రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి

  • కేంద్ర మంత్రులకు ఎంపీ మల్లు రవి విజ్ఞప్తి
  • ఐఐఎం వంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని వినతి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులకు నాగర్ కర్నూల్  ఎంపీ మల్లు రవి విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఆయన.. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. 

కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి వరంగల్ (మామునూరు), బసంత్ నగర్, ఆదిలాబాద్, కొత్తగూడెం, మహబూబ్‌‌‌‌నగర్  విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించానని తెలిపారు. ఈ ఎయిర్ పోర్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కేంద్రానికి సహకరిస్తుందని, కావాల్సిన నిర్ణయాలు సత్వరమే తీసుకుంటుందని వివరించానని పేర్కొన్నారు. 

అలాగే, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి ఐఐఎం, నిడ్, ఐఐఎస్సీఆర్, ఎస్పీఏ వంటి విద్యా సంస్థలను తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరానని వెల్లడించారు. ఈ ఉన్నత విద్యా సంస్థలను ఇప్పటికే ఏపీలో ఏర్పాటు చేశారని, అదే మాదిరిగా తెలంగాణకూ ఇవ్వాలని రిక్వెస్ట్  చేశానన్నారు. ఈ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారన్నారు. తాజాగా బడ్జెట్ లో రైల్వే కేటాయింపులపై లోక్ సభలో రాష్ట్రానికి రావాల్సిన రైల్వే ప్రాజెక్టుల గురించి రిక్వెస్ట్  చేశానని వివరించారు.