రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సింఘ్వీ ఏకగ్రీవం

  • ఆయన తరఫున ధ్రువీకరణ పత్రం తీసుకున్న పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం సాయంత్రం రిటర్నింగ్ ఆఫీసర్లు సింఘ్వీ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. అసెంబ్లీలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి సింఘ్వీ తరఫున పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు. ఆయన ఎన్నికతో రాష్ట్రం తరఫున కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యుల సంఖ్య మూడుకు చేరింది. రేణుకా చౌదరి, అనిల్ కూమార్ యాదవ్ కూడా రాష్ట్రం తరఫున కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. 

సీనియర్ నేత కే. కేశవరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో పాటు ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 21న నామినేషన్లకు చివరి తేదీ ఉండగా.. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున ఎవరూ నామినేషన్ వేయలేదు. పద్మరాజన్ అనే వ్యక్తి ఒకరు ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేసినా.. 

అతన్ని ఎమ్మెల్యేలు ఎవరూ బలపరచకపోవడంతో ఎన్నికల అధికారులు తిరస్కరించారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు రోజు కావడంతో.. అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ తప్ప ఇతరుల నామినేషన్లు ఏవీ దాఖలు కాలేదు. దీంతో అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు .

2026 ఏప్రిల్ వరకు పదవిలో సింఘ్వీ

తెలంగాణ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అభిషేక్​మను సింఘ్వీ 2026 ఏప్రిల్ వరకు పదవిలో కొనసాగనున్నారు. దాదాపు ఏడాదిన్నర పాటు ఆయన పదవీలో కొనసాగుతారు. దేశంలోనే ప్రముఖ అడ్వొకేట్ అయిన సింఘ్వీని తెలంగాణ కోటా నుంచి ఏఐసీసీ ప్రకటించడంతో రాష్ట్రం తరఫున ఆయన ఎంపీగా రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విభజన అంశాలను సభలో గట్టిగా ప్రస్తావించి, రాష్ట్రానికి రావాల్సిన హక్కులను తీసుకురావడంలో ఆయన పోరాడుతారనే నమ్మకాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

రాజ్యసభకు 12 మంది ఏకగ్రీవం

న్యూఢిల్లీ : రాజ్యసభకు 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి 9 మంది, మిత్రపక్షాల నుంచి ఇద్దరు, కాంగ్రెస్  నుంచి ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి ఏకగ్రీవం అయిన వారిలో మిషన్  దాస్, రామేశ్వర్  తేలి (అస్సాం), మనన్  కుమార్  మిశ్రా (బిహార్), కిరణ్​ చౌధరి (హర్యానా), జార్జ్  కురియన్ (మధ్యప్రదేశ్), ధ్రియా శీల్  పాటిల్  (మహారాష్ట్ర), మమతా మొహంతా (ఒడిశా), రవ్ నీత్  సింగ్  బిట్టు (రాజస్థాన్), రాజీవ్  భట్టచార్జీ (త్రిపు) ఉన్నారు. మిత్రపక్షాల్లో అజిత్  పవార్  ఎన్సీపీ నుంచి నితిన్  పాటిల్, రాష్ట్రీయ లోక్ మంచ్  నుంచి ఉపేంద్ర కుశ్వాహా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

దీంతో ఎగువసభలో బీజేపీ బలం 96కు చేరగా.. ఎన్డీఏ కూటమి బలం 112కు చేరింది. అలాగే నామినేట్  అయిన ఆరుగురు, ఒక ఇండిపెండెంట్  సభ్యుడి మద్దతు కూడా అధికార పార్టీకి ఉంది. దీంతో ఎగువసభలో ఎన్డీఏ మెజారిటీ మార్కుకు చేరినట్లయింది. ఇక తెలంగాణ నుంచి కాంగ్రెస్  తరపున అభిషేక్  మను సింఘ్వీ ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 85కు చేరింది. ఎగువసభలో మొత్తం 245 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం 8 సీట్లు ఖాళీగా ఉన్నాయి. జమ్మూకాశ్మీర్  నుంచి 4, మరో 4 నామినేటెడ్  సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం సభలో సభ్యుల సంఖ్య 237 ఉండగా.. మెజారిటీ మార్కు 119.