జగిత్యాల జిల్లా వైద్య విధాన పరిషత్ లో .. నిధుల గోల్ మాల్

  • ఉద్యోగుల సీపీఎఫ్, జీపీఎఫ్ లకు చెందిన రూ. 6 కోట్లకుపైగా పక్కదారి
  • విజిలెన్స్ తోనే ఉన్నతాధికారుల పాత్ర బహిర్గతమవుతుందంటున్న ఉద్యోగులు 

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా వైద్య విధాన పరిషత్ చుట్టూ వరుస వివాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే ఎంప్లాయీస్ జీపీఎఫ్, సీపీఎఫ్ నిధుల గోల్ మాల్ ఘటనపై జరుగుతున్న విచారణ నీరుగారుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇదే ఘటనలో గత నెలలో ముగ్గురు ఆఫీసర్ల కు షోకాజ్ నోటీసులు ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 గత జూన్ లో జిల్లా వైద్య విధాన పరిషత్  ఉద్యోగుల నిధుల మళ్లింపు ఘటన వెలుగులోకి రావడంతో రికార్డు అసిస్టెంట్ యాసిన్ ను సస్పెండ్ చేశారు. ఉన్నతాధికారులు రూ. కోటికి పైగా నిధులను రికవరీ చేసి.. ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. ఆరు నెలలు గడిచినా నిధుల గోల్ మాల్ విచారణలో భాగంగా పూర్తిస్థాయి రికవరీలో ఎలాంటి ఫురోగతి లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 

 ఎంక్వైరీ ఆఫీసర్ ను నియమించినా..

వైద్య విధాన పరిషత్ కింద కోరుట్ల ఆస్పత్రికి మంజూరు చేయాల్సిన నిధుల కోసం టీవీవీపీ సూపరింటెండెంట్  సుదక్షిణా దేవి ఇచ్చిన బ్యాంక్ వోచర్ల ను అదే డిపార్ట్ మెంట్ లోని సీనియర్ అసిస్టెంట్ మార్పు చేసి రూ. 28 లక్షలు మరో అకౌంట్ లో జమ చేసినట్టు అనుమానించిన ఆఫీసర్లు ఆరా తీశారు. దీంతో నిధులు  గోల్ మాల్ అయినట్టు గత జూన్ లో బహిర్గతమైంది. 

దీంతో వెంటనే ఉన్నతాధికారులు స్పందించి బైంసా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెం ట్ ను ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎంక్వైరీలో ఎంప్లాయీస్ అకౌంట్‌‌లలో జమ చేయాల్సిన డీఏ, ఎరియల్స్, సీపీఎస్ ఎరియల్స్, రెగ్యూలర్ సీపీఎస్, వివిధ డిడక్షన్స్ కు సంబంధించిన  రూ. 6 కోట్లకు పైగా సొమ్ము పక్కదారి పట్టించినట్లు వెల్లడైంది. ఇంకా ఎవరెవరున్నారనేది తేలాల్సి ఉంది. 

రూ. 6 కోట్లకుపైగా పక్కదారి?

రూ. 6 కోట్లకుపైగా నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఎంక్వైరీ చేపట్టిన ఆఫీసర్లు ఆడిటింగ్ నిర్వహించి ఆఫీసు లావాదేవీలకు సంబంధించిన రెండు బ్యాంక్ అకౌంట్లలోని ట్రాన్సాక్షన్స్ గుర్తించారు. అయితే వినియోగంలో లేని బ్యాంక్ అకౌంట్ నుంచి నిధులను పక్కదారి పట్టించినట్టు తెలుస్తోం ది. నిధుల గోల్ మాల్ ఘటనలో రికార్డు అసిస్టెంట్ ను బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారు. అతని వద్ద హామీ పత్రాలతో పాటు చెక్కులను కూడా తీసుకున్నట్లు సమాచారం. సదరు ఉద్యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఉన్నతాధికారుల పాత్ర ఉందనేదానిపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

ముగ్గురు ఆఫీసర్లకు షోకాజ్ నోటీసులు

జగిత్యాల వైద్య విధాన పరిషత్ ఆఫీసులో నిధుల రికవరీలో ఫురోగతి లేకపోవడంతో గత నెల రెండోవారంలో  తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ నుంచి జగిత్యాల టీవీవీపీ ఇన్ చార్జ్ సూపరింటెండెంట్, అకౌంట్ ఆఫీసర్‌‌‌‌, అకౌంట్ క్లర్క్ కు షోకాజ్ నోటీసులు అందాయి. అసలు ఎంత సొమ్ము దుర్వినియోగం చేశారు? అందులో ఎంత రికవరీ చేశారు? పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు? అనే ప్రశ్నలు ఉన్నట్లు తెలిసింది. ఘటనపై విజిలెన్స్ ఎంక్వైరీ చేపడితేనే పూర్తిస్థాయి నిధుల రికవరీతో పాటు ఉన్నతాధికారుల పాత్ర బహిర్గతమయ్యే చాన్స్ ఉందని ఎంప్లాయీస్ పేర్కొంటున్నారు.