న్యూఢిల్లీ: రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ వెల్లడించారు. అహంకార బీజేపీని ఒంటరిగా ఎదుర్కోగల సామర్థ్యం తమకు ఉందని తెలిపారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తన భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ నేతలకు అతివిశ్వాసం మితిమీరిందని..అందుకే హర్యానాలో ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని విమర్శించారు.
ఆప్ వంటి భాగస్వామ్య పక్షాలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు."ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మేం ఒంటరిగా పోటీ చేస్తం. అతివిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్, అహంకార బీజేపీని ఎదుర్కొనే సామర్థ్యం మాకుంది. ఢిల్లీలో పదేండ్లుగా ఒక్క అసెంబ్లీ సీటు గెలవని కాంగ్రెస్కు.. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో మూడు సీట్లు ఇచ్చాం. అయినప్పటికీ హర్యానాలో ఆ పార్టీ మిత్రపక్షాలకు తోడుగా నిలవలేదు. పొత్తుకోసం ఇండియా కూటమి చేసిన ప్రయత్నాలన్నింటినీ కాంగ్రెస్ తుంగలో తొక్కింది" అని ప్రియాంక మండిపడ్డారు.