మాడవీధుల పనులు స్లో .. భద్రకాళి ఆలయంలో ముందుకు సాగని నిర్మాణం

  •   రెండేండ్లుగా నడవని పనులు

  • డిజైన్లు, యానిమేషన్‍ వీడియోతో సరిపెట్టిన కేసీఆర్‍ సర్కార్‌

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయంలో మాడవీధుల నిర్మాణం స్లోగా నడుస్తోంది. తెలంగాణ ఇంద్రకిలాద్రిగా భావించే అమ్మవారి ఆలయంలో.. గత దసరా నాటికే మాడవీధులతో పాటు నాలుగు వైపులా రాజగోపురాల నిర్మాణాలు చేపడుతామని కేసీఆర్‍ సర్కార్‍ హామీ ఇచ్చింది. కానీ, వారి డిజైన్లు, యానిమేషన్‍ వీడియోల వరకే పరిమితమైంది.

 కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ ఆధ్వర్యంలో పనులు మొదలుపెట్టినా.. ఆఫీసర్ల పర్యవేక్షణ లేకపోవడంతో  వచ్చే దసరా నాటికి కూడా సగం పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. 

డిజైన్లు, అనుమతులు తప్పితే.. బడ్జెట్‍ ఇయ్యలే

భద్రకాళి దేవాలయంలో ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఊరేగింపు నిర్వహించేందుకు  60 అడుగుల వెడల్పుతో మాడవీధులు, తొమ్మిది అంతస్తుల్లో  నాలుగు రాజగోపురాలు నిర్మించనున్నట్లు 2022లో కేసీఆర్‍ సర్కార్‍ తెలిపింది. ప్రభుత్వం రూ.20 కోట్లు, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) నుంచి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్ట్‍ డిజైన్లు గీయించారు. 

యానిమేషన్‍ వీడియో చేయించారు. దానిని సోషల్‍ మీడియాలో ప్రచారం చేశారు. 2023 మే 5న  అప్పటి మాజీ మంత్రి కేటీఆర్​  శంకుస్థాపన చేశారు. ఆరు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేసి  అదే ఏడాది దసరాకు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇంత చెప్పినా  ఎస్టిమేషన్‍, అనుమతులు తప్పితే బడ్జెట్‍ మాత్రం ఇవ్వలేదు. ఆపై అసెంబ్లీ ఎన్నికల కోడ్‍ పేరిట చేతులు దులుపుకున్నారు. 

గుట్ట, లోయ, చెరువుతో..బిగ్‍ టాస్క్‍

భద్రకాళి ఆలయంలో ఏ పనిచేసినా   నిర్మాణాలన్నీ  ఆగమశాస్త్ర ప్రకారం చేయాలని స్తపతులు చెప్పారు.  ఆలయానికి మూడు వైపులా చెరువు, గుట్ట, లోయ ఉండటంతో నిర్మాణాలు ఎలా చేయాలన్న అంశం పై తర్జన భర్జన పడ్డారు.  గర్భగుడి ఎదురుగా ధ్వజ స్తంభం నిర్మాణం  కోసం ఆగమ శాస్త్ర ప్రకారం..   పద్మాక్షి గుట్ట వైపున ఉండే చెరువు భాగాన్ని కొంత పూడ్చివేయాలని సూచించారు. 

యాగశాలలు, రథం నిలిపే స్థలం, ఇతరత్రా కట్టడాల కోసం స్థలం కావాలంటే..ప్రధాన పూజరి నివాసంతో పాటు ప్రసాదాలు తయారు చేసే బిల్డింగ్‍ మార్చాల్సి ఉంది. అంతేగాక కాపువాడ దారిలోని ఎల్బీ కాలేజీ వైపున వేద పాఠశాల ఉండే లోయను పూడ్చాల్సి ఉంది. ఆలయం పక్కనే అందంగా ఉండే గుట్టను సైతం 15 నుంచి 20 ఫీట్ల వరకు తొలగించాల్సి ఉంటుందన్నారు. 

ప్రత్యేక దృష్టి పెడితేనే.. పనుల్లో వేగం

 అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‍ సర్కారు మాడవీధుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. పెండింగ్​ పర్మిషన్లతో పాటు రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. జిల్లా ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు, మంత్రి కొండా సురేఖ సైతం పలుమార్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు వేగవంతం చేయాలని చెప్పారు. కానీ, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్మాణ పనులు మమ అన్నట్లు సాగుతున్నాయి. గతంలో వేద పాఠశాల ఉన్న లోయను కొంతమేర మట్టితో పూడ్చటం తప్పించి అడుగులు పడలేదు.

 గుట్టను ఆనుకుని గతంలో  గుడిసెలు వేసుకున్న వారికి  ప్రత్యామ్నాయం చూపాల్సి ఉంది. ప్రస్తుతం అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న ప్రధాని పూజరి నివాసం, వంటశాలను అక్కడి నుంచి తరలించి కొత్త నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఆలయం చూట్టూరా మాడవీధులకు కావాల్సిన దారి క్లియర్‍ అయితే అనంతరం చెరువులో పిల్లర్లు, బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది.

  ఈ పనులకు వీటంతటికి ప్రస్తుతం కేటాయించిన రూ.30 కోట్లు కాకుండా మరో రెండింతల బడ్జెట్‍ అవసరముంటుందని చెబుతున్నారు. ఓరుగల్లు జనాల కలల ప్రాజెక్ట్‍ కావడంతో.. ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక దృష్టి పెట్టి , పనుల్లో వేగం   పెంచాలని భక్తులు కోరుతున్నారు.