బర్నవుట్..రోడ్‌బ్లాక్...హోల్డింగ్ బ్యాక్...
ఇలా పదం ఏదైతేనేం వీటన్నింటి అర్థం ఒకటే. సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే ‘జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. ముందుకు కదలట్లేదు’ అనుకోవడం. ఇలాంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక దశలో కలగడం సర్వసాధారణం. అలాంటి ఫీలింగ్ నుంచి బయటపడినప్పుడే కదా చిన్నదో, పెద్దదో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగేది.
జీవితం ‘కన్వేయర్ బెల్ట్‌లో ట్రాప్ అయినట్టు ఉంద’ని ఫీలయ్యే వాళ్లు చాలామందే ఉంటారు. అర్థంకాకపోతే కన్వేయర్ బెల్ట్ ఎలా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించండి. ‘ఎ’ పాయింట్ నుంచి ‘బి’ పాయింట్‌కి వస్తువులను చేరవేసేందుకు సాధారణంగా ఈ బెల్ట్ వాడుతుంటారు కంపెనీల్లో. ఈ ప్రాసెస్‌ను జీవితానికి అప్లయ్ చేసి చూస్తే అటు నుంచి ఇటు... ఇటు నుంచి అటు... అంటూ జీవితం కూడా కొన్నింటి మధ్య ఆగి పోయిందనిపిస్తుంది.
ఈ విషయం మీద డాక్టర్ ఆడమ్ ఆల్టర్ పదిహేనేండ్లుగా రీసెర్చ్ చేస్తున్నాడు. అలా 2020లో కొన్ని వందల మంది మీద ఒక సర్వే చేశాడు. ఈ సర్వేలో పాల్గొన్న వాళ్లలో ప్రతి ఒక్కరూ ‘పర్టిక్యులర్‌గా ఒక పార్ట్‌లో ఆగిపోయాం’ అని చెప్పారు. అంటే.. సృజనాత్మకంగా ఆలోచించలేకపోవడం, కెరీర్ ఉన్న దగ్గరే నిలిచిపోవడం, రిలేషన్షిప్లో అసంతృప్తి, డబ్బు ఆదా చేయలేకపోవడం... అంటూ గ్లోబ్ని చుట్టి పడేసేంత లిస్ట్ తయారైంది. అసలు లైఫ్‌లో ఒక దగ్గర ఆగిపోయామన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది?
ఎందుకలా?
ఏదో ఒక టైంలో.. ఎక్కడో ఒక దగ్గర.. ఆగిపోయినట్టు అనిపించడం అనేది యూనివర్సల్ ఎక్స్‌పీరియెన్స్ అంటాడు డాక్టర్ ఆల్టర్. ఆయన రాసిన ‘అనాటమీ ఆఫ్ ఎ బ్రేక్ త్రూ’ పుస్తకంలో జీవితం ఆగిపోయిందన్న ఫీలింగ్ నుంచి బయటపడేందుకు వంద మార్గాలు చెప్పాడు.
లాంగ్ టర్మ్ గోల్ అంటే దీర్ఘకాల లక్ష్యాలను సాధించాలనే ప్రయత్నంలో ఏదో ఒక దశలో ఆగిపోయామన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలా ఎందుకంటే కొన్ని లక్ష్యాలకు ‘ఎండ్ పాయింట్ ఇది...’ అనే స్పష్టత లేకపోవడం వల్లే. అలాంటప్పుడు ఆ లక్ష్యం చేరుకునే ప్రాసెస్‌లో ప్రోగ్రెస్ అవుతున్నారనేది ఫీల్ అవ్వడం కష్టం. ఇదొక్కటే కాకుండా ఇతర విషయాలు కూడా కొన్ని ఉన్నాయి.
అవి... అనారోగ్యం, ఉద్యోగం లేకపోవడం, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లడం వంటివి కూడా జీవితం ఆగిపోయిందనే ఫీలింగ్‌ని తెచ్చేస్తాయి. వీటితోపాటు వయసులో వచ్చే మార్పు కూడా అందుకు కారణం అవుతుంది.
అదెలాగంటే.. 29 ఏళ్లు నిండి 30ల్లోకి లేదా 39 దాటి 40ల్లోకి అడుగుపెట్టినప్పుడు ‘వంటిమీదకు ఏళ్లు వస్తున్నాయే తప్ప అనుకున్నది ఏదీ చేయలేకపోతున్నాం’ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ వయసులోనే ఎందుకు అంటే ఒకరకంగా చెప్పాలంటే ఆ రెండు వయసులు జీవితంలో టర్నింగ్ పాయింట్స్! అయితే ‘ఈ ఏజ్‌లో అలాంటి ఫీలింగ్ కలగటం చాలా సహజం’ అంటున్నారు రీసెర్చర్లు. అదిసరే స్టక్ అయిపోయింది అనుకున్న జీవితాన్ని ముందుకు నెట్టడం ఎలా? అందుకు కొన్ని మార్గాలున్నాయి.
ఎందుకలా?
ఫ్రిక్షన్ ఆడిట్(ఘర్షణతో కూడిన తనిఖీ) చేసుకోవాలి. అర్థంకాలేదా! ఫ్రిక్షన్ ఆడిట్ అంటే కంపెనీలు తమ సంస్థలో సామర్ధ్యం లేని వాటిని వెనకా ముందూ ఆలోచించకుండా కలుపు మొక్కల్లా తీసి పారేస్తాయి. ‘‘అచ్చం అలానే మనం కూడా లక్ష్యాన్ని చేరుకోవడంలో అడ్డుగా నిలుస్తున్న విషయాలను, ఎదురవుతున్న సమస్యలను లేదా ఒత్తిడిని తీసి అవతల పారేయాలి’’ అని చెప్పాడు డాక్టర్ ఆల్టర్. అయితే అందుకు ఎవర్ని వాళ్లు ప్రశ్నించుకోవాలి.
‘ఈ పనిలో నాకు ఏ విధంగా సాయపడని పద్ధతులనే మళ్లీ మళ్లీ వాడుతున్నానా? నాకు ఆనందాన్ని ఇవ్వని పనులను రెగ్యులర్‌గా చేస్తున్నానా?’ వంటి ప్రశ్నలు వేసుకోవాలి. అడ్డుపడుతున్న వాటిని సరిదిద్దుకోవాలి లేదా ఒక్కో ఫ్రిక్షన్ పాయింట్ నుంచి బయట పడేందుకు తగిన మార్పులు చేసుకోవాలి.
ఇందుకు డాక్టర్ ఆల్టర్ కొన్ని చిట్కాలు చెప్పాడు. ఆగిపోయింది అనుకున్న పాయింట్ నుంచి జీవితాన్ని ముందుకు నడిపించడం మీ చేతుల్లోనే ఉంది. అందుకు మీకు నచ్చిన యాక్టివిటీ చేయొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఆడియో బుక్ లేదా పాడ్ కాస్ట్ వింటుంటారు. మరికొందరు కొలీగ్స్‌తో కలిసి కార్‌పూల్ చేసి స్టక్ పాయింట్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు.
ఇంకొందరు వర్క్ ఫ్రం హోం చేసే అవకాశం ఉంటే దాన్ని వాడుకుని జీవితాన్ని ముందుకు నడిపించేందుకు ట్రై చేస్తుంటారు. అలానే మీ లైఫ్ స్టక్ పాయింట్ నుంచి లైఫ్‌ని ముందుకు పరుగెత్తించగలరో గమనించుకోవాలి. ఆ పని వెంటనే చేయాలి.
రీ ఫ్రేమ్ చేయాలి
నెగెటివ్ ఆలోచనలను రీ ఫ్రేమ్ చేసుకోవాలి. అదెలాగంటే... ఏదైనా పని చేస్తున్నప్పుడు మిస్టేక్ ఏదో జరుగుతుందనే ఆలోచనలు ముసురుతాయి. ఇంకా వర్క్ చేసి ఉండాల్సింది అనిపిస్తుంది. ఇలాంటివి లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డుపడడమే కాకుండా ఒత్తిడిని పెంచుతాయి అంటున్నారు న్యూరోసైకాలజిస్ట్లు. ఇలాంటప్పుడు ఆలోచనా విధానాన్ని రీ ఫ్రేమ్ చేసుకోవాలి. ఉదాహరణకి ‘ఈ ప్రాజెక్ట్‌లో ఫెయిల్ అవుతానేమో’ అని భయపడే బదులు. ‘ఈ ప్రాజెక్ట్‌లో నా బెస్ట్ ఇస్తా. ఒకవేళ ఈ జర్నీలో నాకు ఇబ్బందిగా అనిపిస్తే ఇతరుల సాయాన్ని అడుగుతా’ అనుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే మీకు వచ్చే ఆలోచనలను నిష్పాక్షికంగా అంచనా వేసుకోగలగాలి.
భవిష్యత్తు గురించి...
జీవిత ప్రయాణంలో అన్స్టక్ అయిన పాయింట్ నుంచి భవిష్యత్ ఊహించుకోవాలి అంటున్నారు క్లినికల్ సైకాలజిస్ట్‌లు. అనుకున్న దాన్ని చేరుకునేందుకు అవసరమైన విషయాల గురించి మాత్రమే ఆలోచించాలి. అప్పుడు అనుకున్న లక్ష్యం వైపు వెళ్లేందుకు ఆ విషయాలే సాయం చేస్తాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని తప్పక పాటించాలి. చెప్తే ‘ఇదేనా...’ అనిపిస్తుంది. కానీ అది చాలా చాలా అవసరం. లైఫ్ జర్నీ ముందుకు వెళ్లేందుకు అవసరమైన స్టెప్స్‌ను ఒక పేపర్ మీద రాయాలి. అదికూడా చేత్తో స్వయంగా మీరే రాయాలి.
ఇలా రాసిన వాటికి కట్టుపడతారు అనడంలో సందేహం లేదు. ఒక్కో రోజు ఒక్కో స్టెప్ తీసుకోగలిగినా ఓకే. ఒకవేళ అలా చేయలేకపోయినా బాధపడాల్సిందేమీ లేదు. ఒకటి లేదా రెండు రోజులు స్కిప్ అయినా పర్వాలేదు. మరుసటి రోజు నుంచి మొదలుపెట్టాలి. ఎవరి భవిష్యత్‌ను వాళ్లే అందమైన పెయింటింగ్‌లా చేసుకోవాలి. అందుకు కావాల్సిందల్లా అక్కడికి చేరుకునేందుకు ఒక మ్యాప్‌ను ప్లాన్ చేసుకోవడమే!
అర్థవంతంగా...
‘‘జీవితంలో సంబంధంలేని డొమైన్స్‌లో స్టక్ అయినట్టు అనిపిస్తే ఏం చేయాలో నా గురించి చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. నా టీచింగ్ కెరీర్ మొదట్లో చేస్తున్న ఉద్యోగం ఏమాత్రం ఆసక్తికరంగా ఉండేది కాదు. సరిగ్గా ఆ టైంలోనే నేను వెళ్లే జిమ్‌లో ఒక పోస్టర్ నన్ను ఆకట్టుకుంది. ‘లుకేమియా అండ్ లింఫోమా సొసైటీ’ ఒకటి ఫండ్ రైజింగ్‌లో భాగంగా న్యూయార్క్ సిటీలో మారథాన్ నిర్వహించబోతుంది.
దానికి వలంటీర్లు కావాలనేది ఆ పోస్టర్ సారాంశం. అది నా తలరాతలా అనిపించింది. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒకరు లుకేమియా వ్యాధితో కొన్నేండ్ల క్రితం చనిపోయాడు. ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న నాకు చాలా మంది స్నేహితులు అయ్యారు. ఆ తరువాత నాకు నేను చాలా ప్రొడక్టివ్ పర్సన్‌గా కనిపించా. ఆ ఎక్స్‌పీరియెన్స్ నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదురీదే ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపింది. అందుకే జీవితంలో ఎక్కడైనా స్టక్ అయిపోయిన ఫీలింగ్ వస్తే... సరిగ్గా అప్పుడే జీవితానికి అర్థాన్నిచ్చే పనులు చేయాలి” అంటాడు డాక్టర్ ఆల్టర్.
నలుగురికీ చెప్పాలి
ఏం చేయాలనుకుంటున్నారు.. అనే ప్లాన్స్ చుట్టు పక్కల వాళ్లకు చెప్పడం అనేది గోల్ రీచ్ అయ్యేందుకు చాలా సాయం చేస్తుంది. ‘‘ఇదే నా సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసింది. మనం చేయాలనుకున్న పని గురించి బయటకు చెప్పడం వల్ల మొదట మన మీద మనకు నమ్మకం వస్తుంది. తెలియకుండానే ఆ పనికి కట్టుబడి పోతాం. అంతేకాదు చుట్టుపక్కల వాళ్లు సాయం చేసే అవకాశం కూడా ఉంది. అలా అనుకున్న గోల్‌ను చేరుకోవడంలో యూనివర్స్ సాయం చేస్తుంది! నేను చేయాలనుకున్నవి బయటకు తెలిసేలా చెప్పడం అనేది నా విజయానికి పెద్ద టూల్ అయ్యింది’’ అన్నాడు ఆడమ్ చేయర్. ఈయన ‘సిరి’ కో---– క్రియేటర్, ఎయిర్‌బీఎన్‌బీ ఏఐ వైస్ ప్రెసిడెంట్.
ఏదో ఒక టైంలో.. ఎక్కడో ఒక దగ్గర.. ఆగిపోయినట్టు అనిపించడం అనేది యూనివర్సల్ ఎక్స్‌పీరియెన్స్ అంటాడు డాక్టర్ ఆల్టర్. ఆయన రాసిన ‘అనాటమీ ఆఫ్ ఎ బ్రేక్ త్రూ’ పుస్తకంలో జీవితం ఆగిపోయిందన్న ఫీలింగ్ నుంచి బయటపడేందుకు వంద మార్గాలు చెప్పాడు.