కర్నాటక మిల్లులకు... పాలమూరు పత్తి

  • అక్కడ ఉత్పత్తి లేక ఉమ్మడి జిల్లాకు వస్తున్న వ్యాపారులు
  • పంట సాగు చేసినప్పటి నుంచే ఏజెంట్ల ద్వారా రైతులతో సంప్రదింపులు
  • మద్దతు ధరతో పాటు స్పాట్‌‌‌‌‌‌‌‌ క్యాష్‌‌‌‌‌‌‌‌ ఇస్తుండడంతో అమ్మకానికి రైతుల ఆసక్తి
  • వడ్లను సైతం కల్లాల వద్దే కొంటున్న వ్యాపారులు

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : కర్నాటక ప్రాంతంలో పత్తి, వడ్లకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ విపరీతంగా పెరిగింది. ఈ రెండు పంటలకు సంబంధించిన మిల్లులు ఆ రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉండడం, అందుకు తగ్గట్లుగా పంట లేకపోవడంతో అక్కడి వ్యాపారుల దృష్టి పక్కనే ఉన్న పాలమూరు జిల్లాపై పడింది. రేటు గిట్టుబాటు అవుతుండటం, పంట కొన్న వెంటనే డబ్బులు ఇస్తుండడంతో రైతులు కూడా కర్నాటక వ్యాపారులకు ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దిగుబడి ప్రారంభం కాగానే పంట మొత్తాన్ని కర్నాటకకు తరలిస్తున్నారు.

రాయచూర్‌‌‌‌‌‌‌‌ ఏరియాలో 250కిపైగా పత్తి మిల్లులు

కర్నాటక రాష్ట్రం రాయచూర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేలకు అనుగుణంగా అక్కడి రైతులు వర్షాధార పంటగా వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో తెల్ల జొన్న, కంది, శనగ, వాము సాగు చేస్తారు. పత్తి సాగు నామమాత్రంగానే ఉంటుంది. అయితే రాయచూర్‌‌‌‌‌‌‌‌ ప్రాంతం పరిశ్రమలకు అనువుగా ఉండడంతో అక్కడ పెద్దమొత్తంలో పత్తి మిల్లులు ఏర్పాటు అయ్యాయి. ఒకరిని చూసి మరొకరు పత్తి మిల్లు ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం అక్కడ 250 నుంచి 280 వరకు మిల్లులు ఉన్నాయి. కానీ ఆ స్థాయిలో పత్తి సాగు లేకపోవడంతో మిల్లుల మనుగడ కష్టంగా మారింది. దీంతో ఆ మిల్లుల వ్యాపారులు తెలంగాణ-–కర్నాటక బార్డర్‌‌‌‌‌‌‌‌లో పత్తి ఎక్కువగా సాగయ్యే ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టారు. 

పత్తి సాగు చేసినప్పటి నుంచే..

పాలమూరు జిల్లాకు చెందిన రైతులు పత్తి సాగు ప్రారంభించగానే కర్నాటక వ్యాపారులు తమ ఏజెంట్లను ఆయా ప్రాంతాలకు పంపి రైతులతో మాట్లాడిస్తున్నారు. పంట చేతికొచ్చాక తమకు అమ్మితే మంచి రేట్‌‌‌‌‌‌‌‌ ఇస్తామని చెబుతున్నారు. రైతుల ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్లు తీసుకొని.. పంట చేతికొచ్చే టైమ్‌‌‌‌‌‌‌‌కు మరోసారి రైతులను సంప్రదిస్తున్నారు. స్థానికంగా ఇచ్చే మద్దతు ధర కంటే ఎక్కువ ఇస్తామని, పంటను తీసుకురావాలని కోరుతున్నారు. హన్వాడ, కోయిల్‌‌‌‌‌‌‌‌కొండ, నారాయణపేట, మక్తల్, మద్దూరు, ఊట్కూరు, నర్వ, కృష్ణ, మాగనూరు, మరికల్, చిన్నచింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర, జోగుళాంబ గద్వాల జిల్లాలోని కొన్ని మండలాల నుంచి రైతులు పెద్ద మొత్తంలో పత్తిని కర్నాటకకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో సీసీఐ క్వింటాల్‌ పత్తికి రూ.7,521 మద్దతు ధరగా నిర్ణయించింది. కానీ పత్తిలో ఎనిమిది నుంచి తొమ్మిది శాతం తేమ ఉంటేనే రైతులకు మద్దతు ధర దక్కుతుంది. కానీ రాయచూర్‌‌‌‌‌‌‌‌లో మాయిశ్చర్‌‌‌‌‌‌‌‌తో సంబంధం లేకుండా, క్వాలిటీ గురించి పట్టించుకోకుండా 
క్వింటాల్‌కు రూ.6,900 నుంచి రూ. 7,300 వరకు చెల్లిస్తున్నారు. పత్తి కొన్న వెంటనే స్పాట్‌‌‌‌‌‌‌‌ క్యాష్‌‌‌‌‌‌‌‌ పేమెంట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాకు చెందిన పత్తి రైతులు పంటను అమ్ముకునేందుకు కర్నాటకకు క్యూ కడుతున్నారు.

పచ్చి వడ్లనే కొంటున్నరు

తెలంగాణలో పండే వడ్లను సైతం కర్నాటక వ్యాపారులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో వరి ప్రధాన పంట కాగా.. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో 7.80 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. కొన్ని ఏరియాల్లో కోతలు ప్రారంభం కాగా.. వచ్చే వారం నుంచి మరింత పుంజుకోనున్నాయి. అయితే వడ్లను కొనేందుకు కర్నాటక వ్యాపారులు ఇప్పటి నుంచే ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నారు. కల్లాల వద్దకే లారీలను తీసుకొస్తున్నారు. పంటను ఆరబెట్టకపోయినా పచ్చి వడ్లనే కొంటున్నారు. ఇందుకు క్వింటాళ్‌‌‌‌‌‌‌‌కు రూ.2,200 నుంచి రూ.2,500 వరకు చెల్లిస్తున్నారు. ఈ రేట్లు గిట్టుబాటు అవుతుండడంతో రైతులు తమ వడ్లను కర్నాటక వ్యాపారులకే అమ్ముతున్నారు.

తేమ ఉన్నా కొంటున్నరు

నేను నాలుగు ఎకరాల్లో పత్తి వేసిన. మొదట 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో అమ్మాలంటే 8 శాతం మాయిశ్చర్‌‌‌‌‌‌‌‌ ఉండాలని చెబుతున్నారు. వాతావరణంలో మార్పులు వల్ల పంటను ఆరబెట్టేందుకు ఇబ్బందులు వచ్చాయి. దీంతో పంట మొత్తాన్ని కర్నాటకకు తీసుకుపోయి అమ్మిన. తేమ ఎక్కువగా ఉన్నప్పటికీ క్వింటాల్‌కు రూ.6,900 ఇచ్చారు.


- రాకేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, రైతు, గూడూరు-

స్పాట్‌‌‌‌‌‌‌‌ క్యాష్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నరు

 నాకు ఉన్న ఆరు ఎకరాల్లో పత్తి వేసిన. పత్తి ఏరడానికి కూలీల కొరత ఉండే. వర్షాలకు పత్తి దెబ్బతిన్నది. మంత్రాలయం నుంచి కూలీలను రప్పించిన. కిలో పత్తి ఏరితే వారికి రూ.17లాగా కట్టిచ్చిన. పంట అమ్ముదామంటే రేట్‌‌‌‌‌‌‌‌ లేదు. అందుకే కర్నాటకకు తీసుకుపోయిన. పత్తి నల్లగా ఉండడంతో క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు రూ.6 వేలు ఇచ్చారు. పంట కొన్న వెంటనే స్పాట్‌‌‌‌‌‌‌‌ క్యాష్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు.


-‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి.రాజు, ఎక్లాస్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌, మరికల్‌‌‌‌‌‌‌‌ మండలం-