రూ. 60 వేల కోట్లతో తెలంగాణలో హైవేల నిర్మాణం

  •   పట్టణ వలసలు తగ్గించి పల్లెల్లో ఉపాధి పెంచే లక్ష్యం 
  •     బీఆర్​ఎస్​ లూటీ చేసింది 
  •     కాంగ్రెస్​ గవర్నమెంట్​తో ఏ మార్పు ఊహించలేం 
  •     400 సీట్లతో మళ్లీ కేంద్రంలో మోదీ సర్కార్​ 
  •     సెంట్రల్​ మినిస్టర్​ నితిన్​ గడ్కరీ 

నిజామాబాద్​, వెలుగు:  తెలంగాణ రాష్ట్రంలో రూ.60 వేల కోట్ల ఖర్చుతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని సెంట్రల్​ ట్రాన్స్​పోర్ట్​ మినిస్టర్​ నితిన్​గడ్కరీ తెలిపారు. పల్లె రోడ్లను హైవేలకు లింకు చేయడం వల్ల బహుముఖ ప్రయోజనం ఉంటుందన్నారు. ముఖ్యంగా వ్యవసాయం వృద్ధి చెంది పట్టణ వలసలు తగ్గుతాయన్నారు. నిజామాబాద్​ సిటీలో గురువారం  నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగింపు సభకు హాజరైన ఆయన మాట్లాడారు. పవర్​, వాటర్​, ట్రాన్స్​పోర్ట్​, కమ్యూనికేషన్​ సౌలత్​ ఉన్న ప్రాంతాలు డెవలెప్​మెంట్​లో స్పీడ్​గా దూసుకెళ్తాయన్నారు. మక్కలు, వడ్లు, గోధుమ, తదితర ఆహార పంటలు పండించే రైతులను ఇథనాల్​ ఉత్పత్తి వైపు టర్న్​ చేశామన్నారు.

మక్కలు, బియ్యం, బాంబూ, చెరుకు రసం, మొలాసిస్​తో ఇథనాల్​ తయారు చేస్తున్నామన్నారు. ఏవియేషన్​ ఇంధనాన్ని కూడా వీటితోనే ఉత్పత్తి  చేస్తున్నామన్నారు. రైతు ఆత్మహత్యలు లేని పాలన కోసం పనిచేస్తున్నామని మహారాష్ట్ర హింగోలిలో ఆర్గానిక్​ పసుపు సాగు చేయించి దేశవ్యాప్త అవసరాలు తీరుస్తామన్నారు. పీఎం సడక్​ యోజన కింద దేశంలోని 6.5 లక్షల గ్రామాల్లో  ఇప్పటికి 3.70 లక్షల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు.

లోక్​సభ ఎన్నికల్లో 400 పైగా సీట్లు సాధించి ప్రధానిగా మూడో సారి మోదీ బాధ్యతలు చేపట్టనున్నారని జోస్యం చెప్పారు. గత బీఆర్​ఎస్​ గవర్నమెంట్​ పాలనను ప్రజల సొమ్ము లూటీకే వినియోగించిందన్నారు. ఎన్నో ఏండ్ల కాంగ్రెస్​ పాలనను ప్రజలు చూశారని, ఈసారి తెలంగాణలో కొత్తగా ఏర్పడిన సర్కారుతో ఒరిగేదేమీలేదన్నారు. బీజేపీని ఆదరించాలని కోరారు. ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్​​, ఆర్మూర్​ ఎమ్మెల్యేలు ​ధన్​పాల్​ సూర్యనారాయణ, పైడి రాకేశ్​​రెడ్డి, పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ దినేశ్​కులాచారి, పల్లె గంగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, స్రవంతిరెడ్డి ఉన్నారు.