ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుకు కలుపు కష్టాలు

  • ముసుర్లతో పత్తి పంటలో విపరీతంగా పెరుగుతున్న గడ్డి 
  • ఎకరానికి రూ. 4 వేల అదనపు భారం 
  • అధిక వర్షాలతో పసుపు పచ్చగా మారుతున్న ఆకులు
  • ఈ ఏడాది 4 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు 

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో వదలకుండా కురుస్తున్న వర్షాలకు పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పత్తి పంట ఎదిగే దశలో ఉండగా, గడ్డి విపరీతింగా పెరుగుతుండటంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే చాలా చోట్ల పత్తి చేనుల్లో నీరు నిలిచి మొక్కలు వాడిపోతున్నాయి. విడవని ముసురు కారణంగా ఆకులు పచ్చబడి నేలరాలే ప్రమాదం ఉందని రైతులు భయపడుతున్నారు.

ముసుర్ల కారణంగా వ్యవసాయ పనులకు సైతం ఆటంకం కలుగుతోంది. పంట పొలాల్లో నీటి నిల్వ, బురద వల్ల కలుపు, మందులు పిచికారీ వంటి పనులు చేయలేకపోతున్నారు. పనులు ఆలస్యమవుతుండడంతో పత్తిలో గడ్డి ఏపుగా పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 5.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుండగా.. అత్యధికంగా 4 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్నారు. పంట ఆశా జనకంగా ఉన్నప్పటికీ రికాంలేని వాన ఆందోళన కలిగిస్తోంది.  

ఎకరానికి రూ.4 వేల అదనపు భారం

పత్తి విత్తనాలు, మందులు మొదలుకొని ఇప్పటి వరకు ఎకరాకు రైతులకు రూ.5 వేల దాకా ఖర్చు చేశారు. ఇప్పుడు కేవలం పంటలో పెరిగిన గడ్డి తొలగించేందుకే రూ.3 వేల నుంచి రూ. 4 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. కూలీలు దొరికే పరిస్థితి లేకపోవడంతో అధికంగా చెల్లించి పనులు చేయించుకుంటున్నారు. చేనుల్లో గడ్డి విపరీతంగా పెరగడంతో ఎకరాకు 10 నుంచి 15 మంది కూలీలు అవసరమవుతున్నారు.

వీరికి రోజూ కూలీ రూ.250 నుంచి రూ. 300 చెల్లించాల్సి వస్తోందని, గతంలో రూ.250 కూలీ ఉంటే ప్రస్తుతం పెరిగిందని రైతులు పేర్కొంటున్నారు. గడ్డిమందుకు రూ. 2 వేలు ఖర్చవుతోందని, వర్షాలు కంటిన్యూగా పడుతుండడంతో మందు కొట్టినా గడ్డి చావడం లేదని చెప్తున్నారు. దీంతో కూలీలతోనే కలుపు తీయిస్తున్నారు.

మరో 5 రోజులు వర్షాలు

జిల్లాలో ప్రతిరోజు వర్షం కురుస్తూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 560 మిల్లి మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 680 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు కలవరపడుతున్నారు. అసలే వర్షాలకు పంటలు నీట మునిగి, కలుపు పెరిగి పనులకు ఆటంకం పడుతుండగా ఇంకా ఐదు రోజుల పాటు వర్షాలంటే మరింత పంట దెబ్బతినే అవకాశం ఉందని భయపడుతున్నారు. 

తన పత్తి చేనులో ఏపుగా పెరిగిన గడ్డిని చూపిస్తున్న ఈ రైతు అంకోలి గ్రామానికి చెందిన మంగారపు రామన్న. గత 15 రోజులుగా కురుస్తున్న ముసురు కారణంగా చేనులో విపరీతంగా గడ్డి పెరిగిందని, దాదాపు ఐదు ఎకరాల్లో గడ్డి తొలగించేందుకే రూ.20 వేలు ఖర్చు చేశానని వాపోయాడు. పెరిగిన గడ్డిని తొలగిస్తున్నానని.. కానీ ఈ ముసురుకు మళ్లీ గడ్డి పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. గడ్డి తొలగింపు, మందుల పిచికారీ, ఇతర ఖర్చులు మోపెడవుతున్నాయని, అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తోందని వాపోయాడు.