కామారెడ్డి , వెలుగు: జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ 10 ఏండ్ల తర్వాత మళ్లీ దక్కించుకుంది. 2019 ఎన్నికల్లో 6,128 ఓట్ల తేడాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఈ సారి 46,188 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. జహీరాబాద్ఎంపీ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు గాను 3 సంగారెడ్డి జిల్లాలో ఉండగా 4 నియోజక వర్గాలు కామారెడ్డి జిల్లాలో ఉన్నాయి. ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల కంటే ఎంపీ ఎన్నికల్లో ఈ పార్టీకి స్వల్పంగానే ఓట్లు పెరిగాయి.
ఎంపీ ఎన్నికల్లో బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి లీడ్ రాగా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లో బీజేపీకి మేజార్టీ దక్కింది. ఈ 4 నియోజక వర్గాల్లో కాంగ్రెస్కు అసెంబ్లీ ఎన్నికల్లో 2,58,588 ఓట్లు వస్తే ఎంపీ ఎన్నికల్లో 2,59,613 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ కంటే ఎంపీ ఎన్నికలు వచ్చే సరికి 1,025 ఓట్లు పెరిగాయి. బీజేపీకి మాత్రం జిల్లాలో అనుహ్యంగా భారీగా ఓట్లు పెరిగాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో 1,44,320 ఓట్లు వస్తే ఎంపీ ఎన్నికల్లో 2,83,977 ఓట్లు దక్కాయి. 1,39,657 ఓట్లు పెరిగాయి. కమలం పార్టీ ఓటు బ్యాంక్ పెరగటంతో జిల్లా కీలకంగా మారింది. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. బీఆర్ఎస్కు భారీగా ఓట్లు తగ్గాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీకి 2,61,991 ఓట్లు వస్తే ఎంపీ ఎన్నికల్లో 84,794 ఓట్లు వచ్చాయి. 1,77,197 ఓట్లు తగ్గాయి. ఈ పార్టీకి చెందిన ఓటు బ్యాంక్ బీజేపీ వైపు మరలిందని పొలిటీకల్ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లా ఓటర్లు ప్రతి ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇస్తున్నారు.