ఆదిలాబాద్ జిల్లాలో పత్తి గొనుగోళ్లలో సీసీఐ దూకుడు 

  • 11,422 మంది రైతుల నుంచి 2.34 లక్షల క్వింటాళ్ల సేకరణ
  • ప్రైవేట్ వ్యాపారులు కొన్నది 1.30 లక్షల క్వింటాళ్లే
  • నాణ్యమైన పత్తితో సీసీఐకే మొగ్గు చూపుతున్న రైతులు 

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా సీసీఐ రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేస్తోంది. అంతర్జాతీయంగా ఆదిలాబాద్ పత్తికి డిమాండ్ ఉండడంతో ప్రతి ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ ఏడాది సైతం 4.10 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సుమారు 20 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అక్టోబర్ 25 నుంచి ప్రైవేట్, సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.

కేవలం 8 నుంచి 12 శాతం తేమ ఉన్న పంటనే సీసీఐ కొనుగోలు చేసే నిబంధనలు ఉండటంతో మొదట తేమ ఎక్కువగా ఉన్న పంటను రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు ధరలో భారీగా కోత పెట్టడంతో తీవ్రంగా నష్టపోయారు. కొద్దిరోజులుగా తేమ శాతం తక్కువగా ఉండడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముతున్నారు. దీంత కొనుగోళ్లలో సీసీఐ జోరు పెంచింది. 

వేగంగా చెల్లంపులు

ప్రైవేట్ వ్యాపారులు క్విటాలుకు రూ.6,800 మాత్రమే ఇస్తుండడంతో రైతులు సీసీఐ వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర రూ.7521 పొందేందుకు పత్తిని ఆరబెట్టి నిర్ణీత తేమ శాతంతో తీసుకొచ్చి సీసీకి అమ్ముతున్నారు. దీంతో చాలా మంది రైతులు మద్దతు ధర పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సీసీఐ, ప్ప్రైవేట్ వ్యాపారులు కలిపి మొత్తం 17,712 మంది రైతుల నుంచి 3,64,514 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశారు.

ఇందులో సీసీఐ 11,422 మంది రైతుల నుంచి 2,34,477 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు చేసింది. సీసీఐకి అమ్మిని రైతులకు చెల్లింపులు సైతం వేగంగా జరుగుతున్నాయి.