ఇంట్లోకి అడుగుపెట్టగానే ‘హాయ్..’ అని మొక్కలు పలకరిస్తే మనసుకు హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. అంతేనా ఇంటి కళే మారిపోతుంది. నేచర్‌ని మించిన ఇంటీరియర్ ఇంకేముంటుంది మరి! ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో పెంచే మొక్కలు మనుషుల్ని నేచర్‌కి కనెక్ట్ చేస్తాయి. చాలామందికి ఇండోర్ ప్లాంట్స్ పెంచాలని ఉంటుంది. అయితే అందుకు నీళ్లు, వెలుగు, ప్రేమ ఉంటే సరిపోదు. మొక్కలు చక్కగా పెరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలానే ఉన్నాయి.
కుండీ తెచ్చాం. మట్టిని నింపాం. మొక్కను నాటాం అంటే సరిపోదు. మొక్కలకోసం టైం ఇవ్వగలగాలి. వాటికోసం ఎఫర్ట్ పెట్టాలి. మొక్కలు పెంచడం అనేది ఒకరకంగా ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పొచ్చు. అందుకే మొక్కలు పెంచాలనే ఆసక్తి, కమిట్మెంట్తో పాటు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి.
వెలుగు అవసరం కానీ...
ఇంట్లో మొక్కలు పెంచాలని డిసైడ్ అయ్యాక వాటిని ఎక్కడ పెట్టాలనేది చూసుకోవాలి. పెంచాలనుకున్న మొక్క ఇంట్లోని వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుందా? లేదా? చూసుకోవాలి. అంటే... వెలుగు, తేమతో పాటు కిటికీ రెక్కలు, ఇంటి తలుపులు మూసి ఉన్నప్పుడు మొక్కకు ఎంత తేమ అందుతుంది అనేది చూసుకోవాలి. ఇలా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ వాతావరణానికి సరిపడే మొక్కను సెలక్ట్ చేసుకుంటే మొక్క పెంచడం ఈజీ అవుతుంది.
మొక్కలకు సరైన కాంతి అందితేనే కిరణజన్యసంయోగక్రియ జరుగుతుంది. అప్పుడే మొక్క సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోగలుగుతుంది. సరైన పోషకాలు అందుతాయి. సరైన కాంతి మొక్కమీద పడకపోతే ఏమవుతుందనే దాన్ని సామాన్యమైన భాషలో చెప్పాలంటే... ఆకలికి అలమటిస్తుంది. దాంతో నెమ్మదిగా క్షీణించిపోతుంది.అందుకే మొక్కలు పెంచాలన్న ఆలోచన రాగానే మొక్కలు పెట్టాలనుకున్న ఏరియాలో వెలుగు ఎంత, ఎలా పడుతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఎంత వెలుతురు ఉంటుంది. ఎంతసేపు ఉంటుంది. వెలుగు పడే డైరెక్షన్ ఎలా ఉంది అనే విషయాల గురించి స్టడీ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏ మొక్క తెచ్చుకోవాలనే విషయం పట్ల స్పష్టత వస్తుంది.
ఈ కాంతిని తక్కువ, ఓ మాదిరి, ఎక్కువ, నేరుగా పడటం అని విడదీసుకోవాలి. అబ్బా ఇంత చూడాలా? అనేవాళ్లకు ఒకమాట ఏంటంటే... సాధారణంగా అందరూ చేసే కామన్ మిస్టేక్... ఇంట్లో వచ్చే వెలుగును అంచనా వేయడంలో పొరపాటు పడడం. వెలుగు స్థాయి రోజు మొత్తం ఒకేలా ఉండదు. మారుతుంటుంది. అలాగే ఏడాది మొత్తంలో కూడా సీజన్‌ని బట్టి మారుతుంటుంది. ఇంటిలోపలకి ఎంత వెలుగు పడుతుందో కచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే లైట్ మీటర్ తెచ్చుకోవచ్చు. దీని ద్వారా ఎంత వెలుగు పడుతుందనేది కచ్చితంగా తెలుసుకోవచ్చు. వెలుగు ఎంత పడుతుందనే దాన్ని ఫుట్ క్యాండిల్స్(ఎఫ్.సి.)లో కొలుస్తారు.
తక్కువ వెలుగు ఉంటే 100 నుంచి 250 ఫుట్ క్యాండిల్స్
ఓ మాదిరి వెలుగు ఉంటే 250 నుంచి 400 ఫుడ్ క్యాండిల్స్
ఎక్కువ వెలుగు ఉంటే 400 ఫుట్ క్యాండిల్స్
ఈ లెక్క సరిగా తెలుసుకోగలిగితే మొక్కలకు ఏం కావాలో అర్థమవుతుంది. ఏ మొక్కలు పెరుగుతాయో తెలుస్తుంది. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. తక్కువ వెలుగు మాత్రమే భరించే మొక్కలు ఎక్కువ వెలుగును ఇష్టపడొచ్చు. కానీ ఎక్కువ వెలుగు అవసరమైన మొక్కలు మాత్రం తక్కువ వెలుగులో హ్యాపీగా ఉండవు. వెలుగుకు సంబంధించి ఇంకా తెలుసుకోవాలంటే హౌస్ ప్లాంట్ లైట్ చార్ట్ చూస్తే ఇంకా బాగా అర్ధమవుతుంది.
మట్టితో మన్నిక
ఇంట్లో పెంచే మొక్కలకు నీళ్లు బాగా డ్రెయిన్ చేసుకునే మట్టి కావాలి. అందుకని బయట తవ్వి తెచ్చే మట్టి కాకుండా పాటింగ్మిక్స్ తెచ్చుకోవాలి. మొక్కలను నాటే మట్టి ఎంపిక... ఏ రకం మొక్క పెంచాలనుకునేదాన్ని బట్టి ఉంటుంది. హౌస్ ప్లాంట్స్ లేదా కంటెయినర్ గార్డెన్స్‌కి సంబంధించిన పాటింగ్మిక్స్ ఏదైనా ఓకే. కాక్టస్, సక్యులెంట్ మొక్కలకి తేలికగా ఉండే మట్టి కావాలి. ఇలాంటి మొక్కల కోసం తయారుచేసిన మిక్స్ వాడాలి.
కుండీ కరెక్ట్‌గా...
కుండీ సరైనది ఉంటేనే మొక్క హ్యాపీగా పెరుగుతుంది. కుండీకి రంధ్రాలు ఉంటేనే అదనంగా ఉండే నీళ్లు బయటకు పోతాయి. లేకపోతే నీళ్లు ఎక్కువై మొక్క వేళ్లు మురిగిపోయి, నీళ్లు మురుగు వాసన వస్తాయి. కుండీ కింద ప్లాస్టిక్ ప్లేట్స్ ఉంచితే బయటకు వచ్చిన నీళ్ల వల్ల ఇల్లు ఆగంకాదు. కుండీకి వాడిన మెటీరియల్ బట్టి కూడా మొక్క వేళ్లకు సరిపడా తేమ అందుతుంది. అందుకే గ్లేజ్డ్, ప్లాస్టిక్ కుండీలు కాకుండా సన్నటి రంధ్రాలు ఉండే కుండీలు వాడాలి. ఇవి అయితే వేళ్లకు తేమ సరిగా అందుతుంది.
హైడ్రేటెడ్‌గా...
మొక్కలకు నీళ్లు అవసరం. అలాగని కావాల్సిన దానికంటే తక్కువ లేదా ఎక్కువ నీళ్లు పోస్తే పాడవుతాయి. ఒక్కో మొక్కకు, వాతావరణాన్ని బట్టి ఒక్కో రకంగా నీళ్లు పట్టాలి. నీళ్లు ఎక్కువ తక్కువ సమస్యలు లేకుండా ఉండాలంటే... మొక్కని జాగ్రత్తగా గమనించాలి. మొక్కకు నీరు పెట్టకముందు ఆ మొక్కకు ఎంత తేమ ఉన్నది చూడాలి. అలా కుదరడం లేదు అనుకుంటే మాయిశ్చర్ మీటర్‌ను పెడితే తేమ ఎంత శాతం ఉందనేది ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. మొక్క ఆకులు వేలాడడం, కుండీ అంచుల నుంచి మట్టి బయటకు వదిలినట్టు ఉండడం, కుండీలోని మట్టి పగిలిపోయి, పొడి బారినట్టు ఉన్నా లేదా మొక్కను కుండీ నుంచి బయటకు ఈజీగా లాగేసేలా ఉన్నా నీరు లేదని అర్థం. నిజానికి ఇంత పరిస్థితి రాకముందే రోజూ మొక్కల్ని గమనిస్తుంటే నీళ్లు ఎప్పుడు పోయాలో తెలిసిపోతుంది.
సౌకర్యంగా...
చాలావరకు మొక్కలు ఉష్ణమండలంలో పెరుగుతాయి. కానీ ఇంట్లో పెంచుకునే మొక్కలకు చాలావరకు నీళ్లలో ఉండే టెంపరేచర్ సరిపోతుంది. ఓ మాదిరి ఉష్ణోగ్రత ఉండి తేమ ఉండి, మంచి గాలి వెలుతురు ఉన్న వాతావరణంలో మొక్కలు హాయిగా పెరుగుతాయి. సీలింగ్ ఫ్యాన్, హ్యుమిడిఫైర్ ఉంటే చాలు ఇంటి లోపల మొక్కలు పెంచొచ్చు.
ప్లాంట్ ఫుడ్
మొక్కలు ఆహారాన్ని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారుచేసుకుంటాయి అనే విషయం తెలిసిందే. అయినా కూడా బయటినుంచి వాటికి తిండి పెట్టాలి. మొక్కలకి విటమిన్ బూస్ట్ అంటే ఫెర్టిలైజర్స్. అయితే వాటిని ఎంత వేస్తున్నారు, ఎప్పుడు వేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మొక్కలు ఎదుగుతున్న దశలో ఫెర్టిలైజర్స్ వాడాలి అంటారు ప్లాంట్ ఎక్స్పర్ట్స్. సింపుల్‌గా చెప్పాలంటే ఫెర్టిలైజర్‌ను మొక్కలకు తల్లిదండ్రులు! ఏడాదికి ఒకటి లేదారెండుసార్లు ఫెర్టిలైజర్స్ వాడితే చాలు. ఒకవేళ మీ ఇంట్లో పెరిగే మొక్క బాగా ఎదగాలి అనుకుంటే ఫెర్టిలైజర్ ప్యాక్ మీద ఇచ్చిన సూచనల ఆధారంగా వాడాలి.
పురుగు– పుట్ర
రకరకాల పురుగులు మొక్కమీద రకరకాల ప్రాంతాల్లో ఉంటాయి. ఆకు, కాడను అంటిపెట్టుకుని ఉండే ప్రాంతంలో సాలె గూళ్లు కనిపిస్తాయి. మొక్క వాలిపోవడం, ఆకులు పసుపురంగుకి మారడం, మచ్చలు, తెల్లటి కాటన్ బాల్స్ వంటివి గమనిస్తుండాలి. సింక్ లేదా షవర్ దగ్గర మొక్కల్ని రెగ్యులర్‌గా కడుగుతుండాలి. ఇలా చేయడం వల్ల పురుగులు మొదలైతే నీళ్లతో పాటు పోతాయి. ఇదంతా చదివాక అబ్బో మొక్కలను పెంచడం కష్టమే అనిపించొచ్చు. కానీ ఇక్కడ చెప్పిన సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే... అదేమంత కష్టం కాదు. ఇంట్లో నేచర్‌ను ఎంజాయ్ చేయాలంటే ఈ మాత్రం శ్రమ పడకపోతే ఎలా?