నిజామాబాద్ బల్దియాలో అంతులేని అక్రమాలు

  • ఆర్వోఇంట్లో కోట్ల నగదు స్వాధీనం.. 
  • బ్యాంకు లాకర్లు ఓపెన్​ చేసేందుకు ఏసీబీ ప్రయత్నం 
  • కార్పొరేషన్​ ఆర్వోగా నసీర్.. ఆరు నెలల తర్వాత  చార్జ్​ దక్కిన  వైనం​

నిజామాబాద్​, వెలుగు: పాతికేళ్ల నుంచి నిజామాబాద్ కార్పొరేషన్ లో పాతుకుపోయిన ఇన్​ఛార్జ్​ రెవెన్యూ ఆఫీసర్​ (ఆర్వో) దాసరి నరేందర్​ సాగించిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అతడికి పై స్థాయి అధికారులు అందించిన సహకారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నగర కార్పొరేషన్​కు ఆర్వోగా నసీర్​ ఆరు నెలల కిందే కామారెడ్డి నుంచి ట్రాన్స్​ఫర్​పై వచ్చినా ఆయనకు బాధ్యతలు ఇవ్వలేదు. ఇన్​ఛార్జ్​ ఆర్వోగా వ్యవహరిస్తున్న నరేందర్​నే సదరు పోస్టులో కొనసాగించడానికి పైఆఫీసర్లు మొగ్గుచూశారు. ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో  నరేందర్​ జైలుకు వెళ్లాక సోమవారం నసీర్​కు  ఆర్వో బాధ్యతలను అప్పగించారు. 

కార్పొరేషన్​ ఇన్​కం దెబ్బతీసి

నగరంలోని నరేందర్​ ఇంట్లో ఈ నెల 9 న  ఏసీబీ నిర్వహించిన రైడ్​లో రూ.2.93 కోట్ల నెట్​క్యాష్​, 51 తులాల బంగారం, తల్లి నర్సుబాయి, భార్య కిరణ్మయి పేరిట బ్యాంకు అకౌంట్​లో రూ.1.10 కోట్ల బ్యాలెన్స్​, 17 రకాల స్థిరాస్తి పత్రాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్​ వాల్యూను పరిగణలోకి తీసుకొని స్థిరాస్తుల విలువను ఏసీబీ ఆఫీసర్లు రూ.1.98 కోట్లుగా లెక్కించారు. కానీ మార్కెట్​లో వాటి విలువ సుమారు రూ.20 కోట్ల దాకా ఉంటుంది. బినామీల పేరుతో నరేందర్​ ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ ఆఫీసర్లు అనుమానిస్తున్నారు. 

ఒక ప్రైవేట్​విద్యాసంస్థ, మరో ప్రైవేట్​ హాస్పిటల్స్​ నిర్వహణలో  ఆయన పెట్టుబడులు రూ. కోట్లలో ఉన్నట్లు  ఆధారాలు సేకరించారు. ఈ స్థాయిలో వసూళ్లకు ఏయే అంశాలు దోహదపడ్డాయనే విషయంలో నగరంలో ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది.  సిటీలోని కమర్షియల్​ బిల్డింగ్స్​ను రెసిడెన్షియల్​ ఇండ్లుగా రికార్డులో నమోదు చేసి భారీగా లాభం పొందినట్లు తెలుస్తోంది. ఇంటి నిర్మాణాల పర్మిషన్లకు రూ.2 లక్షలు, కమర్షియల్​ బిల్డింగ్స్​కు అంతకు డబుల్​, ప్రతి మ్యూటేషన్​కు రూ.25 వేల నుంచి రూ.లక్ష తీసుకునేవారని చెబుతున్నారు. 

తైబజార్  వేలం ఎప్పుడు జరిగినా వ్యక్తుల మధ్య సిండికేట్​ కుదుర్చడంలో కీ రోల్​ పోషించేవారు. గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌కు డబ్బుకడితే ఏమొస్తది?  తలా ఇంత లాభపడదామని ఓపెన్​గా చెప్పిన ఆధారాలు ఏసీబీ సంపాదించింది.  అన్​అసెస్డ్, అండర్​అసెస్డ్​ బిల్డింగ్స్​నుంచి భారీ వసూళ్లు ఉండేవి.  కార్పొరేషన్​ ఇన్​కంను దెబ్బతీసిన ఈ నష్టాన్ని లెక్కించే పనిలో ఆఫీసర్లు తలమునకలయ్యారు. 

సబ్ రిజిస్ట్రార్​ అండతో 

కార్పొరేషన్​ పరిధిలో ఎనిమిది శివారు గ్రామ పంచాయతీలను 2018లో కార్పొరేషన్​లో విలీనం చేశాక సూపరింటెండెంట్ హోదాలోని నరేందర్​ఇన్​ఛార్జ్​ఆర్వో బాధ్యతలు చేపట్టారు. ఈ విలీన గ్రామాలన్నీ నగరంలోనే ఉన్నాయి.  లింక్​ డాక్యుమెంట్లు లేని ఇండ్లకు రికార్డులు సృష్టించి వాటి అమ్మకాలు జరిగేలా ఓ సబ్​ రిజిస్ట్రార్​సహకారంతో ఒక్కో కేసు నుంచి రూ.5 లక్షలకు తక్కువ కాకుండా రూ.కోట్లు ఆర్జించినట్లు సమాచారం.  

ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపాల్సిన ప్రాపర్టీ  ట్యాక్స్ డిమాండ్​ నోటీసులను తనకు అనుకూలమైన వ్యక్తుల పేర్లపై పంపి సెటిల్​మెంట్​కు పురమాయించేవారు.  ఈ రకంగా ఓ డాక్టర్​ నుంచి రూ.10 లక్షలు తీసుకున్నారు. ​ వీటికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని ఏసీబీ ఆఫీసర్లు సేకరించారు.  రిమాండ్​లో ఉన్న నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవడానికి ఏసీబీ అధికారులు రెడీ అయ్యారు. ఈలోపు బ్యాంకు లాకర్లను ఓపెన్​ చేయాలని భావిస్తున్నారు.