Summer Fruits : సపోటా, ద్రాక్ష.. వీటిని తీసుకుంటే నీరసం రాదు.. ఎనర్టీ లెవల్స్ పెరుగుతాయి..!

ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో తింటే రుచికి రుచి... ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎండాకాలంలో స్పెషల్ గా దొరికే ఫ్రూట్స్ చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని శరీరాన్ని చల్లబరుస్తాయి. మరికొన్ని ఈ కాలంలో వచ్చే పలు వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇంకొన్ని పోషకాలు అందిస్తాయి. శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతాయి. అందుకే, సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తినాలి.

వేసవి తాపాన్ని తట్టుకుని, కాస్త కూల్గా ఉండాలంటే.. ఈ కాలంలో వచ్చే వడదెబ్బ, చికెన్ ఫాక్స్, విరేచనాలు.. లాంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే.. నీరసం రాకండా, తక్షణ శక్తి పొందాలంటే.. ఎండాకాలంలో దొరికే అన్ని రకాల పండ్లు తినాల్సిందే. అయితే, వాటిలో ఏఏ రకాల ప్రొటీన్స్ ఉన్నాయి? ఏఏ వ్యాధులు రాకుండా కాపాడతాయి? అసలు ఎండాకాలంలో దొరికే ఫ్రూట్స్ ఏంటి? ఎలా తినాలి?

సపోటా

ఈ కాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో సపోటా కూడా ఒకటి. గ్రామాల్లోనే కాదు నగరాల్లో కూడా బండ్ల మీద కుప్పలుగా పోసి కిలోల లెక్కన అమ్ముతుంటారు. అయితే, ఇవి కొనేటప్పుడు పచ్చివా, పండువా చూసి కొనాలి. బాగా పండినవైతే వెంటనే కుళ్లిపోతాయి. అలాగని ఎక్కువ పచ్చిగా ఉంటే ఇంట్లో పండకపోవచ్చు. అందువల్ల పండటానికి సిద్ధంగా ఉన్నవి. తెచ్చుకోవాలి. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మలబద్ధకం సమస్య ఉన్నవాళ్లు వీటిని తినడం మంచిది. అతిసారం, రక్తస్రావం కాకుండా సపోటా కాపాడుతుంది.

పేగుల్లో ఉండే క్యాన్సర్ కారక పదార్థాలను తొలగిస్తుంది. సపోటాలోని విటమిన్ ఏ.. కంటిచూపును కాపాడుతుంది. విటమిన్ సి. ఫ్రీరాడికల్స్ తొలగిస్తుంది. రాగి, ఇనుము, పొటాషియం, పోలేట్, నియాసిన్, పాంథోయినిక్ ఆమ్లాలు జీర్ణవ్యవస్థ సరిగా జరిగేందుకు సాయపడతాయి. దీనిలో నీటిశాతం ఎక్కువ. వేసవి తాపాన్ని తీర్చి శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది. ఎందుకంటే, వీటిలో కార్బొహైడ్రేట్స్ ఎక్కువ. పైగా తేలికైన ఆహారం కూడా.

ద్రాక్ష

ద్రాక్షలో అనేక రకాలు ఉన్నాయి. మన దగ్గర నలుపు, తెలుపు ద్రాక్ష ఎక్కువగా దొరుకుతాయి. వీటిలో కూడా నీటిశాతం ఎక్కువ. కార్బొహైడ్రేట్స్, క్యాల్షియం, పాస్పరస్, విటమిన్ ఏ, సీ "బీకాంప్లెక్స్ లు ఉన్నాయి. -అందుకే వీటిని నేరుగా తింటారు. జ్యూస్ చేసుకుని కూడా తాగుతారు. అనారోగ్యంతో ఉన్నవాళ్లకు ద్రాక్షజ్యూస్ తక్షణ శక్తినిస్తుంది. ఇవి తినడం వల్ల మూత్రపిండాలు బాగా పనిచేస్తాయి. కిడ్నీల్లో రాళ్లు రాకుండా నివారిస్తాయి. క్యాన్సర్ నిరోధక కారకంగా పనిచేస్తాయి. శరీరంలో పెరిగే చెడుకొవ్వును తగ్గిస్తాయి.

నోరు, గొంతు ఇన్ఫెక్షన్లపై పోరాడతాయి. అన్నింటికంటే శరీరంలో రక్తప్రసరణ వేగంగా జరిగేందుకు ద్రాక్షపండ్లు తోడ్పడతాయి. అజీర్తితో బాధపడే వాళ్లు ద్రాక్షపండ్లు తింటే మంచిది. అలాగే మైగ్రెయిన్తో ఇబ్బందిపడేవాళ్లు రోజూ ద్రాక్షరసం తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ద్రాక్ష తినడం వల్ల చిగుళ్లు, పళ్లకు మేలు. ఊపిరితిత్తులు, గుండెకు మంచిది. ఐస్క్రీములు, కేకుల తయారీలోనూ ప్రత్యేకంగా వీటిని వాడతారు. సౌందర్య సాధనాల్లో భాగంగా, శరీరకాంతిని పెంచడానికి ద్రాక్షను ఉపయోగిస్తారు.