కామారెడ్డి జిల్లాలో రైల్వే డబుల్​ లైన్ వచ్చేనా?

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో పలు సమస్యలు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి.  ప్రస్తుత ఎంపీ ఎన్నికల నేపథ్యంలో  ప్రధాన పార్టీల అభ్యర్థులు వాటిపై హామీ ఇచ్చి పరిష్కారం దిశగా  అడుగులు వేయాలని స్థానికులు కోరుతున్నారు. వాటిలో రైల్వే డబుల్​ లైన్​ నిర్మాణం, ఉపాధి అవకాశాలకు ఇండస్ర్టీస్​ఏర్పాటు,  బీడి కార్మికుల ఉపాధి మెరుగుపర్చడం, సాగునీటి సమస్య  ప్రధానంగా ఉన్నాయి. 

రైల్వే లైన్ పై డబుల్ ఆశలు

కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్​అసెంబ్లీ నియోజకవర్గాలు జహీరాబాద్​ పార్లమెంట్​పరిధిలోకి వస్తాయి. ఉత్తర – దక్షిణ భారత రాష్ట్రాలను అనుసంధానం చేసే  రైల్వే లైన్ కామారెడ్డి జిల్లా మీదుగా వెళ్తుంది. సికింద్రాబాద్​ నుంచి  ముంబై వరకు వెళ్లే ఈ లైన్.. మనోహరబాద్​ వరకు డబుల్​అయ్యింది. ఆపై మనోహరబాద్​నుంచి కామారెడ్డి, నిజామాబాద్, నాందేడ్ మీదుగా మహారాష్ట్రలోని మన్మాడ్​ వరకు డబులింగ్​కావాలి. 

30కి పైగా ప్యాసింజర్​ రైళ్లు, మరో 10 వరకు  గూడ్స్​బండ్లు ఈ లైన్​లో తిరుగుతుంటాయి. దీన్ని డబుల్ గా మార్చితే కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లా కేంద్రాల్లో మరింతగా అభివృద్ధి జరగనుంది. కర్నాటకలోని బీదర్​-– బోధన్​మధ్య  కొత్త రైల్వే లైన్​ నిర్మాణం దశాబ్దాలుగా పెండింగ్​లో ఉంది.  రైల్వే లైన్​ కామారెడ్డి జిల్లా కేంద్రాన్ని 2 భాగాలుగా విభజించింది. ఈ క్రమంలో రాకపోకలకు వీలుగా కొత్తగా 2 ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం హైస్కూల్​రోడ్డులో ఫ్లై ఓవర్ ఉన్నప్పటికీ  ఇది దశబ్దాల క్రితం అప్పటి  అవసరాలకు కట్టింది. 

ఉమ్మడి  నిజామాబాద్​జిల్లాలో  7 లక్షల మంది వరకు బీడి కార్మికులు ఉంటారు. వీరంతా మహిళలే. వీరికి సరిపడా ఉపాధిని కంపెనీలు కల్పించటం లేదు. నెలలో 15 నుంచి 18 రోజులే పని దొరుకుతుంది.  బీడిలు చేసి కార్మికులు ఆరోగ్యపర సమస్యలు ఎదుర్కొంటున్నారు.  తమకు ఉపాధి అవకాశాలతో పాటు,  ఇండ్ల నిర్మాణం చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు.

ఇండస్ర్టీస్​ తెస్తారా?

జిల్లాలో  ఉపాధికి ఇండస్ర్టీస్​ లేవు.  ఉపాధి కోసం యువత గల్ప్​ దేశాలు,  హైదరాబాద్, ముంబై తదితర ఏరియాలకు వలస పోతున్నారు.  ప్రైవేట్ రంగంలో షుగర్​ ఫ్యాక్టరీలు తప్పా మిగతా ఇండస్ర్టీస్​ లేవు. అగ్రీ ఇండస్ర్టీస్​ నెలకొల్పేందుకు అవకాశాలు ఉన్నాయి.  ఇండస్ర్టీస్​ ఏర్పాటు పై ప్రతి ఎన్నికల్లో పార్టీలు హామీలు ఇస్తూ ఆ తర్వాత పట్టించుకోవట్లేదనే భావనలో ప్రజల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలో  కాళేశ్వరం ఫ్యాకేజీ 22 పనుల కంప్లీట్​ చేయాల్సి ఉంది.