బరువు తగ్గడానికి, ఆరోగ్యం బాగుచేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా సైంటిస్ట్‌లు, డాక్టర్లు అనేక పద్ధతులు కనుగొన్నారు. వాటిలో ఎవరికి తెలిసిన పద్ధతులు వాళ్లు పాటిస్తుంటారు. వాస్తవానికి పేషెంట్‌కి ఒక మెడిసిన్ ప్రిస్క్రయిబ్ చేసేటప్పుడు ఆ వ్యక్తికి ఇదివరకేమైనా సమస్యలు ఉన్నాయా? శరీరం ఆ మెడిసిన్‌ని తట్టుకుంటుందా? వయసు? బరువు? లాంటివన్నీ లెక్కలోకి తీసుకుంటాడు డాక్టర్. అలాగే.. డైట్ లేదా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేయాలన్నా ఎన్నో విషయాలు బేరీజు వేసుకోవాలి.
అలా కాకుండా తెలిసినవాళ్లు చేస్తున్నారని ఆ డైట్ గురించి ముందూ వెనకా ఏమీ తెలుసుకోకుండా ఫాలో అయ్యి ఆరోగ్యం మీదకి తెచ్చుకోవద్దు అని హెచ్చరిస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. ముందుగా ఈ మధ్య చాలా మంది ఫాలో అవుతున్న, ఎక్కువమంది మాట్లాడుకుంటున్న ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించిన వివరాల్లోకి వెళ్తే...
16/8 లేదా 14/10 పద్ధతి
ఈ పద్ధతిలో రోజులోని 24 గంటలను ఈ రెండు భాగాలుగా విభజిస్తారు. వాటిలో ఒకటి ఈటింగ్ విండో, రెండోది ఫాస్టింగ్ విండో. ఉదాహరణకు.. రోజులో16 గంటలు ఉపవాసం ఉంటే 16/8 అంటారు.14 గంటలు ఉంటే14/10 అంటారు. ఈ రెండు పద్ధతులనే ఎక్కువమంది పాటిస్తుంటారు. మొదటి పద్ధతిలో ఒక రోజుకు సరిపడా ఆహారం రోజులోని ఎనిమిది గంటల్లో మాత్రమే తింటారు. మిగతా16 గంటలు ఫాస్టింగ్ విండోగా పెట్టుకుంటారు. అంటే ఆ పదహారు గంటలు మంచి నీళ్లు, జ్యూస్‌లు మాత్రమే తాగుతారు. అయితే.. సాధారణంగా నిద్రపోయే టైం కూడా ఈ ఫాస్టింగ్ విండోలోనే ఉంటుంది. అందుకే ఈ పద్ధతిని ఎక్కువ మంది ఫాలో అవుతుంటారు. ఎందుకంటే.. ఆ పదహారు గంటల్లో ఎనిమిది నుంచి పది గంటలు నిద్రలోనే గడిచిపోతుంది.
మిగతా నాలుగు నుంచి ఆరు గంటలు ఆకలిని తట్టుకుంటే సరిపోతుంది. ఈ పద్ధతిలో ఎక్కువమంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకుండా డైరెక్ట్‌గా ఉదయం పది గంటలకు భోజనం చేస్తారు. సాయంత్రం ఆరు గంటల్లోపు డిన్నర్ చేసేస్తారు. ఇక అప్పటి నుంచి మరుసటి రోజు ఉదయం పది గంటల వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోరు.
14/10 పద్ధతిలో ఉదయం 9 నుండి సాయంత్రం7 గంటల మధ్య మాత్రమే తింటారు. కొందరు ఈ ఫాస్టింగ్ ఏండ్ల తరబడి చేస్తుంటారు. కొందరేమో వారానికి రెండు మూడు రోజులు చేసి, మిగతా రోజుల్లో మామూలుగానే తింటారు. కానీ.. ఈ పద్ధతుల్లో విండోలను ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవడానికి లేదు. ఉదాహరణకు.. మొత్తానికి ఎనిమిది గంటలు ఈటింగ్ విండో ఉండాలి కాబట్టి.. ‘మధ్యాహ్నం వరకు ఏమీ తినకుండా ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు తింటా’ అంటే కుదరదు. కచ్చితంగా చీకటి పడకముందే ఫాస్టింగ్ విండో మొదలుపెట్టాలి. సాయంత్రం ఏడు గంటల్లోపే రోజులో చివరి భోజనం తినేయాలి. అలా చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు. ఈటింగ్ విండోలో కూడా మితంగా తినాలి. సాయంత్రం తినే ఫుడ్‌లో తక్కువ క్యాలరీలు ఉండాలి.
వారానికి రెండుసార్లు
ఈ పద్ధతిలో వారానికి రెండు రోజులు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసి, మిగిలిన ఐదు రోజులు మామూలుగా తినొచ్చు. కాకపోతే.. ఫాస్టింగ్ చేసే ఆ రెండు రోజులు చాలా కీలకం. ఎందుకంటే.. ఆ రోజుల్లో రోజుకు 500 కేలరీలు ఇచ్చే ఫుడ్ మాత్రమే తినాలి. ఆ రెండు రోజులూ రోజుకు రెండుసార్లు మాత్రమే భోజనం చేయాలి. మొదటి భోజనంలో 300 క్యాలరీలు, రెండో భోజనంలో 200 కేలరీల ఫుడ్ తినాలి. అందులో కూడా ఎక్కువ ఫైబర్, ప్రొటీన్ ఉండాలి. బాగా గుర్తుంచుకోవాల్సిన మరో విషయం.. వారంలో ఈ రెండు రోజులు వరుసగా ఉండకూడదు.
రోజు విడిచి రోజు...
రిజల్ట్స్ తొందరగా రావాలి అనుకునేవాళ్లు ఈ పద్ధతి ఫాలో అవుతుంటారు. ఇందులో రోజు మార్చి రోజు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తుంటారు. ఫాస్టింగ్ డేస్‌లో 500 కేలరీలకు మించకుండా తింటారు. ఉపవాసం లేని రోజుల్లో కడుపు నిండా తింటారు. ఆరోగ్యకరమైన ఫుడ్ మాత్రమే తినాలి. కొందరు వారంలో ఒకట్రెండు రోజులు తేనె, గోరు వెచ్చని నీళ్లు వంటివి తాగుతూ, కీరా ముక్కలు తింటూ జీరో కేలరీ డైట్ చేస్తుంటారు.
ఈట్... స్టాప్... ఈట్...
ఈ పద్ధతిని చాలా తక్కువమంది పాటిస్తుంటారు. ఇందులో వారంలో ఆరు రోజులు మామూలుగానే తింటారు. ఒకరోజు మాత్రం అస్సలు ఫుడ్ తీసుకోరు. కానీ.. దీనివల్ల మంచి రిజల్ట్స్ రావడంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్తున్నారు ఎక్స్‌పర్ట్స్. 24 గంటలు పూర్తిగా ఉపవాసం ఉండడం వల్ల చాలామంది అలసట, తలనొప్పి, చిరాకు, ఆకలి సమస్యలతో బాధపడుతుంటారు.
లైఫ్ స్టయిల్ - టెక్నాలజీ
మన దేశంతోపాటు చాలా దేశాల్లోని ప్రజల ఒకప్పటి లైఫ్ స్టయిల్ నుంచే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పుట్టిందని కొందరు అంటున్నారు. ఎందుకంటే.. కరెంట్ లేని పాత రోజుల్లో అందరూ సాయంత్రం ఆరుగంటల లోపే భోజనం చేసేవాళ్లు. తర్వాత చాలా గంటలు కడుపు ఖాళీగా ఉంటుంది. ఉదయం లేవగానే పొలం పనులు చూసుకుని పదింటికల్లా ఇంటికొచ్చి భోజనం చేసేవాళ్లు. ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌లో పాటించే పద్ధతి కూడా ఇదే. కాకపోతే.. ఈ ఫాస్టింగ్‌లో ఏం తినాలి? ఏం తినకూడదు? అనేదానికి కొన్ని రూల్స్ ఉంటాయి.
న్యూరో సైంటిస్ట్ మార్క్ మాట్సన్ పాతికేండ్లు ఈ ఫాస్టింగ్ మీద స్టడీ చేశాడు. ‘‘మన శరీరాలు రోజులో చాలా గంటలు ఫుడ్ లేకుండా ఉండగలిగేలా పరిణామం చెందాయి. పూర్వ కాలంలో వ్యవసాయం చేయడం నేర్చుకోకముందు వేటపై ఆధారపడి బతికేవాళ్లు. అప్పట్లో ఆహారం దొరక్కపోతే.. గంటలు కాదు, కొన్నిసార్లు రోజులపాటు తినకుండా ఉండేవాళ్లు. అయినా.. ఆరోగ్యంగానే ఉన్నారు వాళ్లు. అంతెందుకు 60.. 70 ఏండ్ల క్రితం ఒబెసిటీతో బాధపడేవాళ్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అందుకు కారణం.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అప్పట్లో ఇంటర్నెట్, సెల్‌ఫోన్, టీవీ, కంప్యూటర్లు లేవు. కాబట్టి చీకటి పడే లోపు తినేసేవాళ్లు. కానీ ఆ తరువాత నుంచి ఇవన్నీ వచ్చాక టైం దాటి తినడం మొదలైంది. దాంతో పాటే వ్యాయామం తగ్గింది” అని చెప్పాడు మార్క్ మాట్సన్.
ఈ ఉపవాసం సేఫేనా?
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విధానాన్ని ఫాలో కావడం సేఫే. కానీ.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొంతమంది దీనికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా వెయిట్ లాస్, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్, అధిక కొలెస్ట్రాల్, ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్లు ఈ పద్ధతి ఫాలో అవుతుంటారు. అయితే వాళ్లలో కొందరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌కు దూరంగా ఉండాలి అంటున్నారు డాక్టర్లు. ఎలా పడితే అలా ఫాస్టింగ్ చేయకూడదు.
డైటీషియన్/న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకుని ఏం తినాలి? ఏం తినకూడదు? ఎప్పుడు తినాలి? అనేది వివరంగా తెలుసుకోవాలి. ఆ తరువాతే ఫాలో కావాలి. ముఖ్యంగా పద్దెనిమిదేండ్ల లోపు వాళ్లు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, టైప్ 1 డయాబెటిస్ ఉండి ఇన్సులిన్ తీసుకునే వాళ్లు, టైప్ 2 డయాబెటిస్ ఉండి మందులు వాడుతున్న వాళ్లు, ఈటింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్లు, అథ్లెట్లు, ఎక్కువగా శారీరక శ్రమ చేసే వాళ్లు ఈ పద్ధతిని పాటించకపోవడమే మంచిది అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. దీనిపై ఇంకా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇంకా ఎన్నో రీసెర్చ్‌లు జరుగుతున్నాయి.