పత్తి ఏరడానికి ఏపీ కూలీలు .. కూలీల కొరతతో రైతులకు తిప్పలు

  • కిలో చొప్పున అయితేనే వస్తమంటున్న కూలీలు
  • పైగా ట్రాన్స్​పోర్టు ఖర్చూ రైతుదే
  • ఇప్పటికీ తెరుచుకోని సీసీఐ కేంద్రాలు
  • ధర తగ్గించిన వ్యాపారులు

యాదాద్రి, వెలుగు : పత్తి రైతు ఆగమైతున్నడు. ఒకవైపు తరచూ ముసురు పడుతూ పత్తి తడుస్తోంది. మరోవైపు కూలీలు దొరకడం లేదు. కొందరు రైతులు ఏపీ నుంచి కూలీలను రప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకో వైపు సీసీఐ సెంటర్లు ఇంకా ఓపెన్ చేయకపోవడంతో వ్యాపారులు ధరను తగ్గించేశారు. దీంతో రైతులు నష్టపోతున్నారు. 

తగ్గిన పత్తి దిగుబడి..

యాదాద్రి జిల్లాలో ఈసారి పత్తి సాగు పెంచడానికి ఆఫీసర్లు ప్రయత్నించినా సక్సెస్​ కాలేదు. చివరకు 1,00,514 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పత్తి విత్తిన సమయంలో వానలు కురవక ఒక్కో రైతు రెండుసార్లు విత్తనాలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పత్తి చేతికొచ్చే సమయానికి గత నెలలో వానలు కురవడంతో కొన్ని చోట్ల పత్తి చేన్లు వాలిపోయాయి. ప్రతికూల పరిస్థితుల్లో సాగు చేయడం వల్ల ఎకరానికి కేవలం 5 క్వింటాళ్ల నుంచి 6 క్వింటాళ్ల పత్తి మాత్రమే చేతికొస్తుందని ఆఫీసర్లు అంచనా వేశారు. మొత్తంగా 5.50 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని లెక్కలు వేశారు. 

ఏపీ నుంచి కూలీలు రాక..

పత్తి తీయడానికి రోజువారీ కూలి ఒక్కొక్కరికి రూ.300 చొప్పున రైతులు చెల్లించేవారు. దీనికి తోడు కూలీలను చేను వద్దకు తీసుకెళ్లడానికి ట్రాన్స్​పోర్టు ఖర్చు కూడా రైతే భరించాల్సి వస్తోంది. రైతులందరూ ఒకేసారి పత్తి తీయడానికి ప్రయత్నిస్తుండడం, తీయడానికి వచ్చేవారు కూడా తక్కువగా ఉండడంతో స్థానికంగా కూలీల కొరత ఏర్పడింది. దీంతో వారికి డిమాండ్ పెరిగింది. 

రోజువారీ కూలి రేటు కొన్ని చోట్ల రూ.400కు పెంచారు.  కొందరు కూలీలైతే రోజువారీ కూలి కాకుండా కిలో చొప్పున చెల్లిస్తే వస్తామని చెబుతున్నారు. అది కూడా గతంలో చెల్లించినట్టుగా కిలో పత్తికి రూ.10 కాకుండా ఎక్కువగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కిలోకు రూ.12 నుంచి రూ.15 వరకు చెల్లిస్తున్నారు. కొందరు రైతులు ఏకంగా ఆంధ్రప్రదేశ్​రాష్ట్రంలోని ఒంగోలు, ప్రకాశం జిల్లాల నుంచి కూలీలను రప్పించుకుంటున్నారు. వీరికి కూడా కిలో చొప్పునే కూలి చెల్లించాల్సి వస్తోంది. వారికి స్థానికంగా నివాసం ఏర్పర్చడంతోపాటు ఖర్చులు కూడా భరిస్తున్నారు. 

తెరుచుకోని సీసీఐ సెంటర్లు.. ధర తగ్గించిన వ్యాపారులు..

పత్తి తీయడం మొదలై నెల కావస్తోంది. మొదటిసారి తీయడం పూర్తయి. రెండోసారి కూడా పత్తి తీస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు పత్తి కొనుగోలు చేయడానికి సీసీఐ సెంటర్లు ఏర్పాటు చేయలేదు. జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్, వలిగొండ, మోత్కూర్, ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డుల పరిధిలో ఏర్పాటు చేయాల్సిన సీసీఐ కేంద్రాలు ఇప్పటివరకు ప్రారంభించలేదు.

 ప్రభుత్వం క్వింటాల్​కు రూ.7,521 మద్దతు ధర ప్రకటించింది. అయితే దిగుబడి తక్కువగా వస్తుందన్న ఉద్దేశంతో గత నెలలో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్​కు రూ.7,100 వరకు ఇచ్చి కొనుగోలు చేశారు. సీసీఐ సెంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో సిండికేట్​గా మారిన వ్యాపారులు క్వింటాల్​కు రూ.5,500 నుంచి రూ.6,100 వరకు చెల్లిస్తున్నారు. పైగా ఎలక్ర్టానిక్​ కాంటాలు వాడకుండా బాట్లు, రాళ్ల వేసి తూకం వేస్తున్నారు. తేమ, నాణ్యత పేరుతో కోతలు పెడుతున్నారు. సీసీఐ సెంటర్లు లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తక్కువ ధరకే రైతులు అమ్ముకుంటున్నారు. 

రైతులకు నష్టమే..

ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టి రైతులు పత్తి పండించారు. కాలం సరిగా కాకపోవడంతో పత్తి దిగుబడి తగ్గిపోయింది. తీరా పత్తి తీసే సమయానికి వానలు పడుతుండడంతో తడిచిపోతోంది. ఈ పరిణామాలతో ప్రైవేట్ వ్యాపారులు ధరను తగ్గించేశారు. దీంతో రైతులకు క్వింటాల్​కు రూ.1500 నుంచి రూ.2 వేల నష్టం కలుగుతోంది. పెట్టిన పెట్టుబడి వచ్చినా చాలని రైతులు నిట్టూరుస్తున్నారు. 

కూలీలు దొరకట్లే.. 

కాలం సరిగా కాకున్నా అనేక ఇబ్బందులు పడి పత్తిని సాగు చేసినం. పత్తి తీసే సమయానికి కూలీలు దొరకట్లేదు. ఎక్కువ డబ్బులు ఇచ్చి కూలీలను రప్పించుకుంటున్నం. సీసీఐ సెంటర్లు తెరవకపోవడంతో తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది.

బిళ్లపాటి నరేందర్​రెడ్డి, కంబాల రఘు, రైతులు, మోత్కూరు