పత్తి రైతుపై తేమ కత్తి! ఈసారి ఖమ్మం జిల్లాలో పత్తి రైతులకు నష్టాలేనా..?

  • క్వింటాకు రూ.6 వేలకు మించి దక్కని ధర 
  • ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాలకుపైగా సాగు 
  • ఈసారి పెట్టుబడి పెరిగింది.. దిగుబడి తగ్గింది
  • అకాల వర్షాలతోనూ పత్తి, వరి రైతులకు తిప్పలు తప్పట్లే..

ఖమ్మం, వెలుగు: ఈసారి ఖమ్మం జిల్లాలో పత్తి రైతులకు నష్టాలు తప్పేలా లేవు. వేర్వేరు కారణాల వల్ల ఇప్పటికే దిగుబడి పడిపోయింది. దానికి తోడు మాయిశ్చర్​ పేరుతో మద్దతు ధరలో కోత పెడుతుండడంతో క్వింటాకు రూ.6వేలకు మించి ధర పలకడం లేదు. అప్పుడు పెరిగిన పెట్టుబడులు, ఎండల కారణంగా విత్తనాల అదనపు ఖర్చు కాగా,  ఇప్పుడు పత్తికి మంచి రేటు దక్కక నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఇదీ పరిస్థితి..

ఖమ్మం జిల్లాలో ఈసారి 2 లక్షల ఎకరాలకు పైగా రైతులు పత్తి సాగు చేశారు. దసరా పండుగకు ముందు నుంచే పత్తి కోతకు రావడంతో కూలీల ద్వారా తీయిస్తున్నారు.  కానీ రోజూ ఆకస్మాత్తుగా కురుస్తున్న వానలతో పత్తి, వరి రైతులు ఇబ్బంది పడుతున్నారు. వర్షం కారణంగా పత్తి తేమ శాతం తగ్గడం లేదు. 12 లోపు తేమ శాతం ఉంటేనే కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర ఇస్తున్నారు.

ఎనిమిది శాతం ఉంటే రూ.7,521, పది శాతం తేమ ఉంటే రూ.7,370, పన్నెండు శాతం ఉంటే రూ.7,220 రేటు దక్కుతోంది. లేకపోతే క్వింటాకు రూ.6 వేలకు మించి ధర పలకడం లేదు. ఈసారి వివిధ కారణాలతో పంట సాగు పెట్టుబడి పెరిగింది.. దిగుబడి తగ్గింది.. కనీసం ధర కూడా దక్కకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొందరు ధర పెరుగుతుందేమోననే ఆశతో ఇండ్లల్లోనే పత్తి  నిల్వ చేసుకొని ఎదురుచూస్తున్నారు. 

రైతుల ముసుగులో వ్యాపారులు!

జిల్లాలో తొమ్మిది కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఖమ్మం, మధిర, నేలకొండపల్లి, వైరా, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ల పరిధిలోని జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో నేరుగా రైతులు తీసుకువచ్చిన పత్తి కంటే, ప్రైవేట్ వ్యాపారుల ద్వారా వచ్చిన పత్తి కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు తీసుకువచ్చిన పత్తిని తేమ శాతం ఎక్కువగా ఉందంటూ తిప్పి పంపుతూ ప్రైవేట్ వ్యాపారుల పత్తిని రైతుల ముసుగులో కొంటున్నారని ఆరోపణలున్నాయి. ఈ కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా రైతులకు సంబంధించిన ఆధార్​ కార్డు వివరాలను నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 

దిగుబడి తగ్గింది

ఈ ఏడాడి పత్తి దిగుబడి బాగా తగ్గింది. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో రెండు సార్లు విత్తనాలు నాటాల్సి వచ్చింది. తీరా పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు పడి పంట నాశనం అయింది. ఎకరానికి కనీసం 1‌0 నుంచి 15 క్వింటాళ్ల పత్తి పండాల్సింది. కానీ ఎకరాకు 6 క్వింటాళ్లు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తేమ శాతం విషయంలో అధికారులు కఠినంగా ఉండడం వల్ల మరింత నష్టపోతున్నాం. - అంబటి సుబ్బారావు, మద్దులపల్లి, ఖమ్మం రూరల్​ మండలం 

వర్షం కారణంగా నష్టపోతున్నాం 

ఐదు ఎకరాలలో పత్తి పంట వేశాను. పంట చేతికి వచ్చే సమయానికి వర్షం పడి కొంతమేర నష్టం వచ్చింది. మార్కెట్ లో తడిసిన పత్తికి రూ.5,500 రేటు ఉంది. రవాణా ఖర్చులు ఇవన్నీ ఆలోచించి  ప్రైవేట్ కు అమ్మాలని అనుకుంటే రూ.5 వేలకు మించి ధర పెట్టడం లేదు.  దీంతో ఈసారి భారీగానే నష్టాలు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కనీసం కింటా పత్తి ధర రూ.10 వేలు ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది.- ఆళ్ల రాజశేఖర్, తాళ్లపెంట, పెనుబల్లి మండలం