పత్తి రైతుకు కష్టకాలం దిగుబడులు రాక తీరని నష్టం

  • నిరుడు వర్షాభావం.. ఈ ఏడు భారీ వర్షం
  • రెండేండ్లుగా పత్తి పంటపై వాతావరణ ప్రభావం
  • దిగుబడులు రాక తీరని నష్టం

మహబూబ్​నగర్, వెలుగు : పత్తి రైతులు నిండా మునిగిపోతున్నారు. రెండేండ్లుగా పంటలు చేతికి రాక తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి నష్టం రాగా.. ఈ ఏడాది నెలన్నరగా కురుస్తున్న భారీ వర్షాలకు పూత, కాయలు రాలిపోతున్నాయి. ఇప్పటికే 50 శాతం పంటలు దెబ్బతినడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. దీంతో పెట్టుబడులు కూడా వస్తాయో? రావోనని రైతుల్లో ఆందోళన నెలకొంది. 

నిరుడు ఎదగని చేన్లు..

2022 సీజన్​లో పత్తికి బాగా రేట్​ పలికింది. దీంతో గతేడాది రైతులు పెద్ద ఎత్తున పత్తి సాగుకు మొగ్గు చూపుతారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ, వర్షాభావ పరిస్థితుల వల్ల పత్తి సాగు తగ్గిపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాల వరకు సాగు కావాల్సిన పంట, 8 లక్షలకే పరిమితమైంది. జూన్, జులైలో వర్షాలు లేకపోగా.. ఆగస్టులో మోస్తరు వర్షాలు పడినా చేలకు జీవం పోయలేదు. బోర్లలో నీళ్లు అడిగంటిపోవడంతో రైతులు పత్తి చేలను కాపాడుకోవడానికి తిప్పలు పడాల్సి వచ్చింది.

ఆ ఏడాది పత్తి మొక్కలకు సరైన నీరు అందక పూత సరిగా రాలేదు. అలాగే వాతావరణంలో మార్పుల వల్ల కాయలు పట్టలేదు. ఒక్కో పత్తి మొక్కకు 30 నుంచి 50 కాయలు పట్టాల్సి ఉండగా.. కేవలం 12 నుంచి 15 కాయలు మాత్రమే పట్టాయి. కొన్ని చోట్ల మొక్కలు ఏపుగా పెరిగినా పూత పట్టలేదు. 30 శాతానికి మించి దిగుబడి రాకపోవడంతో పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టోయారు. 

ఈ ఏడాది భారీ వర్షాలతో..

గతేడాది వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో ఈ ఏడాది రైతులు 2.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. మేలో విత్తనాలు చల్లుకోగా.. జులైలో వచ్చిన వర్షాలు పంటలకు మేలు చేశాయి. అయితే ఆగస్టు నుంచి వరుసగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పంటలు దెబ్బతింటున్నాయి. 20 రోజుల కింద పడిన వర్షాలకు పత్తి చేలల్లో నీరు చేరడంతో కొంత నష్టం వాటిల్లింది.

తాజాగా నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు ఉన్న పంటలు కూడా దెబ్బతింటున్నాయి. పత్తి మొక్కలకు పట్టిన కాయలు నేల రాలిపోతున్నాయి. కాయలు నల్లగా మారి, కుళ్లిపోతున్నాయి. కొన్ని కాయలు పగిలి పత్తి వచ్చినా.. నాసిరకంగా ఉంటోంది. మొక్కల ఆకులు పసుపు రంగులోకి మారి.. ఇప్పుడు ముదురు ఎరుపు రంగులోకి మారి మాడిపోయినట్లు కనిపిస్తున్నాయి. మొక్కల కింద భాగాలు కుళ్లిపోతున్నాయి. అధిక వర్షాల వల్ల పంటలకు ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

దిగుబడిపై ప్రభావం..

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పత్తి కాయలు నల్లగా మారి రాలిపోతున్నాయి. ఈ ఎఫెక్ట్​ వల్ల పంట దిగుబడిపై పడే ప్రమాదం ఉంది. వాతావరణం అనుకూలిస్తే ఒక ఎకరాకు దాదాపు 15 క్వింటాళ్ల పత్తి వస్తుంది. దీంతో ఎకరాకు ఐదు క్వింటాళ్ల పత్తి కూడా రావడం కష్టమేనని రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడులు పెట్టగా, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు.

కాయలు కుళ్లిపోయినయ్

14 ఎకరాల్లో పత్తి పంట వేసిన. విత్తనం వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.4 లక్షల వరకు ఖర్చు చేసిన. కానీ, వర్షాలతో చేనులో నీళ్లు నిలిచాయి. దీంతో పత్తి మొక్కలు దెబ్బతిని పత్తి కాయలు కుళ్లిపోయి రాలిపోతున్నాయి.
- బి.రాములు,  రైతులు, మరికల్​ గ్రామం