43 ఏండ్లలో 12 సార్లు విడాకులు.. ప్రభుత్వ డబ్బుల కోసం దంపతుల కక్కుర్తి

  • కేసు నమోదు చేసిన ఆస్ట్రియా సర్కార్

వియన్నా: ఆస్ట్రియాలోని వియన్నాలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ప్రభుత్వ పథకం ద్వారా వచ్చే డబ్బులకు కక్కుర్తి పడి..ఓ జంట 43 ఏండ్లలో ఏకంగా 12 సార్లు విడాకులు తీసుకుంది. దాంతో దంపతులపై ఆస్ట్రియా ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దేశంలోని వితంతువులకు, విడాకుల వల్ల భర్తకు దూరంగా ఉండే మహిళలకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని ఆస్ట్రియా సర్కార్ గతంలో నిర్ణయించింది. దీని కోసం ఓ స్కీమును ప్రవేశపెట్టింది. ఒక్కొక్కరికి 28,405 డాలర్ల(రూ. 24 లక్షలు) చొప్పున పెన్షన్ గా అందజేసింది. 

వియన్నాలో నివసించే జంట.. ఈ పథకంలోని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కావాలనే డైవర్స్ తీసుకుని, పెన్షన్ డబ్బులు పొందేవారు. రెండు మూడేండ్ల తర్వాత మళ్లీ పెండ్లి చేసుకునేవారు. ఆ తరువాత మళ్లీ డైవర్స్ తీసుకునే వారు. ఇలా గత 43 ఏండ్లలో 12 సార్లు విడాకులు తీసుకున్నట్లు నాటకమాడి సుమారు రూ. 2 కోట్ల 88 లక్షల ప్రభుత్వ సొమ్మును కాజేశారు. ఇటీవల సదరు మహిళ..13వ సారి తన భర్తకు డైవర్స్ ఇచ్చేసింది. 

ఆ తరువాత యథావిధిగా పెన్షన్ కోసం ప్రభుత్వ కార్యాలయానికి వచ్చింది. ఈ క్రమంలో అధికారులు ఆమె గురించి విచారించగా.. జంట నడుపుతున్న నాటకం వెలుగులోకి వచ్చింది. వీరు ఈ స్కామ్ 1988లో స్టార్ట్ చేసినట్లు గుర్తించారు. దాంతో అధికారులు జంటపై కేసు ఫైల్ చేశారు.  ఇప్పుడు జంట చేసిన నిర్వాకం స్థానికంగా సంచలనంగా మారింది.

ALSO READ : ఇప్పుడు వీటితో కూడా చంపుతున్నారా : ఇయర్ఫోన్ కేబుల్స్తో అప్పుడే పుట్టిన బిడ్డను చంపిన తల్లి

కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ఉద్దేశించిన పథకంలోని లోపాలను అడ్డుపెట్టుకుని మోసంతో  జంట లబ్ధి పొందడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో షాక్ కు  గురైన అధికారులు.. ఇలాంటి మోసాలు ఇంకా ఎన్ని జరిగాయే తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాస్పద జంటల చరిత్రను నిశితంగా పరిశీలిస్తున్నారు.