూరగాయల విత్తనాలు సబ్సిడీ ఇవ్వకపోవడం, డ్రిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పక్కన పెట్టడం, హార్టికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంటలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు కూరగాయల సాగువైపు మొగ్గు చూపడం లేదు. కష్టపడి కూరగాయలు పండించినా రేట్ల హెచ్చుతగ్గుల వల్ల నష్టపోతామనే భయంతో రైతులు ముందుకు రావడం లేదు. 

ప్రధానంగా కూరగాయల్లో టమాటా, ఉల్లి ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి. సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వారీగా ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టమాటా పంటకు రేటు ఎట్లా ఉంటుందో తెలియక ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు చెప్తున్నారు. రైతులకు కూరగాయల పంటల్లో సాంకేతిక మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెలకువలపై అవగాహన కల్పించడం, మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల లింకేజీ కల్పిస్తే సాగు పెరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు.

శివార్లలో పంటలు తగ్గినయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కూరగాయల సాగు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శివారు జిల్లాల్లో గణనీయంగా జరిగేది. ప్రధానంగా రంగారెడ్డి, మహేశ్వరం, వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంగారెడ్డి, మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాదాద్రి, నల్గొండ, సూర్యపేట, ఖమ్మం, మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాల్లో కూరగాయల సాగు బాగుండేది. రంగారెడ్డి జిల్లాలో గతంలో లక్ష ఎకరాల వరకు సాగు చేస్తే అది నేడు సగానికి పడిపోయింది. వికారాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంగారెడ్డి, మెదక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సూర్యాపేటల్లో వేలాది ఎకరాల సాగు తగ్గింది. ఫలితంగా మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే కూరగాయలు తగ్గినట్లు ఉద్యానశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రెండు విధాలా నష్టాలే!

రాష్ట్రంలో ఎక్కువగా పండే కూరగాయలను మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చేసుకోలేక ధర తగ్గి పోయి రైతులు నష్టపోతున్నారు. టమాటా రైతుల వద్ద ఉన్పప్పుడు తక్కువ రేటు, రైతుల వద్ద లేనప్పుడు ఎక్కువ రేటు ఉంటూ వినియోగదారులకు భారంగా మారుతోంది. దీనికి తోడు దిగుమతి చేసుకునే వెజిటబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషయంలో అందుకు భిన్నంగా ఉంటోంది. ఇక్కడ పండని కూరగాయల కోసం.... ఏటా దాదాపు రూ.1000 కోట్ల విలువైన వెజిటబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దిగుమతి చేసుకుంటున్నం. వీటిని రాష్ట్ర రైతులు పండిస్తే లాభాలు రావడంతో పాటు వినియోగదారులకు చౌకగా లభించే అవకాశం ఉంటుంది. కానీ ఈ దిశలో కొన్నేండ్లుగా చర్యలు తీసుకోకపోవడంతో అటు రైతులు, ఇటు వినియోగదారులు నష్టపోయారు. 

తక్కువ సాగయ్యే కూరగాయలు

రాష్ట్ర అవసరాలకు కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లి, బీర, సొర, కాకర , దోస, చిక్కుడు, ఆలు, చేమ, క్యారెట్ , ఆకుకూరలు కొరత ఉంది. రాష్ట్ర ప్రజలు ఎక్కువగా తినే 20 రకాల్లో 11 రకాల కూరగాయలు 9,34,470 టన్నులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. బెండ 50,538 టన్నులు, పచ్చిమిర్చి70,622 టన్నులు, బీర 54,183 టన్నులు, కాకర 48,898 టన్నులు, దొండ 60,058 టన్నులు, సొర 25,458, ఆకు కూరలు1,06,454టన్నులు, ఆలు1,78,861 టన్నులు, చేమగడ్డ 4,547 టన్నులు,  క్యాప్సికం 5,761 టన్నులు, కాలీఫ్లవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 201టన్నుల కొరత ఉంది. సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న కూరగాయల్లో టమాటా, వంకాయ తదితర తొమ్మిది రకాలు అధికంగా సాగు చేస్తుండగా, దిగుబడి అయిన వాటిలో 8,22,834 లక్షల టన్నుల కూరగాయలు సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నట్లు తేలింది. 

కూరగాయల​కు అనుకూలమే

రాష్ట్రంలో కూరగాయలు పండించేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. మంచి నేలలు ఉన్నాయి. నేల స్వభావం ఎంతో అరుదైనది. ప్రపంచంలోనే ఇలాంటి నేలలు చాలా తక్కువ చోట్ల ఉంటాయి.  నల్లనేలలు, ఎర్రనేలలు, ఇసుక నేలలు, చౌడు భూములు ఇలా టిపికల్ ల్యాండ్ మిక్సింగ్ నేలల తత్వం వల్లనే ఇక్రిసాట్ వంటి సంస్థ ఇక్కడికి వచ్చింది.  సమశీతోష్ణ పరిస్థితులు రాష్ట్రానికి వరం. ఎక్కువ ఎండలు, ఎక్కువ చలి ఉండకుండా, అన్ని రకాల పంటలు పండే వాతావరణం మన దగ్గర ఉంది. 900 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం కూడా ఉంది. కూరగాయలతో అన్ని రకాల  పంటలకు అనుకూలత ఉంది.   వరదలు, తుపాన్లు, ఈదురుగాలులు లాంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా తక్కువగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో కొంత వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. వృత్తి నైపుణ్యం కలిగిన రైతాంగం పుష్కలంగా ఉన్నారు. 

రైతులకు శిక్షణ ఇప్పించాలి

రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వ్యవసాయ పద్ధతులను అమలు చేసేందుకు రైతులకు శిక్షణ ఇప్పించాలి. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక ఫలితాలు సాధించిన జపాన్, ఇజ్రాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, థాయిలాండ్, జర్మనీ, మలేసియా, చైనా, అమెరికా యూరప్ దేశాల్లో వాడే టెక్నాలజీని, అధునాతన విధానాలను రాష్ట్రంలో విరివిగా వినియోగించేందుకు ప్రణాళికలు చేయాలి. నూతన సాంకేతిక విధానాలను అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో హార్టికల్చర్​ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ద్వారా ప్రజలకు అవసరమైన కూరగాయలు, పండ్లు అందుబాటులోకి వస్తాయి. వ్యవసాయ రంగంలో ఆశించిన స్థాయిలో ఉత్పాదకత, ఉత్పత్తిని సాధించడంతో పాటు, ఉత్పాదక వ్యయాన్ని తగ్గించి రైతాంగానికి ఎక్కువ ఆదాయాన్ని అందించేందుకు టెక్నాలజీ ఉపకరిస్తుంది. సాంప్రదాయ విధానాలకు సాంకేతికను జోడించే ప్రయత్నం చేయాలి.  

ఇంటర్నేషనల్ టెక్నాలజీ అవసరం

జర్మనీ, ఇజ్రాయిల్, జపాన్ తదితర ఇంటర్నేషనల్ టెక్నాలజీపై అధ్యయనం చేసి రాష్ట్రంలో విస్తృతంగా అమలులోకి తీసుకురావాలి. కూరగాయలు, పండ్లు, పూలతోటల సాగు, మెక్రో ఇరిగేషస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాలీహౌజ్​ల ఏర్పాటులో ఇజ్రాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానాలను అమలు చేయాలని ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు. విత్తనాల తయారీలో జర్మనీ టెక్నాలజీని వినియోగించుకోవాలని, మరిన్ని పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసి స్థానికంగా పండే కూరగాయలు, ఆకుకూరలు నూతన సాంకేతిక పద్దతుల్లో సాగు చేయాలి. 

హార్టికల్చర్​ శాఖ ములుగులోని సెంటర్​ ఆఫ్​ ఎక్స్​లెన్స్​ అధునాతన విధానాలను రాష్ట్రం అంతటా అమలు చేయాలి. కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెన్సార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారిత టెక్నాలజీని ఇజ్రాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వినియోగిస్తోంది. ఇలాంటివి ఇక్కడ అమలు చేసేందుకు సన్నాహాలు చేయాలి. రాష్ట్రంలోని జీడిమెట్ల, హార్టికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ ప్రాంగణంలో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్​లెన్సీల్లో  ఇజ్రాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీతో సాగు జరుగుతోంది.   

జర్మనీ సహాకారంతో ప్రత్యేక ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో జిల్లాల వారీగా నేలలు, వాటి సారం, పండే పంటలు, కూరగాయలు, వాటిలో ఉండే రసాయన అవశేషాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడి పంటలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు క్లియెరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చేందుకు నాణ్యత పరీక్షలు చేసే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రైతులు తమ పంట ఉత్పత్తులను విదేశాలకు ఎక్స్​పోర్ట్ చేసే స్థాయికి తీసుకురావాలి. అప్పుడే వారికి వెజిటబుల్​ సాగుకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.

ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

జర్మనీ, ఇజ్రాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీని వ్యవసాయ ఉత్పత్తులకు, ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రంగానికి అన్వయించాల్సి ఉంటుంది. ఈ దిశలో  లేటెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​తో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలో విస్తృతంగా అధ్యయనం జరగాలి. కూరగాయలు,  పండ్లను ప్రాసెస్ చేసి జ్యూస్, పల్ప్​లను ప్యాకేజీ డ్రింక్స్ తయారీ కోసం టెక్నాలజీని తెలంగాణలో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయాలి.

మొక్కలకు నేరుగా పోషకాలు..

పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ, వ్యవసాయరంగంలో అనుకున్న ఉత్పాదకతను సాధించడానికి పంటకు అవసరమయ్యే సమగ్ర సాగునీటి వినియోగం, పోషకాల యాజమాన్యం అత్యంత కీలకమైన  ఫర్టిగేషన్ పద్ధతులను ఇజ్రాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీతో అమలు చేయాలనే డిమాండ్​ ఉంది. ఈ పద్ధతి వల్ల డ్రిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్వారా సాగు నీరు, పంటకు అవసరమయ్యే పోషకాలు ఒకేసారి మైక్రో ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా మొక్కలకు అందుతాయి. 

దీనివల్ల పంటకు అవసరమైనప్పుడు, అవసరమైనంత పోషకాలు అందడంతో పర్యావరణంపై ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ప్రస్తుతం ఫర్టిగేషన్ చాలా రకాల పంటల్లో, వివిధ రకాల నేలల్లో, వాతావరణ పరిస్థితుల్లో వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయిల్​లో దాదాపు 75 శాతం సాగువిస్తీర్ణం సూక్ష్మసాగునీటి పద్ధతి ద్వారానే సాగు చేస్తున్నారు. ఇందులో 81 శాతం విస్తీర్ణం ఫర్టిగేషన్ పద్ధతిలో సాగుచేస్తున్నారు.  రాష్ట్రంలో డ్రిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తుంపర సేద్యాన్ని ఎక్కువ మంది రైతులు వినియోగించేలా ప్రోత్సహించాలి.

పంట మార్పిడి పద్ధతులు

నీళ్లు పుష్కలంగా ఉన్నాయని కేవలం వరి మాత్రమే వేయాలనే పాత పద్ధతులను విడనాడాలని రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి.  ఒకే పంట అధికంగా పండిస్తే అది వరి, పత్తి, మిరప.. ఇలా పంట ఏదైనా ఉత్పత్తి పెరిగి, పంట ధర తగ్గి, గిరాకీ దెబ్బ తింటుంది. రెండు మూడు పంటలు వేస్తే ఒక పంట రేటు సరిగా లేక పోయినా మరో పంటతో ఆదాయం పొందొచ్చు. ఇలా రకరకాల పంటలు వేయడం ద్వారా ఉత్పత్తి పెరిగితే డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న పంట ద్వారా ఆదాయం పొందే  అవకాశం ఉంటుంది. 

ఈ నేపథ్యంలో సాంకేతికతను వినియోగిస్తూనే పంటమార్పిడి విధానాలు అమలు చేయాలని రైతాంగానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేయాలి..  ఇజ్రాయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరహాలో చిన్న కమతాల్లోనూ వేరు వేరు పంటలు వేసే విధంగా రైతుల్లో చైతన్యం తీసుకురావాలి. పండ్లు, పూలు, డ్రైఫ్రూట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇలా పలు రకాల పంటలు వేస్తే ఒకటి కాకపోయినా మరో పంట దిగుబడి పెరిగి రైతుకు లాభసాటిగా మారే అవకాశం ఉంది.
 - మరిపాల శ్రీనివాస్​, వెలుగు

కూరగాయల ఊరు 

ఈ ఊరిని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు ‘కూరగాయల ఊరు’ అని పిలుస్తుంటారు. దానికి కారణం.. జిల్లాలోనే అత్యధికంగా ఆకుకూరలు, కూరగాయలు పండించే ఆదర్శ గ్రామం ఇది. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలం కాల్వ తండా గ్రామానికి చెందిన రైతుల్లో 90 శాతం మంది 30 ఏళ్లుగా ఆకుకూరలు, కూరగాయలే పండిస్తున్నారు. ఆ పంటలను నిర్మల్ మార్కెట్‌లో అమ్ముతున్నారు. మగవాళ్లంతా సాగు పనులు చేస్తుంటే.. ఆడవాళ్లు వేకువ జాము నుండి ఉదయం 11 గంటల వరకు మార్కెట్‌లో కూరగాయలు అమ్ముతుంటారు. ముఖ్యంగా పాలకూర, మెంతికూర, తోటకూర, కొత్తిమీర, ఉల్లికూర సాగు చేస్తారు. కూరగాయల్లో వంకాయలు, కాకర, గోరుచిక్కుడు, టమాట, బెండకాయ ఎక్కువగా సాగు చేస్తున్నారు.  చాలామంది సేంద్రియ ఎరువులనే వాడుతున్నారు. 
- నిర్మల్‌, వెలుగు 

ఎకరాకు 2 లక్షలు..

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని హరిపురం గ్రామానికి చెందిన కూస రాజేందర్ అనే రైతు గత పది సంవత్సరాల నుండి కూరగాయల పంటలు సాగు చేస్తున్నాడు. ఇతను ఒక ఎకరం సాగులో కూరగాయలు సాగు చేస్తాడు. ఇందులో బెండకాయ, అల్చింత, గోరు చిక్కుడు, వంకాయ లాంటి పంటలు సాగు చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఎకరానికి  ఒక రూ. 1.50 లక్షలు నుంచి రూ. 2లక్షలు సంపాదిస్తున్నట్టు రైతు చెప్తున్నాడు. కూరగాయలను పెద్దపల్లి, గోదావరిఖని, మంథని పట్టణాలకు సరఫరా చేస్తున్నట్లు చెప్తున్నాడు.
- పెద్దపల్లి, వెలుగు 

కూరగాయలకు కేరాఫ్​

మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఆదర్శ గ్రామమైన  మల్కాపూర్ కూరగాయ పంటలకు కేరాఫ్​ అడ్రస్​గా మారింది. ఈ గ్రామంలో సుమారు 100 మంది రైతులు దాదాపు 40 ఎకరాల్లో కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. హార్టికల్చర్​ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్ల సలహాలు, సూచనలతో పందిరి సాగు, షేడ్​ నెట్​ విధానంలో, డ్రిప్​, స్ప్రింక్లర్​ లు ఏర్పాటు చేసుకుని టమాట, వంకాయ, బీర, కాకర, సొరకాయ, బీర్నీస్​, క్యాబేజీతోపాటు పాలకూర, పుంటికూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకు కూరలు పండిస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కూరగాయలను రైతులు హైదారాబాద్​, సికింద్రాబాద్‌లతోపాటు సిద్దిపేట జిల్లాలోని వంటిమామిడి మార్కెట్​లకు తీసుకెళ్లి అమ్ముతారు.

మూడున్నర ఎకరాల్లో...

నేను మూడున్నర ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు చేస్తున్నా. పండే కూరగాయలను సికింద్రాబాద్​ మార్కెట్​ కు తీసుకెళ్లి అమ్ముతా. కూరగాయ పంటల సాగుతో ఆదాయం బాగానే వస్తోంది. మా పొలంలోనే వివిధ రకాల కూరగాయలు పండుతాయి కాబట్టి మాకు ఇంట్లోకి కూడా కూరగాయలు కొనే అవసరమే లేదు. దాంతో కూరగాయల ఖర్చు కూడా లేదు.
- చింతల లక్ష్మణ్​, రైతు, మల్కాపూర్​ 

ఆకుకూరల కొటాల్‌పల్లి

కామారెడ్డి జిల్లాలోని కొటాల్‌పల్లి ఆకు కూరల సాగుకు ప్రసిద్ధి. ఇక్కడి రైతులు ప్రధానంగా ఆకు కూరలను పండిస్తారు. కామారెడ్డి టౌన్‌కు 7 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరిలో  90 ఫ్యామిలీలు ఉంటాయి. జనాభా 380 మంది వరకు ఉంటారు. సాగు భూమి 250 ఎకరాలు. ఇక్కడ నివసించే వారిలో 50 వరకు కుటుంబాలు ఆకు కూరలను పండించి కామారెడ్డి మార్కెట్లో అమ్మకాలు చేస్తారు. తమకు ఉన్న సాగు భూమిలో ఒక్కో రైతు 5 నుంచి 10 గుంటల ఆకు కూరలు వేస్తారు. పాలకూర, తోటకూర, మెంతికూర, పుంటికూర ( గొంగూర) , కొత్తమీర వేస్తారు. 

దశాబ్దాలుగా ఇక్కడి రైతులు ఆకు కూరలు పండించటం అలవాటుగా మారింది. టౌన్​కు సమీపంలో ఊరు ఉండటం, ఆకు కూరలకు డిమాండ్ ఉండటంతో రైతులు సాగుపై ఆసక్తి చూపారు. పొద్దున్నే కోసి అమ్మకానికి తీసుకెళ్తారు. ఒక సారి ఆకు కూరల విత్తనాలు చల్లితే మూడు సార్లు కోతకు వస్తుంది. 10 గుంటల భూమికి మార్కెట్లో రేటు బాగుంటే రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు మూడు కోతలకు వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. విత్తనాలు కూడా అధిక రేట్లకు ప్రైవేటు షాపుల్లో కొంటున్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ల కూడా ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వట్లేదు. రైతులే స్వతహాగా యజమాన్య పద్ధతులు పాటించి ఆకుకూరలు పండిస్తారు. 

మిగతా గ్రామాల్లో కూడా..

కామారెడ్డి జిల్లాలోని ఇంకా కొన్ని గ్రామాల్లో ప్రధానంగా కూరగాయలను సాగు చేస్తారు. రాజంపేట మండలం శివాయిపల్లి, బసన్నపల్లి, భిక్కనూరు మండలం గుర్జకుంట, సదాశివనగర్ మండలం కుప్రియల్, మర్కల్, తాడ్వాయి మండలం దేవాయిపల్లి, కృష్ణాజివాడి గ్రామాల్లో కూరగాయలు పండిస్తారు. ఇక్కడ టమాట, బెండ, బీర, క్యాబేజీ, క్యాలీప్లవర్, క్యారెట్, మిర్చి వంటి కూరగాయలను సాగు చేస్తారు. 
- కామారెడ్డి, వెలుగు

10 గుంటల్లో 3 రకాలు

నాకు ఎకరంన్నర భూమి ఉంది. ఇందులో 10 గుంటల్లో ఆకుకూరలు వేస్తా. చాలా ఏండ్ల నుంచి మా ఊరి వాళ్లం ఆకు కూరలు పండిస్తున్నాం.   పాలకూర, తోటకూర, మెంతికూర వేస్తా. మార్కెట్లో రేట్ ఉన్నప్పుడు మంచి లాభం వస్తుంది. సబ్సిడీపై విత్తనాలు ఇస్తే రైతులకు మేలు జరుగుతుంది. 
- బాలయ్య, కొటాల్పల్లి, 
కామారెడ్డి జిల్లా

సగం కుటుంబాలు ఆకుకూరలే...

భద్రాద్రికొత్తగూడెం జిల్లా సుజాతనగర్​ మండలంలోని రాఘవపురం గ్రామం ఆకుకూరల సాగుకు కేరాఫ్​ అడ్రస్​గా మారింది. ఈ గ్రామంలోని సగం కుటుంబాలు ఆకుకూరలనే పండిస్తున్నాయి. ఇంటి పక్కన కాస్త ఖాళీ స్థలం కనిపించినా సాగు మొదలుపెడతారు ఇక్కడివాళ్లు. 150 నుంచి 200 కుటుంబాలు 150ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అందులోనూ చాలామంది సేంద్రియ పద్దతిలో పండిస్తున్నారు. ముఖ్యంగా పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, తోటకూర, చిన్న తోటకూర, బచ్చలి కూర , గంగవాయిల లాంటి ఆకుకూరలను ఎక్కువగా పండిస్తున్నారు. 

ఏడాదికి ఎకరానికి రూ. 50 వేలు పెట్టుబడి పెడితే రూ. లక్ష నుంచి రూ. 1.50లక్షల వరకు ఆదాయం వస్తుంది. పండిన పంటను మగవాళ్లు కొత్తగూడెం పట్టణంలోని రైతు బజార్​, ముఖ్య కూడళ్లతో పాటు చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో అమ్ముతున్నారు. కొంతమంది మార్కెట్లోని చిరువ్యాపారులకు హోల్​సేల్​గా కూడా అమ్ముతుంటారు. ఆడవాళ్లు రోజూ పొలానికి వెళ్లి పనులు చేసుకుంటున్నారు. కొందరు కాకర, చిక్కుడు లాంటి కూరగాయలను కూడా సాగు చేస్తున్నారు.  

70 ఎకరాల్లో.. 

ఇదే సుజాతనగర్‌‌కు చెందిన తాళ్లూరి పాపారావు అనే రైతు దాదాపు 70 ఎకరాల్లో టమాట, దోస, బోడ కాకర, స్టార్​ కాకర, సొర పండిస్తున్నాడు. ఈ మండలంలోని మరో ఐదారు గ్రామాల్లో కూడా టమాట, దోస, కీరదోస, సొర సాగు చేస్తున్నారు.  ‌‌
- భద్రాద్రికొత్తగూడెం, వెలుగు 

కూరగాయల ఊరు.. గోపాలపూర్ 

కరీంనగర్  సిటీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపాలపూర్ గ్రామానికి సాగులో ఓ ప్రత్యేకత ఉంది. అందరిలా ఆ ఊరి రైతులు ఒక వరికో, పత్తికో, మిర్చికో, మక్కకో పరిమితం కాలేదు. తమకున్న భూమిలో ఇలాంటి పంటలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తున్నారు. ఈ గ్రామంలో 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడినవారే. 

తమకున్న భూమిలో 10 నుంచి 20 శాతం భూమిలో ఏడాదంతా కూరగాయలు సాగు చేస్తూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు. ఈ గ్రామంలో పండే ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనాకు కరీంనగర్ మార్కెట్​లో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. వీటితోపాటు క్యాబేజీ, క్యారెట్, పచ్చిమిర్చి, టమాట, వంకాయతోపాటు పందిళ్ల విధానం ద్వారా తీగజాతి కాకర, బీర, దొండ, చిక్కుడు రకం కూరగాయలు ఏడాది పొడవునా పండిస్తున్నారు. స్థానిక అగ్రికల్చర్ ఆఫీసర్ లెక్కల ప్రకారం ఈ సీజన్​లో110 ఎకరాల్లో 61 మంది రైతులు కూరగాయలు సాగుచేస్తున్నారు. ఒక పంట చేతికి రాగానే మరో పంటను మార్చుతూ కూరగాయలు రెండు పంటలు తీస్తుండగా.. ఆకుకూరలైతే ఏడాదిలో నాలుగైదు పంటలను పండిస్తున్నారు. కొందరు రైతులు గత నాలుగైదు దశాబ్దాలుగా వెజిటబుల్స్ సాగునే జీవనాధారంగా కలిగి ఉన్నారు. 

నెలకి రూ.30 వేల ఆదాయం

మాకు ఉన్న ఎకరాలో... 20 గుంటల్లో కొత్తిమీర, మరో 20 గుంటల్లో ఆకు కూరలు వేస్తున్నాం. కొత్తిమీరకు రూ.5 వేల పెట్టుబడి పెడితే రూ.20 వేల వరకు ఆదాయం వస్తోంది. అలాగే ఆకు కూరలు మీద నెలకో రూ.8 వేల ఆదాయం వస్తుంది. చేనులో ఇద్దరం మనుషులం పనిచేస్తాం. కరీంనగర్ మార్కెట్​లో వ్యాపారులకు అమ్ముతాం. 
 - మెండ లక్ష్మి, గోపాలపూర్