కేంద్రం దూరం.. రవాణా భారం

  • కామారెడ్డికి వంద కిలోమీటర్ల దూరంలో పత్తి కొనుగోలు కేంద్రం 
  • అంతదూరం వెళ్లలేక ఇబ్బందిపడుతున్న రైతులు
  • ఇదే అదునుగా భావించి ధర తగ్గించిన వ్యాపారులు
  • మద్దతు ధర పొందలేకపోతున్న రైతులు 
  • దళారులకే విక్రయిస్తున్న వైనం

కామారెడ్డి జిల్లాలో పత్తిని అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడాల్సి వస్తోంది.  జిల్లాలో  పత్తి జిన్నింగ్​ మిల్లులు మద్నూర్​లో ఉన్నాయి.  సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్​ ఏర్పాటు చేశారు.   ప్రభుత్వ కొనుగోలు సెంటర్​ కామారెడ్డి ఏరియాకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.  అంత దూరం తీసుకెళ్లి అమ్మటం భారంగా భావిస్తున్న  రైతులు తమ వద్దకు వచ్చే వ్యాపారులకు అమ్ముతున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు, దళారులు మద్దతు ధర కంటే తక్కువకు కొంటున్నారు.  

కామారెడ్డి, వెలుగు:  జిల్లాలో వానాకాలం సీజన్​లో 31 వేల ఎకరాల్లో  పత్తి పంట సాగు చేశారు.   2.36 లక్షల క్వింటాళ్ల  పత్తి అమ్మకానికి రావచ్చని ఆఫీసర్లు అంచనా వేశారు.  జిల్లాలో ప్రధానంగా  గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి, రాజంపేట,  భిక్కనూరు,  మద్నూర్, బిచ్​కుంద, జుక్కల్​ మండలాల్లో  ప్రధానంగా పత్తి పంట సాగు చేస్తారు.  ఈ పంటను సీసీఐ​కొనుగోలు చేయనుంది.  క్వింటాల్​కు కనీస మద్దతు ధర రూ. 7,521 ధర నిర్ణయించినట్లు ఆఫీసర్లు తెలిపారు. 

 జిన్నింగ్​ మిల్లులు ఉన్న చోటనే  సీసీఐ  కొనుగోలు సెంటర్​ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.  జిల్లాలో మద్నూర్​లో  జిన్నింగ్​ మిల్లులు ఉన్నాయి. ఇటీవల కొనుగోలు సెంటర్​ ప్రారంభించారు. ఈ సెంటర్​ మద్నూర్, జుక్కల్​, బిచ్​కుంద మండలాలకు దగ్గరగా, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లోని మండలాలకు దూరంగా ఉంటుంది.  కామారెడ్డి, తాడ్వాయి, సదాశివనగర్, గాంధారి, రాజంపేట మండలాలకు వంద కిలోమీటర్ల దూరం  ఉంటుంది.   రైతులు అంత దూరం తీసుకెళ్లలేక, తమ వద్దకు వచ్చే వ్యాపారులు, దళారులకు పత్తిని విక్రయిస్తున్నారు. 

గిట్టుబాటు ధర రాక

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పత్తి రైతులకు దక్కట్లేదు.  జిల్లాలోని ఆయా గ్రామాలకు వచ్చి కొనుగోలు చేసే వ్యాపారులు క్వింటాల్​కు రూ. 6.500 నుంచి రూ.6,700 వరకు మాత్రమే కొంటున్నారు. పెట్టుబడి, ఇతర ఖర్చులు గిట్టుబాటు కావాలంటే మద్దతు ధరకే పత్తి కొనాలని రైతులు అంటున్నారు. పాలకులు చొరవ చూపి కామారెడ్డి ఏరియాలో  ప్రభుత్వ కొనుగోలు సెంటర్​ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

సెంటర్​ దూరంగా ఉంది

ఎకరంలో పత్తి పంట సాగు చేశాను.  కొనుగోలు సెంటర్ చాలా​ దూరంలో ఉంది.  అంత దూరం  పత్తిని తీసుకెళ్లటం కష్టం.   రవాణా ఖర్చులు ఎక్కువవుతాయి.  గత్యంతరం లేక మా దగ్గరకు వచ్చే వ్యాపారులకు అమ్ముతున్నాం.  వాళ్లు తక్కువ ధర చెల్లిస్తున్నా, అమ్ముకోక తప్పడంలేదు.  కామారెడ్డి ఏరియాలో సెంటర్​ ఉంటే మాకు మేలు జరుగుతుంది. లక్ష్మారెడ్డి, పత్తి రైతు