బంగ్లాలో ఓటుహక్కు కనీస వయసును 17కు తగ్గిద్దాం.. యునుస్ ఆంతర్యమేమిటి?


బంగ్లాదేశ్ లో కనీస ఓటింగ్ వయస్సును 17 ఏళ్లుగా నిర్ణయించాలన్న ముఖ్య సలహాదారు ముహమ్మద్ యూనస్ సూచించడంపై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) విమర్శించింది. కనీస వయసును తగ్గించాలనే నిర్ణయం వలన ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెరిగి ఎన్నికల ప్రక్రియ ఆలస్యం కావచ్చునని పేర్కొంది. 

ఆగస్టులో మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీ నుంచి తప్పుకున్న తర్వాత మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి ప్రమాణం చేసిన 84 ఏళ్ల యూనస్..  శుక్రవారం (డిసెంబర్ 27) కనీస ఓటరు వయస్సును 17 కు తగ్గించాలని సూచించినట్లు ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది.

వీడియో సందేశంలో యూనస్ మాట్లాడుతూ యువతకు వారి భవిష్యత్తుపై వారి (యువత) అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం కల్పించాలని, అందుకోసం వారికి ఓటు వేసే వయస్సును 17కు తగ్గించాలని భావిస్తున్నానని అన్నారు.

Also Read :- అండర్19 వరల్డ్ కప్కు ఎంపికైన త్రిష‌, ధ్రుతికి హెచ్సీఏ ఘన సన్మానం

యునుస్ ప్రకటనపై BNP సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ స్పందిస్తూ.. ఈ నిర్ణయం వలన ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అన్నారు. ప్రధాన సలహాదారు యునుస్ అందరినీ సంప్రదించకుండా, చర్చించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు.  ప్రభుత్వం ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు వదిలిపెట్టి ఉండాల్సిందని, నిర్ణయం తీసుకునేందుకు ఎన్నికల కమిషన్ కు సమయం ఇవ్వాలని కోరారు. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న కనీస వయస్సు 18 ఏళ్లు అందరికీ ఆమోదయోగ్యమని తెలిపారు.

బంగ్లాదేశ్ లో జరిగిన తిరుగుబాటు తర్వాత  డిసెంబర్ 16న తన విక్టరీ డే ప్రసంగంలో యూనస్ 2026 ప్రారంభంలో ఎన్నికలు నిర్వహించవచ్చని సూచించిన విషయం తెలిసిందే. అయితే ఉన్నట్లుండి ఓటరు కనీస వయసు తగ్గించాలనడం ఎన్నికల ప్రక్రియను ఆలస్యం చేయడానికేననే విమర్శలు వస్తున్నాయి.