కవర్ స్టోరీ..క్యాన్సర్..అవేర్​ & కేర్​ : మనీష పరిమి

ఒక ఊళ్లో ముగ్గురు పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్న ఒక కుటుంబం ఉంది. రోజూవారీ పనులు మామూలుగా జరుగుతూనే ఉన్నాయి. కాలం గడిచేకొద్దీ రోజురోజుకు ఆ ఇంటి యజమాని ఆరోగ్యం క్షీణిస్తోంది. అలా ఎందుకు అవుతుందో కారణం తెలియలేదు ఎవరికీ. మందు, సిగరెట్ అలవాట్లు ఉంటే మానేయమని పట్నం డాక్టర్ చెప్పాడు.

ఆ రోజు నుంచి ఆ రెండూ ముట్టలేదు. కానీ, ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. ఆ తరువాత కొన్ని నెలలకు కన్నుమూశాడు. ఎలా చనిపోయాడని అడిగితే ‘రాచపుండు వచ్చి చచ్చిపోయాడు’ అని చెప్పేవాళ్లు. అప్పటి నుంచి ఊళ్లో తెలియని జబ్బు వచ్చి ఎవరైనా చనిపోతే రాచపుండు వచ్చి చచ్చిపోయారని ప్రచారం జరిగేది. అది పూర్వకాలం.  

కానీ.. ఇప్పుడు కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. ఏ జబ్బునైనా కనుక్కుని, దాన్ని నయం చేసే డాక్టర్లు ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్​​​లోనూ మంచి వైద్యం అందుతోంది. కానీ, ఇప్పటికీ రాచపుండు (క్యాన్సర్) అంటే మాత్రం వెన్నులో వణుకు పుడుతుంది. క్యాన్సర్ పేరు వింటే చాలు ఏదో భూతంలా చూస్తారు. అంతెందుకు.. ఎవరికైనా క్యాన్సర్ ఉందని తెలిస్తే ‘అయ్యో! పాపం.. ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే. ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా బతకడమే’ అంటూ వేదాంతం మాట్లాడతారు. చుట్టు పక్కల వాళ్లు అనే ఆ మాటలు కుటుంబ సభ్యులనూ విపరీతమైన దిగులు, బాధలో ముంచేస్తాయి. ఒక్కసారిగా ఇంట్లో పరిస్థితులు అన్నీ మారిపోతాయి. తెలియని ఒత్తిడి పెరిగిపోతుంది. 

ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లకు డాక్టర్లు చెప్పేది ఒక్కటే.. ‘లక్షణం కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. క్యాన్సర్​ వచ్చిందని కంగారు పడొద్దు. ట్రీట్​మెంట్ చేయించుకోవడానికి భయపడొద్దు. మనో ధైర్యానికి మించిన మందు మరొకటి లేదు. ఎంత ధైర్యంగా ఉంటే అంత త్వరగా కోలుకుంటారు’’ అని. దీనిపై మరింత అవేర్​నెస్ కల్పించడం కోసం ఈ రోజు (ఫిబ్రవరి 4) ‘వరల్డ్ క్యాన్సర్ డే’ సందర్భంగా ఈ స్పెషల్​ స్టోరీ. 

శరీరంలో కోటానుకోట్ల కణాలు ఉంటాయి. వాటిలో చాలా రకాలు ఉంటాయి. ఆ కణాల్లో కొన్నింటి వల్ల క్యాన్సర్ వస్తుంది. ఆ క్యాన్సర్​లలో కూడా రకాలు ఉంటాయి. శరీరంలోపలి భాగాల మీద పొర​లా కనిపించేది కార్సినోమా, అదే ఎముకల్లో అయితే సార్కోమా, బ్లడ్​లో వస్తే లుకేమియా... అని జనరల్​గా చెప్తుంటారు. ఇంకా లోతుగా వెళ్తే ఒక్కో కణాన్ని బట్టి ఒక్కో టైప్​ క్యాన్సర్ ఉంటుంది. ఆ కణం పేరు వెనకాల క్యాన్సర్ చేర్చి క్యాన్సర్​ రకాన్ని చెప్తారు. 
శరీరంలో రోజుకి కొన్ని కోట్ల కణాలు ఉత్పత్తి అవుతుంటాయి.

వాటిలో క్యాన్సర్​ కారక కణాలు కూడా ఉంటాయి. ఇదింకా బాగా అర్థం కావాలంటే ఒక ఇండస్ట్రీని ఉదాహరణగా తీసుకుని చెప్పుకోవచ్చు. అదెలాగంటే తయారీలో లోపం వల్ల పనికిరావని కొన్ని వస్తువులను పక్కన పడేస్తుంటారు. అచ్చం అలాగే శరీరంలో కూడా పనికి రాని కణాలను డీఎన్​ఏ ఫిల్టర్​ చేస్తుంటుంది. అయితే డీఎన్​ఏలో, జెనెటిక్స్​లో మార్పు జరిగినప్పుడు తట్టుకుని నిలబడిన కణాలు క్యాన్సర్​ కణాలుగా మారే అవకాశం ఉంది. ఆ కణాలు శరీరంలో ఎక్కడ ఉంటే ఆ భాగానికి క్యాన్సర్ సోకుతుంది. అలా శరీరంలో ఏ భాగాన్నైనా క్యాన్సర్​ కణాలు ఎఫెక్ట్​ చేయగలవు. అంతేకాదు.. శరీరంలో ఒక భాగంలో వచ్చిన క్యాన్సర్​ని ఎక్కువకాలం కనుక్కోలేకపోతే అది మిగతా అవయవాలకు పాకుతుంది.

జన్యువుల్లో మార్పులే కారణం

జన్యువుల్లో మార్పులు ఎందుకు జరుగుతాయి అంటే...  పొగ, మందు తాగడం వల్ల డీఎన్​ఏ నిర్మాణాల్లో మార్పులు వస్తాయి. అలాగే జన్యుపరంగా వచ్చే కొన్ని వ్యాధుల వల్ల కూడా డీఎన్​ఏలో మార్పులు వస్తుంటాయి. తద్వారా క్యాన్సర్​ కణాలు ప్రొడ్యూస్​ అవుతాయి. వాటి కణ విభజన ఒకసారి మొదలైందంటే ఇక ఆగదు. వాటి సంఖ్యను పెంచుకుంటూ పోతాయి.

అలా కణాలు పెరిగేకొద్దీ, గడ్డల్లా మారతాయి. గడ్డల సైజ్ కూడా పెరుగుతుంది. అవి పెరిగేకొద్దీ క్యాన్సర్ స్టేజ్ మారుతుంది. అదే టైంలో క్యాన్సర్​ కణాలకు బలం పెరుగుతుంది. రెసిస్టెన్స్ సెల్స్ (క్యాన్సర్) కూడా పెరుగుతాయి. వాటిని క్లోన్స్ అంటారు. ఆ కణాలు పెరగడం వల్ల బాడీలో ఉండే నేచురల్ బ్యారియర్స్ నుంచి తప్పించుకుని రక్తం ద్వారా మిగతా అవయవాలకు క్యాన్సర్​ పాకుతుంది.

పిల్లల్లోనూ..

పిల్లల్లో క్యాన్సర్ రావడానికి కారణం క్రోమోజోమ్స్​లో మార్పులు కారణం. అప్పుడే  పుట్టిన పిల్లల నుంచి పదిహేనేండ్ల వరకు జాగ్రత్తగా చూసుకోవాలి అంటారు. అలాగెందుకంటే జీవక్రియల్లో మార్పులు (మెటబాలిక్ ఛేంజెస్) వస్తాయి కాబట్టి. కణాలు వేగంగా వృద్ధి చెందుతుంటాయి. మార్పు కూడా అంతే వేగంగా చెందుతాయి. ఆ టైంలోనే కణాల్లో మార్పులు వచ్చి, అవి క్యాన్సర్​ కణాలుగా మారే అవకాశం ఉంది. 

*   *   *

కారణాలెన్నో... 

క్యాన్సర్​కి ఒకప్పుడు డీఎన్​ఏ లోపాలే కారణాలుగా ఉండేవి. కానీ, ఇప్పుడు కేవలం డీఎన్​ఏలో లోపాలే కాకుండా మరికొన్ని అంశాలు కూడా ఉంటున్నాయి.
       

ప్రస్తుతం క్యాన్సర్​ కేసులు పెరిగిన మాట వాస్తవం. దానికి కారణం...1930 – 50ల కాలంతో పోలిస్తే ఇప్పుడు ఇండియాలో ఆయుర్దాయం పెరిగింది. వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయనేది మొదటి కారణం. 


     కాలుష్యం ఎక్కువగా ఉన్న దేశాల్లో మనదేశం కూడా ఒకటి. వెహికల్స్, ఇండస్ట్రీల నుంచి వెలువడే వ్యర్థ వాయువులు, ప్లాస్టిక్ వాడకం ఇలా రకరకాల కాలుష్యాలు పెరుగుతున్నాయి. అవి పలు రకాల క్యాన్సర్ల​కు కారణం అవుతున్నాయి.


     ప్రాసెస్డ్, రిఫైన్డ్​​ ఫుడ్ తినడం, ఎక్సర్​సైజ్ చేయకపోవడం, ఒబెసిటీ వంటివి కూడా క్యాన్సర్లను పెంచే కారకాలే. ప్రస్తుతం ఇండియాలో స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం బాగా పెరిగింది. అలాగే ఒత్తిడి, బయట ఫుడ్​ ఎక్కువగా తినడం పెరిగాయి... ఇలాంటి కారణాల వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే ఈ రకం క్యాన్సర్​లు మగవాళ్లలోనే ఎక్కువ.

 
     ఒబెసిటీ అంటే బరువు పెరగడం మాత్రమేకాదు. శరీరం ఒకరకంగా ఇన్​ఫ్లమేటరీ స్టేజ్​కి వెళ్లడం. దీనివల్ల బ్రెస్ట్, పొట్టలో క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
    

మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్​ పేషెంట్స్ 98 శాతం సిటీల వాళ్లే. అందుకు... డీఎన్​ఏ లోపాలు, ఒత్తిడి, పిల్లలకు పాలు ఇవ్వకపోవడం, పెండ్లిళ్లు ఆలస్యంగా చేసుకోవడం లేదా అసలు చేసుకోకుండా ఉండడం వంటివి కారణాలుగా ఉంటున్నాయి. అదే గ్రామాల్లో చూస్తే ఇలాంటి పరిస్థితి లేదు. ఊళ్లల్లో ఉండేవాళ్లకు ఒత్తిడి చాలా తక్కువని చెప్పొచ్చు. అలాగే గ్రామాల్లో వాళ్లు పిల్లలకు రెండు మూడేండ్లు వచ్చే వరకు తల్లి పాలు పడతారు. పిల్లలకు పాలు పట్టించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్​ తగ్గిపోతాయి.

*   *   *

అవగాహన ముఖ్యం

ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కాషన్​: సెవెన్ వార్నింగ్ సైన్స్ ఆఫ్​ క్యాన్సర్’​ అని ఒక ప్రకటన చేసింది. అంటే... అందులో చెప్పిన ఏడు రకాల లక్షణాలు ఉంటే టెస్ట్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేయాలి. విదేశాల్లో అయితే జనరల్ ప్రాక్టీషనర్ లెవల్​ నుంచి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్​ చేస్తుంటారు. ప్రైమరీ లెవల్​లో కూడా స్క్రీనింగ్​ ప్రోగ్రామ్స్ పెంచి, ఆరోగ్యకరమైన జీవన విధాన పరిస్థితులు కల్పించాలి. ఇలాంటివి చేయడం వల్ల క్యాన్సర్​ని నిర్మూలించే అవకాశం ఉంది. 

ఒత్తిడి తగ్గించుకోవాలి 

తీవ్ర మానసిక భావోద్వేగాలు క్యాన్సర్లను ప్రేరేపిస్తాయి. క్యాన్సర్​ బారిన పడిన వాళ్లు మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే త్వరగా నయం అవుతుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే తిరిగి క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే శరీరాన్ని, మనసును వేరు చేసి చూడలేం. ఇవిరెండూ ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉంటాయి.

ఒక వ్యక్తి ఆరోగ్యంలో ఈ రెండిటిదీ ‘కీ’ రోల్​. ‘జబ్బు లేకపోవడమే కాదు.. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కూడా బాగుంటేనే హెల్దీగా ఉన్నట్టు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. శరీరం, చుట్టుపక్కల పరిసరాలు, భావోద్వేగాలు, మానసిక పరిస్థితులు, ఆహారం, వ్యాయామం​ వంటివి అన్నీ బ్యాలెన్స్ చేస్తేనే హెల్దీగా ఉంటారు ఎవరైనా. 

ఆహారం​ 

పెద్ద పేగు (కొలన్) క్యాన్సర్స్ ఉంటే..  ఫైబర్ ఎక్కువ తినాలి. ఆయిల్ ఫుడ్ తగ్గిస్తే అల్సర్స్ తగ్గి, క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు. ఎందుకంటే... అల్సర్ వస్తే అది క్యాన్సర్​గా మారే ఛాన్స్ ఉంది. స్మోకింగ్ తగ్గిస్తే లంగ్ క్యాన్సర్​ బారిన పడకుండా ఉండొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో ఫుడ్​ ఒక్కో రకమైన ప్రభావం చూపిస్తుంది. అందుకే హెల్దీ ఫుడ్​ తింటే పెద్ద జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చు.

వీళ్లకు క్యాన్సర్ రాదా? 

స్పోర్ట్స్ ఆడేవాళ్లకు, యోగా, జిమ్ చేసేవాళ్లకు, ఫిజికల్​ ఫిట్​నెస్​ కాపాడుకునేవాళ్లకు, మెంటల్​ స్ట్రెస్ తగ్గించుకుని, ఆల్కహాల్, సిగరెట్​కు దూరంగా ఉండేవాళ్లకు, డైట్, మెడిటేషన్, నిద్ర అన్నీ సరిగా మెయింటెయిన్​ చేసేవాళ్లకు క్యాన్సర్ సెల్స్ మీద ఫైట్​ చేసే శక్తి ఉంటుంది. అందుకే అలాంటివాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. 

ఇప్పుడు ఎక్కువగా..

‘‘ఈ మధ్యకాలంలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనుక్కుంటున్నాం. దానికి కారణం.. ప్రజల్లో కాస్త అవేర్​నెస్ రావడమే. న్యూస్​ పేపర్లలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తల వల్ల, మెడికల్ కాలేజీల్లో అవేర్​నెస్ కల్పించడం, గవర్నమెంట్ అవేర్​నెస్ ప్రోగ్రామ్​లు నిర్వహించడం వంటివి అందుకు దోహదం 
చేస్తున్నాయి. ముఖ్యంగా స్క్రీనింగ్ అనేది ముఖ్యం.

అంటే జబ్బు రాకముందు, లక్షణాలు లేనప్పుడే గుర్తించడానికి చేసే టెస్ట్​లను స్క్రీనింగ్​ అంటారు. దీని వల్ల కూడా జబ్బు ముదరకముందే ఎర్లీ స్టేజ్​ల్లో తెలుస్తుంది. అదే లక్షణాలు బయటపడిన తరువాత చేసే టెస్ట్​ని ‘డయాగ్నసిస్’ అంటాం. అవేర్​నెస్ పెరగడం వల్ల స్క్రీనింగ్ టెస్ట్​లు చేయడంతో క్యాన్సర్​ ఉంటే బయటపడుతుంది.

అలాగే లక్షణాలు వెంటనే గుర్తించి స్కానింగ్ చేయడం వల్ల కూడా కేసులు కనుక్కుంటున్నాం. పూర్వం ఇంత అడ్వాన్స్​డ్​టెక్నాలజీ లేదు. అందువల్ల బయాప్సీ చేసే ఛాన్స్ ఉండేది కాదు. ఇవేవీ లేని కాలంలో ఏ రోగం వచ్చిందో తెలియక రాచపుండు వచ్చి చనిపోయాడు అనేవాళ్లు. అంతేకానీ, అది ఏంటి? ఏ రకం? వంటి వివరాలు తెలిసేవి కావు. 

అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ 

పాతకాలంలో అయితే, సర్జరీ ఒక్కటే ఉండేది. శరీరంలో ఏ భాగానికి క్యాన్సర్ వస్తే దాన్ని తొలగించే వాళ్లు. ప్రస్తుతం క్యాన్సర్ ట్రీట్​మెంట్​లో చాలా అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ వాడుతున్నారు. రోబోటిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, రీ– కన్​స్ట్రక్షన్​ వంటి అడ్వాన్స్​డ్​​ టెక్నాలజీలు చాలా వచ్చాయి. ఇండియాలో ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. విదేశాల్లో ఉన్న కొన్ని టెక్నిక్స్ మన దగ్గర ఇంకా రాలేదు. ఈ విషయాలు పక్కనపెడితే మన దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ మొత్తంలో ట్రీట్​మెంట్ అందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనదేశంలో జనాభా ఎక్కువ కాబట్టి కేసులు పరంగా చూసినా ఎక్కువ ఉంటాయి. 

రేడియేషన్ వల్ల లాభమే!

ట్రీట్‌‌మెంట్ టెక్నిక్స్ విషయానికొస్తే...  రేడియేషన్​ ఎంత ఇవ్వాలనే దానిమీద ఒక స్టాండర్డ్ గైడెన్స్ ఉంటుంది. దాని ప్రకారమే ఫాలో అవుతారు. ప్రపంచమంతటా అవే గైడ్​లైన్స్ ఉంటాయి. ఒక పద్ధతి ప్రకారమే ట్రీట్​ చేయాలి. కాబట్టి ఎక్కడా కూడా రేడియేషన్ ఎక్కువ అవ్వడం అనేది ఉండదు. అయితే ఉదాహరణకు ఒక నలుగురు పేషెంట్లను తీసుకుంటే.. రేడియేషన్ ట్రీట్​మెంట్​ తీసుకున్న ఆ నలుగురి శరీరం రియాక్షన్ ఒకేలా ఉండదు. పేషెంట్​ శరీర తత్వాన్ని బట్టి రియాక్షన్​ ఉంటుంది. రేడియేషన్ ఇచ్చే టీం, వాళ్ల దగ్గర ఉండే మెషిన్, దాని టెక్నాలజీది కూడా ఇందులో కీలక పాత్ర. 

ఎక్స్​పీరియెన్స్ లేనివాళ్లు, కొత్త పద్ధతుల్లో సరైన శిక్షణ లేనివాళ్లు పాత పద్ధతులు ఫాలో అవుతారు. పాత పద్ధతుల్లో సైడ్ ఎఫెక్ట్స్ కాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే అవి కూడా చాలావరకు తాత్కాలికమే. రేడియేషన్ తీసుకున్నంతకాలం ఉండి, ఆ తర్వాత రెండు మూడు వారాలకు ఆ ఎఫెక్ట్స్​ తగ్గిపోతాయి. ముఖ్యంగా హైదరాబాద్​లో తీసుకుంటే రేడియేషన్​కు​ పాతపద్ధతులు వాడట్లేదు. 
 

అడ్వాన్స్​డ్​​ టెక్నాలజీనే వాడుతున్నారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రత తగ్గి, రేడియేషన్ వల్ల కలిగే లాభాలు పెరుగుతాయి. 

ఇమ్యునోథెరపీ

లేటెస్ట్​గా ఇమ్యునోథెరపీ అనే ట్రీట్​మెంట్ కూడా వచ్చింది. సాధారణం​గా శరీరంలో రోగనిరోధక శక్తి ఉంటుంది. అది రక్షణ కవచంలా ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది. అయితే, క్యాన్సర్​లో అది కూడా ఏం చేయలేదు. క్యాన్సర్​ కణాలు రోగనిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేస్తాయి. ఇమ్యునోథెరపీ వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, క్యాన్సర్​ కణాలకు ఉన్న ముసుగును బ్రేక్​ చేస్తాయి. అప్పుడు శరీరంలో ఉండే టి–సెల్స్, బి–సెల్స్ అనే తెల్ల రక్తకణాలు వెళ్లి దానికి అటాచ్ అవుతాయి. 

అలాగయితే, మనలో ఉన్న ఇమ్యూనిటీ కూడా క్యాన్సర్​ కణాలతో పోరాడొచ్చు కదా అనిపిస్తుంది. కానీ, తెల్ల రక్త కణాలకు... క్యాన్సర్​ కణాలు అనే తేడా తెలియక సమస్య వచ్చి పడుతుంది. అలాంటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఉదాహరణకు థైరాయిడ్​ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇలానే శరీరంలో ఎక్కడైనా సమస్యలు తలెత్తొచ్చు. అందుకే ఆ ప్రాబ్లమ్స్ గురించి పేషెంట్స్​కి ముందే చెప్పి అవి వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్​కి వెళ్లమని చెప్తాం’’ అని వివరించారు డాక్టర్ యుగంధర్. 

*   *   *

తక్కువ ఖర్చుతోనే...

ట్రీట్​మెంట్​లో సర్జరీ అనేది పాత పద్ధతే అయినా గవర్నమెంట్​ హాస్పిటల్స్​లో ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. చాలా హాస్పిటల్స్​లో తక్కువ ఖర్చుతోనే ట్రీట్​మెంట్ అందుతోంది. అయితే క్యాన్సర్​ ట్రీట్​మెంట్​ విషయంలో ఖర్చుకు భయపడడంలో నిజముంది. ఎందుకంటే అది కొన్ని రోజుల్లో తగ్గిపోయే జబ్బు కాదు. అందువల్ల ట్రీట్​మెంట్​, అబ్జర్వేషన్, మెడిసిన్​ వంటివాటికి అయ్యే ఖర్చు ఎక్కువరోజులు భరించాల్సి వస్తుంది. చాలావరకు సర్జికల్ ట్రీట్​మెంట్స్ తక్కువ ఖర్చుతోనే అయిపోతాయి.


ట్రీట్​మెంట్ - తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

    సర్జరీ, కీమో థెరపీ, రేడియేషన్.. వీటిలో ఏ ట్రీట్​మెంట్ చేయించుకుంటున్నా మంచి ఫుడ్​ తినాలి.  ప్రొటీన్స్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి. రికవరీకి అది ఎంతగానో ఉపయోగపడుతుంది.
    

షుగర్స్ తగ్గించాలి. ఆహారంలో గుడ్లు, పాలు, పండ్లు తీసుకోవడం పెంచాలి.
    

ఓపిక ఉంటే... చిన్న పాటి వ్యాయామాలు చేస్తే బెటర్. ఉదయం, సాయంత్రం పది లేదా పదిహేను నిమిషాల నడక. ఓ మాదిరి ఎక్సర్​సైజ్​ చేయడం వల్ల ట్రీట్​మెంట్ తట్టుకోగలుగుతారు. 

    ప్రత్యేకించి కీమో థెరపీ, రేడియేషన్ చేయించుకునేటప్పుడు శుభ్రత పాటించాలి. ఉదాహరణకు నోటి క్యాన్సర్ ట్రీట్​మెంట్​ తీసుకుంటుంటే కనుక ఆ పేషెంట్ నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. స్పైసీ ఫుడ్ తినకూడదు. 
    

రేడియేషన్ చేయించుకుంటున్న ప్రాంతంలో సబ్బు వాడకూడదు. నీళ్లతో శుభ్రం చేసుకోవచ్చు.
    

కీమో థెరపీ చేయించుకునేటప్పుడు నలుగురిలోకి వెళ్లకూడదు. బయటకు వెళ్లాల్సి వస్తే ఇన్ఫెక్షన్ రాకుండా మాస్క్​ పెట్టుకోవాలి. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. పేషెంట్​ ఎంత శుభ్రంగా ఉంటే... అది వాళ్ల ట్రీట్​మెంట్​ రిజల్ట్​ మీద అంత ఎఫెక్ట్ చూపిస్తుంది. 
    

ట్రీట్​మెంట్ పూర్తయ్యాక రికవరీ మీద దృష్టి పెట్టాలి. అదెలాగంటే.. డాక్టర్ చెప్పినట్టుగా రెగ్యులర్​గా చెకప్స్​ చేయించుకోవాలి. క్యాన్సర్​ రకాన్ని బట్టి రెండు లేదా నాలుగు నెలలకు ఒకసారి చెకప్​కు వెళ్లాల్సి ఉంటుంది. 
    

శరీరంలో క్యాన్సర్​ కాని గడ్డలు కూడా ఉంటాయి. అవి మళ్లీ మళ్లీ వచ్చే ఛాన్స్​ ఉంటుంది.  అందుకని వాటిని ఆరు నెలలకు ఒకసారి చెకప్ చేయించుకోవాలి. వీటిని ఫాలో అప్స్ అంటారు. 
    

డాక్టర్​తో పేషెంట్స్​ రెగ్యులర్​ ఫాలో అప్​లో ఉండాలి. ఒకవేళ జబ్బు తిరగబెడితే అది ప్రాధమిక దశలో ఉన్నప్పుడే గుర్తించడం ఈజీ అవుతుంది. వెంటనే దానికి ట్రీట్​మెంట్​ ఇచ్చే ఛాన్స్​ ఉంటుంది. 

లైఫ్ స్టయిల్ మారిపోతుంది

క్యాన్సర్​ తగ్గిపోయాక అంతకుముందులా లైఫ్ స్టయిల్ లీడ్​ చేస్తాం అంటే కుదరదు. లైఫ్​ స్టయిల్​లో మార్పులు తప్పనిసరి. హెల్దీ డైట్ తినాలి. రెగ్యులర్ చెకప్స్​ అవసరం. బీపీ, డయాబెటిస్​కి మల్లే క్యాన్సర్​ కూడా పూర్తిగా నయమయ్యే జబ్బు కాదు. కాబట్టి పేషెంట్​ని వాళ్ల కుటుంబసభ్యులు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ల చుట్టూ హెల్దీ ఎన్విరాన్​మెంట్ ఉండాలి. ఇలాంటి విషయాలను డాక్టర్లు ముందుగానే చెప్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే  కండిషన్డ్​ లైఫ్​ లీడ్ చేయాలి. అలాగని దాన్నేదో పెద్ద విషయంలా చూడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన లైఫ్​ స్టయిల్​ అనుసరించాలి. 

యాంటీ క్యాన్సర్ డ్రగ్ వల్ల..

క్యాన్సర్​ ట్రీట్​మెంట్​లో భాగంగా చేసే కీమో థెరపీలో కొన్ని రకాల డ్రగ్స్ ఉంటాయి. ఒకటి నార్మల్​గా ఇచ్చే కీమో థెరపీ డ్రగ్​, రెండోది యాంటీ క్యాన్సర్ డ్రగ్​. ఉదాహరణకు హర్​సెప్టిన్ మెడిసిన్​ తీసుకుంటే... బ్రెస్ట్​ క్యాన్సర్​ ట్రీట్​మెంట్​లో ఈ మందు వాడతారు. ఇది​ టార్గెట్​గా అంటే క్యాన్సర్​ కారక కణాల​ మీద పని చేస్తుంది. అందుకే దీన్ని యాంటీబాడీ అంటారు. అయితే వీటిలో కూడా రకాలు ఉన్నాయి.  హర్​సెప్టిన్ మెడిసిన్​ తీసుకునేవాళ్లు  రెండు నెలలకు ఒకసారి 2డిఎకో టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే హర్​సెప్టిన్​ వల్ల గుండె మీద కొంత ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి గుండె పనితీరు ఎలా ఉంది? అనేది తరచూ చెక్ చేసుకుంటుండాలి. 

ఇలాంటిదే మరో యాంటీబాడీ, వాస్క్యులార్​ ఎండోథిలియల్ గ్రోత్ ఫ్యాక్టర్ అనే దాని మీద పని చేస్తుంది. అది ఇచ్చినప్పుడు రక్త సరఫరాని చాలావరకు ఆపేస్తుంది. రక్త కణాలు, ఆర్టరీస్, వీన్స్ పనిచేయకుండా చేస్తుంది. అలాగే సైడ్​ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బీపీ పెరగడం, మానని గాయాలు అవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి డ్రగ్​కి ఒక్కో రకమైన సైడ్​ ఎఫెక్ట్స్ ఉంటాయి.

అందుకే పేషెంట్​ ప్రొఫైల్​ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ​మామూలుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే.. ఎక్కువ నీరసం, ఆయాసం వంటివి రాకుండా చూసుకోవాలి. క్యాన్సర్​ నుంచి బయటపడాలంటే కౌన్సెలింగ్‌ కూడా చాలా అవసరం. గత తొమ్మిదేండ్లుగా ఇండియాలో క్యాన్సర్ కౌన్సెలర్స్ అందుబాటులో ఉంటున్నారు. కానీ, ఈ సంఖ్య ఇంకా పెరగాలి.

అసలు క్యాన్సర్​ బారిన పడకుండా ఉండాలంటే... చేయాల్సింది మన చేతిలోనే ఉంది. కావాల్సింది హెల్దీ లైఫ్​ స్టయిల్.​ అంటే... సరైన తిండి తినాలి. ఎక్సర్​సైజ్​ చేయాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. కంటి నిండా నిద్రపోవాలి.

కాషన్  

క్యాన్సర్ కనుక్కోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏడు లక్షణాలు చెప్పింది. అయితే ఈ లక్షణాలు క్యాన్సర్​లో మాత్రమే ఉండవు. కానీ... ఈ లక్షణాలు ఉంటే మాత్రం భయపడకుండా వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్లి టెస్ట్​ చేయించుకోవాలి అని చెప్తుంది డబ్ల్యూహెచ్​ఓ.

    పేగు, పొత్తికడుపులో మార్పులు 
(C--– Change in bowel or bladder habits)
    

మానని గడ్డలు 
(A – Sore that does not heal)
  

 అన్ యూజువల్ బ్లీడింగ్ లేదా డిశ్చార్జ్​ (U – Unusual bleeding or discharge)
    

అవయవాల్లో గడ్డలు గట్టిపడడం 
(T – Thickening or lump in the breast or elsewhere)
  

 అజీర్ణం (I –Indigestion)
    పుట్టు మచ్చలు, పులిపిర్లలో మార్పు 
(O – Obvious change to warts or moles)
  

 ఆగకుండా దగ్గు రావడం 
(N – Nagging cough)

అందరికీ కీమో అవసరం లేదు

క్యాన్సర్ అనగానే ‘సర్జరీ, కీమో థెరపీ, రేడియేషన్’ వంటి పదాలు గుర్తుకొస్తాయి. అయితే క్యాన్సర్​ వచ్చిన ప్రతి పేషెంట్​కి ఇవన్నీ  అవసరం ఉండదు. కొందరికి సర్జరీ అవసరం అవుతుంది. ఇంకొందరికి కీమో థెరపీ మాత్రమే సరిపోతుంది. మరికొందరికి కేవలం రేడియేషన్​ చేస్తే చాలు.  కొందరికి మాత్రం కాంబినేషన్​ ఆఫ్​ సర్జరీ అండ్ రేడియేషన్ లేదా కాంబినేషన్ ఆఫ్ కీమో థెరపీ అండ్ రేడియేషన్ చేయాల్సి వస్తుంది.

క్యాన్సర్​ రకాన్ని బట్టి ట్రీట్​మెంట్​ ఉంటుంది. ఉదాహరణకు.. ప్రస్తుతం కామన్​గా ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్​ తీసుకుంటే... దానికి సర్జరీ చేస్తారు. క్యాన్సర్​ స్టేజ్​ని బట్టి తర్వాత కీమో చేస్తారు. ఆపై రేడియేషన్ కూడా. ఆ తర్వాత హార్మోనల్ ట్రీట్​మెంట్ ఉంటుంది. ఇలా ఒక్కో రకాన్ని బట్టి ట్రీట్​మెంట్​లో ఏ కాంబినేషన్ ఇస్తే పేషెంట్​కి తక్కువ ఇబ్బందితో ఎక్కువ లాభం కలుగుతుంది... ఎక్కువగా క్యూర్ అవుతారు? అనేది చూసి అలా ప్లాన్ చేస్తాం.

ఇవన్నీ కూడా పేషెంట్​కు ట్రీట్​మెంట్ స్టార్ట్ అవ్వకముందు ట్యూమర్ బోర్డ్ మెంబర్స్  అందరూ కలిసి డిస్కస్ చేస్తారు. ప్రతి హాస్పిటల్లో ఇలాంటి బోర్డ్ ఒకటి ఉంటుంది. పేషెంట్​కు సంబంధించిన వివరాలన్నీ ఆ బోర్డ్​ దగ్గర ఉంటాయి. ఆ కేస్​ గురించి ముందుగా డిస్కస్​ చేసి ఆ తర్వాత ఏ ట్రీట్​మెంట్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తాం. కాబట్టి అది ‘ఫలానా డాక్టర్ చేశారు’ అనడానికి లేదు. టీం మెంబర్స్ డెసిషన్. 
-
 డాక్టర్ యుగంధర్ శర్మ
సీనియర్ కన్సల్టెంట్ & డిపార్ట్​మెంట్ ఆఫ్​ రేడియేషన్ ఆంకాలజీ హెడ్​
రెనోవా క్యాన్సర్ సెంటర్, కార్ఖానా,  సికింద్రాబాద్​

స్టేజ్​లు ఉండవు

నార్మల్ క్యాన్సర్​లు ఏ స్టేజీలో అయినా కనుక్కోవచ్చు. బ్లడ్ క్యాన్సర్ అయితే స్టేజ్​లు ఉండవు. బాడీ మొత్తం ఒకటే రక్తం ప్రవహిస్తుంది కాబట్టి. అదే లంగ్ క్యాన్సర్​ అయితే ఎర్లీ స్టేజ్​లో కూడా కనుక్కోవచ్చు. అది ఏ ఏజ్​లో అయినా రావచ్చు. కొన్ని క్యాన్సర్లు ఒక వయసు వాళ్లకు మాత్రమే వస్తాయి. ఉదాహరణకు అక్యుట్​ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అనేది పిల్లల్లో చాలా కామన్.

పెద్దవాళ్లలో అయితే వాళ్ల లైఫ్ స్టయిల్, డైట్.. వంటివాటిపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా బ్లడ్​ క్యాన్సర్​​లో రకాలు ఉంటాయి. లింఫోమా, మైలోమా, లింఫో బ్లాస్టిక్ లుకేమియా, మైలో బ్లాస్టిక్ లుకేమియా, అక్యుట్ లుకేమియా, క్రానిక్ మైలాయిడ్ లుకేమియా వంటివి ఉంటాయి. వీళ్లలో ఎక్కువగా వచ్చే మైలోమా పేషెంట్స్. దీనికి కారణాలు అనేకం. జీన్ మ్యుటేషన్స్ వల్ల, దాన్ని బాడీ రిపేర్ చేసుకోక పోవడం వల్ల ఎముకల మీద ఎఫెక్ట్​ చేసి క్యాన్సర్​కి కారణమవుతాయి. 

లక్షణాలు..

బ్లడ్ తక్కువ కావడం వల్ల ఆయాసం రావచ్చు. తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి.  బరువు తగ్గడం. రాత్రిపూట విపరీతంగా చెమటలు పట్టడం. చిగుళ్ల నుంచి రక్తం కారడం. ఒంటి మీద ఎర్రటి మచ్చలు. ఎముకల్లో నొప్పి, వెన్ను నొప్పి, ఎముకలు ఫ్రాక్చర్ అవ్వడం. శరీరం మీద గడ్డల్లాగ రావడం, జ్వరం, బలహీనంగా ఉండడం.

క్యాన్సర్ పేషెంట్స్​కి వయసు, ఫిజికల్​ ఫిట్​నెస్, హెల్త్ రిపోర్ట్​, క్యాన్సర్​ స్టేజ్​​ని బట్టి ట్రీట్​మెంట్ ఉంటుంది. దగ్గు, దాంతోపాటు రక్తం పడితే బయాప్సీ చేస్తారు. బ్లడ్​ క్యాన్సర్ అయితే బ్లడ్ టెస్ట్, బోన్​ మారో టెస్ట్​ చేస్తారు.

  – డాక్టర్ బైరెడ్డి పూజిత 
హెమటాలజిస్ట్​, ఆంకాలజిస్ట్, 
బోన్​ మారో ట్రాన్స్​ప్లాంట్ ఫిజీషియన్
కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్

టెస్ట్ చేయించుకోవాలి

క్యాన్సర్స్​లో ఫలానా రకం క్యాన్సర్​ అయితే త్వరగా నయమవుతుంది. మరొకటైతే చాలా టైం పడుతుంది అని చెప్పలేం. ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం ట్రీట్​మెంట్ చేస్తే తగ్గిపోతుంది. వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాంటప్పుడు స్క్రీనింగ్ గైడ్ లైన్స్ ఫాలో కావాలి. మహిళల్లో అయితే పాప్​స్మియర్ అనేది 20 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. మమ్మోగ్రఫీ అనేది 45 ఏండ్లు పైబడిన వాళ్లు చేయించుకోవాల్సిన టెస్ట్​. అలాగే 50 ఏండ్లు దాటిన ఆడ, మగ ఇద్దరూ కొలనో స్కోపీ చేయించుకోవాలి.

ఇండియాలో లంగ్, నోటి క్యాన్సర్స్​ ఎక్కువ. పాన్​, చుట్ట, బీడీ, సిగరెట్​లు కాల్చే అలవాటు ఉన్నవాళ్లు స్ర్కీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. ముఖ్యంగా ఇండియాలో క్యాన్సర్​లను 60 శాతం ఆలస్యంగా గుర్తిస్తున్నారు. ఆ ఆలస్యం జరగకుండా ఉండాలంటే అవగాహన కల్పించే కార్యక్రమాలు పెంచాలి. అప్పుడు స్ర్కీనింగ్ టెస్ట్​లు త్వరగా చేయించుకోగలుగుతారు. ఎర్లీ స్టేజ్​ల్లో క్యాన్సర్​ బారిన పడ్డారనే విషయం తెలిస్తే డాక్టర్లు పూర్తిగా నయం చేయగలుగుతారు. 

పాజిటివిటీ పవర్​ఫుల్​

ఒక మహిళకు లివర్ క్యాన్సర్ వచ్చింది. ట్రీట్​మెంట్​ కోసం చాలా చోట్ల తిరిగిందామె. పది సార్లు బయాప్సీ టెస్ట్​లు చేశారు. వెళ్లిన ప్రతిచోటా డాక్టర్లు ఆమెకు ‘‘ఆరు నెలలు మాత్రమే బతుకుతావ’’ని చెప్పారు. ఆమెకి పన్నెండేండ్ల కూతురు ఉంది. ఆ కూతురి కోసమైనా తాను బతకాలని పాజిటివ్​ లైఫ్​ స్టయిల్ లీడ్ చేయడం మొదలుపెట్టింది. ‘క్యాన్సర్​ వచ్చి ఆమెకి ఇప్పటికి 20 ఏండ్లు’ అని చెప్పుకుంటున్నారు అంతా. అందుకు కారణం పాజిటివిటీ. దానికోసం సైకియాట్రిస్ట్, యోగా గురువుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. మనోధైర్యమే సగం వైద్యం చేస్తుంది.

అలాగే ‘‘విదేశాల్లో క్యాన్సర్ ట్రీట్​మెంట్​ కోసం సీబీడీ ఆయిల్ వంటి నేచురల్ పద్ధతులు ఉన్నాయి. మన దగ్గర కూడా ఆయుర్వేద, హోమియోపతి వైద్యాలు ఉన్నాయి. కానీ, వాటి గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. అల్లోపతికి సంబంధించి రీసెర్చ్ నుంచి మెడిసిన్, రిజల్ట్ వరకు ఇన్ఫర్మేషన్ మొత్తం అందుబాటులో ఉంది. అందుకే దాని గురించి ఎక్కువగా తెలుస్తోంది. 
-
 డాక్టర్ శైలేష్​ 
మెడికల్ డైరెక్టర్ &  ఆంకో సర్జన్, పుణె

మనీష పరిమి