అమరావతి ఎమ్మెల్యేపై ఆరేళ్ల సస్పెన్షన్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గానూ అమరావతి ఎమ్మెల్యే సుల్భా ఖోడ్కేపై కాంగ్రెస్ పార్టీ ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు ఖోడ్కేపై అనేక ఫిర్యాదులు వచ్చినట్లు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ మహారాష్ట్ర ఇంచార్జి రమేష్ చెన్నితాల ఆదేశాల మేరకే ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. 

ఈ ఏడాది ప్రారంభంలో ప్రతిపక్షాల మహా వికాస్ అఘాడి కూటమి అభ్యర్థి జయంత్ పాటిల్ ఓటమికి దారితీసిన శాసన మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన ఏడుగురు ఎమ్మెల్యేలలో ఖోడ్కే ఒకరు. ఖోడ్కే భర్త మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు అత్యంత సన్నిహితుడు. ఆమె అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.