టీచర్ల కౌన్సెలింగ్​లో గందరగోళం

  • అధికారుల తప్పిదంతో అభ్యర్థులకు నష్టం
  • 12వ ర్యాంకు సాధించినా లిస్ట్​లో కనపించని ఓ అభ్యర్థి పేరు
  • అభ్యర్థుల కోరుకున్న పోస్ట్ కేటాయించని వైనం 
  • ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ ఉపాధ్యాయ సంఘాల ఆందోళన 


 ఆదిలాబాద్, వెలుగు: డీఎస్సీలో జాబ్​ సాధించి ఇటీవలే నియామక పత్రాలు అందుకున్న కొత్త టీచర్లకు ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన కౌన్సెలింగ్​ గందరగోళం, ఉద్రిక్తతల మధ్య సాగింది. డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందని చెప్పడంతో ఎంపికైన అభ్యర్థులు ఉదయం 9 గంటలకే అక్కడికి చేరుకున్నారు. కానీ కొద్దిసేపటికే సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించడంతో నిరాశతో వెనుదిరిగారు.

 అయితే మళ్లీ కొద్దిసేపటికి మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్ చేపడుతామని డీఈవో ప్రెస్ నోట్ రిలీజ్ చేయడంతో వారంతా తిరిగి కేంద్రానికి చేరుకున్నారు. కానీ ఉద్యోగం సాధించిన టీచర్ల జాబితాలో పలువురు అభ్యర్థులు పేర్లు లేకపోవడంతో సదరు బాధితులతో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. 12వ ర్యాంకు సాధించిన అభ్యర్థి సాయికృష్ణ పేరు లేకపోగా.. మరికొందరు స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ రెండింటిలో ర్యాంకు సాధించగా వారికి ఇష్టమైన పోస్టింగ్ కేటాయించకపోవడంతో గందరగోళం నెలకొంది. ఆందోళనల కారణంగా మధ్యాహ్నం 2 గంటలకు కూడా కౌన్సెలింగ్​మొదలు కాలేదు.

మొత్తం 266 మందికి పోస్టింగ్

కౌన్సెలింగ్​లో మొత్తం 266 మంది కొత్త టీచర్లకు పోస్టింగ్‌ ఇచ్చారు. వీరిలో 72 మంది స్కూల్‌ అసిస్టెంట్లు ఉండగా 194 మంది ఎస్జీటీలుఉన్నారు. అభ్యర్థులు సాయికృష్ణ, శివాజీతోపాటు ఎస్జీటీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ అభ్యర్థిని అండర్‌ టేకింగ్‌ తీసుకొని పోస్టింగ్‌ కల్పిస్తామని వెల్లడించారు. వీరు ఎంచుకున్న పాఠశాలలను అబయెన్స్​లో పెట్టినట్లు అధికారులు చెప్పారు.

ఆందోళన చేస్తున్న టీచర్ల అరెస్ట్

విద్యాశాఖ అధికారులు కావాలనే తమకు పోస్టింగ్ ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, అక్రమాలతో అభ్యర్థులకు నష్టం జరిగిందని, వెంటనే వారికి పోస్టింగ్ ఇవ్వాలని డీఈవో ప్రణీతతో  ఉపాధ్యాయ సంఘాలు, కుల సంఘాల నాయకులు, బీజేపీ నేత పాయల్ శరత్ ఆందోళన చేశారు. డీఈవో చాంబర్ లో అభ్యర్థులు, నేతల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీస్ బలగాలు మోహరించాయి. అర్హులైన అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చిన తర్వాతే కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.

పోస్టింగ్ కేటాయించడంలో అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతిపై అధికారులు విచారణ చేపట్టాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆందోళన చేస్తున్న టీచర్లను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. సాయంత్రం 5 గంటల తర్వాత అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి డీఈవో ఆఫీస్​కు చేరుకొని ఆర్డీవో వినోద్ కుమార్, డీఈవో, జడ్పీ సీఈవో జితేందర్ రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం పోలీస్ బందోబస్త్ మధ్య కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించగా రాత్రి వరకు సాగింది. 

ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్ కాలనీకి చెందిన నేరెళ్ల సాయికృష్ణ ఎస్జీటీ తెలుగులో 12వ ర్యాంక్ సాధించాడు. అయితే జిల్లా విద్యాశాఖ అధికారులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాలో సాయికృష్ణ పేరు లేదు. విద్యాశాఖ డైరెక్టర్ కు పంపిన జాబితాలో అతడి పేరును మిస్ చేశారు. అయితే దీనిపై సదరు అభ్యర్థి అధికారులను ప్రశ్నించాడు. ఎడిట్ ఆప్షన్ తో మిస్ అయిన పేర్లను మళ్లీ ఉన్నతాధికారులకు పంపినప్పటికీ జాబితాను సవరించకుండానే పాత లిస్ట్ ప్రకారమే ఎంపిక ప్రక్రియ చేపట్టారు. తాను కష్టపడి చదివి 12 ర్యాంకు సాధిస్తే అధికారుల నిర్లక్ష్యంతో తన పేరు లేకుండా చేశారనే సాయికృష్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.   

ఆదిలాబాద్​కు చెందిన శివాజీ కందెకర్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ లో 2వ ర్యాంక్, స్కూల్​అసిస్టెంట్​తెలుగులో 15వ ర్యాంక్ సాధించాడు. తాను కోరుకున్నట్లు ఫిజికల్ సైన్స్ లో పోస్టింగ్ కావాలని ఆప్షన్ పెట్టుకుంటే.. విద్యాశాఖ అధికారులు మాత్రం 2వ ర్యాంకర్ తనను కాదని, 3వ ర్యాంకు వచ్చిన అభ్యర్థికి పోస్టింగ్ ఇచ్చి తనకు తెలుగు పోస్టింగ్ ఇవ్వడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు నచ్చిన పోస్టింగ్ ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేశారని వాపోతున్నాడు. ఇలా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో పలువురు అభ్యర్థులకు పోస్టుల కేటాయింపు, ఉద్యోగం కేటాయించకపోవడంతో తీవ్ర నష్టం జరిగింది.